Friday, January 2, 2009

పరబ్రహ్మ స్వరూపము

పరబ్రహ్మము ఇంద్రయములకును, మనస్సుకును, బుద్ధికిని, ఊహలైన తర్కములకును అందదు అని ఆనేక శ్రుతులు బోధించుచున్నవి కదా! ఉదాహరణకు 'న తత్ర వాగ్గచ్చతి', 'న మనోగచ్చతి', మరియు 'ఎ తోవాచో నివర్తంన్తే', 'అప్రాప్య మనసాసః', 'యో బుద్ధే పరతస్తు సః', 'న మేధయా', 'నైషాతర్కేణ', 'న చక్షుషా', 'న సందృసే', 'అతర్క్యః కధమే తత్‌ విజానీయామ్‌' అను శ్రుతులన్నియును ఈవిషయమునే చెప్పుచున్నవి. ఇట్టి బ్రహ్మము “యత్‌ సాక్షాత్‌” మరియు “ప్రత్యగాత్మాన మైక్షత్‌” ఇత్యాది శ్రుతులు పరబ్రహ్మము కంటికి కనబడుచున్నదని చెప్పుచున్నవి. వీటి సమన్వయము ఎట్లు చేయవలెను? కంటికి కనబడుచున్న బ్రహ్మము అవతారపురుషుడనియు, కంటికి కనబడని బ్రహ్మము అగ్రాహ్యమైన నిర్గుణ బ్రహ్మమనియు చెప్ప వచ్చునా? శ్రీకృష్ణుని అర్జునుడు చర్మ చక్షువులతో చూచుచునే ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుని అసలు స్వరూపమైన యోగీశ్వర స్వరూపమును చూపమని అర్జునుడు అడిగినపుడు శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపమును చర్మ చక్షువులతో చూచుటకు వీలు కాదనియు, దానిని దివ్యనేత్రములతో చూడమనియు చెప్పి సమస్త విశ్వమునకు కారణ, ధారణ, మారణ తత్త్వమైన తన పరబ్రహ్మ స్వరూపమును చూపినాడు. అనేక దేవతాముఖములతో జగత్తునంతయు పుట్టించి, భరించి, ఉపసంహరించి తన నిజస్వరూపమే సృష్టి, స్ధితి, లయ కారణమైన పరబ్రహ్మ స్వరూపమని చూపించినాడు. ఆ స్వరూపమునకు కాళ్ళు, చేతులు, ఉదరము, ముఖము మొదలగు అవయవములున్నవి. మరి ఆ నిర్గుణ పరబ్రహ్మము నిరాకారము ఎట్లగును? ఈ జగత్తుకు సృష్టి, స్ధితి, లయ కారణమైన పరబ్రహ్మము నిరాకారమని బ్రహ్మ సూత్రములు చెప్పుచున్నవి. “అరూప వ దేవ తత్ప్రధా నత్త్వాత్‌” శ్రుతియు “న రూపమస్త్యేహ” అనియు “అరూపమవ్యయం” అనియూ నిరాకార తత్త్వమును కూడా ప్రస్తావించుచున్నది. కావున ఈ శ్రుతులను, గీతలను, బ్రహ్మ సూత్రములను సమన్వయించి పరబ్రహ్మ స్వరూపమనను నిర్ణయించవలెను. ఈ నిర్ణయము ఈ విధముగా ఉన్నది.

No comments:

Post a Comment