అత్రి అనసూయలకు మానవ స్వరూపంలో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్త జయంతి. జయంతి అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్త జయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్త జయంతియే. దత్తుడనగా లభించిన వాడు అని అర్ధము. జయంతి అన్ననూ అదే అర్ధము. మార్గశీర్షము అనగా మార్గము నందు శీర్షమును ఉంచుట. అనగా భగవంతుని చేరు సత్యమైన మార్గము నందు బుద్ధిని ప్రసరింప చేయుట అని అర్ధము. నేడు మృగశిరా నక్షత్రము పూర్ణిమతో చేరినందున మార్గశీర్షమైనది. మృగశిర అనగా మృగము యొక్క శిరస్సు. అనగా పశుబుద్ధి అని అర్ధము. నక్షత్రములు అనగా అల్పజ్ఞానము గల అల్పజీవులు అని అర్ధము. పూర్ణచంద్రుడు అనగా వారి మధ్య పూర్ణజ్ఞానము గల సర్వజ్ఞుడగు పూర్ణచంద్రుడే అవతార పురుషుడని అర్ధము. అట్టి అవతార పురుషుని లోకమునకు అందించబడిన పరమాత్మయే కావున దత్తుడనబడుచున్నాడు. అయితే అట్టి అవతార పురుషుని లోకమునకు అందించిన వాడు ఎవరు? అందించబడిన వాడే అందించినవాడు. అనగా స్వయముగా తనను తాను దత్తము చేసుకొనిన వాడు అని అర్ధము. ఇట్లు పరమాత్మ తనను తాను అందించుకున్న స్వరూపమును అసూయ అహంకారములతో విడిచి పెట్టి ఒక మానవుడు ఊహించి చెక్కిన శిల్పములను, గీచిన చిత్రములను సేవించుట ఎంతటి వెర్రితనము. ఇవి అన్నియు ఊహా చిత్రములే కాని కనీసము తీసిన ఫోటోలు కూడా కావు. కావున మానవుడు అందించిన ఊహరూపములగు జడములను సేవించుట పామర లక్షణము. భగవంతుడు నిర్మించిన రూపములగు ప్రాణులలో సాత్వికులగు సాటి మానవులకును, పశుపక్ష్యాదులకును సేవ చేయుట ఉత్తమ ధర్మమగు ప్రవృర్తి మార్గము.
ఇక నివృర్తి మార్గములో ఇట్టి చైతన్య సహితములగు విగ్రహములలో ఒకానొక స్వరూపముతో పరమాత్మయే అవతరించియున్నాడు. అట్టి అవతార పురుషుని గుర్తించి, సేవించు మోక్షమార్గమే నివృర్తి అనబడుచున్నది. ప్రవృర్తి అనగా సర్వసాధు ప్రాణి వర్గమును సేవించి లోకమునకు శాంతిని అందించుట. నివృర్తి అనగా ప్రాణులలో ఒకానొక ప్రాణి రూపమున ఉన్న పరమాత్మను సేవించి తరించుట. మానవుడు సాటి మానవుని ద్వేషించుచున్నప్పుడు, ఇక మానవరూపములో యున్న పరమాత్మను ఎట్లు గుర్తించి సేవించగలడు? కావున ప్రవృర్తియే తెలియని వానికి నివృర్తి ఎట్లు లభించును? ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కునా? దీనికి గీతలో “ప్రవృర్తించ నివృర్తించ”అని చెప్పుచున్నది. ఈ ప్రవృర్తికి నివృర్తికి మధ్య అడ్డుగోడలే అసూయ అహంకారములు. అసూయ లేని జీవుడే అనసూయ. మూడు గుణముల అహంకారము లేని వాడే అత్రి. చైతన్య స్వరూపమైన జ్ఞానగర్వమే సాత్వికాహంకారము. శక్తి స్వరూపమైన బలము యొక్క మదమే రాజస అహంకారము. జడమైన శరీర దర్పమే తామస అహంకారము. అట్లు అసూయ అహంకారములు లేని సాధకుడే అనసూయ, అత్రి స్వరూపుడు. అట్టి సాధకుడే సాటి మానవ రూపములో యున్న సద్గురువును పొందగలడు. అట్టి వానికే సద్గురువు దత్తమైనాడు లేక లభించినాడు. ఇట్టి అంతరార్ధమును తెలుసుకొనక ఆచరించక అత్రి, అనసూయ అను దంపతులకు ఒక శిశువు జన్మించు ఉత్సవమును పిండి వంటలతో చేసుకొనుట పసిబాలుర వినోదము కొరకు చెప్పబడిన ఒక అవిచారిత రమణీయమైన కల్పన. ఇట్టి కల్పనల స్ధాయికి ఉత్తమ సాధకులు కూడా దిగజారుట వారికే ఎంత అవమానమో వారకే తెలియకున్నది. ఉద్యోగములో పై పదవి నుండి క్రింద పదవికి లేక ఒక విద్యార్ధి పైతరగతి నుండి క్రింది తరగతికి దిగజారుట అను డిమోషన్ ఎంత అవమానమో ఇదియు అంతే.
కావున ఇట్టి మానవాకారమున అంది వచ్చిన దైవ స్వరూపములను సేవించుట తప్ప మరియొక మార్గము లేదు అను శ్రుతి “నాన్యః పంధా” అని చెప్పుచున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞాన సూర్యడుగా సద్గురువును వేదప్రమాణముల ద్వారా తెలుసుకొనవలెనని వేదము "వేదాహ మేతం పురుషం” అని చెప్పుచున్నది. అట్టి సద్గురువును గుర్తించుటకు వేదము, గీత, భాష్యములను ఆధారముగా తీసుకొనవలయును. ఇందులో మొదటి మూడు మహావాక్యములు ఆయన బాహ్యాకారము ఇతర మానవులవలె మానవస్వరూపము అని చెప్పుచున్నవి. “అహం బ్రహ్మస్మి”, “తత్వమసి”, “అయమాత్మ బ్రహ్మ”. నాలుగవ మహావాక్యము”ప్రజ్ఞానం బ్రహ్మ”. ఆయన ఇతర జీవులకు సాధ్యం కాని అతివిశిష్ట బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని చెప్పుచున్నది. “సత్యం జ్ఞానం, ఆనందో బ్రహ్మ” అను శృతులు ఆయన బోధించు బ్రహ్మజ్ఞానము ఇతర పండితులవలె చెప్పు శిరోవేదనాకరమగు జ్ఞానము కాదని అర్ధము. గీత కూడా “మానుషీం తనుమాశ్రితమ్” అని మానవుల కొరకు పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించి వచ్చునని చెప్పుచున్నది. మరియును గీత “భూతే జ్యాయంతి భూతాని” అను శ్లోకములో జడములగు పంచభూతముల స్వరూపములగు విగ్రహాదులను సేవించువారు జడములగుదురు. అనగా జడములగు పాషాణాది జన్మములలో జన్మింతురనియు, నరాకారమును గుర్తించి సేవించిన నరజన్మమును పొందుదురనియు చెప్పుచున్నది. విగ్రహములు, పటములు కేవలము దర్శన యోగ్యములే కాని సేవా యోగ్యములు కావు. దూర దేశమున ఉన్న బంధువుల ఫోటోల వంటివే. అట్టి ఫోటోలను దుమ్ము దులిపి శుభ్రముగా ఉండునట్లు విగ్రహములకు స్నానోపచారములు తప్పు మిగిలిన ఉపచారములు అక్కరలేదు. శివ లింగము అన్ని విగ్రహములకు మూల పదార్ధము అగు శిలను సూచించు చున్నది. దానికి అభిషేకము తప్ప ఇంకొకటి అక్కరలేదు. కావున విగ్రహాదులు సాధనలో పరమిత ప్రయోజనము కలిగియున్నవి. వాక్కులకు, మనస్సుకు, బుద్ధికి, ఊహకు కూడా పరమాత్మ అందడని వేదములు ఘోషించు చున్నవి. "న తత్ర వాగచ్చతి”, “న మనోగచ్చతి”, “అప్రాప్య మానసాసః”, “నమేధయా”, “నైషాతర్కేణ”, “నచక్షుషా” అట్టి పరమాత్మ మనుష్య శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి భక్తులకు దర్శనము, స్పర్శ, సంభాషణము, సహవాసములను అనుగ్రహించుటకును, బ్రహ్మజ్ఞానము భోధించుటకును, తన భక్తుల పాప కర్మఫలములను తానే అనుభవించి అటు ధర్మదేవతకు న్యాయము చేయుచూ, ఇటు భక్తులను కర్మ విముక్తులను కావించుటకును, మానవ రూపంలో అవతరించి దత్తుడనబడుచున్నాడు. వాతావరణములో కంటికి కనిపించని ఎలక్ట్రానులే అందరాని పరబ్రహ్మ స్వరూపము. ఆ ఎలక్ట్రానులే ఒక తీగెలో వ్యాపించి ప్రవహించునప్పుడు ఆ విద్యుత్ తీగెయే అవతారమైన దత్తుడు. విద్యుత్ తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున ఆ విద్యుత్ తీగెయే మనకు స్పర్శనందించు అనుభవమును ఇచ్చు విద్యుత్. విద్యుత్తుకు, తీగెకు అద్వైతమే ఉన్నది. కావున విద్యుత్తే తీగ, తీగయే విద్యుత్తు. అట్లే మానవరూపియగు దత్తుడే పరమాత్మ. పరమాత్మయే మానవరూపుడైన దత్తుడు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, ఏసు, మహమ్మద్, బుద్ధుడు, మహావీరుడు, గురునానక్, శ్రీ పాద శ్రీవల్లభుడు, శ్రీ నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, స్వామి సమర్ధ, సాయిబాబా మొదలగు పురుషులే ఈ లోకమునకు అందించబడిన మానవ రూపులగు దత్త స్వరూపములు. ప్రతి మనుష్య తరమునకు ప్రతి దేశప్రాంతమునకును, అందరికినీ సులభముగా నుండుటకు ఈ దత్త రూపములు గురువులుగా అవతరించుచునే యున్నవి. ఒక మానవ తరమునకే ఒక దేశ ప్రాంతమునకే పరమితమైనచో పరమాత్మకు పక్షపాత దోషము వచ్చును. ఈ అంతరార్ధమును తెలుసుకొని ఆచరణలో తెచ్చుకున్న పవిత్ర దినమే నిజమైన దత్త జయంతి.
No comments:
Post a Comment