Friday, January 2, 2009

శుద్ధావతారము - ఆవేశావతారము

రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును. ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మెదలు మరణము వరకు అందులో నిత్యముగా యుండును. ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును. ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో పాటు జీవుని కూడా వ్యాపించి యుండును. ఇట్లు వ్యాపించిన సమయమున శుద్ధావతారమునకు, ఆవేశావతారమునకు ఎట్టి భేదము లేదు. ఒక లోహపు తీగెను కరెంటు వ్యాపించి యున్నను, రెండు లోహముల మిశ్రమమైన తీగెను కరెంటు వ్యాపించియున్నను, కరెంటు ప్రవహించుచున్నంత వరకు ఆ రెండునూ కరెంటు తీగెలె. కావున ఆవేశావతారమైన పరశురాముడు దశావతారములలో చేర్చబడినాడు. పరశురాముడు ఒక ముని కుమారుడు. అతని శరీరములో సంస్కారమయుడైన జీవుడున్నాడు. ఆ శరీరము అతనికి కర్మఫల లబ్ధమే. ఆ శరీరము ఒక వృక్షము వంటిది. ఆ శరీరములో ఉన్న ఆ జీవుడు ఒక పక్షి వంటివాడు. ఆ జీవుడు అనేక జన్మలు పరమాత్మకై తపించినవాడు. ఆట్టి ఆ జీవుని శరీరమును పరమాత్మ ఆవేశించుట పరమాత్మ అను మరొక పక్షి ఆ శరీరమున వాలి ఆ జీవునితో కలసి గూఢముగా కూర్చున్నది. ఈ శరీరములో ఉన్న పరమాత్మ దుష్ట సంహారమను అద్భుతమహిమను చేసి, ఆ కీర్తిని పరశురామునికి ఇచ్చినది. ఈ ఆవేశావతార విషయమునే “ద్వా సుపర్ణా సయుజా” అను శ్రుతి చక్కగా వివరించుచున్నది. గీతలో కూడా “ప్రహ్లదశ్చాస్మి” అను గీతలు ప్రహ్లాదుడను జీవపక్షితో పరమాత్మపక్షి చేరి హిరణ్యకశిపుడు సంహరించుటకు ఎంత ప్రయత్నించిననూ, ఆ ప్రయత్నములన్నియు విఫలములగునట్లు చేసి ప్రహ్లదునకు కీర్తి నిచ్చినది. ఈ శ్రుతిలో ”సఖాయ” అను శబ్ధము తపస్సు ద్వారా జీవపక్షి, పరమాత్మపక్షికి ఇష్టుడగుట సూచించుచున్నది. “సయుజ” అను శబ్ధము దానికి సంతోషించిన పరమాత్మపక్షి, జీవపక్షిలో చేరుటను సూచించుచున్నది.
“స్వాదు అత్తి” అను శబ్ధములు జీవపక్షి కీర్తి ఫలమును భోగించుటను సూచించుచున్నది. “అనశ్నన్‌” అను శబ్ధము ఆ కీర్తి పరమాత్మ గ్రహించక జీవపక్షికి ఇచ్చుటను సూచించుచున్నది. ఐతే ఈ మహిమను పరమాత్మ చేసినాడని గ్రహించక, పరశురామ జీవపక్షి తానే చేసితినని అహంకరించెను. ఇట్టి ఈ అహంకారమును నిత్యావతారమైన రామ పరమాత్మపక్షి పోగోట్టినది. ఇట్టి అవేశావతారమే హనుమంతుడు కూడా. అయితే సముద్రలంఘనమను మహిమను చేసిన తర్వాత హనుమంతుడు అహంకరించక ఇది రామ శక్తియేనని ప్రకటించినాడు. అట్టి భక్తునికు ఆ కీర్తిని శాశ్వతముగా అంటగట్ట తలచి రామాంజనేయ యుద్ధమున రాముడు ఓడిపోయి ఆంజనేయుని గెలిపించి తన కన్న ఆంజనేయుడే గొప్పవాడానియు, తన కన్న హనుమంతుడే మహామహిమాన్వితుడనియు ప్రకటించుటకై రాముడు ఎట్టి మహిమలను చేయక, తాను సామాన్యునివలె నటించెను. రాముడే మహిమలను చేసియున్నచో హనమమంతుని సముద్ర లంఘనము రాముడే చేయించినాడని లోకము భావించి యుండెడిది. ఈ నిత్యావతారము చేయవలసిన కార్యము యొక్క స్ధాయిని బట్టి కళావతారముగను, అంశావతారముగను ఉండుచుండును.

No comments:

Post a Comment