Friday, January 15, 2010

నారాయణుడు

నారాయణుడు అనగా ఎవరు? "నారం ఆయనం యస్యసః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్ధమేమి? నరీయతే క్షీయతే ఇతి నరః అనగా నశించని వాడు నరుడు అని అర్ధము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు. శరీరము కూడ నశించినట్లు కనబడుచున్నదే కాని నశించుట లేదు. ఏలయనగా శరీరము లోని పంచభూతములు సృష్టిలోని పంచభూతములతో కలయుచున్నవి. ఆ పంచభూతములు ఇతర శరీరములకు కారకములగుచున్నవి. కావున జీవుడు నిత్యుడే. శరీరములోని పంచభూతములు కూడా నిత్యములే. ఈ శరీరము యొక్క రూపము మాత్రము నశించుచున్నది. కావున నరుడు అనగా నిత్యుడు అనగా జీవుడు మరియు శరీరము అని తీసుకొనవచ్చును. శరీరము బాల్య, యవ్వన, కౌమార, వార్ధక దశలు అన్నింటి యందును నిత్యముగనే ఉన్నది కదా. మనము నరుడు అన్నప్పుడు కూడ ఒక మనిషి అర్ధమునే తీసుకొనుచున్నాము. అనగా జీవునితో కూడిన శరీరమునే తీసుకునుచున్నాము. కావున శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవునితో కూడిన ఒక నర శరీరమును ఆశ్రయించిన వాడే నారాయణుడు. "మానుషీమ్‌ తను మాశ్రితమ్‌" అను గీత కూడా నేను మనుష్య శరీరమును ఆశ్రయింతును అని చెప్పుచున్నది. ఐతే పరమాత్మ అవతరించునప్పుడు ఆశ్రయించు నరశరీరములో ఉన్న జీవుడు నిర్గుణుడైన శుద్ధ చైతన్యము మాత్రమే. ఇట్టి శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవుని పైన శరీరమును మాతృ గర్భములో యున్నపుడు పరమాత్మ ఆశ్రయించ వచ్చును. లేక పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు ఆశ్రయించ వచ్చును. మరి మాతృ గర్భమున శరీర పిండమున ఉన్న శుద్ధ చైతన్యమును జీవుడన్నారు గదా. మరి పరలోకము నుండి దిగివచ్చిన ఈ రెండవ జీవుడెవరు? అనగా పిండ శరీరమున ఉన్న జీవుడు శుద్ధ చైతన్యము.

పరలోకము నుండి వచ్చిన జీవుడు నానా కర్మవాసనా గుణములతో కూడిన చైతన్యము ఒక ఉదాహరణము. ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర జడపదార్ధము. మాతృ గర్భలో యున్న జడమైన పిండ శరీరము జడమైన ఆ పాత్ర వంటిది. ఆ పాత్రలో శుద్ధ జలమున్నది. పిండ శరీరములో యున్న శుద్ధ చైతన్యము శుద్ధ జలము వంటిది. ఇప్పుడు ఈ పాత్రలో యున్న శుద్ధ జలములో కొంచెము బురద నీరు కలిపినాము. ఈ బురద నీరే పరలోకము నుండి దిగి వచ్చిన జీవుడు. ఈ బురద నీటిలో కూడ శుద్ధ జలము ఉన్నది. ఐతే బురద నీటిలో కూడ శుద్ధ చైతన్యము ఉన్నది. ఐతే బురద నీటిలో శుద్ధ జలముతో పాటు మట్టి కణములు కూడ వున్నవి. ఈ మట్టి కణములే దిగి వచ్చిన జీవునిలో ఉన్న కర్మ వాసనా గుణములు. ఇప్పుడు బురద నీరు పాత్రలోని శుద్ధ జలముతో కలసినప్పుడు ఏమైనది? బురద నీటిలోని శుద్ధ జలము పాత్ర నీటిలోని శుద్ధ జలముతో కలసి పోయినది. అనగా శరీరములోని శుద్ధ చైతన్యము దిగివచ్చిన జీవుని యొక్క శుద్ధ చైతన్యము కలసిపోయినది. కాని మట్టి కణములు మాత్రము శుద్ధ జలములో కలసిపోవు. అట్లే వాసనాగుణములు శుద్ధ చైతన్యముతో ఐక్యము కాజాలవు. కాని శుద్ధ జలము అది మట్టి కణములు వేరు చేయని స్ధితిలో కలసిపోయి శుద్ధ చైతన్యము కన్న విడిగానే యుండును. అట్లే వాసనా గుణములు కూడ శుద్ధ చైతన్యము నుండి వేరు చేయలేము. కాని గుణములు ప్రత్యేకముగా విడిగనే యుండును. ఇదంతయు జరిగిన తర్వాత చివరకు బురద నీరు మాత్రమే మిగిలినది. అనగా మాతృ గర్భస్ధ పిండ దశలో యందు పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు మాత్రమే ఉన్నాడు. పాత్రలో ఉన్న శుద్ధ జలముతో బురద నీటిని కలిపిన తరువాత బురద నీటి యొక్క ప్రమాణము పెరిగినది. కాని మట్టి కణముల సంఖ్య పెరగలేదు. అట్లే దిగివచ్చిన జీవుడు మాతృగర్భ పిండమున ప్రవేశించగనే వాని కర్మ వాసనా గుణములలో ఎట్టి మార్పురాదు. కాకున్న శుద్ధ జలము యొక్క ప్రమాణము అధికమైనందున బురద నీరు మరింత అయినట్లు పరలోకము నుండి వచ్చిన జీవుడు మరింత శుద్ధ చైతన్యముతో చేరినందున బాగుగా బలపడును. అనగా జీవనని వాసనా గుణములు పిండ ప్రవేశము చేత బలపడుచున్నది. ఆ తల్లి తిను ఆహారము వలన లభించిన శుద్ధ చైతన్య శక్తి రోజు రోజుకు ఎక్కువ అగుచుండగా ఈ జీవునిలో వాసనా గుణములు నానాటికి బలపడుచుండును. ఈ బలపడిన వాసనా గుణములు ఆ జీవ శిశువును ప్రసవించిన తరువాత ఆ శిశు శరీరములో అకారణముగా ఏడ్చుట, అకారణముగా నవ్వుట మొదలగు క్రియలను కల్గించుచుండును. ఆ శిశువు రోజు రోజుకు అన్నశక్తి చేత శుద్ధ చైతన్యము వృద్ధి యగుచుండగా ఆ వాసనా గుణములు బాల్యమున వాటికి అనుకూలమగు మంచి చెడు కర్మలను చేయించు చుండును. ఈ జీవుడు క్రమముగా బలపడి పెరిగి ఇతర జీవుల సంగము యొక్క ప్రభావము చేత కొత్త కొత్త వాసనలను సంపాదించుకొని, తదనుగుణముగా కొత్త కొత్త కర్మలను చేయుచుండును.

కాని పరమాత్మ అవతరించునపుడు జరుగు విషయము దీని కన్న వేరుగనున్నది. ఇదివరలో చెప్పిన పాత్రలో యున్న శుద్ధ జలమునకు కొంత చందన సుగంధ జలమును కలిపినప్పుడు ఆ పాత్రలో నున్న శుద్ధ జలమంతయు సుగంధ జలముగా మారుచున్నది. ఇదే విధముగా శుద్ధ చైతన్యముతో కూడిన గర్భస్ధ పిండ శరీరము లోనికి ఈశ్వరుడు ప్రవేశించుచున్నాడు. ఈ ఈశ్వరునిలో శుద్ధ చైతన్యమను శుద్ధ జలముతో పాటు కలిసిపోయిన చందన సుగంధ రేణువులను కల్యాణ గుణములున్నవి. కావున ఇప్పుడు మాతృ గర్భపిండ శరీరమున జీవునకు బదులు పై లోకము నుండి దిగివచ్చిన ఈశ్వరుడున్నాడు. ఆ తల్లి ప్రసవించగనే ఈశ్వరావతార పురుషుడు జన్మించినాడు. మానవ శిశువునకు, అవతార శిశువునకు బేధమేమి? ఇరువురిలోను జడ శరీరము అను రెండు పాత్రలున్నవి. ఇరువురిలోను శుద్ధ చైతన్యమను శుద్ధ జలమున్నది. అవతార శిశువులో చందన సుగంధ రేణువులగు కల్యాణ గుణములున్నవి. మానవ శిశువులో వాని పూర్వ కర్మ వాసనా గుణములను మట్టి రేణువులున్నవి. గుణములను తీసివేసినచో ఈశ్వరుడు జీవుడు ఒక్కటియే అగుదురు. బురద నీటి పాత్ర నుండి మట్టి కణములను వడపోసినాము. సుగంధ పాత్ర నుండి సుగంధ రేణువులను వడపోసినాము. ఇప్పుడు మిగిలినది శుద్ధ జలముతో కూడిన రెండు పాత్రలు. ఈ రెండు పాత్రలలో ఉన్న శుద్ధ జలము ఒక్కటే. ఈ శుద్ధ చైతన్యమునే బ్రహ్మము అన్నారు. కావున గుణములను తీసివేసిన నిర్గుణ చైతన్యము ఒక్కటే కావున జీవుడు బ్రహ్మమే ఈశ్వరుడు బ్రహ్మమే అన్నారు శంకరులు. ఇది నిజమే కాని శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేయలేము. శుద్ధ చైతన్యము గుణములకు ప్రాణము. ప్రాణము పోయిన కుక్కను కుక్క అని పిలువలేము. అది యొక రాయి వంటి జడ పదార్ధమే. ఆట్లే శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేసినపుడు వాటిని అసలు గుణములు అనలేము. గుణములను వదలి శుద్ధ చైతన్యము ఉండగలదు. కాని శుద్ధ చైతన్యమును వదిలి గుణములు ఉండలేవు. కాని నీటిని విడచి చేప ఉండలేదు. కావున సాధన యనగా జీవుడు తనలో నున్న పూర్వ కర్మ వాసనా గుణములను నిత్యము జ్ఞాన విచారణ అను వడపోత గుడ్డ సాయముతో వేరు చేయవలయును. అప్పుడు ఆ గుణములు నీటిని వదలినచో చేపల వలె నశించును. అయితే అది మరల ప్రవేశించకుండా ఎంతో శ్రద్ధతో ఉండవలయును. ఏలయనగా మహా భక్తులకే ఒక్కొక్కసారి అహంకార, మాత్సర్యాది గుణములు ప్రవేశించుచున్నవి. పెక్కు మాటలేల? సాక్షాత్తు హనిమంతునికే యయాతి రక్షణమున క్షణకాలము అహంకారము ప్రవేశించినది.

నారాయణ ఋషి వెంట జన్మ జన్మల వెంట యున్న నర ఋషియగు అర్జునుడే గయుని రక్షణ విషయమున అహంకారమును పొందెను. ఈ జీవుని గుణములలో పునాది వంటి మూల గుణమే అసూయ. ఈ అసూయనే ఈర్ష్య లేక మాత్సర్యమందురు. అసూయయే అహంకారమునకు కారణమగుచున్నది. తన కన్న గొప్పవానిని చూచినపుడు అసూయ కలుగును. వాడి కన్నను నేను గొప్పవాడను అను అహంకారము కాలక్రమముగా అసూయ నుండి జనించుచున్నది. ఈ అహంకారము యొక్క శాఖోపశాఖలే మిగిలిన జీవగుణములు. కావున అసూయ పోగానే సర్వజీవ గుణములు నీటి నుండి విసిరివేయబడిన చేపల వలె నశించుచున్నవి. నీ ఎదురుగ నరాకారమున పరమాత్మ యున్నపుడు నీవు ఎంత శ్రద్ధగా ఆరాధించినను ఒకానొక రోజుకు నీలో అసూయ గుణము బయిటపడక మానదు. ఆ నరాకార పరమాత్మ సిద్ధులను ప్రదర్శించినచో నీలో అసూయ మరింత బలముతో బయిటపడును. అందుకే శ్రీ రాముని ద్వేషించిన వారు చాలా తక్కువ. శ్రీ కృష్ణుని ద్వేషించిన వారు చాలా ఎక్కువ. షిరిడి సాయిని నిందించిన వారు చాలా తక్కువ. సత్యసాయిని నిందించిన వారు చాలా ఎక్కువ. సిద్ధులు విశ్వాసము కల్గించినను, కాలక్రమమున జీవునిలో మాత్సర్యము కల్గించును. జీవునిలో స్వామిపై పెరుగుచున్న మాత్సర్యము జీవునికే తెలియక ఒక్కసారి అనుకోకుండా అకస్మత్తుగా బయిటపడును. కాని ఆ మాత్సర్యము పెరుగుదల స్వామికి గోచరించును. అది బయిట పడక ముందే దానిని శాంతిప చేయుటకు స్వామి తన్ను తాను తగ్గించుకొనుచు చండాలాది రూపములతో గోచరించును. అధమ నరుండను నేను అని చెప్పుకొనును. అప్పుడు ఆ మాత్సర్యము వానిలో శాంతించును. జీవునిలో మాత్సర్యము శాతింపచేయుటకు స్వామి వాడు మరియొక ఔషధము ఏమనగా "సర్వజీవులు పరబ్రహ్మ స్వరూపులే" అనుట. దీనినే శంకరులు వాడినారు. ఈ ఔషధము చేత మాత్సర్యము పూర్తిగా శాంతించిన తరువాత కూడ గురువు చేసిన బోధ నిజమే అనుకొని "అహంబ్రహ్మస్మి" అను భావములో కొందరు శిష్యులున్న సమయములో వారికి నిజమును బోధించ తలచినారు శంకరులు. నిజము చెప్పినచో, ఇంక వారిలో మాత్సర్యము జన్మించదు అని నిశ్చయము చేసుకున్న తర్వాత తాను ఒకనాడు కరిగిన సీసమును త్రాగి మీరును బ్రహ్మమే అయినచో దానిని త్రాగమని శిష్యులను అడిగినాడు. అప్పుడు వారికి చిత్తశుద్ధి పూర్ణమైనందున మాత్సర్యము పుట్టలేదు. కావున దాసోహం అని శంకరుల పాదముల పడినారు. అయితే కొందరు చిత్తశుద్ధి పూర్ణముగా జరగని వారు మాత్సర్యము మరల విజృంభించుట చేత ఇది గారడి విద్యలెండు అని తలచి "అహం బ్రహ్మస్మి" అని భావించుచునే యుండిరి.

కావున జీవులను ఉద్ధరించుటకు శంకరులు రామానుజులుగ అవతరించినారు. తనను తాను స్వామి యని చెప్పుకొనుట జరిగిన ప్రమాదమును శంకరులు గుర్తించినారు. శంకరులు నిజముగా శంకరుడే ఇది శ్రుతి ప్రమాణ సిద్ధము. "నమో వ్యుప్త కేశాయచ" అని శ్రుతి. శివుడు ఎప్పుడును జటాజూటమును ధరించి యుండును. కాని రుద్ర నమకములో కేశములు గొరిగించుకున్నవాడని చెప్పబడినది. ఇది శ్రుతి వాక్యము కావున ఇది పరమ సత్యము. త్రోసివేయుటకు వీలులేదు. శివుడు శంకరులుగా అవతరించినపుడు సన్యాసాశ్రమమున శిరోముండనము చేయించుకున్నాడు. కావుననే "శివోహం శివోహం" అని వెలుగెత్తి చెప్పినాడు. అహంబ్రహ్మస్మి అని ఘోషించినాడు కాని ఈ జీవులు పరమానందయ్య శిష్యులు. ప్రతి శిష్యుడును శివోహం, అహం బ్రహ్మస్మి అన్నారు. పరమానందయ్యగారు శిష్యులతో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. వెంటనే శిష్యులు పరమానందయ్యగారితో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. అందుకే రామానుజులు సాక్షాత్తు విష్ణు స్వరూపులైనను, నేను విష్ణు భక్తుడగు శేషుని అవతారము అన్నాడు. అప్పుడు గాని శిష్యులు మేము స్వామి భక్తులము అని అనలేదు. రామానుజులు స్వామి అయినను తాను జీవుడనని చెప్పుకున్నారు. అప్పుడు జీవులు తాము కూడా జీవులమే అన్నారు. ఇదే జీవుల స్వభావము. దీనికి కారణము జీవుని కన్న అధికత్వమును ప్రత్యక్షముగ యున్న జీవుని రూపములో మాత్రము ససేమీరా ఒప్పుకొనరు. కావున స్వామి జీవుని రూపములో వచ్చినప్పుడు తనను తాను స్వామియని ప్రశంసించుకొనుట జీవులతో చాలా ప్రమాదకరము. ఎదో ఒక పరిపూర్ణ చిత్తశుద్ధి గల జీవునకు మాత్రమే అదియును ఏకాంతముగా తాను స్వామిని యని ప్రకటించును. ఒక్క అర్జునకు మాత్రమే ఏకాంతముగా గీతలో తన్ను తాను పరమాత్మనని చెప్పుచున్నాడు. అన్ని మహిమలను చేసినను యాదవులకు ఎన్నడును తనని తాను స్వామియని చెప్పుకొనలేదు. అంత పరిపూర్ణ చిత్తశుద్ధి గల, అంతకు ముందు వేయి జన్మలలో ఒక్కొక్క జన్మలో వేయి సంవత్సరములు తపస్సు చేసిన నరఋషి అవతారమగు అర్జునునికే చెప్పినాడు. ఆ మాటను భీష్మ ధర్మరాజాదులకు కూడా చెప్పలేదు. కాని అట్టి అర్జునుడే గీతాబోధ జరిగినా, 18 అధ్యాయములు విన్నా, పదునెనిమిదో రోజు సాయంకాలమునకే మాయలో పడినాడు. యుద్ధము ముగిసి పాండవ శిబిరమునకు రధము రాగానే ప్రతిరోజు సారధియగు తాను ముందు దిగి రధ ద్వారమును తెరచిన తరువాత రధికుడు అర్జునుడు దిగు సంప్రదాయము విడచి, పార్ధుని ముందుగా దిగమన్నాడు. ఆ క్షణములో రధికున కన్న సారధి గొప్పవాడు కానందున అహంకారముతో అర్జునుడు క్రిందకు దిగలేదు. కావున అర్జునిలోను అహంకారము ప్రవేశించినది. ఈ అహంకారమునకు కారణమేమి? కృష్ణునిపై గల అసూయయే. ఈ అసూయ ఎప్పుడు కలిగినది? భగవద్గీత చెప్పుటకు ముందు కృష్ణునిపై అసూయ కలుగలేదు.

ఏలననగా అంతకు ముందే జరిగిన గయోపాఖ్యానమున కృష్ణుని తాను గెలిచినాడు. కావున కృష్ణుడు తన కన్న తక్కువవాడు అన్న భావము వలన అసూయ కలగలేదు. మరియును తాను స్వామి యని అప్పుడును ప్రకటించలేదు. అప్పుడే పదునెనిమిది రోజుల ముందే కృష్ణుడు తాను స్వామియని ప్రకటించుట విశ్వ రూప దర్శనములో తాను గడగడ వణికి ఓడిపోవటము జరిగినది. కృష్ణుడు తాను పరబ్రహ్మమునని తెల్పుటయే కాక నిరూపించుట చేత అర్జునునకు అసూయ జనించినది. ఆ పదునెనమమిది రోజులలోఅసూయ పెరిగి పెరిగి అహంకారమును మొలకెత్తించినది. ఇది పార్ధునికి తెలియకుండగనే, పార్ధుని మనములో జరిగిన పరిణామము. కావున స్వామి అవతరించినపుడు తనను తాను స్వామియని ప్రకటించుకొనుటకు అర్హుడైన జీవుడు ఈ సృష్టిలో లేడు. ఒక్క జీవుడు తప్ప. ఆ జీవుడే రాధ. ఆ జీవుడు ఎప్పుడును ఓడిపోలేదు. ఆ జీవుడు ఎట్టి అడ్డునైనను దూకగల ఒక నిరంతతర భగవత్ప్రేమ మహాధార. అట్టి జీవుని కూడ దత్తుడు నిరంతర పరీక్షలోనే పెట్టుచున్నాడు. తన లోకమునకు పైన గోలోకమును సృష్టించి ఆమె పాదముల క్రింద తన శిరస్సును నిలిపి, ఆమెకు ఏ క్షణమైన అహంకారము వచ్చునేమో అని పరీక్షించుచునే ఉన్నాడు. కాని ఆ జీవునిలో ఇంతవరకు అహంకారము ప్రవేశించలేదు. భవిష్యత్తులో కూడా ప్రవేశించదు. కావుననే అమె పదవి పదిలముగనే యున్నది. ఉండును కూడా. కాని రాజరాజేశ్వరి భక్తులగు శక్తేయులు మాత్రము అహంకారముతో మిడిసిపడు చున్నారు. శక్తి యొక్క శ్రీ మత్సింహాసనము శక్తిలో అహంకారము ప్రవేశింపలేదు. శాక్తేయులలో అహంకారము ప్రవేశించినది. స్వామి కన్నను శక్తియే గొప్పదని వాదించుచున్నారు. అది శక్తికి పరీక్షయని వీరికి తెలియదు. పరీక్షించుట దత్తుని స్వభావ సిద్ధమైన గుణము. రామానుజుడు తనను తాను శేషుడు అనుటలో అర్ధము శేషుడు అనగా అవయవము అని అర్ధము. అనగా తాను విష్ణువు యొక్క అంశయని అర్ధము. సాక్షాత్తుగా స్వామి కాక పోయినను స్వామి యొక్క అంశయే అనుట చేత అద్వైతము మత్తు యొక్క నిషా కొంత తగ్గినది. మత్తును కూడా ఒక్కసారిగా క్రిందకు కుదించ కూడదు. ఆ తరువాత బ్రహ్మ దేవుని అవతారమగు మధ్వాచార్యులు వచ్చినారు. ఆయన నేను భగవంతునిలో అంశ కాదు. స్వామి కన్న వేరు. కేవలము స్వామి యొక్క దాసుడనే అని స్వామి సేవ్యుడు జీవుడు సేవకుడు అను సిద్ధాంతమును స్ధాపించినాడు. ఆయన స్వయముగా స్వామి అయిననూ తనను మూడవ వాయుపుత్రునిగా వర్ణించుకున్నారు.

హనమమంతుడు, భీముడు, మధ్వుడు అని వరుస చెప్పుకొని తనను తాను దాసుడనని శ్రీ వారి యొక్క కాలి కుక్కనని చెప్పుకున్నారు. అప్పుడు జీవుల యొక్క అద్వైత నిషా పూర్తిగా దిగినది. వారు మేము స్వామిలో భాగము కాదు. స్వామి కంటె వేరు. దాసాను దాసులము అన్నారు. ఇట్లు మూడవ అవతారమునకు గాని జీవుల వారి యొక్క సత్యమైన స్ధితికి రాలేదు. జీవుడు స్వస్ధితికి వచ్చుటకు స్వామి మూడు అవతారములు ఎత్తవలసి వచ్చినది. కావున ఒక్క జీవుని ఉర్ధరించుటకు స్వామి వేల అవతారములను ఎత్తవలెను. జీవుని చేత సత్య వాక్యమును పలికించుటకు స్వామి మూడు భాష్యములను చెప్పవలసి వచ్చినది. ఒక వ్యక్తి రైల్వేస్టేషనుకు పోయి, Who is tha station master? అని అడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I is tha stationa master" అన్నారు. ప్రశ్నించినవాడు తన ప్రశ్నలో ఏ క్రియను వాడినాడో (is) అదే క్రియను (is) తన సమాధానములో వాడినాడు. కావున గురువు తనను గురించి తాను ఏమి చెప్పునో శిష్యుడు కూడ తనను గురించి తాను ఆనాడు కాకపోయినను మరియొక నాటి కైనను అదే పలుకును. అప్పుడా వ్యక్తి "Are you the station master? అని ఆడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I are the station master" అన్నాడు. అప్పుడా వ్యక్తి ఆ స్టేషన్‌ మాస్టరు చేత సరియైన ఇంగ్లీషు వాక్యము పలికించవలయునని I am the station master అన్నాడు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు బల్లగుద్ది "I am the station master" అని కరెక్టుగా పలికినాడు. అట్లే శంకరుల తాను స్వామి అనగా, శిష్యులును తాను స్వామి అన్నారు. రామానుజులు తాను స్వామి యొక్క అంశలాగు భక్తుడననగా, శిష్యులు కూడ తాము స్వామి యొక్క అంశలాగ భక్తులమే అన్నారు. ఈ శిష్యుల చేత సత్యమును పలికించవలయునని మధ్వాచార్యులు "నేను వేరు స్వామి వేరు నేను స్వామి దాసుడను" అని చెప్పగా శిష్యులు కూడా "నేను వేరు, స్వామి వేరు, నేను స్వామి దాసుడను" అని పలికారు. ఈ విధముగా "సోహం" అని ఆరంభించి "దాసోహం" అను మాటతో ముగిసినది.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, January 12, 2010

గురుత్రయము

ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్యాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్ధాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకూలు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవోన కశ్చిత్‌" అనుచున్నది. అనగా దేవుడు లేడని అర్ధము. ఇక శూన్యవాదులగు బౌద్ధులు అంతా శూన్యమే కావున పరమాత్మయు శూన్యమే అన్నారు. ఒక కుగ్రామమునకు ఒక విద్యావంతుడు వెళ్ళి వారిని విద్యావంతులుగా చేయదలచినాడు. ఆ కుగ్రామములో జనులందరును ఒక్క అక్షరము గూడ వ్రాయటము చేతకాని వారే. అప్పుడు వారికి చదువు నేర్పుటాకు ఆ విద్యావంతుడు స్కూలు పెట్టునా, కాలేజి పెట్టునా లేక యూనివర్సిటి పెట్టునా. అతడు స్కూలు పెట్టి ముందు అక్షరముల నేర్పును. నాస్తికులు కూడ ఆ కుగ్రామ వాసుల దశలోనే ఉన్నారు. వారికి ముందు పరమాత్మ ఉన్నాడని స్ధాపించి పరమాత్మను గురించిన వివరములన్నియు చెప్పవలెను. ఇదే జ్ఞానము. ఆ కుగ్రామ వాసులను స్కూలుకు రప్పించుటకై మీరు ఈ స్కూలుకు వచ్చి అక్షరములను నేర్చుకొన్నచో కలెక్టరు పదవిని పొందుదురు అని చెప్పును. అది వారిని ఆకర్షించుట కొరకై ఈ స్కూలు తరువాత కాలేజి ఆ తరువాత యూనివర్సిటిలో చదివిన కాని కలెక్టరు పదవి రాదన్నచో అంత శ్రమకు భయపడి అసలు స్కూలులోకే రాడు. అట్లే మీరు పరమాత్మను గురించి తెలుసుకున్నంతనే మీరు పరమాత్మ అగుదురు అని శంకరులు "జ్ఞానా దేవత కైవల్యం" అని చెప్పినారు. అనగా జ్ఞానము చేత కైవల్యము సిద్ధించును అని అర్ధము. స్కూలుకు పోయి అక్షరములు నేర్చుకొనగనే కలెక్టరు పదవి లభించును అన్నపుడు ఆశతో ఉత్సాహము లభించి స్కూలుకు వచ్చి అక్షరములు నేర్చుకొందురు. అక్షరములు నేర్చుకొను శ్రమకు కూద భయపడినవరికి అవి చాలా సులభము ఒక్కసారి వ్రాసిన చాలును అని చెప్పి స్కూలుకు రప్పించవలెను. అట్లే బ్రహ్మజ్ఞానము తెలుసుకొను శ్రమకు కూడ బద్దకించిన వారికి "నీవే బ్రహ్మము"అను ఈ విషయము వచ్చి కొంచెము విచారణ చేసుకున్నచో చాలును. నీవే పరమాత్మవు అగుదువు అని ప్రలోభ పెట్టి భగవంతుని గూర్చిన వివరణమును కొంచమైనను వినుటకు ఉత్సాహము కల్గించినారు శంకరులు. ఈ విధముగా అప్పుడున్న కాల పరిస్ధితిని అనిసరించి స్కూలును మాత్రమే పెట్టి స్కూలు సిలబస్‌ను మాత్రమే బోధించినారు శంకరులు. ఇట్లు అని శంకరులు స్కూలు టీచరు మాత్రమే అని భావించరాదు. ఒక యూనివర్సిటి ప్రొఫెసరు ఆ కుగ్రామమునకు వచ్చినను స్కూలునే పెట్టవలెను. స్కూలు సిలబస్‌నే బోధించవలెను. అదే శంకరులు మరల రామానుజ రూపమున వచ్చినారు. అప్పటికి గ్రామస్తులందరును స్కూలులో చేరి స్కూలు చదువును పూర్తి చేసుకొనియున్నారు. ఆ కాల పరిస్ధితిలో యూనివర్సిటి ప్రొఫెసరు అయిననూ ఆ గ్రామములో కాలేజిని మాత్రమే పెట్టవలయును గాని యూనివర్సిటిని పెట్టరాదు.జ్ఞానము తర్వాత మెట్ట్టు భక్తి. అనగా జ్ఞానములో పరమాత్మ ఒక్క వివరమును ఆయన యొక్క గొప్పతనమును తెలుసుకొన్నగొలది ఆయన పై ఆకర్షణ కలుగును. ఆ ఆకర్షణయే భక్తి. బ్రహ్మము అనగా గొప్పది అని అర్ధము. కావున పరమాత్మ యొక్క గొప్పతనమును తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము. స్కూలు సిలబస్‌ కన్న కాలేజి సిలబస్‌ వేరుగా యుండును. కావున శంకరులు చెప్పిన దానికి రామానుజులు చెప్పిన దానికిని తేడా ఉండును. కాలేజి పెట్టినవారు రామానుజులు. జ్ఞానము వలన పుట్టిన ఆకర్షణచే ఏర్పడిన వేదన అని భక్తికి పరమాత్మ లభించును అని "వేదనా దేవ కైవల్యం" అని రామానుజులు అన్నారు. ఈ రెండింటికిని తేడా కనిపించినను ఇవి పరమాత్మను చేర్చు ఒక మెట్టునకు తరువాత యున్న మరియొక మెట్టు. మొదటి మెట్టు రెండవ మెట్టు వేరగా యున్నను అని రెండు ఒక దానికొకటి విరుద్ధములు కావు. రెండవ మెట్టు ఎక్కి ఇంటిలోనికి పోయినావు.

కావున ఇంటిలోనికి పోవుటకు రెండవ మెట్టే కారణమా. ఆ రెండవ మెట్టు ఎక్కుటకు మొదటి మెట్టు కారణము. ఇంటిలోనికి పోవుటకు రెండు మెట్లును కారణమే. జ్ఞానము మూల కారణమైనచో భక్తి ప్రాప్తి కారణము. జ్ఞానము వలన భక్తి, భక్తి వలన పరమాత్మ లభించును. ఇప్పుడు కాలేజి చదువు పూర్తియైన ఆ కుగ్రామములో రామానుజులే మధ్వులుగా వచ్చినారు. ఇప్పుడు మూడవ మెట్టుయగు యూనివర్సిటిని పెట్టినారు. అదియే సేవ్య సేవక సంభంధః అనగా పరమాత్మను వ్యక్తిగతముగనే, కాకుండా ఆయన కార్యములో పాల్గొనుచు సేవను చేయవలయును. ఇదే పరిపూర్ణ కైవల్యము పరిపూర్ణ ముక్తి. అట్టి దాసులకు స్వామి తాను దాసుడై యుండును. రామునకు దాసుడైన రామ దాసునకు నేను దాసుడను, జవానును అన్నాడు రాముడు. అట్టి సేవకులు స్వామి వెంట నుండి ప్రతి అవతారములోను ఆయన యొ్క్క సామీప్యము బొంది బ్రహ్మానందమున ఓలలాడుదురు. "ఇది సాధన యొక్క ఫలము, దీనికి మరియొక ఫలము లేదు". అనగా యూనివర్సిటి చదువుతో, చదువంతా పూర్తి అయినట్లే. ఈ విధముగా శంకర, రామానుజ, మధ్వులు అయా సాధకుల దశలను బట్టి తేడాలు కనిపించినను ఒకే లక్ష్యమును చేర్చు మెట్లు వరుసవలే ఏకత్వమును కలిగియున్నవి. ఇది మొదటి కారణము.

ఇక రెండవ కారణము ఏమనగా గురుదత్త స్వరూపులగు అవతార పురషులు బోధించిన విషయములను శిష్యులు తాళపత్ర గ్రంధములందు నిక్షిప్తము చేసినారు. ఆ గ్రంధములు ఒకరి చేతి నుండి మరియొకరి చేతికి సంక్రమించు చున్నప్పుడు వారి వారి భావములను మధ్య మధ్యలో దూర్చినారు. ఈ శిష్యులు భావములే ప్రక్షిప్తములు అనబడుచున్నవి. గురువులు చెప్పనవి గంగా జలము వలె శుద్ధమైన ఒకే తత్త్వము కల్గినవి. శంకర, రామానుజ, మధ్వుల భాష్యములు మూడు పాత్రలలోఉన్న ఒకే జలము. ఆ మూడు పాత్రలలోని జలము మూడు బావుల నుండి తేబడినవి. ఆ జలములలో కొంచెము రుచి బేధమున్నది. కాని తత్త్వములో విరోధము లేదు. రుచి బేధమునకు కారణము వారు అవతరించిన సమయములందు వేరు వేరు దశలలో ఉన్న సాధకులే కారణము. అవి హైస్కూలు, కాలేజీ, యూనివర్సిటి సిలబస్‌ల వంటివి. ఒక మెట్టు తర్వాత మరియొక మెట్టు ఎక్కినట్లు కేవలము స్ధాయి బేధము మాత్రమే. కాని ఆయా శిష్యుల చేతులలో పడిన ఈ భాష్యములు వారు వారు చేర్చిన పక్షిప్తములు అను రంగుతో కలసి వేరు వేరు రంగుల జలము వలె మారిపోయినవి. అసలే ఆయా కాలముల సాధకుల స్ధితులననుసరించి కొంత బేధమును కలిగియే యున్నవి. ఆ బేధములు సమన్వయమునకు అందుచుచు తాత్పర్యములో ఏకత్వము కలిగియున్నవి. ఈ విధముగా పురాణములు అన్నియును ప్రక్షిప్తములతో సంకరములైనవి. వ్యాస మహర్షి జయము అను పేరుతో 7000 శ్లోకముల గ్రంధము రచించెను. దానిలో పండితుల ప్రక్షిప్తములు కలిపి 1,25,000 శ్లోకముల గ్రంధముగా మారి దాని యొక్క అసలు పేరును కూడా పోగొట్టుకొని "మహాభారతము" అను కొత్త పేరు ధరించినది. వేదము మాత్రము బ్రహ్మదేవుని ముఖము నుండి అనగా సాక్షాత్తు గురుదత్తుని నోటి నుండి బ్రహ్మర్షుల పరంపరలో అధ్యయనము ద్వారా ఎట్టి ప్రక్షిప్తములు లేకుండా రక్షింపబడి ఈనాటికిని చెక్కుచెదరక యున్నవి. అయితే వేదములో చాలా భాగము నష్టమైపోయినది. దీనినే ఖిల భాగము అందురు. బ్రహ్మ దత్తుడు చెప్పిన జ్ఞాన సరస్వతి రూపమగు వేదములను భరద్వాజ మహర్షి చదవనారంభించినాడు.

మూడు వందల సంవత్సరములు తర్వాత తాను చదివినది ఒక చిన్న మట్టి కుప్పగాను, తాను చదవలసిన మిగిలిన వేదరాశి శిఖరమే కనిపించని మేరు పర్వతము గాను గోచరించినది. ఆయన చదివిన మూడు వందల సంవత్సరముల వేద భాగములు ఒక్క సంవత్సర భాగమే భూమిలో నిలచినది. అదియును క్రమ క్రమముగా విస్మరణము వలన సన్నగిల్లుచు వచ్చి ఈనాడు నాలుగు ఘడియల కాలము భాగము మాత్రమే మిగిలినది. ఇవియే ఉపనిషత్తులు. మరి ఈనాడు మనకు మిగిలిన వేదమంతయును ఉపనిషత్తులు మాత్రమే కాక సంహిత ఆరణ్యకములు, బ్రాహ్మణములు, నామములతో ఇప్పుడు లభించుచున్న వేదము ఋషులు చెప్పినదే. ఆ సూక్తములకు ఋషులు పేర్కొనబడినారు. ఈ వేద భాగములో ఎక్కువ భాగము యజ్ఞమును, చేయు విధానమును వివరించు కర్మ స్వరూపము గాను, ఇంద్రాది దేవతలను స్తుతించు స్త్రోత్రములతో నిండియున్నది. ఈ యజ్ఞము వచ్చిన బ్రహ్మ జ్ఞానియగు అతిధికి పెట్టు అన్నమును వండు పాక శాస్త్రమునకు సంబంధించి యున్నది. ఇక దేవతల స్త్రోత్రములన్నియును, ఆరోగ్యము, శత్రుసంహారము, ఐశ్యర్యము, సంతానము, బలము మొదలగు కాకములను కోరు స్త్రోత్తములుగా యున్నవి. ఇవి అన్నియు ఋషులు చెప్పినవే కావున ఈ భాగమును పురుష శబ్ధముచే చెప్పబడు జీవులు రచించినవే కావున వాటిని బుద్ధుడు పౌరుషేయములు అని అన్నారు. సంతోషించవలసినది ఏమనగా ఉపనిషత్తుల మధ్యలో ఋషులు ఎట్టి మంత్రములని చేర్చలేదు. ఏలననగా అవి అధ్యయన పరంపరల ద్వారా వచ్చుచున్నవి. కావున వేదము జ్ఞాన కాండము, కర్మ కాండము అని రెండు భాగములుగా విభజింపబడినది. జ్ఞానకాండమగు ఉపనిషత్తులు సాక్షాత్తు బ్రహ్మదత్తునిచే చెప్పబడినవి. ఆయన జీవుడు కాడు కావున ఆ భాగమును అపౌరుషేయమని చెప్పవచ్చును. జ్ఞాన, కర్మ కాండములు రెండును వేదమే అపౌరుషేయమే అని మన పండితులు వాదింతురు. ఇచ్చట నేను ఒక ప్రశ్నను అడుగుచున్నాను. వేద శబ్ధమునకు అర్ధమేమి?

"విదుః జ్ఞాని" అని కదా. అనగా వేదము అన్న జ్ఞానము అని అర్ధము. కావున జ్ఞాన కాండము మాత్రమే వేదము. కర్మ కాండము కర్మయే కావున వేదము కాదు. కాని పూర్వ మీమాంసకులు కేవలము కర్మ కాండనే తీసుకొని దానిని మాత్రమే వేదముగా భావించి జ్ఞాన కాండము చెప్పు ఈశ్వరుని నిరాకరించి నాస్తికులైనారు. వారు కేవలము అన్నమును వండు కర్మ కాండను మాత్రమే తీసుకొని కేవలము ఉదర పూరణ భోగమాత్రులై నాస్తికులుగా మారినారు. కావుననే వీరిని భగవద్గీత "వేదవాదరతాః పార్ధ నాన్య దస్తీతి వాదినః" అని చెప్పుచున్నది. అనగా వీరు కేవలము కర్మ కాండమునే వేదమని భోగలాలసులై నాస్తికులుగా మారినారు అని అర్ధము. కావున జ్ఞాన కాండము ఉత్తర మీమాంస అనబడు వేదాంత శాస్త్రము మాత్రమే గురుదత్తునిచే చెప్పబడిన గ్రంధము. ఆ గురుదత్తుని అవతారములగు శంకర, రామానుజ, మధ్వ గురువులు వారి భాష్యములందు ఈ ఉపనిషత్తులనే శ్రుతి ప్రమాణమునే ఉదహరించుచు వ్రాసినారు. ఇక శ్రుతి ప్రమాణమును అనుసరించి ఉన్న పురాణములలోని శ్లోకములను మాత్రమే గ్రహించినారు. శ్రుతి ప్రమాణమునకు విరుద్ధములైన పురాణ శ్లోకములను త్యజించినారు. ఏలననగా అవి ప్రక్షిప్తములు. ఈ పురాణములు చాలక సంప్రదాయములు అను మరియొక ప్రమాణమును తీసుకొనుచున్నారు. సంప్రదాయములు అనగా మన పెద్దలు ఆచరించినవి. కాని సంప్రదాయమునకు కూడ శ్రుతి ప్రమాణము ఉన్నప్పుడే దానిని గ్రహించవలెను. లేకున్నచో త్యజించవలెను. సంప్రదాయమే ప్రమాణమైనచో రాక్షస వంశమున పుట్టిన ప్రహ్లాదుడు సంప్రదాయ విరుద్ధముగా నారాయణ ఆరాధన ఏల చేసినాడు? కావున సంప్రదాయమును గుడ్డిగా అనుసరించరాదు. దానిని తర్కించి దానికి శ్రుతి ప్రమాణము ఉన్నదా లేదా అని చుడవలెను. శ్రుతి "బ్రహ్మశ్చనారాయణః శివశ్చనారాయణః" అనుచున్నది. అనగా సృష్టి ఆరంభమున సృష్టిని చేయుచున్న కాలములో పరబ్రహ్మ యొక్క పేరు బ్రహ్మ దేవుడు. సృష్టి అంతఃకాలమున సృష్టిని లయము చేయు బ్రహ్మము పేరు శివుడు. ఇది స్ధితి కాలము. స్ధితిని రక్షించుచు పాలించు పరబ్రహ్మము యొక్క పేరు నారాయణుడు. కావున వర్తమాన పరబ్రహ్మ నామధేయము నారాయణుడు అని మాత్రమే. ఊర్ధ్వ లోకములకు దేవతలు ఋషులు పోయినప్పుడు కనిపించునది నారాయణుడు మాత్రమే. కొందరు బ్రహ్మ స్త్రోత్రములను, శివ స్త్రోత్రములను చేసినప్పుడు నారాయణుడే బ్రహ్మ దేవునిగా, శివునిగా క్షణకాలము దర్శనమిచ్చును.

అంతే కాని వర్తమాన స్వరూపము నారాయణుడే.రాక్షసులకు బ్రహ్మ పైన, శివుని పైనన భక్తి గలిగి నారాయణునిపై ఏల ద్వేషము కలిగెను? రాక్షసులు అసూయ, మాత్సర్య స్వరూపులు. ప్రత్యక్షముగా ఎదురుగా యున్నస్వరూపమును ద్వేషింతురు. కంటికి కనిపించని స్వరూపములనే ఆరాధింతురు. కవున వారికి నారాయణునిపై ఈర్ష్యా ద్వేషములు కలుగుటలో ఆశ్చర్యము లేదు. దేవతలు, రాక్షసులు, ఋషులు ఎక్కడో లేరు. ఈ నరులలోనే ఉన్నారు. అసూయ, మాత్సర్యములను పరిపూర్ణముగా నాశనము చేసుకున్న వారే ఋషులు, దేవతలు అట్టి నరులు ప్రత్యక్షముగా వర్తమాన నరావతారముగా వచ్చిన స్వాముని అంగీకరించి ఆరాధింతురు. కాని అసూయ, మాత్సర్యములతో నున్న రాక్షస స్వభావము కల నరులు పరోక్ష నరాకారములనే అంగీకరించి ఆరాధింతురు. ప్రహ్లాదుడు దేవతాంశ సంభూతుడు. అనగా పరిపూర్ణమైన అనసూయ తత్త్వము కలిగినవాడు. కావున వర్తమాన స్వరూపుడగు నారాయణుని ఆరాధించినాడు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, January 7, 2010

సర్వమత సమన్వయము

హిందూ మతము ప్రకారముగా మూడు మతములు ఉన్నవి. అవియే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. హిందూమతము ఒక మానవ శరీరము వంటి పిండాండము. పిండాండమే బ్రహ్మాండమని పెద్దలు చెప్పుదురు. పిండాండమైన నర శరీరములో ఉన్న పదార్ధములే బ్రహ్మాండమున ఉన్నవి. జడమైన పంచభూతములు అనబడు అపరా ప్రకృతి. చైతన్యమగు పరా ప్రకృతి. రెండింటిలోను సమానముగా ఉన్న తత్త్వములే. కావున హిందూ మతమును పోలి విశ్వమతములు ఉన్నవి. భారతదేశము పిండాండమైనచో ఈ భూమి అంతయు బ్రహ్మాండము. ఈ భూమియగు ప్రపంచములో కూడా ముఖ్యమైన మతములు మూడున్నవి. హిందూమతము, క్రైస్తవమతము, ఇస్లాంమతము. హిందూమతములోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములలో ఏకత్వమును చూడలేని వాడవు హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతములలో ఏకత్వము ఎట్లు చూడగలవు. ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా? శంకర, రామునుజ, మధ్వాచార్యుల భాష్యములలో ఏకత్వమును చూడలేనప్పుడు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ గ్రంధములలో ఏకత్వమెట్లు చూడగలవు. నీ ఇంటిలో ఉన్న మూడు గదుల మధ్య గోడలు పగులగొట్టి ఒక్క హాలును చేయలేని వాడవు, మూడు ఇండ్ల మధ్య నున్న గోడలను పగులగొట్టి ఒక్క ఇంటిగా ఎట్లు మార్చగలవు. హిందూ మతములో ఉన్నన్ని వేదాంత గ్రంధములు శాస్త్రములు నిజముగా ఏ మతములోను లేవు. అనగా హిందూమతములో సత్యమును దర్శించుటకు కావలసిన సామాగ్రి ఎంతో ఎక్కువగా యున్నది. ఇంత సాధన సామాగ్రితో నీవే సత్యమును కనుగొన లేనప్పుడు ప్రపంచములో మిగిలిన జీవులు సత్యమును కనుగొనగలరా? అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత పండితులు కలహించు కొనుచుండగా ప్రపంచములో కెల్ల సర్వ మతస్ధులు కలహించుకొనుటలో ఆశ్చర్యమేమున్నది. వీరశైవులు శివుడే దైవమందురు. వీర వైష్ణవులు విష్ణువే దైవ మందురు. శాక్తేయులు శక్తియే దైవ మందురు. ఈ కలహములకు భయపడి బ్రహ్మదేవుడు తనకు గుడి లేకుండా చేసుకున్నాడు. దీనిలో అంతరార్ధమేమి? బ్రహ్మదేవునిలో బ్రహ్మ శబ్ధమున్నది. బ్రహ్మము అనగా సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆయన వేదకర్త. అనగా జ్ఞాన స్వరూపుడు మరియు ఆయన జిహ్వపై వాణి యున్నది. అనగా వాక్కుతో జ్ఞానముతో బోధించు గురుస్వరూపుడు.అనగా సాక్షాత్తు దత్తుడే. అనగా ఈ కలహములను చూచి అసలు వ్యక్తియగు దత్తుడు జారిపోయినాడు. ఆయన యొక్క వేషములే విష్ణువు, శివుడు, శక్తి. కావున వీర శైవులకు మిగిలినది శివుడను పేరుగల కేవలము శివ వేషమే. వీర వైష్ణవులకు దక్కినది విష్ణువను పేరుగల విష్ణు వేషమే. అట్లే శాక్తేయులకు చిక్కినది అమ్మవారి యొక్క వేషమగు చీరె, అలంకారములు కిరీటము మాత్రమే. మూడు వేషములలో ఉన్న వ్యక్తిని కనుగొనలేనప్పుడు కేవలము వేషము పైననే నీ దృష్టి ఉన్నప్పుడును నటుడగు వ్యక్తి జారిపోవును. కావున ప్రపంచములో మూడ మత కలహములు చేయువారి దైవ స్వరూపములు కూడ కేవలము వేషమాత్రము గనే మిగిలిన ఒక ఉపాధ్యాయుడు ఒకే పాఠమును అనగా సిలబస్‌ను ఇంగ్లీషు భాషలో ఇంగ్లీషు మీడియం సెక్షనులో, ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి చెప్పుచున్నాడు. అదే ఉపాధ్యాయుడు అట్లే పాఠమును తెలుగు భాషలో తెలుగు మీడియం సెక్షనులో ధోవతి చొక్కాను ధరించి బోధించుచున్నాడు. ఈ రెండు సెక్షనులలో వ్యక్తిపై దృష్టి లేక కేవలము వేషమునందు దృష్టియున్న విద్యార్ధులు మా ఉపాధ్యాయుడు గొప్ప అంటే మా ఉపాధ్యాయుడు మరియు మా పాఠము గొప్ప ఆంటే మా పాఠము గొప్ప అని వాదించుకొనిచున్నారు. కాని రెండు సెక్షనులలో కొందరు తత్త్వమును పరిశీలించగల ఏకాగ్రతతో ఉన్న బుద్ధిమంతులగు విద్యార్ధులు మిగిలిన విద్యార్ధులతో ఈ వి్ధముగా చెప్పుచున్నారు.

ఓ! విద్యార్ధులారా! మీరు ఏల కలహించుచున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఆయా భాషలలో విద్యకు బోధించియున్నాడు. ఉన్నది ఒక ఉపాధ్యాయుడే కాని వేషములు రెండు. చెప్పినదీ ఒక పాఠమే. కాని భాషలు రెండు మీరు మీ ఉపాధ్యాయుల వేషముపై దృష్టి ఉంచక ఉపాధ్యాయుని యొక్క స్వరూపమును నిశతముగా పరిశీలించుడు. మీకు సత్యము తెలియును. అట్లే మీలో రెండు భాషలు వచ్చు విద్యార్ధి ఎవరైనను ముందుకు వచ్చి రెండు పాఠములను చదించుడు. అప్పుడు ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము అను విషయము బోధపడును. దీనిని ప్రపంచమునకు చాటి చెప్పిన వాడే స్వామి వివేకానందుడు. ఆయన ఒక్కొక్క మతస్ధుడగు వీరాభిమానిని ఒక్కొక్క బావి నుండి వచ్చిన బావి కప్పగా వర్ణించినాడు. వేషాలు వేరు దేవుడొక్కడే. భాషలు వేరు బోధింపబడిన తత్త్వము ఒక్కటే అని ఘోషించినాడు. కావున శ్రీ దత్తుడు ఒక్క హిందూమతమునకు సంబంధించిన వాడు కాడు. ప్రపంచములో యున్న సర్వ మతముల దైవ స్వరూపములగు వేషములలో ఉన్న ఒకే ఒక నటుడు శ్రీ గురు దత్తుడు. అన్ని మత గ్రంధములు ఆయన యొక్క పాఠములే. ఆయా దేశములకు అనుకూలమైన వేషములలో నుండి ఆయా భాషలలో ఒకే సిలబస్‌ను బోధించినవాడు. అయితే ప్రతి దేశాములోను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీలు ఉన్నవి. ఆట్లే ప్రతి దేశములోను అధమ, మద్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులగు జీవులు ఉన్నారు. కావున ప్రతి మతములోను ఆ మతములో వివిధ దశలలో ఉన్న సాధకుల దశలననుసరించి వివిధ పాఠములున్నవి. అన్ని దేశములలోను హైస్కూలు విద్యార్ధులకు ఒకే సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలో కాలేజి స్ధాయి విద్యార్ధులకు ఒకే స్ధాయి సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలోను యూనివర్సిటీ స్ధాయి విద్యార్ధులకును ఒక స్ధాయి సిలబస్‌ ఉన్నది. ఒకే దేశములో ఒకే భాషలో బోధించబడుచున్నను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ సిలబస్‌లు వేరు. మన హిందూ మతములో త్రిమతముల పండితులు కలహించుకొనుట మన ఊరిలో హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ విద్యార్ధులు కలలహించుకొనుట వంటిది. మరియు మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పర రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుచున్నారు. కావున భాష ఒక్కటే అయినను సిలబస్‌ తేడా వలన మన ఊరిలో విద్యార్ధుల కలహము, సిలబస్‌ ఒక్కటియే యైనను భాషలో తేడా వలన మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పరరాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుట జరగుచున్నది. ఇది చాలక మరియొక కలహమున్నది. మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధికి పరరాష్ట్ర భాష వచ్చును. ఐతే వీడు ఈ రాష్ట్ర హైస్కూలు సిలబస్‌ పరరాష్ట్ర కాలేజి సిలబస్‌తో పోల్చి ఈ రాష్ట్రములో విద్య లేదు ఆ రాష్ట్రములో విద్య లేదు అని కలహించుచున్నాడు. ఈ కలహములు ఎప్పుడు పోవును? అన్ని మతములలోను అధమ, మధ్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులున్నారు. ఒక మతములో అధమ స్ధాయి వారికి సంబంధించిన బోధన విషయములకు మరియొక మతములో అదే అధమ స్ధాయికి చెందిన సాధకుల యొక్క విషయమును పోల్చి చూచినచో ఒక్కటియే అని తేలును. ఇట్లే మధ్యమ, ఉత్తమమ స్ధాయిల వారు కూడ వారి వారి స్ధాయి విషయములను మాత్రమే అన్ని మతములలో పోల్చుకున్నచో ఏకత్వమును దర్శించి అన్ని మతముల పాఠ్యాంశములు ఒక్కటే యని తేల్చుకొనవచ్చును. ఇట్లు తేల్చి వివరించి నిరూపించుటయే ఈ జ్ఞాన సరస్వతి యొక్క ముఖ్యలక్ష్యము. మన హిందూ మతములో ఉన్న హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ స్ధాయిలే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతములు. అద్వైతములో శంకరులు చెక్కిన జ్ఞానము మొదలు మెట్టు హైస్కూలు విద్య లేనిదే కాలేజి, యూనివర్సిటీ విద్యలు లభించవు. కావున హైస్కూలు విద్య తక్కువ అని భావించరాదు. కావున జ్ఞానము మూల కారణము. ఆ తరువాత విశిష్టాద్వైతములో రామానుజులు చెప్పిన భక్తి భగవంతుని చేర్చు ప్రాప్తి కారణమగు రెండవ మెట్టు. రెండవ మెట్టుయగు కాలేజి. ఆ భగవంతుని పొందిన తరువాత నీవు క్రియలో నిరూపించు సత్యమైనన భక్తియే సేవ యనబడు మూడవ మెట్టు అగు అత్యుత్తమమైన యూనివర్సిటిగా ద్వైతమున మధ్యులు చెప్పనారు. క్రియలేని భావము వాక్కు వ్యర్ధములు. అసత్యములు. క్రియలో ఉన్నదా లేదా అని పరీక్షయే దత్త పరీక్ష.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Sunday, January 3, 2010

బహూనాం జన్మనామన్తేః

"బహూనాం జన్మనామన్తేః జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ స్సర్వమితి సమహాత్మా సుదుర్లభః" అని గీత. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ నరాకారము పరబ్రహ్మమని విశ్వసించు నిశ్చల జ్ఞానము, అనేక జన్మల తపస్సాధన వలన అసూయను పోగొట్టు కొని అనసూయా తత్త్వమును పోందిన ఒకానొక అతిదుర్లభ జీవునకే లభించునని అర్ధము. "నాహం ప్రకాశః సర్వశ్య యోగ మాయా సమావ్యతః" అని గీత. నేను మాయచే కప్పబడి యున్నందున అందరు గ్రహించలేరని అర్ధము. ఒక సింహము గొర్రెలలో కలసి పోయి ఆత్మీయుడుగా ఆ గొర్రెలతో మెలుగుచు కొన్ని గొర్రెలకు తండ్రిగాను, కొన్ని గొర్రెలకు పుత్రునిగాను, మరి కొన్నింటికి సోదరునిగాను,కొన్నింటికి భర్తగను, మరి కొన్నింటికి ప్రియునిగాను ఆయా గొర్రెల అభీష్టముననుసరించి ప్రవర్తించి దగ్గరకు తీసుకొని జ్ఞాన, భక్తులను గురించి బోధించవలసిన అవసరము వచ్చినది. ఇది సింహము అని ఏ మాత్రము బయిటపడినను తనతో గల ఆత్మీయ బంధము చెదరిపోవును. ఏలననగా తండ్రి కొడుకు మొదలగు బంధములు జీవుల మధ్య నుండు బంధములు. ఆ బంధములలో స్వామిని ఆరాధించవలయునన్నచో స్వామి ఒక జీవుని వేషములో జీవుని ప్రవర్తననే అనుసరించి యుండవలయును. అందువలన ఆ సింహము పూర్తిగా గొర్రె తోలు కప్పుకొని గొర్రె ఆకారమున, గొర్రె కంఠస్వరముతో గొర్రెల మధ్యకు రావలయును. అప్పుడే గొర్రెలు స్వామితో లౌకిక బంధముతో ఆనందించగలవు. కావున గొర్రెలకు తాను సింహమన్న సత్యజ్ఞానము తెలుయకుండా వేషములో స్వామివలె నటించుటయే మాయ. ఈ మాయతోనే స్వామి అవతరించవలెను. "సంభవామి ఆత్మమాయయా అని గీత. అనగా నా మాయను ఆధారము చేసుకొని నేను అవతరించెదను అని అర్ధము. ఈ నటన రూపమగు, మాయ వలన గొర్రెలు తాము కూడా గొర్రెలని భావించి పరిహాసముతో, సరసోక్తులతో లౌకిక బంధములతో స్వామితో క్రీడించగలవు. అవి క్రీడించుట మాత్రమే స్వామి వానితో క్రీడించగలడు. కావున స్వామి ఈ ప్రయోజనము కొరకే స్వామి తన మాయా నటనముతో వాటికి తాని సింహము కాదన్న ఆజ్ఞానమును వాటికి కలిగించుచున్నాడు. కాని ఈ అజ్ఞానము వాటికి దీర్ఘకాలమున్నచో తన మీద నిర్లక్ష్యము కలుగి తనను అవమానించుచు తాను చేయు బోధలను శ్రద్ధతో వినరు. అంతే తప్ప మానావమానములకు అతీతుడగు స్వామి వారు చేయు అవమానమునకు ఏ మాత్రము బాధపడడు. అంతే కాక పైలోకమున స్వామికి అవమానము దుర్లభము కావున మానము కన్నను అవమానమునకు ఎక్కువ ఆనందించును. కావున భగవత్‌ అవమానమునకు ఎప్పుడును ఆగ్రహించడు. ఇచ్చట మానావమానముల ప్రశ్న కాదు. నిర్లక్ష్యముతో తాను చెప్పునది వినకపోవుట వలన వాడు ఉద్ధరింపబడరు. తాను వచ్చిన ప్రధాన కార్యము వారిని ఉద్ధరించుటయే. కావున అట్టి సమయములలో చిన్నచిన్న సిద్ధులను చూపి అనగా తన కంఠ స్వరమును తన సహజమగు సింహ కంఠమును కొంత చేర్చి తాను సింహమన్న జ్ఞానము ఒక్క క్షణకాలము కల్గించును. పూర్తిగా వేషము తీసి తాను సింహమని చూపినచో గొర్రెలు కనుచూపు మేరలో ఉండవు. మరల ఆ సింహము గొర్రెగా నటించిననూ దగ్గరకు రావు. వచ్చిననూ భయముతో బెదురు చుండునే తప్ప వాటికి ఇష్టమైన లౌకిక బంధములో సహజ స్ధితిలో రమించ జాలవు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad