Tuesday, December 30, 2008

భారతదేశము ఎప్పుడునూ దారిద్ర్యముతో బాధపడుచున్నది. ఎందువలన?

భారతీయ పండితులు కర్మఫలత్యాగమును యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫల త్యాగమును చేయుటలేదు. పరీక్షకు పేపరు, పెన్నువలె ఈ పరీక్షకు కర్మఫలమగు ధనము, నరాకారమున ఉన్న స్వామి కావలయును. ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకొనుటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు. మరియొక్క అతి తెలివి ఏమనగా మానవుడు ఆహారమును భుజించి మానవుడే మాధవుడు కావున మాధవుడే భుజించినట్లుగా భావించుచూ స్వామికి కర్మఫలత్యాగమును చేసినట్లుగా పలుకుచున్నాడు. ఇట్టి అతితెలివి మార్గములలో కర్మఫలము నిజముగా వారి వద్దనే ఉన్నది. ఈ విధముగా భారతీయ పండితులు తమ లోభమును అతి తెలివితేటలతో కప్పి పుచ్చినారు. హృదయము ప్రేమతోను, బుద్ధి తెలివి తేటలతోను నిండియుండును. భారతీయులు స్వామికి బుద్ధిలోనున్న తెలివిని, కుటుంభమునకు హృదయములో నున్న ప్రేమను త్యాగము చేసినారు. విదేశములలో వారు కుటుంబమునకు తెలివిని, స్వామికి ప్రేమను ఇచ్చుచున్నారు. ప్రేమ యొక్క ఫలమే కర్మఫలత్యాగము. తెలివియొక్క ఫలములే ధ్యానము, స్తోత్రము మొదలగునవి. ఈ తెలివియే భారతదేశమునకు దారిద్ర్యమును తెచ్చినది. చేతిలోనున్న పేలపిండి గాలికి ఎగిరిపోయినచో దానిని "రామార్పణం" అను స్థాయికి భారతీయుల తెలివి పెరిగినది. విదేశీయులు సంపాదించి అనుభవించి మిగిలిన దానిని త్యాగము చేయుచున్నారు. వారు తమ పిల్లలను వయస్సు రాగానే సంపాదించి జీవించమని బయటకు పంపుచున్నారు. భారతదేశములో ఉన్న కుటుంబ బంధములకన్ననూ విదేశములలో ఉన్న కుటుంబ బంధములు చాలా బలహీనమైనవి. కావున విదేశీయులహృదయములలో కుటుంబ బంధముల ద్వారా కారిపోని ప్రేమ ఎక్కువగా మిగిలియున్నది. వారు భగవంతుని గురించి తెలియగనే ఆ ప్రేమ అంతయును విజృంభించి స్వామి మీదకే మరలించబడుచున్నది. వారి కర్మఫలత్యాగము పూర్ణము కావున త్వరగా స్వామిని చేరుకొనుచున్నారు. వారి బుద్ధులు నేరిగా ఉన్నవి. కావున కనీసము పిల్లలకు సైతము దాచుట లేదు. కావున వారి దేశములను సంపన్నదేశములుగా స్వామి అనుగ్రహించినారు. భారతదేశములో ఎంత జ్ఞానము వర్షించినా ఇంకి పోవుచున్నదె కాని ఆచరణలో ఉపయోగించుటలేదు. విదేశములలో గట్టి నేలపై వర్షించిన వాన నదివలె ప్రవహించినట్లు జ్ఞానము అందరికీ ఉపయోగపడుచున్నది. సైన్సులో కూడా విదేశీయులు ఆచరణమునకు ప్రాధాన్యతను ఇచ్చుచుండ భారతీయులు మేథాశక్తితో చర్చలతో గడుపుచున్నారు. ఈ స్వభావము అథ్యాత్మిక సంప్రదాయము నుండి భారతీయులకు సంక్రమించినది. అందుకే భారతదేశమును స్వామి అపార మేథా శక్తితోను, విదేశీయులను అపార ధనములతోను అనుగ్రహించినారు. "ఎవరు ఎట్లు నన్ను సమీపింతురో వారిని అట్లు సమీపింతును" అని గీతా వాక్యము.

ఈ పూర్ణిమ పూర్ణ చంద్రుడు ధనమును, మనస్సును సూచించును. కావున నీ పూర్ణ ప్రేమను కర్మఫల త్యాగము ద్వారా పూర్ణ విశ్వాసముతో కూడిన మనస్సుతో సద్గురువునకు గురుదక్షిణగా ఇచ్చుటయే. పూర్ణిమ నాడు దత్తుడు సాక్షాత్కరించినందున ప్రతి పూర్ణిమ నాడు మీరు గురుదక్షిణ ద్వారా కర్మఫలత్యాగము చేయవలెను. కాని గురువుకు ప్రదక్షిణములను చేయుట కాదు. భారతీయులు తప్పుదిద్దుకొని కర్మఫలత్యాగమును నేర్చుకొని తమ దేశమును సంపన్న దేశముగా స్వామి అనుగ్రహముద్వార సాధించవలయును. భారతీయుల ఆథ్యాత్మిక కేంద్రములు సైతము విదేశ ధనముల ద్వారానే వృద్ధి చెందిన విషయము స్పష్టమే కదా. స్వామి వివేకానందుదు "ఇంత జ్ఞానముతో ఉన్న నా భారతదేశము ఇంత దారిద్ర్యముతో ఏల భాధపడుచున్నది?" అని పెద్దగా ఏడ్చినాడు. దానికి స్వామి ఇచ్చు సమాధానమే ఇది.

శ్రీ దత్తుని పాదముల వద్దనున్న కుక్కలు కాపలా పనిని చేయుచూ కర్మ సంన్యాసమును చూపుచున్నవి. గోవు తన దూడను సైతము వదలి తన పాలను దత్తునికి ఇచ్చుచూ కర్మఫలత్యాగమును చేయుచున్నది. కర్మఫల త్యాగముతో కూడిన కర్మసంన్యాసమే కర్మయోగము. కేవలము కర్మసంన్యాసము కన్ననూ కర్మయోగమే గొప్పదని గీత. "తయోస్తు..." అని చెప్పుచున్నది. అనగా సద్గురువు చేయు జ్ఞాన, భక్తి ప్రచారమునకు చేయు సేవయే కర్మయోగము. ఇదే కేవలము దత్తుని చేరు మార్గము. యోగ వాశిష్టములో శ్రీ రాముని ముందు ధనమునార్జించి గురుదక్షిణ తెమ్మని వసిష్టుడు ఆదేశించినాడు.

"గురుసాక్షాత్పరబ్రహ్మ" గురువు అనగా సద్గురువగు "శ్రీ దత్తుడే". బిక్షల ద్వారా, గురుదక్షిణల ద్వారా నిరూపించబడిన నీ భక్తికి సంతసించి, అతడే నీ పాపములను, నీ భక్తికి తగు ప్రమాణములో గ్రహించి నిన్ను ఈ లోకములో సుఖముగా ఉంచి సాధన చేయించగల సమర్థుడు. సాయి తనకు సమర్పించు రొట్టెలు వారి పాపములు అని చెప్పినారు. పేదవాడు ఇచ్చు రూపాయి గురుదక్షిణ ధనికుని లక్షలతో సమానము. సద్గురువువలె జీవుడు సమర్థుడు కాడు. ప్రాచీన కాలంలో పండితులు ఎవరి ఇంటనూ భుజించుట కాని, దక్షిణలను స్వీకరించుట కానీ చేసెడివారు కారు. (అపరిగ్రహ వ్రతము). ఇందుకె ఈ రెండింటికీ అవకాశము కల పౌరోహిత్యమును తప్పని సరికానిచో చేయుటకు ఇష్టపడెడి వారు కాదు. తన పాపములతోనె సతమతమగుచుండగా ఇతరుల పాపములను స్వీకరించి అనుభవించగల ఓర్పు, శక్తి జీవులకు ఉండదు. కావున ఒకరి ఇంట భోజనము చేయక వైశ్వదేవమును పాటించెడివారు. అందుకే భోజనము, బహుమానములను గుర్తుంచుకొని మరల చెల్లించుచుందురు.

సద్గురువు దక్షిణలను, మరల జ్ఞాన, భక్తి ప్రచారములకు దరిద్రులగు భక్తులకు సాయపడుటలోను ఉపయోగించి లోకకళ్యాణమునకే పాటుపడును. మరియు సద్గురువు బిక్షలద్వారా పొందిన అన్న శక్తిని కూడా జ్ఞాన బోధలోనే ఖర్చు చేసి జీవులను ఉద్ధరించును. ఇట్టి త్యాగము వలన దత్తుడు అను శబ్దము స్వామి సార్థకమైనది.

Monday, December 29, 2008

విశ్వమత సమన్వయము

స్వామి మరియు క్రిస్టియన్ ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ

ఒకసారి స్వామి నరసరావుపేట-విజయవాడ రైలులో ప్రయాణించుచున్నారు. ఒక క్రిస్టియన్ మతస్థుడైన ఫాదర్ కూడా స్వామితో ప్రయాణించుచున్నారు. స్వామి మరియు ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ:


ఫాదర్: నాయనా విను, క్రీస్తును నమ్మి ఆరాధించని వారు శాశ్వత నరకమున పడిపోవుదురు. ఇది మా మత ధర్మము.

స్వామి: క్రీస్తు పుట్టక ముందు జీవులకు ముక్తిలేదా? దేవునకు, ఆ తరముల వారికి ఈ అవకాశమును ప్రసాదించని కారణమున పక్షపాతము వచ్చినది గదా! అనగా క్రీస్తు ముందు తరముల వారిని నిష్కారణముగా అనుగ్రహించకపోవుట తప్పుకదా!

ఫాదర్: క్రీస్తు పూర్వము యొహోవా పేరుతో దేవుడున్నాడు. కావున దేవునకు ఈ నింద రాదు. యొహోవాను ఆరాధించిన వారు కూడా పరలోకమునకు పోవుదురు.

స్వామి: మంచిది. అయితే ఈ భారతదేశమునకు యొహోవాను గురించి కాని, క్రీస్తును గురించి కాని వాస్కోడిగామా ఇండియాకు రాకముందు ఏమీ తెలియదు. మరి ఈ భారతదేశమున వాస్కోడిగామా రాకముందున్న జీవులందరును నిష్కారణముగా అన్యాయముగా నరకమునకు పోయినారు. వారికి యొహోవా క్రీస్తుల గురించి తెలియకపోవుట వారి తప్పుకాదు. తెలిసి ఆరాధించకపోయినచో వారి తప్పు ఒప్పుకొనవలసినదే. వారికి భగవంతుడు యొహోవా, క్రీస్తుల గురించి తెలియచేసి ఉండవలెను. అనగా ఒక చిన్న దేశమునకే కాక, అన్ని దేశములనున్న సర్వజీవులకు యొహోవా, క్రీస్తుల గురించి ఏల తెలియబడలేదు? ఒకేసారి కేవలము ఒక దేశమునకే యొహోవా, క్రీస్తుల గురించి ఏల పరిమితమైనది? ఆ దేశము వారికి అవకాశము ఇచ్చుట దేవుని పక్షపాతముకదా? మీ సిద్ధాంతమున జీవునకు పునర్జన్మ లేదు. కావున భారతదేశమున ఆనాటి తరములందరును యొహోవా, క్రీస్తుల గురించి తెలియక అన్యాయముగా నరకమున పడినారు! పోనీ మరల భూమిపై జన్మించి యొహోవా, క్రీస్తుల గురించి ఇప్పుడు తెలుసుకొను అవకాశము కూడా లేదుకదా. ఏలననగా వారికి పునర్జన్మ లేదు కదా! కావున మీ వాదము దేవునకు పక్షపాతము అంటకట్టుచున్నది అనుట నిస్సంశయము.

ఫాదర్: సరే దేవుడు పక్షపాతము కలవాడన్న వాదము మీ మతమునకు అంటక తప్పదు. ఏలననగా మీరు నారాయణుడు, కృష్ణుడు తెలియనివారు నరకమున పడుదురని వాదించుచున్నారు గదా. విదేశములకు పాత కాలములో నారాయణ,కృష్ణుల గురించి తెలియ నరకమున పడినందున మీ దేవునకు గూడ పక్షపాతము వచ్చినట్లే గదా!

స్వామి: మంచి ప్రశ్న వేసినావు. క్రీస్తు, యొహోవాల గురించి తెలియని వారు నరకమున పడుదురనువారు వీర క్రైస్తవులు. అలానె కృష్ణుడు, నారాయణుడు గురించి తెలియని వారు నరకమున పడుదురన్న మా హిందువుల శాఖ వారు వీర వైష్ణవులు. ఈ రెండు మతముల వలే వీర శైవులునూ ఉన్నారు. వీరు శివుని ఆరాధించకపోయిన నరకప్రాప్తియని వాదింతురు. హిందూ మతములో వీరశైవ, వీరవైష్ణవ మతములవారు ఇట్లే కలహించుకొనుచున్నారు.హిందూ మతము ఒక చిన్న విశ్వముగా ఉన్నది. హిందూ మతములోని అవాంతర మతములగు శైవ, వైష్ణవ మతములలోనే ఏకత్వమును చూడలేని వారు, ప్రపంచ మతములలో ఏకత్వమును చూడగలరా? ఇంటిలోని గోడలను పగులకొట్టి, ఇల్లు మొత్తము ఒకే హాలు చేయలేని వారు, ఇండ్ల మధ్యగోడలను పగులకొట్టి అన్ని ఇళ్ళను ఒకే ఇల్లు చేయగలరా? కావున ఈ వీర మతములన్నియు దేవునకు పక్షపాతమును తెచ్చుచున్నవి.

కానీ, దేవుడు నిష్పక్షపాతియని నిరూపించుటకు ఒకే ఒక మార్గమున్నది. అది ఏమనగా--
అన్ని కాలములందును, అన్ని దేశములందును, ఒకే దేవుడు భిన్న రూపములతో వచ్చి, ఒకే జ్ఞానమును బోధించి యున్నాడు. కావున, ఆ జ్ఞానమును అనుసరించినవారు అన్ని కాలముల, అన్ని దేశములాలో ముక్తులగుచున్నారు. అనుసరించని వారు అన్ని కాలముల, అన్ని దేశముల నరకమున పడుచున్నారు. చూడండి! ఈ సిద్ధాంతములో దేవుడు నిష్పక్షపాతియని నిరూపించబడుచున్నాడు. ఇంతకన్న వేరు మార్గము లేదు. కావున, నీ దేశకాలములకు సంబంధించిన నీ మతములో నీవు ప్రయాణము చేయుము. తప్పక లక్ష్యము చేరుదువు. పరమతమును విమర్శించవద్దు. నీ మతమును ఇతర మతస్థులపై రుద్దవలదు. అది మతాహంకారము అగును. నీవు తలవంచుకొని, పక్క మతములవైపు చూడక నీ మతమున ప్రయాణించినచో నీవు తప్పక దేవుని చేరుదువు. అన్ని నదులూ, సముద్రమునే చేరును. ఒక నది "నేనే సముద్రమును చేరుచున్న ఏకైక నదిని" అని అహంకరించినచో, దేవుడు ఆ నదికి అడ్డముగా ఆనకట్టను కట్టించును. ఆ నదితప్ప, ఇతర నదులన్నియును సముద్రమును చేరును! నీవు నీ మతములో ముందుకు పోతే లక్ష్యమును చేరగలవు. అట్లుకాక అడ్డముగా పరమతంలోకి పోతే, ఆ మతంలో లక్ష్యము నుండి అదే దూరములో ఉంటావు. నీ మతమును స్తుతించుము. కాని ఇతర మతమును నిందించకుము. దేశ కాల భేదము వలన భాషా వ్యవహార సంస్కారములు మారుచున్ననూ, మానవుడు ఒక్కడే. అలానే అన్ని దేశములందు అవతరించిన అవతారములలో కూడా దేశ కాల భేదము కనిపించిననూ, దేవుడు ఒక్కడే. అలానే దేవుని చేరు మార్గములైన మతములలో -- క్రీస్తు ఎలా భక్తుల పాపములను తాను భరించి, జీవులకు పుణ్య ఫలములనిచ్చు దయామయుడో అలానే కృష్ణుడు కూడా, కుచేలుని పాప ఫలమగు దారిద్ర్యమును తాను తీసుకొని, తన సంపద నంతయును భక్తుడగు కుచేలునకు ఇచ్చుటకు సిద్ధపడ లేదా? "అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి - అనగాఅ మీ పాపములనన్నింటి నుండి మీకు విముక్తినిచ్చుచున్నాను." అని అనలేదా? కావున క్రీస్తు అయినా, కృష్ణుడు అయినా ఆ కరుణాతత్త్వము ఒక్కటే.

దత్తావతారములన్నియును భక్తుల పాపకర్మఫలములను ఆకర్షించుకొని తాము అనుభవించి, భక్తులకు సౌఖ్యమును కలిగించుట అందరూ చూచుచున్నారు కదా! (స్వామి తన భక్తుల రోగములను ఎన్నిసార్లు తనపై ఆకర్షించుకొని అనుభవించుట, స్వామి భక్తులమైన మనము ఎన్నిసార్లు చూడలేదు?)

ప్రతి మతములోను జీవులు వివిధ స్థాయిలలో ఉన్నారు. ఆ స్థాయిలననుసరించి, ఆ మతములోనే వివిధ బోధలున్నవి. ఆంధ్రలో, స్కూల్, కాలేజీ స్థాయిలలో సిలబస్ లు తెలుగులో ఉన్నవి. తమిళనాడులో అదే స్కూల్ కాలేజీ సిలబస్ లు తమిళములో ఉన్నవి. రెండు రాష్ట్రములలోను స్కూల్ సిలబస్ ఒక్కటే. అలానే కాలేజీ సిలబస్ కూడా ఒక్కటే. ఏ రాష్ట్ర విధ్యార్థి అయినా స్కూల్ విధ్యార్థి కన్నా కాలేజీ విధ్యార్థి గొప్పయగును. అలానే, నీవు ఏ మతస్థుడవైననూ నీవు స్కూల్ స్థాయిలో ఉన్నావా? లెక కాలేజీ స్థాయిలో ఉన్నావా అనునది ముఖ్యము. తెలుగు స్కూల్ విధ్యార్థి, తమిళ కాలేజీ విధ్యార్థి కన్నా గొప్ప కాదు. రెండు భాషలు సమానమే. అయితే స్కూల్ సిలబస్ కన్నా కాలేజీ సిలబస్ గొప్పది. తమిళ స్కూల్ విధ్యార్థి తెలుగు స్కూల్ లో చేరినంత మాత్రమున గొప్పవాడు కాదు. కావున నీ మతమును మార్చుకొనుట కాదు. నీ మతములో పై స్థాయికి పొమ్ము. అప్పుడు గొప్పవాడగుదువు. నీ తమిళ భాషలోనే స్కుల్ల్, కాలేజీ రెండూ ఉన్నవి. నీవు తెలుగు మీడీయంకు మారనక్కరలేదు. అలానే ప్రతి మతములోను ఆది నుండి అంత్య స్థాయి వరకును జ్ఞానమున్నది. ఈ సత్యమును తెలియక పోవుటయే అజ్ఞానము. ఇదే మత ద్వేషములకు మూలమై ఇహలోకములో సుఖముగా ఉండుటకే అడ్డుగా మారుచున్నది. ఇట్టివారు పరలోక సుఖమును పొందుదురా! "ఉట్టికెక్కలేనివారు స్వర్గమునకు ఎక్కగలరా?"

ఈ సంభాషణము జరిగిన తరువాత ఆ ఫాదరు లేచి స్వామికి నమస్కరించి ఆశ్రునయనాలతో ఇలా అన్నారు.
"క్రీస్తు మరల వచ్చును అన్నమాట నేడు సత్యమైనది. క్రీస్తు తప్ప ఎవరును ఇలా బోధించలేరు". స్వామి ఇంటికి రాగానే "చూశారా! అతడెంత విశాల హృదయుడో అన్ని మతములలోను మంచి వారున్నారు. అట్టి వారి కొరకే నా యీ జ్ఞాన ప్రచారము అని వచించారు."

Saturday, December 27, 2008

స్వామి గురించి

శ్రీ జన్నాభట్ల వేనుగోపాల కృష్ణమూర్తి, ఎం.ఎస్‌.సి, పి.హెచ్.డి., కెమిస్ట్రీ ప్రొఫెసర్ భక్తుల చేత 'స్వామి' లేక 'దత్తస్వామి' గా పిలువబడుతున్నారు. నేటి తరానికి అధ్యాత్మిక తత్త్వమును బోధించాలంటే "సైన్సు అంటే నవీన తర్క శాస్త్రము కావాలి" అంటారు స్వామి. స్వామి 19 సంవత్సరముల వయస్సులో పి.హెచ్.డి డిగ్రీని పొందినారు. 11వ ఏటనే సంస్కృతములో వందకు పైగా గ్రంధములు వ్రాసినారు. ఈ గ్రంధాలలో శంకర-రామానుజ-మధ్వ గురుత్రయము యొక్క భాష్యాలను సమన్వయము చేసి మూడింటిలోను ఒకే సిద్ధాంతమున్నదని నిరూపించినారు. ఉత్తర-దక్షిణ భారత దేశంలో 12 సంవత్సరాలు సంచరించి అనేక పండితులతో వాదోపవాదములు చేసినారు. స్వామి ఇచ్చిన దివ్య ఉపన్యాసాలు "జ్ఞాన సరస్వతి" శ్రీర్షిక కింద అనేక గ్రంధాలుగా ముద్రించబడినవి. స్వామి ఆశువుగా చెప్పిన భక్తిగీతాలను "భక్తిగంగ" అను గ్రంధముగా ముద్రించబడినవి. స్వామి దత్తవేదము, దత్తభగవద్గీత, దత్తోపనిషత్తులు, మొదలగు పవిత్ర గ్రంధములను అందించినారు. స్వామి చేసిన దివ్య మహిమలు "మహిమ యమున" అను గ్రంధముగా ప్రచురించబడినవి. దత్తసేవకు మూల స్తంభములగు శ్రీ చిలుకూరు బాలకృష్ణమూర్తిగారు, భవాని గారు అందరికీ చిరస్మరణీయులు.

"అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును" అంటారు స్వామి. భక్తులు స్వామిని దత్తావతారముగా గుర్తించి విశ్వసిస్తున్నారు. స్వామి ప్రసాదించిన అనేక దివ్య ఉపన్యాసాలను ఈ బ్లాగు ద్వారా పొందగలరు. ఈ దత్తసేవలో పాల్గొని ఇతర భక్తులు కూడా శ్రీ దత్త ప్రభువుల యొక్క అనుగ్రహమును, ఆశీస్సులను పొందుదురుగాక!
శ్రీ దత్తప్రభువు ఒక్కరే ఈ విశ్వమునకు గురువుగా, పరమాత్మగా ఉన్నారు గదా.

At Lotus feet of Shri Dattaswami
-Durgaprasad