Monday, November 30, 2009

ఏ జీవుని ఆక్షేపించకుము

సాధకుని యొక్క గొప్పతనము అతడు చేసిన సాధన యొక్క గొప్పతనము మీద ఆధారపడియుండును. ఆ సాధన యొక్క గొప్పతనము ఆ సాధకుడు పొందిన ఫలము యొక్క గొప్పతనము పై ఆధారపడి యొండును. ఒకడు సాధించిన ఉద్యోగము యొక్క హోదా జీతమును పట్టి అతడు చదివిన చదువును నిర్ణయించి వచ్చును. ఆ చదువు యొక్క గొప్పతనము బట్టియే అతని గొప్పతనముండును. ఈ సృష్టిలో పరమాత్మ నుండి అత్యుత్తమ ఫలమును పొందిన సాధకులు ఇద్దరే ఇద్దరు. వారు హనుమంతుడు, రాధ. హనుమంతుడు 14 లోకముల యొక్క ఆధిపత్యమును సృష్టికర్త, సృష్టిభర్తగా, సృష్టిహర్తగా పొందినాడు. ఈ లోకములే సృష్టి. రాధ 14 లోకముల పైన పరమాత్మచే ప్రత్యేకముగా సృష్టించబడిన 15 లోకమగు గోలోకమునకు ఆధిపత్యము పొందినది. ఇంతకు మించి ఫలములు లేవు. కావున ఇరువురిని మించిన సాధకులు లేరు. కావున ఆ ఇరువురి సాధనను మించిన సాధన లేదు. అయితే ఆ ఇరువురికి అనుగ్రహించిన ఫలములలో తారతమ్య మున్నది. ఒకరిని హైస్కూలుకు హెడ్‌మాస్టర్‌గా చేసినాడు. మరి యొకరిని హైస్కూలుకు పైనున్న కాలేజ్‌కి ప్రిన్సిపాల్‌గా చేసినాడు. అనగా 14 లోకముల అధిపత్య పదవియే హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే గోలోక ఆధిపత్యము. హనుమంతుడు పరమాత్మను నిలదీశినాడు. పరమాత్మ హనుమంతుని బుజ్జగించుచు "హనుమా! నీ రాజ్యము 14 లోకములు. రాధ రాజ్యము ఒక్క లోకమే గదా అన్నాడు. కాని బుద్ధిమంతులలో వరిష్టుడుగు హనుమంతుడు దీనిని అంగీకరించలేదు. 2000 మంది విద్యార్ధులు గల హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి కన్నను 200 విద్యార్ధులు గల కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే ఎక్కువ. హెడ్‌మాస్టర్‌ జీతము కన్నను ప్రిన్సిపాల్‌ జీతము ఎక్కువగా యుండును. ఈ రెండు పదవులలో పెద్ద తారతమ్యము లేకపోయినను రాధ యొక్క పదవియే హనుమంతుని పదవి కన్న కొంచెము ఎక్కువయని పరమాత్మ అంగీకరించక తప్పలేదు. అప్పుడు హనుమంతుడు "స్వామీ! లంకలో నా తోక మండుచున్ననూ ఇంత బాధపడలేదు. ఇప్పుడు నీవు చేసిన పనికి నా కడుపు మండుచున్నది అన్నాడు. కావున హనుమంతునకు కారణము వివరించక తప్పలేదు". స్వామి ఇట్లు వివరించినాడు.

"బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన హనుమా! నిన్ను మభ్యపెట్టుట స్వామికి కూడా తరము కాదు. కావున సావధానముగా ఆలకించుము. సముద్రమైన నన్ను ఒక నది నేరుగా వచ్చి చేరుచున్నది. మరియొక నది వంకరులుగా తిరిగి చేరుచున్నది. కాని నేరుగా వచ్చునది అహంకారముతో వంకరలుగా వచ్చునదిని చూచి ఆక్షేపించుచున్నది. ఈ ఆక్షేపణము చేయకున్నచో నేరుగా వచ్చు నది త్వరగానే చేరును. ఇందు ఎట్టి సందేహము లేదు. కాని అహంకారముతో రెండవ నదిని ఆక్షేపించినందులకు సముద్రుడగు పరమాత్మ యొక్క సంకల్పము చేత మొదటినదికి అడ్డముగా మానవులు ఆనకట్టను కట్టిరి. మొదటినది యొక్క జలములన్నియును పొలములకే మరలింపబడి ఒక్క చుక్కయైనను సముద్రమునకు చేరలేదు. నీవును ఇదియే పొరపాటు చేసియున్నావు. నేను రామావతారము తరువాత కృష్ణావతారము నెత్తితిని. నేను చేయు అల్లరి పనుల వలన నీ విశ్వాసము సడలి నన్ను గుర్తించలేకపోయినావు. అందుకే నన్ను దర్శించుటకు నీవు ఎప్పుడును రాలేదు. ఈ కృష్ణుడు పరమాత్మ కాదని భావించినావు. కాని భగవద్దూషణమునకు భగవంతుడు ఎట్టి పాప ఫలమును అందించడు. హిరణ్యకశిపుడు నన్ను నిందించినను నేను వానిని దండించలేదు. కాని నా భక్తుడైన ప్రహ్లాదుని జోలికి వెళ్ళి నందున హిరణ్యకశిపుని దండించితిని. కావున భగవదపచారము కన్నను బాగవత అపచారము గొప్పది. ఒక భక్తుడు ఇతర భక్తుల పై ఎట్టి ఆక్షేపణలు చేయరాదు. నీవు రాధను, గోపికలను చూచి ఆక్షేపించినావు. ఈ భక్తులు అధర్మవర్తనులు. వీనిని భగవంతుడు అధర్మమునే ప్రోత్సహించుచున్నారు" అని నా భక్తులగు గోపికలను చులకనగా చూచినావు. కావున నా వద్దకు నీవు రాలేదు. ఐతే కౌరవసభలో నేను ప్రదర్శించిన విశ్వరూపమును చూచి, నన్ను చేరి నా కార్యమగు ఆ యుద్ధమున సాయపడినావు.

"ఏ యధామాం ప్రపద్యన్తే తాం స్తదైవ భజామ్యహం మమ వర్మాను వర్తన్తే మనుష్యాః పార్ధ సర్వశః" నన్ను ఎవరు ఏ భావమున ఇష్టపడుదురో ఆ భావములోనే వారిని నేను సమీపించెదను. భావములో ఎట్టి గొప్పదనము లేదు. భావములో యున్న ప్రేమయను బరువును చూడవలెను. నీవు నన్ను దాస భావమున ఆరాధించినావు. రాధ, గోపికలు నన్ను ప్రియ భావమున ఆరాధించినారు. దాస భావము కన్నను ప్రియ భావము గొప్పది కాదు. చిలుక యైనను, గాడిద యైనను పంచదార బరువును పట్టియే ధర పలుకును. ఒక వేశ్య ఒకనిని ప్రియ భావమున సేవించుచున్నది. దాని దృష్టి యంతయు వాని ధనము పైనే యున్నది. కావున ఈ భావము ఈ ఉదాహరణములో గొప్పది యుగుచున్నదా? నీవు నీ యజమాని అగు సుగ్రీవుని వద్దకు పోయి నీవు సుగ్రీవుడికి దాసుడవై యున్నను "నేను రామునకు దాసుడను అని చెప్పినచో అతడేమి చెప్పును".

నిజమే నేనును రామునకు దాసుడనే కావున రామునికి దాసుడగుటలో అభ్యంతమేమున్నది? నీవు అని పలుకును. ఇట్లే పరమాత్మను తండ్రిగా, సోదరునిగా, గురువుగా భావించిన వారు వారి తండ్రులకు, వారి సోదరులకు, వారి గురువులకు చెప్పినచో వారును హర్షింతురు. కాని రాధ యొక్క అవతారమగు మీరాబాయి యొక్క భర్తకు మీరాబాయి కృష్ణుడే నా భర్తయని చెప్పినప్పుడు మీరాబాయి యొక్క భర్త ఆమెను విషమునిచ్చి హింసించినాడే తప్ప నిజమే జగద్భర్తయగు కృష్ణుడు నాకును భర్తయే అని చెప్పలేదు. మీరాబాయి సమయములో కృష్ణుడు కేవలము విగ్రహముగా యున్నాడు. కాని గోపికలు యున్న సమయములో కృష్ణుడు నరాకారమున ఉన్నాడు. కాని గోపికలు వారి భర్తలకు ఇదే సమాధానము నిచ్చినారు. వారిచే ఎంతో హింసించబడినారు. కావున ఆ గోపికలు ఆ గోపికల నాయకురాలగు రాధ ఎంత గొప్పవారో ఆలోచించుము. అంతే కాదు వారు బృందావమునకు వచ్చినప్పుడు నేను కూడా వారికి బోధించినాను. "ఓ గోపికలారా! మీకేమైనా పిచ్చి పట్టినదా? మీ గృహములనను, పతిపుత్రులను, తల్లితండ్రులను, భాంధములను త్యజించచి ఈ అర్ధరాత్రి నా వద్దకు వచ్చినారు. ఒకవేళ వారు నిద్రించుచున్న మీరు శిక్ష తప్పించుకున్నను చిత్రగుప్తుని, యమధర్మరాజును తప్పించుకొన లేరుగదా! ధర్మ శాస్త్రమున మీకు ఏమి శిక్ష విధించబడునో మీకు తెలియునా? ఇనుముతో తయారు చేసిన కృష్ణ విగ్రహములను ఎర్రగా అగ్నిలో కాల్చి ఆ విగ్రహములను ఆ లింగనము చేసుకొనునట్లు యమదూతలు చేయుదురు. కావున మీ తమోగుణమును వదలి ఇండ్లకు పొండు అని చెప్పితిని. దానికి వారు మందహాసములను చేసి "కృష్ణా! నీవు చెప్పిన శిక్షను మేము సంతో్షముగా స్వీకరింతుము. కాని నిన్ను విడజాలము" అని అన్నారు. కావున నా కొరకు ఎట్టి శిక్షలను అయినా అనుభవించుటకు సిద్ధపడిన ఆ గోపికల ప్రియ భావములో వారి ప్రేమ భారమును చూడుము. కిలో పంచదారతో చేయబడిన గాడిద బొమ్మ యొక్క ధర అరకిలో పంచదారతో చేయబడిన చిలుక కన్న ఎక్కువ పలుకును. కనుక భారము ప్రధానము కాని చిలుక కాదు. కావున నన్ను ప్రియునిగా భావించుటలో గొప్పతనము రాలేదు. ఆ భావములో వారికి కల భక్తి యొక్క బరువు వలన విలువ వచ్చినది. భావములోనే విలువ యున్నచో ఒకని ప్రియునిగా చూచు వేశ్యకు కూడా ఫలము వచ్చును గదా. కావున గోపికలు వేరు, వేశ్యలు వేరు. "గోపి వేశ్య అనిన మూఢా దత్తుడెపుడు వేశ్య రతుడే భాగవతము రంకు కాదు జ్ఞానమదియే ఓరి శుంఠా!" 7 రోజులలో ముక్తి నిచ్చు గ్రంధమేది యని పరీక్షిత్తు శుకుని ప్రశ్నించినపుడు, నీ చరిత్ర గల రామాయణమును చెప్పలేదు. గోపికల చరిత్రయుగు భాగవతమును చెప్పినాడు. పండితులు కూడా "విద్యావతాం భాగవతే పరీక్షా" అనగా భాగవతమును గురించి చెప్పినారు గాని, రామాయణము గురించి చెప్పలేదు. కావున నీవు ఏ మార్గమును వంకర మార్గమని ఆక్షేపించినావో, అదియే నీ మార్గము కన్న గొప్పదియని తెలుసుకొనుము. భాగవతము గాడిద బొమ్మలో ఉన్న కిలో పంచదారను గురించి చెప్పుచున్నది కాని గాడిద బొమ్మను గురించి కాదు. కావున భాగవతము ప్రియ భావమును గురించి బోధించుటలేదు. ప్రియ భావ మార్గమున ఉన్న భక్తి యొక్క బరువును గురించి బోధించుచున్నది. నీవు గాడిదను, చిలుకనే చూచినావు తప్ప ఆ బొమ్మలలో ఉన్న పంచదార బరువును చూడలేదు. కావుననే దుకాణము యజమానిని పంచదార గాడిద రు 100/- లు పంచదార చిలుక రు 50/- లు అన్నప్పుడు ఛీ ఛీ గాడిద ధర వంద రూపాయిలా అని గాడిదను ఆక్షేపించినావే తప్ప, వాడు ఆ బోమ్మలోని పంచదార బరువును పట్టి ధర చెప్పినాడని గ్రహించకున్నావు. కావున నీ ఆక్షేపణ నీ అజ్ఞానము నుండి జనించినది. కావున ఏ జీవుని ఆక్షేపించకుము. ఏ పుట్టలో ఏ పామున్నదో నీకేమి తెలియును. పాములను పట్టు వానికే తెలియును. వారి మార్గములో గొప్పతనము ఉన్ననూ నేను గోలోకము సృష్టించి యుండెడివాడను కాను. వారిని నా హృదయములో నుంచుకొని దాచుకొనెడి వాడను. ఈ చతుర్ధశ భువనాధిపత్యము కన్ననూ, నా హృదయ స్ధానము గొప్పది. కాని బహిరంగముగా అందరికిని కనపడునట్లు ఈ గోలోక సృష్టిని చేసినది నీకును నీవలె ఆక్షేపణము చేయు ఇతరులకు బోధించుట కొరకే అని పరమాత్మ తన ఉపన్యాసమును ముగించినాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, November 24, 2009

సాధన

సాధన అనగా నేమి? సాధన యనగా మంత్రమును జపించుట అని కొందరు, ధ్యానమును చేయుట అని మరి కొందరు, పూజలు చేయుట అని మరి కొందరు తలచుచున్నారు. ఇట్లు పలు విధములుగా తలచుచున్నారు. కాని వీటి వలన భగవంతుడు లభించును గాని, లభించిన భగవంతుడు నిలువజాలడు. ఇవి అన్నియును మనము స్వామిని పిలుచుట. పిలువగనే స్వామి వచ్చుచున్నాడు. కాని మన ఇంటిలోనికి రాగానే దుర్భరమైన కుళ్ళు కంపు కొట్టుచున్నది. దానికి మనము అలవాటు పడినాము. అది లేకుండ మనము జీవించజాలము. బురద గుంటయే పందికి పన్నీరు సరస్సు కాని ఆ బురద గుంట లోనికి మానవుడు ప్రవేశించగలడా? ఇక్కడ మన ఇల్లు అనగా మన శరీరము అని అర్ధము. మనము పిలువగనే మన శరీరము లోనికి దత్తుడు ప్రవేశించుచున్నాడు. దానికి ఎన్నోసార్లు జపము అక్కరలేదు. ఒక్కసారి నామోచ్చారణము చాలును. ఎన్నో సంవత్సరముల దానము అనగా తపస్సు అక్కరలేదు. ఒక్క క్షణము స్మరించిన చాలును దత్తుడు నీలో ప్రవేశించును. కాని ప్రవేశించిన వాడు నిలువలేకయున్నాడు. కారణము నీలో ఉన్న కంపు. ఆ కంపు నీలో ఉన్న మూడు బురద గుంటల నుండి వచ్చుచున్నది. ఆ మూడు గుంటలే అసూయ, అహంకారము, స్వార్ధము. ఈ మూడింటిని ఒక్క పరమాణువు మాత్రము కూడా లేకుండా తుడిచి వేయవలెను. అసూయ పోగానే అనసూయవగుదువు. ఏ జీవుడైనను అనసూయ కావచ్చును. ఇందు స్త్రీ పురుష బేధము లేదు. ఏలననగా జీవులందరును ప్రకృతి స్వరూపులగు స్త్రీలే. మాత్సర్యము యొక్క మరొక పేరే అసూయ. అసూయ పోగానే అనసూయ యైన జీవునిలోనికి దత్తుడు ప్రవేశించును. దత్తుడు అనసూయా గర్భస్తుడనుటలో అంతరార్ధమిదే. ఈ మూడు వరుసగా రజోగుణ, తమోగుణ, సత్వగుణములు. అసూయ తమోగుణము. అసూయ పోగానే తమోగుణి పతియగు శివుడు నీలోనికి ప్రవేశించును. తరువాత అహంకారము రజోగుణము. అహంకారము పోగానే రజో గుణాధిపతియగు బ్రహ్మ నీ లోనికి ప్రవేశించును. స్వార్ధము సత్వగుణము. దీనిలో మంచి చెడులు రెండును ఉన్నవి. లోకములోని వస్తువులను వ్యక్తులను నీవి నీవారు అనుకొనుట చెడు భాగము. ఏలననగా అవి, వారు అనిత్యములు ఈ జన్మ కాగానే ఈ జీవుడు వేరు వేరు జీవుల బంధములోనికి పోవుచున్నాడు. ఒక నటుడు ఒక సినిమా షూటింగ్‌ బంధముల నుండి మరియొక సినిమా షూటింగ్‌ బంధములోనికి పోవుట వంటిదే. కాని అన్ని షూటింగ్‌ల యజమాని యగు సినిమా నిర్మాతతో బంధము నిత్యముగా యుండును. అట్లే అన్ని జన్మములలోను జీవునకు సృష్టినిర్మాతతో బంధము నిత్యముగా యుండును. కావున అనిత్య బంధములు వదలి స్వామి నా వాడు అనుకొనుటలో విషయము స్వార్ధములో మంచి భాగమై యున్నది.

ఐతే స్వామి నా వాడు మాత్రమే అనుకొనుటలో మరల ఈ మంచి భాగము చెడు భాగమగుచున్నది. కృష్ణుని తన వాడుగా పోందుటకు సత్యభామ తన బంగారంతయు త్యజించినది కాని ఓడిపోవుటకు కారణము స్వామి నా వాడు మాత్రమే అనుకొనుట. కావున లోకబంధములన్నింటిని త్యజించి "స్వామి నా వాడు" అనుకొనుట మంచిదే. కాని స్వామి నాకు మాత్రమే దక్కవలయును అనుకొనుట తప్పు. రుక్మిణి స్వామి నా వాడు మాత్రమే కాదు అష్టభార్యలందరుకిని సమముగా దక్కవలయునని భావించినది. కావున సత్యభామ ఓడి రుక్మిణి గెలిచినది. కాని రుక్మిణి కూడా రాధ చేతిలో ఓడిపోయినది. రుక్మిణి అష్టభార్యలకు మాత్రమే స్వామి దక్కవలయును అనుకొనినది. కాని రాధ 16000 గోపికలకు దక్కవలయునని అనుకొన్నది. రాధకన్న మీర ఇంకనూ గొప్పది. స్వామిని గురించి సర్వ జీవులకు ప్రచారము చేసి, స్వామి సర్వజీవులకు దక్కవలయునని భావించినది. కావుననే స్వామి పూరీ జగన్నాధ దేవాలయములో మీరను సశరీరముగా తనలో ఐక్యము చేసుకున్నాడు. ఇట్టి సశరీర కైవల్యమును, రుక్మిణి, సత్యభామ, రాధలకు ఇవ్వలేదు. అట్లే శంకరాచార్యుడు సర్వజీవులు తరించవలయునని దేశమంతయును సంచరించి జ్ఞాన ప్రచారము చేసినాడు. కావున హిమాలయములోని దత్తాత్రేయగుహలో అదే సశరీర కైవల్యమును ఇచ్చినాడు. కావున దానము లేనిదే దత్తుడు లేడు. స్వార్ధము పోందే దత్తుడు రాడు. అహంకారము పోనిదే అసూయ పోదు. అసూయ పోనిదే అహంకారము పోదు. మీరా, శంకరులలో అసూయ పరమాణువు కూడా లేదు. వారితో మనము పోల్చుకున్నచో ఎంత దూరములో ఉన్నామో ఆలోచించుడు.

మీ ఇంటిలో కరెంటు పోయినదా అని ఎదురివారు అడుగగనే ఎదురువారిని మీ ఇంటిలో కూడా పోయినదా అని అడుగుదుము. వారింటిలో కరెంటు పోయిన వీరికి ఆనందము. మన యింటిలో కరెంటు పోయి ఎదురు వారింటిలో ఉన్నచో మన ముఖము అప్పుడే మండును. మన అసూయను పోగొట్టుటకు స్వామి ఒక్కొక్క నరావతారమున వచ్చి కొందరిని ఎన్నుకొని వారిని శుద్ధిచేయుటకు ఆరంభించును. మన మంచి కోసము ఆయన ప్రయత్నమును మనము గుర్తించము. మనము ఏమి మాట్లాడిన తప్పులు పట్టుచున్నాడని ఆయనను మనము నిందింతుము. శ్రీ రామ అన్నచో బూతుమాట అగుచున్నదే అని ఆయనను ఆక్షేపింతుము. కాని ఆయన మనలను పరిపూర్ణముగా శుద్ధిచేసి, మనలోనికి ప్రవేశించ తలచినాడని గుర్తించము. ఇట్లు ఆక్షేపించుటలో కారణము మన అహంకారము. స్వార్ధము పోవుట ఇంకనూ కష్టము.

ఒకసారి హనుమంతుడు శ్రీ రామునకు చామరముతో విసురు చున్నాడు. అక్కడ వున్న వానరుడు ఇట్లు తలచినాడు. ఈ మాత్రము సేవ నేను చేయలేనా? అని అనుకున్నాడు. శ్రీ రాముడు వెంటనే హనుమంతుని ఆపి ఆ వానరుని పిలచి ఆ చామరమును వానరున కిచ్చి విసర మన్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత గాలి మందగించి ఉక్కపోయుట ఆరంభించెను. వానరుని చేతిలోని చామరము కొంచెము పైకి లేచెను. అనగా తనకు స్వామికి గాలి వచ్చునట్లు విసరుచున్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత ఇంకా మందగించినది. ఉక్కపోయుట ఎక్కువైనది. అప్పుడు వానరుడు తన వరకే విసురుకొనుచున్నాడు. అప్పుడు స్వామి వాని వైపు చూచి చిరునవ్వు చిందించినాడు. ఇదే పరీక్షను హనుమంతునికి కిష్కింద గుహలో పెట్టినాడు. హనుమంతుని శరీరమంతయు చెమటలు కారుచున్నది. చామరము స్వామికి మాత్రమే విసరుచున్నాడు. దీని అర్ధమేమి? కావున అసూయ, అహంకారము, మమకారమనెడి స్వార్ధము ఈ మూడు నీలో నుండి పోయినపుడే త్రిమూర్తులు నీలోనికి ప్రవేశించుదురు. కాని త్రిమూర్తులకు మూలవిరాట్టు యైన దత్తుడు ప్రవేశించవలెనన్నచో నీవు దానమును ప్రారంభించవలెను. అనగా స్వామి నుండి నీవు పోందిన జ్ఞానాన్ని సర్వజీవులకు అందించి, వారు ఆనందించు చుండగా నీవు ఆనందించు సిత్ధికి రావలయును. ఇట్టి త్యాగము లేక దానము చేతనే దత్తుడు ప్రవేశించి స్ధిరముగ నిలచును. స్వామి నరాకారమున వచ్చినపుడు నీ విశ్వాసములోని లోపము చేతనే ఆయన నిన్ను పూర్ణముగా బాగు చేయలేక యున్నాడు. స్వామియే అను విశ్వాసము ఏర్పడిన తరువాత మరల స్వామి కాడేమో అని సంశయము వచ్చును. దీని వలన శ్రద్ధ తగ్గి అశ్రద్ధ ఏర్పడును. మరల ఒకవేళ స్వామి అయినచో అన్న అనుమానము వచ్చును. ఈ విధముగా విశ్వాసము ఊగులాడుట చేతనే యోగిరాజు నుండి నీవు యోగమును పూర్ణముగా పొందలేకున్నావు. విశ్వాసము యోగమునకు మూలాధారము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Sunday, November 8, 2009

పరమాత్మను ఆరాధించు కరణములు

పరమాత్మను ఆరాధించు కరణములు అనగా పనిముట్లు. అవి మూడు 1)మనస్సు, 2)వాక్కు, 3)శరీరము చేత చేయబడు కర్మ . ఈ మూడింటిలోను మనస్సు రాజు. వాక్కు మంత్రి, కర్మ సేనాధిపతియై యున్నాడు. మనస్సుననుసరించియే వాక్కు కర్మలు యుండును. మనస్సు చేయు క్రియ మననము, వాక్కు చేయు క్రియ శబ్ధోచ్చారణము, శరీరము చేయు క్రియ గమనము, దానము మొదలగునవి. ఈ మనన క్రియయే మంత్రము అనబడుచున్నది. శబ్ధోచ్చారణములో శ్రేష్టమైనది సామవేదాత్మకమైన గానము. వచనము కన్న పద్యము, పద్యము కన్న గీతము శ్రేష్టము. "వచనమే యజుర్వేదము, పద్యమే ఋగ్‌వేదము, గీతమే సామవేదము". ఈ మూడు కలసి త్రయి అనబడుచున్నవి. సనాతన సంప్రదాయములో దత్తుని వెంట మూడు శునకములున్నట్లు చిత్రీకరించిరి. నాల్గవ వేదముగ అధర్వణవేదము ధనుర్వేదాత్మకమై శస్త్రాస్త్రములను సూచించుచున్నది. అనగా నాల్గవ వేదము పాణిపద శరీరమునకు సంబంధించిన క్రియయై శారీరక కర్మను సూచించుచున్నది. గానాత్మకమైన ఛందోమయమైన వాక్యమే గాయత్రీ మంత్రము. వాక్యము కావున యజుర్వేదము, చంధస్సులో బంధింపబడినది కావున ఋగ్వేదము, గానముతో మిళితము కాబడినది కావున సామవేదము. ఇట్లు గాయత్రీ మంత్రము వేదత్రయాత్మకమై యున్నది. ఈ గాయత్రీ మంత్రము శ్రవణము, పఠనము, మననము అను ముడు దశలుగా యున్నది. అనగా వినుట, పాడుట, పదేపదే మనస్సులో స్మరించుట. గాయత్రీ మంత్రము అనగా అందరును జపించు " తత్సవితుర్వరేణ్యమ్‌" మొదలగు పాదత్రయాత్మకమైన ఋగ్వేదము లోని మంత్రము కాదు.

గాయత్రి యనగా కేవలము ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి తిష్టుల్‌ భృహతి మొదలగు ఛందస్సులలో గాయత్రి ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి ఛంధః అని చెప్పుచున్నాము. కావున గాయత్రి మంత్రమనగా ఛందోబద్ధమై గానమిళితమై పరమాత్మ యందు ప్రేమను పెంపొందించు వాక్యమే. ఆ వాక్యము ఏ వాక్యమైనను కావచ్చును. ఆ వాక్యము మధురమై గానాత్మకముగా యున్నచో గాయత్రి అనబడును. అది మనస్సుకు ఆకర్షించి పదేపదే దానిని ఉచ్చరింప చేసినచో అదే మంత్రము అనబడును. ప్రతి దేవతకు ఒక్కొక్క గాయత్రి మంత్రము గలదు. దీనినే మంత్ర గాయత్రీ అనుచున్నారు. ఏ దేవతా రూపము మీదనూ గాయత్రీ మంత్రము గలదు. గాయత్రి అనగా ఒకే దేవతపై చెప్పుబడిన మంత్రము కాదు. వాక్కు, మనస్సు, కర్మల మధ్య యున్నది. వాక్కు, మనస్సు, కర్మల యొక్క సంధి స్ధానము శ్రవణము చేత మనస్సు నందు పరమాత్మపై ప్రేమ కలుగుచున్నది. ఈ ప్రేమయే వాక్కులో వ్యక్తమగుచున్నది. మనస్సులో పుట్టి వాక్కులో వ్యక్తమైన ప్రేమయే భక్తి అనబడును. ఈ రెండును పరమాత్మను సాధించుకొని పొందుట వరకే ఉపయోగించును. పరమాత్మ లభించగనే ఏ మాత్రమును మురిసిపోవలసిన అవసరము లేదు. లభించిన పరమాత్మను నిలుపుకొనుటయే సాధన యొక్క సారాంశము. పరమాత్మ స్మర్తృగామి. స్మరణ మాత్ర సంతుష్టుడు. నీవు మనస్సులో ఒక్క క్షణము స్మరించగనే, ఒక్కసారి వాక్కుతో పిలువగనే పరమాత్మ నీ సన్నిధి యందు నిలచుచున్నాడు. కావున పరమాత్మను పొందుటకు పెక్కుసార్లు మనస్సుతో, వాక్కుతో స్మరణము చేయనవసరము లేదు. మనస్సుతో, వాక్కుతో జపము పేరున పెక్కుసార్లు పిలువనేల. స్మరించగనే లభించుచున్నాడు. కాని లభించిన దానిని నిలుపుకొనుటకే నీవు ఎంతో సాధన చేయవలయును.

పరమాత్మను నీవద్ద శాశ్వతముగా నిలుపుకొనవలయున్నచో, నీ భక్తిని సత్యమైనది అని నిరూపించయలయును. ఆ నిరూపణయే కర్మ, లేక సేవ. కావున సేవ కర్మ లేక కేవలము మనస్సు, వాక్కుల చేత పరమాత్మను ఆరాధించి ఏ మాత్రము ప్రయోజములేదు. "రామ" అనగనే నీ వెంట కోదండపాణియై నిలుచున్నాడు. రెండవ సారి "రామ" యననేల? రెండవ సారి రామ యన్నచో వచ్చిన రాముని దూరముగా పొమ్మని మరల రమ్మని అర్ధము. ఒక గురువు "రామ" అని చెప్పుచూ భక్తులకు తీర్ధము నిచ్చుచున్నాడు. ఆ తీర్ధముతో భక్తుల కష్టములు తొలగుచున్నవి. ఒకనాడు ఆ గురువు గ్రామాంతరమునకు పోయెను. భక్తులు వచ్చినారు. ఆయన శిష్యుడు " రామ రామ రామ" అని మూడుసార్లు పలికి తీర్ధము నిచ్చినాడు. భక్తుల కష్టములు తొలగుచున్నవి. తరువార ఆ రాత్రికి గురువుగారు ఇంటికి వచ్చినాడు. శిష్యుడు తాను చేసిన పనిని గురువుకు చెప్పినాడు. గురువు వెంటనే వాని చెంప మీద కొట్టినాడు. గురువు ఇట్లు వచించినాడు. నీవు ఒక్కసారి "రామ" అన్నచో ఆ తీర్ధము కష్టములను తొలగించదా? మూడుసార్లు ఏల ఉచ్చరించితివి? అనగా నీకు రాముని పై విశ్వాసము లేదననియే గదా? అని బోధించినాడు. ఒకే రామ శబ్ధమును అనేక సార్లు ఉచ్చరరించుటలో వ్రాయుటలో అర్ధము లేదు. పరమాత్మ సర్వవ్యాపకుడు. కావున పరమాత్మ నీవు ఉన్నచోటనే ఉన్నాడు గదా. నీ ప్రక్కనే నీ తండ్రి నిలచియున్నాడు. "నాన్న"అని పిలచినావు. వెంటనే నీ వైపు తిరిగి "ఏమి"అనుచున్నాడు. పరమాత్మ కోటాకోట్ల తల్లితండ్రుల కన్న ఎక్కువ వాత్సల్యము గలవాడు గదా! నీవు ఒక్కసారి పిలచిన పలుకడా? నీవు పదేపదే ఆయనను పిలుచుట ద్వారా ఏమి అర్ధము చేసుకొనుచున్నావు. రామ రామ అని ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు. నీ తండ్రి ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు అనగా దాని అర్ధముమేమి? ఆయన నీ పై కోపముతో ఉన్నాడు. ఆయన ముఖము నీకు చూపించుట లేదు. అనగా పరమాత్మ కనబడుట లేదు, పలుకుట లేదు. నిజముగా నీయందు పరమాత్మకు ప్రేమ యున్నచో నీవు ఒక్కసారి "రామ" యన్ననే ఎదురుగ నిలచి ఏమి అనవలయును. ఈ రెండును జరుగుట లేదు. దానికి కల కారణమేమి అని విచారింపక, విచారించి సరిదిద్దుకొనక ఎన్నిసార్లు రామ మంత్రము జపించినను ఫలమే మున్నది?

ఎన్ని రాగములతో రాముని పై గానము చేసినను ప్రయోజనమే మున్నది? నీ తండ్రి వచ్చి నాయనా కాళ్ళు నొప్పులు పుట్టుచున్నవి కొంచెము సేపు పిసుకుము అని అడుగగా ఆయన సేవాకర్మను చేయక నాన్న నాన్న అని అక్షరలక్షలు జపము చేసిన ఫలమేమున్నది? లేక నాన్న యొక్క గుణగణములను పొగడుచూ సంగీత శాస్త్రములో ఉన్న రాగములలో నాన్న పై పాటలు పాడిను అవసరమైన పనిని చేయక వీటిని చేయుచున్నందుకు నాన్న కోపగించి నీకు ముఖమును చూపడు. నీతో పలుకడు. ఆచరణములో కర్మలో స్వామి పైన ప్రేమను నిరూపించిన హనిమంతుని ఆదర్శముగా తీసుకొనక నీవు రాముని ఎట్లు పొందగలవు. కావున రామకార్యములో పాల్గోని రామసేవను చేసినవాడు హనుమంతుడు. హనుమంతుడు రాముడు జీవించినంత కాలము ఎప్పుడును రామ మంత్రమును జపించలేదు. ఎప్పుడును రామును పై భజనలు చేయలేదు. రాముడు జీవించనంత కాలము చేసినవి రెండేరెండు పనులు. ఒకటి రామకార్యములో పాల్గోనుట. రెండవది రామకార్యము లేనపుడు రాముని యొక్క వ్యక్తిగత సేవలో పాల్గోనుట. అనగా పాద సంవాహనము, చామరవీజనము మొదలగు సేవలు. సేవలో రాముని కార్యము మొదటిది. రామ కార్యము ఉన్నప్పుడు రాముని వ్యక్తిగత సేవ చేయలేదు. రామకార్యము లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత సేవ చేసేడి వాడు. వారధి నిర్మాణమునకు వ్యాకులుడై సముద్ర తీరమనన రాముడు కూర్చుని యుండగా, హనమమంతుడు వారధి నిర్మాణము నందు నిమగ్నుడైనాడే తప్ప, వారధిని పట్టించుకొనక కేవలము రాముని పాదములు పిసుకుచు రాముని ఎదురుగా కూర్చున లేదు. రామకార్యమంతయు ముగిసిన పిమ్మట రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామని వ్యక్తిగత సేవ చేసినాడు. తరువాత రాముడు కొంత కాలమునకు శరీరము చలించగా ఆనాటి నుండి రామనామ జపము రామ గానమును చేసినాడు. తరువాత రాముడు మరల కృష్ణునిగా మానవరూపమును తాల్చగా కృష్ణుని యొక్క కార్యమైన కురుక్షేత్ర యుద్ధమున పార్ధుని జండా పై నిలచి అదృశ్య రూపమున శత్రువులను సంహరించినాడు. అనగా మరల రామకార్యమున పాల్గోన్నాడు. నిజముగా కురుక్షేత్రమున శత్రువులను సంహరించినది రధమునకు ముందున్న కృష్ణుడు, మరియు రధము పైనున్న హనుమంతుడే. రామాయణమున, రాముడు హనుమంతుడు యుద్ధము చేయుచూ చేసినట్లు కనిపించినారు. కురకక్షేత్రమున కూడా నిజముగా ఆ ఇరువురు యుద్ధము చేసినారు. కాని కనిపించలేదు. కారణము స్వామి భక్తుడగు అర్జునునకు కీర్తి ఇచ్చుట కొరకే. ఈ కారణము వలననే కృష్ణుడు ఆయుధము పట్టను అన్నాడు. ఇట్లు హనుమంతుడు స్వామి ఎప్పుడు నరరూపమును తాల్చినను తాను కూడా స్వామి వెంట నుండి సేవలో పాల్గొనుచున్నాడు. సేవలేని జపములు, భజనలు వ్యర్ధములు . జపములు, భజనలు లేకపోయినను సేవ యున్నచో భక్తి నిరూపించబడినట్లే. తిన్నడు ఏ జపము చేసినాడు? ఏ భజన చేసినాడు? కేవలము తనకున్న దానితో సేవను చేసినాడు. ఇట్టి ఆచరణాత్మక సేవయే స్వామిని నీ వద్ద శాశ్వతముగా నిలుపును. జప తపములతో స్వామిని పట్టు చున్నావు. కాని క్షణములో జారిపోవు చున్నాడు. దీని వలన ప్రయోజనమేమి? నీ వద్దకు ఒక కోటి రూపాయిలు వచ్చి జారిపోయినచో నీవు కోటీశ్వరుడవు అగుదువా! లేదు లేదు. ఆ కోటి రూపాయిలు నీ వద్ద నిలచి నప్పుడే నీవు కోటీశ్వరుడవగుదువు.

జ్ఞానము, భక్తి స్వామిని సంపాదించునే తప్ప స్వామిని నిలుపజాలవు. స్వామి కంటి నుండి నెత్తురు కారినప్పుడు తన రెండు కన్నులను పెకిలించి స్వామికి అర్పించిన తిన్నడి యొక్క ఆచరణా రూపమైన సేవ ముందు కోటి రామ కోటియైనా తులతూగునా? ఒక్క తులసీ దళము ముందు ఎన్ని మణుగుల బంగారమైనను తుల తూగినదా? ఈ ఆచరణాత్మక మైన ప్రేమ నిరూపణమైన సేవ దత్త పరీక్షలలో బయిటపడును. దత్త పరీక్షలు అతి సూక్షముగా యుండును. ఒక్క క్షణకాలములో పరీక్ష పెట్టుట ఫలితములు ప్రకటించుట జరిగిపోవును. మనము చేయు చిన్న చిన్న పనులలో, మనము మాట్లాడు చిన్న చిన్న మాటాలలో, మన మనస్సులో మెదులు క్షణకాల భావములలో కూడా పరమాత్మకు మనము ఇచ్చు విలువ విషయములో ఓడిపోయి ఆ ఫలితములు చిత్రగుప్తుని గ్రంధములోనికి ఎక్కుచున్నవి. కావున పరమాత్మ విషయములో మనసా వాచా కర్మణా ఎంతో శ్రద్ధతో మెలుకువ యుండవలయును. రాజుగారి వద్ద ఎప్పుడు మనము ఎంతో జాగరూకతతో ఉందుము. ఆయన రాజు రారాజు. కావున ప్రతి క్షణము సేవలో ఎంతో జాగరూకత ఉండవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, November 5, 2009

త్యాగేనైకే అమృతత్వ మానసు

"త్యాగేనైకే అమృతత్వ మానసుః" అని శ్రుతి. త్యాగము చేతనే పరమాత్మ లభించును. త్యాగము అనగా దానము. దానమే దత్త శబ్దార్ధము.కావున స్వామి పేరులోనే స్వామిని చిక్కించుకునే మార్గము బోధపడుచున్నది. దానము అనగా ధనము యొక్క దానము మాత్రమే కాదు. స్వామి పరీక్షించినపుడు స్వామి బంధము నుండి అన్ని బంధములు తక్కువేయని నిరూపించవలయును. చివరకు నీ శరీరము పైన బంధము కూడా వదలి ప్రాణ త్యాగము చేయుటకు సిద్ధము కావలయును. నీ శరీర ప్రాణములపై బంధము కూడ ఒక బంధమే. ధర్మము మీద ఉన్న బంధమును సైతము స్వామి పరీక్షలో త్యజించవలయును అని "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" అను గీతా శ్లోకము తెలుపుచున్నది. మానమును సహితము త్యజించవలెను. మానము అనగా అభిమానము అని అర్ధము. దీనిని ఆత్మాభిమానమందురు. అనగా తన పై తన కున్న అభిమానము. ఇది కూడ బంధమై అభయమిచ్చిన గయుని వదలినచో ఆత్మాభిమానమునకు భంగము కలుగును. పట్టుదలయును ఒక బంధమే. గయుని రక్షింతును పట్టుదల పట్టికాదు. అర్జునుడు ఆ పట్టుదలచే బంధింపబడినాడు. స్వామిపై తనకున్న బంధము కన్న ఆ పట్టుదలతో నున్న బంధము ఎక్కువ అని నిరూపించినాడు పార్ధుడు. స్వామి కొరకు ఎలాటి పట్టుదలనైనను త్యజించి ఆత్మాభిమాన త్యాగము చేయవలయునని స్వామి పార్ధునికి బోధించుటకై తన పట్టుదలను త్యజించినాడు. పట్టుదల ఎట్లు త్యజించవలయునో ఆచరించి చూపెట్టినాడు. పట్టుదల కూడ అజ్ఞానము యొక్క లక్షణమే. కావుననే పార్ధుడు అజ్ఞాని యగు ఆటవికునిగా తిన్నడుగా పుట్టినాడు. ఇదే సర్వ సాధన యొక్క సారాంశము. స్వామి సర్వాధికుడన్న భావము ఏక్షణములోనైనను నిరూపించుటకు సిద్ధముగా యుండవలెను. స్వామి నీ విశ్వాసమును పరీక్షించుటకు ఒక్కొక్కసారి అధర్మమును ఆచరించమని ఆజ్ఞాపించును. స్వామి చెప్పినదే ధర్మము స్వామి కన్న ధర్మము ఎక్కువ కాదు. ధర్మాచరణము యొక్క ఫలమేమి?

దానిచేత స్వామి ప్రసన్నుడగుననియే కదా? స్వామి ఆజ్ఞను పాలించినచో, స్వామి ప్రసన్నుడగును. కావున స్వామి ఆజ్ఞయే ధర్మము. స్వామితో పోటి పడినచో ధర్మమే తలవంచుచున్నది. ధర్మదేవత ధేను రూపమున స్వామి పాదముల వద్ద తలవంచి 'రక్ష రక్ష' అని యాచించుచున్నది. ధర్మమే తలవంచినప్పుడు, నీవేల తలవంచవు? ఇందులో అసలు రహస్యము ఏమనగా నీవు తలవంచక పోవుటకు కారణము నీ అహంకారము అది బయిటపడుట ఇష్టము లేక ధర్మ శాస్త్రములను వల్లించుచున్నావు. "పెద్దలు ఇట్లు చెప్పినారని" శిష్టాచారమును ఉదహరించుచున్నావు. శిష్టాచారమే కేవలము ప్రమాణమైనచో ప్రహ్లాదుడు తన తండ్రి తాతలు ఆచరించిన రాక్షస ఆచారములను ఏల నిరాకరించెను? కావున జ్ఞానముతో కర్మ చేయవలయును. "జ్ఞాతే కర్మన విజ్యతే" "సర్వం కర్మ దీనం పార్ధ జ్ఞానే పరిసమాప్తతే" " జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భక్తసాత్‌ కురుతే అర్జునా! బుద్ధ్యా యుక్తోయయా పార్ధా కర్మ బద్దం పయశ్యసి బుద్ధియుక్తో జహతీహ ఉభేసకృత దుష్యతే ఆత్మవంతం నకర్మాణి నిబదృంతి ధనుంజయా" ఇత్యాది శ్లోకములన్నియును జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయుననియు, జ్ఞానము కర్మలను చూచి నవ్వుచున్నదనియు, జ్ఞానిని కర్మలు బంధించజాలవనియు బాధ పడుచున్నది. కావున ధర్మశాస్త్రము గాని పెద్దలు గాని కేవలము నీవు అడ్డుపెట్టుకొను సాకులే తప్ప నీ పట్టుదలకు కారణము నీలోని రజస్తమో గుణమైన అహంకారమే. శరణాగతి ధర్మమును పార్ధుడు అడ్డుపెట్టుకున్నాడే తప్ప పట్టిన పట్టుదల విడవక పోవుట అను క్షత్రియ రాజస అహంకారము దీనికి కారణము. తనకు తెలియకుండా తనలోనే పెరిగిన మాత్సర్యము మరొక కారణము. ఏమి కృష్ణుని ఆధిక్యము? ప్రతిమాట కృష్ణుడు చెప్పినట్లు వినవలసినదేనా? నేను ఆయనకు బానిసనా? అన్న అసూయ అహంకారములే గయుని విషయమున పట్టుదలకు కారణము కావున ఈ అసూయ అహంకారములు పరిపూర్ణముగా ఈ సాధన చేత నిర్మూలించుకున్న నాడే దత్తుడు జీవులకు చిక్కును. అంత వరకు చిక్కుచూ, జారుచూ ఉండును. దత్తుడు మీలో ప్రవేశించి, జారిపోకుండా శాశ్వతముగా నిలువవలయున్నచో అసూయను అహంకారమును నిర్మూలించుకొనుము.

ఎదుటి ఇంటిలో మంచినీటి బావి ఉన్నది. వాని ఇంటిలో ఉప్పునీటి బావి ఉన్నది. "తాతస్య కూపోయమితి బ్రలవాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి" అని శాస్త్రవచనము. అనగా మాతండ్రిగారు తవ్వించిన బావియని మూర్ఖుడు ఉప్పు నీటినే త్రాగును. వాడు ఉప్పు నీటిని త్రాగుటకు అసలు కారణము తండ్రిపై అభిమానము గాదు. దానిని అడ్డు పెట్టు కొనుచున్నాడు. వానిలో అసలు కారణము ఎదుటి వారి బావిలో మంచినీరు పడినదను అసూయ. తాను నీటి కొరకు మరియొకరిని యాచించనేలనను అహంకారము. వానిని ఉప్పు నీరు త్రాగునట్లు చేయుచున్నవి. ఇట్టి అహంకారముతో, మూర్ఖత్వముతో, అజ్ఞానముతో, అసూయతో పట్టుదలకు చిక్కి దానిని సడలించుకొనలేక, దానిని బయిట పడకుండా కప్పుకొనుటకు సంప్రదాయములను, పెద్దలిట్లు చెప్పినారనియు సాకులుగా ఉపయోగించుకొనుచున్నారు. "ఇది ఆత్మవంచన" దీనిచే వారు నష్టపోదురు. అజ్ఞానులు చెప్పు అజ్ఞానవాక్యములను గుడ్డిగా విశ్వసించి, అజ్ఞానమయమగు అంధరాల శ్రమమని నరక లోకమున శాశ్వతముగా పడుచున్నారు. అనగా ఆట్టి వారు విచారణకు, జ్ఞానమునకు అవకాశము లేని పశుపక్ష్యాది జన్మలయందు శాశ్వతముగా పడుచున్నారు. గుడ్డివారిని గుడ్డివారు పట్టుకున్నచో గుంటలో పడుట తప్పునా? ఈ అజ్ఞానులు చెప్పు వాక్యములు "అవిచారిత రమణీయములు". అనగా విచారణ చేయనంత వరకు మనోహరములు. ఉదాహరణకు ఈ సృష్టిలో జరుగు ప్రతి పనియును ఈశ్వర సంకల్పమేనందురు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమయైనా కుట్టదు అందురు. దీని ఆధారముగా చేసుకొని తమ అజ్ఞానమును సమర్ధించుకొను అహంకారమే కారణము. స్వామి నరసింహుని రూపములో వచ్చినపుడు హిరణ్యకశిపుడు స్వామీ! ప్రతిదీ నీ సంకల్పము చేతనే జరుగును కదా. కావున ప్రహ్లాదుని నేను హింసించుట నీ సంకల్పమే. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమ యైననూ కుట్టనప్పుడు నీ ఆజ్ఞ లేకుండా నేను ప్రహ్లాదుని ఇంత హింసించుట సాధ్యమా? కావున నన్ను సంహరించుట అన్యాయము. దానికి స్వామి సమాధానము ఏమని చెప్పును? ఓరీ! రాక్షసా! ఇప్పుడు నిన్ను చీల్చి చంపుటయు ఈశ్వరాజ్ఞయే. ఇదియు స్వామి సంకల్పమే. హత్య చేసాక వాడు న్యాయస్ధానములో ఇదే మాటను చెప్పినచో న్యాయమూర్తి నీకు ఉరి వేయుట కూడా ఈశ్వర సంకల్పమనియే చెప్పును. సృష్టిలో ప్రతి పనియును ఈశ్వరుని శక్తి చేతనే జరుగుచున్నది. నిజమే, కాని ఆపనిలో సంకల్పము ఈశ్వరునిది కాదు. సంకల్పము జీవునిది. సంకల్పించిన వారికే కర్మఫలముండును. సంకల్పము లేకుండా కర్మ చేసిన వారికి కర్మఫలము అంటదు. సంకల్పము ఫలము మీద ఉన్న ఆశ వల్లనే జరుగుచున్నది. ఫలాశ లేని వారికి సంకల్పము కలుగదు కావున కర్మ చేసినను ఫలము అంటదు. అని భగవంతుడు గీతలో పదేపదే ఘోషించినాడు. "మాఫలేషు కాదాచన, మాకర్మ ఫలహితుర్వా, అనాశ్రిత కర్మ ఫలం, సంగం చెత్త్వా ధనుంజయ" ఇత్యాది అనేక శ్లోకములు కలవు.

అడవిలో నున్న నిధిని పొందవలయునని ఆశతో ఒకడు గుర్రమును ఎక్కి అడవికి వెళ్ళినాడు. అక్కడ దొంగలు వానిని కొట్టినారు. వాడు అడవికి పోవుట అను కర్మ గుర్రము చేసినది కాని వారు గుర్రమును కొట్టలేదు. కర్మము జడము. జడము ఫలము నీయజాలదు. కావున సంకల్పము చేసిన వానికే ఫలము అందును. సంకల్పము లేకుండా రావణ శరీర స్పర్శ జరిగినను సీత అపవిత్రురాలు కాలేదు. అగ్ని రామునకు చెప్పినాడు. నర్మదానదిలో స్నానము చేయుచున్న గంధర్వుని చూచి రేణుక మనస్సు చలించననదది.గంధర్వుని కనీసము చేతితోనైనను సృశించలేదు. కావున కర్మ జరగలేదు అయినను శిరచ్ఛేధమను కర్మఫలమును పొందినది. కావున చేయుకున్నను సంకల్పము చేత కర్మఫలము లభించును. కర్మ చేసినను సంకల్పము లేనిచో కర్మఫలము అంటదు. ఎట్టి సంకల్పము లేక తల్లి ఆజ్ఞను అనుసరించి వ్యాసుడు అంబిక, అంబాలికల యందు పుత్రోత్పత్తిని కలుగచేసినాడు. కావున ఆ కర్మఫలము వ్యాసునకు అంటలేదు. ఇదే ధర్మశాస్త్రము యొక్క సారాంశము. కావున సర్వకర్మలను పరమాత్మయే చేయుచున్నప్పటికిని సంకల్పము మాత్రము జీవులవే కావున వాటి ఫలములను జీవులే పొందుదురు. జీవులే కర్తలు భోక్తలు. పరమాత్మ కేవలము సృష్టి సంకల్పమును చేసినా సృష్టి యను కర్మను చేసినాడు. దీనియొక్క ఫలము లీలా వినోదము. అట్టి లీలా వినోదమును ఫలమును తానే పొంోదుచున్నాడు. జగత్తును సృష్టించినంత వరకే స్వామి కర్త, దాని వినోదమును అనుభవించు వరకే భోక్త. ఈ జగత్తులో సృష్టి జరిగిన తర్వాత జరుగుతున్న అన్ని పనులకు పరమాత్మ సంకల్పము లేదు. వాటి సంకల్పము లన్నియు జీవులవే. తన తప్పును కప్పిపుచ్చుకొనుటకే ఈ మయావాదమును జీవుడు చేయుచున్నాడు. ఇట్లే జీవులందరును పరమాత్మయే లేక అన్ని జీవులలో పరమాత్మను చూడుము. ఈ వాక్యములు కూడా అవిచారిత రమణీయములే. సర్వ జీవులు పరమాత్మయే అయినచో పరమాత్మయగు తన తండ్రి జీవుని మాట ప్రహ్లాదుడు ఏల వినలేదు? పరమాత్మ యగు రావణ జీవుని రాముడు ఏల వధించెను? పరమాత్మ యగు తల్లి జీవుని శంకరులు ఏల త్యజించిరి? పరమాత్మలగు భార్యాపుత్రులను ఏల త్యజించెను? ఈ వాక్యమును తప్పు చేసిన వానిని సమర్ధించుకొనుటకు తెలివిగా ఉపయోగించు కొందురు. ఇది శంకరులు చేసిన అద్వైత వాక్యమని చెప్పుదురు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, November 3, 2009

ధనము

ధనము నీ శక్తి యొక్కయు నీ సమయము యొక్కయు స్వరూపమై యున్నది. నీ కాలము శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున దుర్వినియోగము చేసినచో నీ కాల శక్తులను దుర్వినియోగము చేసినట్లే. నివు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా శోడశోపచారములు ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు అనగా నేమి? ఒకడు జ్వరముతో బాధపడుచున్నాడు వానికి ఔషధము నిచ్చి, పాలు మొదలగు ఆహారము నిచ్చి, విసని కర్రతో విసరుచు ఇట్టి సేవలను చేయుట ద్వారా వాని యొక్క ఆర్తి శాంతించి వాడు ఆనంద పడుచున్నాడు. ఆర్తి యనునది చైతన్యము కలిగిన ప్రాణికి ఏర్పడును. ఆర్తి జడములకు కలుగదు. బ్రహ్మము చైతన్యమని "ఈక్షతే నా శబ్ధం" అని బ్రహ్మ సూత్రము చెప్పుచున్నది. "స ఈక్షాం చకే" అను శ్రుతియు బ్రహ్మమును సృష్టి సంకల్పము చేసినది కావున బ్రహ్మము చైతన్యమేనని చెప్పుచున్నది. శ్రుతిలో సః అను శబ్ధము ఈశ్వరుడును చైతన్య స్వరూపుడే అని చెప్పుచున్నది. చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు లేదా బ్రహ్మము అవతరించినపుడు చైతన్య స్వరూపమైన ప్రాణిగనే అవతరించును. మత్స, కుర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాద్యవతారములు ప్రాణులే. పరమాత్మ అచేతనమైన జడముగా అవతరించునట్లు శ్రుతి స్మృతులలో ఎచ్చటను లేదు. కావున పరమాత్మ మనుష్య రూపమున వచ్చినపుడు అవతారములో పరమాత్మ మరియు జీవాత్మ మరియు మనుష్య శరీరము ఉండును. జీవాత్మ ఇతర జీవుల వంటి జీవుడు కాకపోవచ్చును. అనగా స్త్రీ గర్భమున శుక్రరేతస్సుల సంయోగము చేత చైతన్యమయమైన జీవపిండము ఏర్పడును. దీనినే సామాన్య జీవ స్వరూపమందురు. ఈ జీవ స్వరూపములొ వంశ లక్షణములు మాత్రము ఉండును. ఆ తరువాత కొంత కాలమునకు విశేష జీవ స్వరూపము ప్రవేశించును. కొందరి సిద్ధాంతము ప్రకారము పురుషుని రేతస్సు ద్వారానే విశేష జీవ స్వరూపము ప్రవేశించుచున్నది. విశేష జీవస్వరూపము అనగా సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మఫలములతో కూడియుండును. అవతార పురుషుని శరీరములో ఇట్టి విశేష జీవ స్వరూపము ఉండదు. అవతారములోని జీవ స్వరూపము శుద్ధ చైతన్యమై సద్వంశ లక్షణములను మాత్రము కలిగి యుండును. ఒక్కొక్కసారి పరమాత్మ విశేష జీవ సహితమైన మానవశరీరమును ఆవహించవచ్చును. రామావతారములోని జీవస్వరూపము సామాన్య జీవస్వరూపము. పరుశురామునిలోని జీవస్వరూపము విశేష జీవస్వరూపము. ఏది ఏమైనను అవతారములో పరమాత్మ జీవాత్మ మనుష్య శరీరము అను మూడు ఉండును. జీవాత్మ మనుష్య శరీరములు కలసి ప్రకృతి అనబడును.ఇందు జీవాత్మ ప్రకృతి పరాప్రకృతి, శరీరము అపరా ప్రకృతి. పరమాత్మ పురుషుడు ఇట్లు అవతార పురుషుడు ప్రకృతిని ఆశ్రయించుటి. ఇదే "ప్రకృతిం స్వా మవష్టభ్య" అని గీతలో చెప్పబడినది.

కొందరి మతమున జీవాత్మయే పురుషుడు శరీరము మాత్రమే ప్రకృతి అనబడును. పరమాత్మ పురుషోత్తముడనబడును. ఏది యైనను సత్యమునకు భంగము లేదు. కావున ఉపచారములు పరమాత్మ ఆశ్రయించిన జీవాత్మ సహిత మనుష్య శరీరమునకే. ఈ ఉపచారములు పరమాత్మకు అవసరము లేదు కాని పరమాత్మ ఆశ్రయించి జీవాత్మను మనుష్య శరీరమును సంపూర్ణముగా వ్యాపించినను జీవ శరీరముల ప్రకృతి ధర్మము నశించవు. విద్యుత్‌ తీగె అంతయు వ్యాపించియున్నను సన్నగా ఉండుట వంకరలు తిరిగి యుండుట మొదలగు తీగె ధర్మములు నశించవు గదా. పైగా భక్తుల కర్మఫలములను అనుభవించుటకు ప్రకృతి ధర్మములు ఉండి తీరయలయునేగదా. సిద్ధులను ప్రదర్శింనప్పుడును శరీరము ప్రకృతి ధర్మములను గలిగియే యుండి భక్త కర్మఫల అనుభవ కర్మ ఆగక నిరంతరము జరుగుచునే ఉండును. ఎప్పుడో గోవర్ధన పర్వతోద్ధరణము మొదలగు మహా సిద్ధులను ప్రదర్శించు సమయమున మాత్రమే అవతార శరిరము దివ్యత్వమును పొండి దివ్యశక్తిమయమై ఉండును. కావున అవతార శరీరము క్షుత్పిపాసాది శరీర ధర్మములు కలిగియే యుండును.

కావున అవతార పురుషునకు ఉపచారములు అవసరము. అవతార పురుషుడు లభించనిచో మహాభక్తునకు, మహాభక్తుడు లభించనిచో ఆర్తులగు సజ్జనులకును ఈ ఉపచారములు అను త్యాగము లేక దానము చేయుట పరమాత్మకు సంపూర్ణ ప్రీతి కలిగించును.

రాముడు చిక్కకున్న హనుమంతుడు, హనమంతుడు చిక్కకున్న ఆర్తులు భక్తులైన సజ్జనులు ఈ ఉపచారములచే సేవనీయులు. జడములకు ఉపచారములు -1) కేవలము నీటితో కడుగుట - అనగా స్నానము. 2) పుష్పాలంకరణము వరకు చాలును. స్వామి లేనప్పుడు విగ్రహము, పటము మొదలగునవి దర్శించి భక్తిభావమును పొందవచ్చును గాన విగ్రహారాధనము ఆవశ్యకమే. కాని జడమైన విగ్రహమునకు ప్రాణియగు అవతార పురుషునకు చేయు ఉపచారములు అనవసరము. చీకటిగా నుండి విగ్రహము యొక్క దర్శనము స్పష్టముగా లేకున్నచో దీపోచారము అవసరమగును. కాని విగ్రహమునకు ధూప, దీప, నీరాజన ఉపచారములు అనవసరము. ధూపము ముమశిక్ష మక్షికాదులను తోలుట కొరకే. వాటి వలన విగ్రహములకు ఆర్తి కలుగదు. కాని వాటిచే నీకు ఆర్తి కలిగినచో ధూపమును వేసుకొని, నీవు స్ధిరాసనము సిద్ధించుటకు ఆ ఉపచారము నీవు చేసుకొన వచ్చును. ఇక నీరాజనమనగా విగ్రహము చుట్టును దీపమును త్రిప్పుట. ఇది విగ్రహము ఇంకనూ స్పష్టముగా కనిపించుట కొరకే. కాని నైవేద్య తాంబూలాల ఉపచారములు ప్రాణియగు అవతార పురుషునకు మాత్రమే. విగ్రహములకు వ్యర్ధము. అవతార పురుషునకు లేక మహాభక్తునకు లేక ఆర్తులైన సజ్జనులకు అన్ని ఉపచారములు సార్ధకము గావున చేయవచ్చును. కావున పట్టపగలు సూర్యకాంతిలో దీపము వెలిగించుట ధనమును దుర్వినియోగము చేయుట అగును. అట్లే మశిక మక్షికాదులు లేనప్పుడు దూపోపచారము వ్యర్ధము. సూర్య తేజస్సుతో లేక ఇంటిలోని దీపముతో దర్శనము స్పష్టముగా జరుగుచుండగా, కర్పూర నీరాజనాదులు వ్యర్ధము. నీవు విచక్షణ లేక ఇట్టి ఉపచారములు చేసినచో తైలము వత్తులు కర్పూరము అమ్ముకొని వ్యాపారము చేయువారికి పిచ్చివాడవై సాయపడుచున్నావు తప్ప అది ఉపచారము కాదు. ఉపచారము అనగా పూజలో చేసినది కాదు. ఏదియైనను ఆర్తిని పోగోట్టుటకు మనము చేయు ప్రయత్నము ఉపచారమనబడును. వారధి నిర్మాణము కొరకు స్వామి బాధపడుచుండగా నీవును ఒక బండ వేసి వారధి నిర్మాణమునకు సాయబడి స్వామి యొక్క ఆర్తిని తగ్గించుటయే ఉపచారము. అంతేగాని సముద్రములో బండవేయుట షోడశోపచారము, రాజోపచారములలో లేదు కావున చేయకుండుట అవివేకము. ఉపచారము అనగా ప్రాణి యొక్క ఆర్తిని తొలగించి ఆనందము కలుగచేయుట. ఐతే సమస్త జీవులు ఉపచారమునకు యోగ్యులు కారు. దుష్టులకు ఉపచారము చేయరాదు.

"పరోపకార పుణ్యయ పాపాయ పరపీడన" అని వ్యాసుడు చెప్పినాడు గదా. అనగా ఇతరులకు ఉపచారము చేసి బాధ తగ్గించుట ఉపచారము చేయుట పుణ్యము కావున సజ్జనులు దుర్జనులు అని చూడకుండా అందరుకి ఉపచారము చేయవలెనని అర్ధము చేసుకొనరాదు. ఇదే నిజమైనచో "పరిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం" అను శ్లోకమునకు విరోధము వచ్చును. అప్పుడు సజ్జనులకు దుర్జనులకు రక్షణము చేయవలయును గదా. సజ్జనులను రక్షించి దుర్జనులను నాశనము చేయుదునని గురువచనము. అట్లు చేయుట ధర్మమని "ధర్మ సంస్ధాపనార్దాయ" అను శ్లోకము చెప్పుచున్నది. కావున వ్యాస శ్లోకములో పర అను శబ్ధమునకు 'ఇతరులు' అని అర్ధము తీసుకొనరాదు. పర అను శబ్ధమునకు శ్రేష్టుడు, సజ్జనుడు అను అర్ధము తీసుకొనవలెను. కావున సజ్జనులకు ఉపచారములు చేయుట దుర్జనులను హింసించుట ఈ రెండును పుణ్యము. అట్లే సజ్జనులను హింసించుట, దుర్జనులకు ఉపచారములు చేయుట ఈ రెండును పాపములే అని తెలియవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad