ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము: "ఈ విశ్వమంతయు ఈశ్వర ధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్న ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని" చెప్పుచున్నది.
గోపికలు తమ సర్వకర్మఫలమగు వెన్నను నరాకారమున ఉన్న కృష్ణునకు పెట్టి వారి పిల్లలకును పెట్టక అత్యుత్తమమైన గోలోకమును పొందినారు. ప్రారబ్ధ కర్మఫలమగు శరీరములను సైతము స్వామికి సమర్పించి ధర్మభంగమునకు, నరకమునకునూ భయపడక సర్వార్పణ త్యాగమును చేసి అత్యుత్తమ స్థితిని పొందినారు. వారు గురుదక్షిణగా స్వామికి అర్పించనిది ఏమున్నది?
స్వామి గోపికలతో ఉన్నాడె తప్ప పురుషులతో కలసి ఏల ఉండలేదు? అని స్వామిని స్త్రీ లోలునిగా నిందించుచున్నారు. దీనిలోని రహస్యమేమి? పురుషుడు అహంకార రజోగుణములతో ఉండును. స్త్రీ ఎప్పుడునూ వినయము, భయము మొదలగు సాత్త్వికమైన మోక్షగుణములతో ఉండును. అందుకే ఋషులు గోపికలుగా జన్మించినారు. ఏ జీవుడైనా ముక్తికి ముందు కడపటిజన్మగా స్త్రీ జన్మను పొందవలసినదే. అయితే దీని అర్థము ప్రతి స్త్రీ జన్మ చివరి జన్మ అని కాదు.
కన్నప్ప అను కిరాతుడు దేహములో ప్రధానమైన కన్నులను స్వామికి సమర్పించినాడు. అది అత్యుత్తమ గురుదక్షిణ. నీకు నీ కుటుంబమునకు కావలిసిన ధనమును ఆర్జించుకొనుటకు స్వామి అనుమతించును. నీవు ఎక్కువ తీసుకొన్నచో దానిని స్వామికి ఇచ్చివేయమని వేదము బోధించుచున్నది. నీవు మిత్రుని ఇంటికి పోయినప్పుడు కప్పుతో పాలను ఇచ్చినాడు. పాలను త్రాగుము. కాని కప్పును దొంగిలించకుము. దొంగిలించినచో నీవు దొంగవు పాపివి అగుదువు అని వేదము చెప్పుచున్నది. ఆ ఎక్కువ పాప ధనము నిన్ను కష్టముల పాలు చేయుచును. కొందరు భక్తులు వారి కనీస ధనమును కూడా మొత్తము లేక కొంత స్వామికి సమర్పించుచున్నారు. పాటిల్ పండించిన సంవత్సర ధాన్యమంతయు షిరిడీ సాయిబాబాకు తెచ్చి ఇచ్చి ఆయన ప్రసాదించినది తీసుకొని పోయెడివాడు. ఒక ధనికుడు బ్రహ్మ జ్ఞానమీయమని సాయిని వెంటబడగా సాయి నాకు కావలసిన ఐదు రూపాయలను నీ జేబు నుండి తీసి ఇవ్వలేనివాడవు నీవు బ్రహ్మమును ఎట్లు తెలుసుకొందువు? అని చెప్పినాడు. ఈ కర్మఫలత్యాగమును నేర్పుటకే సాయి అందరినీ గురుదక్షిణ అడిగెడివాడు.
అసలు స్వామికి నీ ధనము అక్కరలేదు. నీవు తీసుకొన్న పెచ్చు ధనమును ఇచ్చటనే వదలి ఆ పాపముతో ఒక్కడవే పైకి పోవుచున్నావు. ఈ విశ్వమంతయును స్వామి ధనాగారమే. ఆయన ధనాగారములోనే నీవు తీసుకొనుట, అనుభవించుట, వదలివేయుటయు జరుగుచున్నది. నీవు దొంగిలించిన హెచ్చు ధనము నీ చేతులతో స్వామికి సమర్పించని పాపమును మాత్రమే మూటగట్టుకుని ఆ హెచ్చుధనమును ఇచ్చటనే వదలిపోవుచున్నావు.
No comments:
Post a Comment