[16.11.2002 శనివారము] జ్ఞానము త్రిపుటి స్వరూపముగా యుండును. గమ్యమును గురించిన జ్ఞానము, గమనమును గురించిన జ్ఞానము, గమనము చేయువాడగు జ్ఞాతను గురించిన జ్ఞానము. గమ్యము అనగా భగవంతుడు. అతడు నిరాకారుడా? సాకారుడా? లేక నరాకారుడా? ఇత్యాది విచారణయే జ్ఞేయము అనబడును. ఆ పరమాత్మను చేరు మార్గము జ్ఞానమా, భక్తియా, యజ్ఞయాగాదులా లేక ప్రాణాయామాది యోగమా? ఇత్యాది విషయములు మార్గ జ్ఞానము. ఇక గమనమును చేయు జీవుడు ఎవరు? ఈ శరీ్రమా? చైతన్యమా? బ్రహ్మ స్వరూపుడా? బ్రహ్మములోని అంశయా? బ్రహ్మము కన్న భిన్నుడా? ఇత్యాది విచారమే జ్ఞాత యొక్క జ్ఞానము. సర్వజ్ఞానము ఈ మూడింటికి సంబంధించియే యుండును. ఇందులో మొదటిది భగవంతుని గురించిన జ్ఞానము. భగవంతుడు ఎవరు? పురుషుడా? లేక స్త్రీ రూపమా? లేక తేజోరూపమా? భగవంతుని విషయములో భగవంతుని గురించి చెప్పిన వేదమే ప్రమాణము. ఆ వేదము యొక్క అర్ధము యుక్తికి సమ్మతమై యుండవలెను. మరియును ప్రత్యక్షముగా అనుభవములోనికి రావలయును. శ్రుతి, యుక్తి, అనుభవ ప్రమాణమైనదే బ్రహ్మజ్ఞానము. వేదములో సర్వత్రా “సః పురుషః” ఇత్యాది శబ్ధములచేత పరమాత్మ పురుష స్వరూపముగనే చెప్పబడు చున్నది. మరియు ఆయన యొక్క శక్తి, శక్తి, మాయ, ప్రకృతి మొదలగు శబ్దములచే చెప్పబడు చున్నది. ఈ శబ్దములు స్త్రీలింగ శబ్దములే తప్ప స్త్రీ స్వరూపమును బోధించవు. ఒక కవిలోని కవితా శక్తి స్త్రీ స్వరూపము కాదు. ఇది వ్యక్తి యొక్క సామర్ధ్యము. అనగా గుణము. ఈ పరమాత్మ యొక్క సామీప్యము నందున్న స్త్రీ స్వరూపమును ఉమగా శ్రుతి చెప్పుచున్నది. లోకములో పురుషుని స్త్రీ సేవించుచున్నది. కావున పరమాత్మ పురషుడుగాను, పరమాత్మ యొక్క సామర్ధ్యమైన మాయ శక్తిని నపుంసక లింగముగాను, పరమాత్మను సేవించు జీవుని స్త్రీగాను తీసికొనవలయును. జీవుడన్నపుడు జగత్తును కూడా తీసుకొనవచ్చును. జగత్తు అనగా ప్రకృతి. ప్రకృతి అనగా ప్రశస్తమైన కృతి. అనగా శ్రేష్ఠమైన కార్యము. ఈ ప్రకృతి అపరాప్రకృతి యను జడముగాను, పరాప్రకృతి యను చైతన్యముగాను రెండు భాగముల ఉన్నది. ప్రకృతి యనగా వ్యక్తమైన పరమాత్మ శక్తి. అనగా కార్యశక్తి. పరమాత్మలో అవ్యక్తముగా నుండి పరమాత్మ కన్న వేరు చేయలేని కారణశక్తియే మాయ. అగ్ని పరమాత్మ యైనచో కాల్చు గుణమే మాయ. బయిటకు వచ్చిన వెలుతురే ప్రకృతి. కవితా శక్తి మాయ. కావ్యము ప్రకృతి. పరమాత్మ యొక్క చిత్ర విచిత్ర నిర్మాణశక్తియే మాయ. చిత్ర విచిత్రముగా నిర్మింపబడన జగత్తే ప్రకృతి. ఈ పరమాత్మ యొక్క తత్వము వేదములకు సైతము అందరానిది. పరమాత్మను గురించి ఏమియు తెలియజాలమని తెలియుటయే జ్ఞానము అని “యస్య మతం తస్య మతం” అను శ్రుతి చెప్పుచున్నది. ఇతడు జ్ఞానస్వరూపుడై, ఆనందస్వరూపుడై, సకల కల్యాణ గుణ పరిపూర్ణుడై అనూహ్యమైన అనంతమైన మాహశక్తి యొక్క ఘన స్వరూపమై యుండును. “ప్రజ్ఞాన ఘనః, తనూంస్వామ్, ఆదిత్య వర్ణం” ఇత్యాది శ్రుతులు ఇదే చెప్పుచున్నవి. పరమాత్మ నిరాకారుడన్న వాదము సరికాదు. కాంతి మొదలగు జడశక్తులు విడిగా కనిపించు చున్నవి కాని ఒక వ్యక్తి ఆశ్రయము లేని చైతన్యము విడిగా లోకములో కనిపించుటలేదు. కావున చైతన్యమే బ్రహ్మము అనువారలు చైతన్యమునకు అధిష్టానమైన వ్యక్తిని అంగీకరించవలెను. దీనినే “బ్రహ్మ పుచ్చం ప్రతిష్టా” అని శ్రుతి చెప్పు చున్నది.
“ఆరూపమ్” మొదలగు శ్రుతులను పరమాత్మ నిరాకార స్ధితిని చెప్పును. “ప్రత్యగాత్మాన మైచ్చత్” “పరి పశ్యంతి” అను శ్రుతులు పరమాత్మ సాకారుడని చెప్పుచున్నవి. అయితే ఈ పరమాత్మ యొక్క స్వస్వరూపమును ఈ చర్మ చక్షువులు చూడలేవు. ఆయన దివ్య దృష్టిని అనుగ్రహించగా ఈ చర్మ చక్షువులే దివ్య శక్తిని పొంది దివ్యనేత్రములై ఆయనను దర్శించగలవు. అర్జనుడు ఆయన నిజ స్వరూపమును దివ్య చక్షువులతోనే దర్శించగలిగెను. ఆ దివ్యస్వరూపము ముందు ఈ జగత్తు అత్యల్పము. సూర్యునిలో ఒక కిరణము. ఒక మానవునిలోని ఊహ ఆయన యొక్క ఊహయే ఈ జగత్తు. ఈ జగత్తులోను ఒక పరమాణువు అగు జీవుడు ఆయనను ఎట్లు దర్శించగలడు? ఒక వ్యక్తి యొక్క ఊహ అంతయు కలసిన ఆ వ్యక్తి యొక్క రోమమును కూడా కదిలించ జాలదు. కావున ఆయన ఊహయగు ఈ జగత్తు ఆయన యొక్క రోమమును కూడా కదిలించ జాలదు. గోవర్ధనమును ఎత్తిన శ్రీకృష్ణుడు ఈ విశ్వమంతయు నాపై పడిననూ నావేలు అల్లాడదు అని చెప్పినాడు. కావున అటువంటి మహాశక్తి సంపన్నుని చూచుటయే దుర్లభమైనప్పుడు, ధ్యానించుట అసంభవము. ఇక స్పర్శ కలలో మాట. ఇక సహవాస సంభాషణములా? ఊహించుటకును వీలుకాదు. ఆయన ఈ నిజ స్వరూపమును అవ్యక్త స్వరూపమందురు. దానిని ఆరాధించుట కష్టము. అది దుఃఖకరము. అందుకే "అవ్యక్తాహి గతి దుఃఖం" అని గీత చెప్పినది. కావున “ప్రకృతిం స్వాం అధిష్టాయ”, “సంభవామి యుగే యుగే”, “ఆత్మమాయయా”, “మానుషీం తను మాశ్రితమ్” అను గీతల ప్రమాణముగా ఆయన ప్రకృతి స్వరూపమగు ఒక నరరూపమను ఆశ్రయించి అధిష్టించును. ఆయన సత్ అను శబ్ధము చేతను, ఈ నర రూపము న్యత్ అను శబ్ధము చేతను శ్రుతిలో “సచ్చత్యత్యాభవతు అసమ్నేవ సభవతి” ఇత్యాది మంత్రములలో చెప్పబడినది. దీనినే అవతార మందురు. తీగెను వ్యాపించిన కరెంటు వలె ఎక్కడ తగిలినా షాక్ కొట్టినట్లు ఈ నర రూపమంతయు సద్రూపమే అయియుండును. రవ్వ లడ్డూలో గోధుమ రవ్వతో కలసిన పంచదార వలె ఎక్కడ ఎంగిలి చేసినను తియ్యగనే ఉండును. ఇట్లు పరమాత్మ జీవులకు నిరంతరమము అనభవమునకు అందుచు ప్రత్యక్షమగు చున్నాడు. “యత్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ” అను శ్రుతి దీనినే చెప్పుచున్నది. కావున ప్రత్యక్ష ప్రమాణమును విశ్వసించు నాస్తికుల సహితము పరమాత్మను ప్రత్యక్షముగానే అంగీకరించవలెను. ఈ విధముగా శ్రుతికి ప్రత్యక్ష ప్రమాణ బలము ఉన్నది. కావున శ్రుతిని కల్పనగా తీసుకొనరాదు.
No comments:
Post a Comment