ఈనాడు మీరు అందరును ఈ దివ్య దత్త జ్ఞాన-భక్తి ప్రచార సేవకై నా చరణముల వద్ద గురుదక్షిణలను సమర్పించినారు. గురుపూర్ణిమ నాటి పూర్ణ చంద్రబింబము బంగారము లేక వెండి నాణెమును అనగా ధనమును సూచించుచున్నది. ఇది నీవు గురువుకు సమర్పించవలసిన గురుదక్షిణలను గుర్తుచేయుచున్నది. ప్రతి నెలా గురుదక్షిణనీయవలెనని ప్రతిపూర్ణిమ నీకు చెప్పుచున్నది. గురువు నరుడు కారాదు. అతడు నరరూపమున వచ్చిన నారాయణుడగు సద్గురువు కావలెను. అప్పుడే నీ గురుదక్షిణకు సద్వినియోగము జరుగును. ధనమే నీ సత్య ప్రేమను నిరూపించుచున్నది. నీవు ధనమును ఎవరికి ఇచ్చుచున్నావు? నీ సంతానమునకు ఇచ్చుచున్నావు. కావున నీ నిజమైన ప్రేమ నీ సంతానముపైనే ఉన్నది. అదియే చక్కని నిజమైన పరీక్ష. నీకు భగవంతునిపై అట్టి నిజమైన ప్రేమ ఉన్నచో నీవు ధనమును భగవంతునకే ఇచ్చెదవు. దీనిలో ఇంక వాదము లేదు. ఇది క్రియాత్మకమైన పరీక్ష. మనస్సుతో ధ్యానము, నోటితో స్తోత్రము నీ అసత్యమైన దైవ ప్రేమను ఇతరులకు సత్యమని చూపించు వంచనయే. అయితే కంచములో అన్నము ఉన్నచో పక్కన ఉన్న ఊరగాయ ముక్కలవలె ఈ ధ్యాన, స్తోత్రములు గురుదక్షిణలకు పక్కనే చేరి ఉన్నచో సార్థకములగును. ఈ గురుదక్షిణలే కర్మఫలత్యాగము అని గీతలో అడుగడుగనా ఘోషించబడినది. కర్మయొక్క ఫలమును ఆశించక దానిని ఈశ్వరార్పణము చేయుటయే కర్మఫల త్యాగము లేక గురుదక్షిణ. గురుదక్షిణ లేని ధ్యాన స్తోత్రములు కేవలము ఊరగాయ ముక్కలు మాత్రమే ఉండి అన్నము వడ్డించని విస్తరి వలే ఉండును. గురుదక్షిణ సార్థకము అగుటకు సద్గురువును గుర్తించవలెను. "సత్యం, జ్ఞానం" అని వేదము సద్గురువును సత్యమైన, అనంతమైన జ్ఞానముచేత గుర్తించవలయును అని చెప్పుచున్నది. నాలుగు వేదముల మహావాక్యములలో మొదటి మూడు వాక్యములు పరమాత్మ నావలె, నీ వలె, వాని వలె మనుష్యాకారమున ఉండునని చెప్పుచున్నవి. నాలుగవ మహావాక్యము అట్టి నరావతారుడు ఎట్టి నరులు చెప్పలేని విశేష జ్ఞానముతో ఉండునని పలుకుచున్నది. పండితులు చెప్పు జ్ఞానము తల నొప్పిని కలిగించును. అవతరించిన సద్గురువు చెప్పు జ్ఞానము మాత్రమే హృదయములోనికి చొచ్చుకొని పోయి ఆనందమును కలిగించుచున్నది.
ఆనందము బ్రహ్మమని వేదవాక్య ప్రమాణము. వేడిచేత అగ్నిని గుర్తించినట్లు ఆనందప్రదమైన జ్ఞానము చేత సద్గురువును గుర్తించవలెను. మహిమలు గుర్తులు కావు. రావణుడు మొదలగు రాక్షసులు సైతము మహిమలను ప్రదర్శించెను. మొండి బిడ్డలగు ఈ రాక్షసులు తపస్సు అను మొండి పట్టుదలద్వారా స్వామికి సొమ్ములవలెనున్న ఈ మహిమలను స్వామి నుంది పొందెదరు. వారు స్వామి నుండి జ్ఞాన గుణములను పొందలేరు. కావున వారు స్వామి కాలేరు. మహిమలచేత వారు దేవుడని ప్రకటించుకున్నను ఈ కారణమువలన ఋషులు అంగీకరించలేదు. ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము: "ఈ విశ్వమంతయు ఈశ్వర ధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్న ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని" చెప్పుచున్నది.
No comments:
Post a Comment