భారతీయ పండితులు కర్మఫలత్యాగమును యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫల త్యాగమును చేయుటలేదు. పరీక్షకు పేపరు, పెన్నువలె ఈ పరీక్షకు కర్మఫలమగు ధనము, నరాకారమున ఉన్న స్వామి కావలయును. ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకొనుటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు. మరియొక్క అతి తెలివి ఏమనగా మానవుడు ఆహారమును భుజించి మానవుడే మాధవుడు కావున మాధవుడే భుజించినట్లుగా భావించుచూ స్వామికి కర్మఫలత్యాగమును చేసినట్లుగా పలుకుచున్నాడు. ఇట్టి అతితెలివి మార్గములలో కర్మఫలము నిజముగా వారి వద్దనే ఉన్నది. ఈ విధముగా భారతీయ పండితులు తమ లోభమును అతి తెలివితేటలతో కప్పి పుచ్చినారు. హృదయము ప్రేమతోను, బుద్ధి తెలివి తేటలతోను నిండియుండును. భారతీయులు స్వామికి బుద్ధిలోనున్న తెలివిని, కుటుంభమునకు హృదయములో నున్న ప్రేమను త్యాగము చేసినారు. విదేశములలో వారు కుటుంబమునకు తెలివిని, స్వామికి ప్రేమను ఇచ్చుచున్నారు. ప్రేమ యొక్క ఫలమే కర్మఫలత్యాగము. తెలివియొక్క ఫలములే ధ్యానము, స్తోత్రము మొదలగునవి. ఈ తెలివియే భారతదేశమునకు దారిద్ర్యమును తెచ్చినది. చేతిలోనున్న పేలపిండి గాలికి ఎగిరిపోయినచో దానిని "రామార్పణం" అను స్థాయికి భారతీయుల తెలివి పెరిగినది. విదేశీయులు సంపాదించి అనుభవించి మిగిలిన దానిని త్యాగము చేయుచున్నారు. వారు తమ పిల్లలను వయస్సు రాగానే సంపాదించి జీవించమని బయటకు పంపుచున్నారు. భారతదేశములో ఉన్న కుటుంబ బంధములకన్ననూ విదేశములలో ఉన్న కుటుంబ బంధములు చాలా బలహీనమైనవి. కావున విదేశీయులహృదయములలో కుటుంబ బంధముల ద్వారా కారిపోని ప్రేమ ఎక్కువగా మిగిలియున్నది. వారు భగవంతుని గురించి తెలియగనే ఆ ప్రేమ అంతయును విజృంభించి స్వామి మీదకే మరలించబడుచున్నది. వారి కర్మఫలత్యాగము పూర్ణము కావున త్వరగా స్వామిని చేరుకొనుచున్నారు. వారి బుద్ధులు నేరిగా ఉన్నవి. కావున కనీసము పిల్లలకు సైతము దాచుట లేదు. కావున వారి దేశములను సంపన్నదేశములుగా స్వామి అనుగ్రహించినారు. భారతదేశములో ఎంత జ్ఞానము వర్షించినా ఇంకి పోవుచున్నదె కాని ఆచరణలో ఉపయోగించుటలేదు. విదేశములలో గట్టి నేలపై వర్షించిన వాన నదివలె ప్రవహించినట్లు జ్ఞానము అందరికీ ఉపయోగపడుచున్నది. సైన్సులో కూడా విదేశీయులు ఆచరణమునకు ప్రాధాన్యతను ఇచ్చుచుండ భారతీయులు మేథాశక్తితో చర్చలతో గడుపుచున్నారు. ఈ స్వభావము అథ్యాత్మిక సంప్రదాయము నుండి భారతీయులకు సంక్రమించినది. అందుకే భారతదేశమును స్వామి అపార మేథా శక్తితోను, విదేశీయులను అపార ధనములతోను అనుగ్రహించినారు. "ఎవరు ఎట్లు నన్ను సమీపింతురో వారిని అట్లు సమీపింతును" అని గీతా వాక్యము.
ఈ పూర్ణిమ పూర్ణ చంద్రుడు ధనమును, మనస్సును సూచించును. కావున నీ పూర్ణ ప్రేమను కర్మఫల త్యాగము ద్వారా పూర్ణ విశ్వాసముతో కూడిన మనస్సుతో సద్గురువునకు గురుదక్షిణగా ఇచ్చుటయే. పూర్ణిమ నాడు దత్తుడు సాక్షాత్కరించినందున ప్రతి పూర్ణిమ నాడు మీరు గురుదక్షిణ ద్వారా కర్మఫలత్యాగము చేయవలెను. కాని గురువుకు ప్రదక్షిణములను చేయుట కాదు. భారతీయులు తప్పుదిద్దుకొని కర్మఫలత్యాగమును నేర్చుకొని తమ దేశమును సంపన్న దేశముగా స్వామి అనుగ్రహముద్వార సాధించవలయును. భారతీయుల ఆథ్యాత్మిక కేంద్రములు సైతము విదేశ ధనముల ద్వారానే వృద్ధి చెందిన విషయము స్పష్టమే కదా. స్వామి వివేకానందుదు "ఇంత జ్ఞానముతో ఉన్న నా భారతదేశము ఇంత దారిద్ర్యముతో ఏల భాధపడుచున్నది?" అని పెద్దగా ఏడ్చినాడు. దానికి స్వామి ఇచ్చు సమాధానమే ఇది.
శ్రీ దత్తుని పాదముల వద్దనున్న కుక్కలు కాపలా పనిని చేయుచూ కర్మ సంన్యాసమును చూపుచున్నవి. గోవు తన దూడను సైతము వదలి తన పాలను దత్తునికి ఇచ్చుచూ కర్మఫలత్యాగమును చేయుచున్నది. కర్మఫల త్యాగముతో కూడిన కర్మసంన్యాసమే కర్మయోగము. కేవలము కర్మసంన్యాసము కన్ననూ కర్మయోగమే గొప్పదని గీత. "తయోస్తు..." అని చెప్పుచున్నది. అనగా సద్గురువు చేయు జ్ఞాన, భక్తి ప్రచారమునకు చేయు సేవయే కర్మయోగము. ఇదే కేవలము దత్తుని చేరు మార్గము. యోగ వాశిష్టములో శ్రీ రాముని ముందు ధనమునార్జించి గురుదక్షిణ తెమ్మని వసిష్టుడు ఆదేశించినాడు.
"గురుసాక్షాత్పరబ్రహ్మ" గురువు అనగా సద్గురువగు "శ్రీ దత్తుడే". బిక్షల ద్వారా, గురుదక్షిణల ద్వారా నిరూపించబడిన నీ భక్తికి సంతసించి, అతడే నీ పాపములను, నీ భక్తికి తగు ప్రమాణములో గ్రహించి నిన్ను ఈ లోకములో సుఖముగా ఉంచి సాధన చేయించగల సమర్థుడు. సాయి తనకు సమర్పించు రొట్టెలు వారి పాపములు అని చెప్పినారు. పేదవాడు ఇచ్చు రూపాయి గురుదక్షిణ ధనికుని లక్షలతో సమానము. సద్గురువువలె జీవుడు సమర్థుడు కాడు. ప్రాచీన కాలంలో పండితులు ఎవరి ఇంటనూ భుజించుట కాని, దక్షిణలను స్వీకరించుట కానీ చేసెడివారు కారు. (అపరిగ్రహ వ్రతము). ఇందుకె ఈ రెండింటికీ అవకాశము కల పౌరోహిత్యమును తప్పని సరికానిచో చేయుటకు ఇష్టపడెడి వారు కాదు. తన పాపములతోనె సతమతమగుచుండగా ఇతరుల పాపములను స్వీకరించి అనుభవించగల ఓర్పు, శక్తి జీవులకు ఉండదు. కావున ఒకరి ఇంట భోజనము చేయక వైశ్వదేవమును పాటించెడివారు. అందుకే భోజనము, బహుమానములను గుర్తుంచుకొని మరల చెల్లించుచుందురు.
సద్గురువు దక్షిణలను, మరల జ్ఞాన, భక్తి ప్రచారములకు దరిద్రులగు భక్తులకు సాయపడుటలోను ఉపయోగించి లోకకళ్యాణమునకే పాటుపడును. మరియు సద్గురువు బిక్షలద్వారా పొందిన అన్న శక్తిని కూడా జ్ఞాన బోధలోనే ఖర్చు చేసి జీవులను ఉద్ధరించును. ఇట్టి త్యాగము వలన దత్తుడు అను శబ్దము స్వామి సార్థకమైనది.
hi,
ReplyDeleteplz read my blog and go ahed through the information
gsystime.blogspot.com
Universal spiritual knowledge, it contains all kinds of information.
Thanks,
Nagaraju G