'అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును' అంటారు స్వామి. భక్తులు స్వామిని దత్తావతారముగా గుర్తించి విశ్వసిస్తున్నారు. స్వామి ప్రసాదించిన అనేక దివ్య ఉపన్యాసాలను ఈ బ్లాగు ద్వారా పొందగలరు. ఈ దత్తసేవలో పాల్గొని ఇతర భక్తులు కూడా శ్రీ దత్త ప్రభువుల యొక్క అనుగ్రహమును, ఆశీస్సులను పొందుదురుగాక! స్వామి గారి భజనల కొరకు BHAKTIGANGA లింక్ చూడండి.
Friday, January 2, 2009
పరబ్రహ్మ స్వరూప నిర్ణయము
పరబ్రహ్మము సాకారుడే. ఈ పరబ్రహ్మము “సః పురుషః” ఇత్యాది శబ్ధములచే శ్రుతులలోను పురుషోత్తముడని గీతలోను ప్రస్తావించబడియున్నది. కావున ఈ పరబ్రహ్మము సాకారమే కాక శ్రేష్ఠమైన పురుషాకారమైయున్నది. ఇంత మాత్రమున జీవులలో స్త్రీల కన్న పురుషులులెక్కువ అని భావించరాదు. జీవులందరు ప్రకృతి రూపులైన స్త్రీలే. జీవులలోనున్న పురుషులు, పురుష వేషమున ఉన్న స్త్రీలే యని భావించవలెను. పరబ్రహ్మమొక్కడే పురుషుడు. “పురుష ఏ వేదగం సర్వం”, “అధ పురుషోహవై నారాయణ” అను శ్రుతులు దీనినే చెప్పుచున్నవి. ఈ నిర్గుణ, యోగీశ్వరస్వరూపము కోటాను కోట్ల సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతూ చర్మచక్షువులకు అగ్రాహ్యమైయున్నది. ఈ మూలరూపము కేవలము ఆ పరమాత్మ అనుగ్రహముచే దత్తమైన దివ్యనేత్రమునకే చూచుటకు సాధ్యము కావున కనపడడు అను శ్రుతులన్నియు చర్మ చక్షువులకు చూచుటకు వీలుగాని మూలరూపమును గురించి చెప్పుచున్నవి. కనపడును అన్న శ్రుతులన్నియు చర్మచక్షువులచే చూడబడు అవతార బాహ్యమనుష్య రూపమును గురించియు, లేక దివ్య క్షువులచే చూడబడు మూలరూపమును గురించి చెప్పుచున్నవి. ఇక బుద్ధికి కూడా అర్ధము కాని పరబ్రహ్మతత్త్వమును గురించి చెప్పిన శ్రుతులు మూలస్వరూపమునకును, అవతార స్వరూపమునకును వర్తించును. అనాద్యనంతమైన విశ్వమును సృష్టించిన మూలస్వరూపమును గురించిన తత్త్వము బుద్ధికి ఎటూ చిక్కదు. ఇక అవతార స్వరూపము కంటికి కనపడుచున్నను, దీని తత్త్వము కూడా బుద్ధికి చిక్కుటలేదు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కంటికి కనపడుచున్నను గోవర్ధన పర్వతమును చిటికిన వేలుపై నిలిపినపుడు ఆ కృష్ణతత్త్వము బుద్ధికి అగ్రాహ్యమై యున్నది కదా! ఇక మూలస్వరూపము సాకారము కాక నిరాకారము అని చెప్పినచో బాగుండునని కొందరు తలచుచున్నారు. వీరి మతము ప్రకారముగా ఆది అంతములు లేని ఈ విశ్వమును భరించు వస్తువు కూడా ఆది అంతములు లేనిదై యుండవలెను. ఇట్లు చెప్పినచో ఇది తర్క సమ్మతముగా యుండును. కాని పరబ్రహ్మతత్త్వము తర్కాతీతము కదా! కావున ఆది అంతములు కలిగి పరమితమైన ఒక రూపము ఆది అంతములు లేని అపరిమితమైన ఈ జగత్తును ధరించి ఉన్నదని చెప్పినచో ఇది తర్కమునకు అందని విషయమై యుండును. అనగా పరిమితాకారము కలిగిన కృష్ణుడు అపరిమితమైన జగత్తును ధరించియున్నాడు అన్నచో ఈ విషయము బుద్ధికి అందదు. అట్లు కాక అపరిమితమైన నిరాకార పరబ్రహ్మ స్వరూపము అపరమితమైన జగత్తును ధరించి ఉన్నది అన్నచో ఈ విషయము బుద్ధికి తర్కసహితముగా అందు చున్నది. తర్కసహితముగా బుద్ధి పరబ్రహ్మతత్త్వమును అందుకొనలేదని శ్రుతులు చెప్పుచున్నవి కదా! కావున పరిమితాకారము గల సాకారమైన యోగీశ్వర మూలస్వరూపమే అసలు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమనియు నిశ్చయించబడుచున్నది. ఉదాహరణకు పరమితాకారము కలిగిన బాలకృష్ణుడు తన చిన్న నోటిలో అనంత జగత్తును యశోదాదేవికి చూపుట చేత పరిమితాకారుడైన ఆ బాలకృష్ణుడే పరబ్రహ్మమని చెప్పుటలో తర్కమునకు అందని తత్త్వము స్పష్టమగుచున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment