[వృషనామ సంవత్సరము మార్గశిర బహుళ దశమి మంగళవారము ఉదయం 6 గంటలకు శ్రీ దత్త దివ్యవాణి.] పంచ భూతమయమైన మనుష్య శరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగ యుగముల తపించి, పంచభూతమయ సృష్ఠికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి, వారి కొరకు పంచభూతమయమైన మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన కృష్ణావతారములో గోపికలుగా పుట్టి సేవించి తరించిరి. “మానుషీం తనుమాశ్రితమ్” అన్న గీతార్ధమిదే. మరియు శ్రుతి “యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ” అని చెప్పుటలో అర్ధమేమి? పరబ్రహ్మము పరోక్షముగా ఉన్నపుడు అగ్రాహ్యము కావున మనకు అది అందదు. కావున లేని దానిగా పరిగణించవచ్చును. మనకు ఉన్న పరబ్రహ్మము, మనకు అందిన శిలావిగ్రహ రూపమున దర్శన, స్పర్శనలిచ్చి అందుచున్నది. కావున ఉపాసనకు యోగ్యములే కాని అవి సహవాస సంభాషణాదులను అనుగ్రహించ లేనందున పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము కాజాలవు.
“ఆదిత్యం బ్రహ్మేతి ఉపాసీత” అనగా సూర్యుని పరబ్రహ్మముగా ఉపాసించుము. సూర్యుడు దర్శన, స్పర్శన యోగ్యుడే కాని సహవాస, సంభాషణా యోగ్యుడు కాడు. కావున కేవలం ఉపాసన మాత్రుడేనని ఈ శ్రుతికి అర్ధం. ఇక మహావాక్యములలో “అయమాత్మా బ్రహ్మ” అని అనగా మనుష్య శరీరమును ఆశ్రయించిన ఒకానొక విశిష్ట జీవస్వరూడైన రామకృష్ణాది అవతారపురషుడే పరబ్రహ్మము అని ఈ శ్రుతికి అర్ధము. “ప్రజ్ఞానం బ్రహ్మ” అనగా విశిష్టమైన జ్ఞానసంపన్నుడైన గురుస్వరూపుడైన అట్టి విశిష్ట మానవుడే పరబ్రహ్మమని గుర్తించవలయును. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ”, “రసోవైసః” ఇత్యాది శ్రుతులు అట్టి అవతారపురుషుడు జ్ఞానానందాది కళ్యాణ గుణతత్త్వసంపన్నుడై ఉండుననియు, అట్టి దానిని అవతార పురుషుని గుర్తించు లక్షణమనియు శ్రుతి బోధించుచున్నది. శ్రీకృష్ణుని భగవద్గీత ద్వారా పరబ్రహ్మముగా ఋషులు గుర్తించినారు. కాని ఆయన చూపిన సిద్ధుల వల్ల కాదు. అట్టి సిద్ధులు ఆయన సంకల్ప మాత్రములే. ఏలననగా సిద్ధులు సృష్టిలోని భాగములు. సృష్టియును ఆయన సంకల్ప స్వరూపమే. అట్టి సిద్ధులను కంసాది రాక్షసులు కలిగి యుండెను. అట్టి అవతార పురుషుని “తత్త్వమసి”అను మహావాక్యముతో గుర్తించవలెను. “తత్త్వమసి “అనగా 'తత్'=ఆ అందని పరబ్రహ్మము, 'త్వం'= అందిన మానవాకారమైన నీవు, 'అసి'= అయి ఉన్నావు. ఇట్టి ఉపాసనకు అద్వైతము ఆధారమైయున్నది. ఒక తీగెను విద్యుత్ అంతయు ఆక్రమించినప్పుడు ఆ కరెంటు తీగెను కరెంటు అందురు. అట్లే ఆపాదమస్తకము ఆ కృష్ణ స్వరూపము పరబ్రహ్మముచే వ్యాపించబడియున్నది. కరెంటు తీగెను ఎచ్చట ముట్టుకొన్ననూ కరెంటు షాకు తగులుచున్నది. ఈ అద్వైతమును అవతార పురుషుడు కూడా “అహం బ్రహ్మాస్మి” అను వాక్యముతో బోధించును. కృష్ణ భగవానుడు అట్లే “అహం సర్వస్య జగతః ప్రభవః ప్రళయః తధా మత్తః పరతరం కించిత్ నాన్యదస్తి ధనంజయా” అని చెప్పినాడు కదా. కావున మహా వాక్యములన్నియు అవతారపురషుడే పరబ్రహ్మమనియు అతనిని ఇచ్చట సేవించి ఆనందించి తరించు స్ధితియే జీవన్ముక్తి అనియు, పరోక్షముగా ఏమియు లేదనియు, అంతయు ఇచ్చటనే కలదనియు, అంది వచ్చిన దానిని కాదన్న వాడు మహా వినాశము పొందుననియు “మహతి వినష్ఠిః" అని శ్రుతి చెప్పుచున్నది. “న విదుః సతి” అను శ్రుతి మరణము కేవలము ఏమి తెలియని గాఢనిద్ర వంటి విశ్రాంతి, విరామమైన అజ్ఞానావస్ధ అనియు చెప్పుచున్నది. ఈ శ్రుతి కూడా పై శ్రుతినే బలపరచుచున్నది.
No comments:
Post a Comment