బ్రహ్మ విష్ణు శివ ముఖములతో యున్న దత్తుని స్వరూపమును చూచుచున్నారే గాని ఆ స్వరూపము యొక్క అంతరార్ధమును మీరు గ్రహించుట లేదు. దత్తుడనగా అందరాని పరబ్రహ్మము మనుష్యాకారములో అందివచ్చిన అవతారపురుషుడే భక్తులకు దత్తమైనాడని అర్ధము. ఆయన మూడు ముఖములు త్రిగుణములను సూచించుచున్నవి. సత్వగుణము మంచిగుణము. రజస్సు, తమో గుణములు చెడ్డ గుణములు. అనగా ఆ మనుష్య శరీరములో అన్ని గుణములు ఉన్నవనియే అర్ధము. గీతలో కూడా ప్రకృతియే మాయ యనియు, ప్రకృతి త్రిగుణములు అనియు, మాయ కలవాడే ఈశ్వరుడనియు, అట్టి ఈశ్వరుడు అవతరించినప్పుడు మాయ సహితుడై యుండుననియు చెప్పుచున్నది. ఈ మాయ సత్వ గుణమేనని చెప్పుట సరికాదు. త్రిగుణమయమైన ఈ బ్రహ్మాండమంతయు అవతార పురుషుని యొక్క పిండాండములో ఉన్నట్లుగా విశ్వరూప ప్రదర్శనమున స్పష్టమగుచుండగా అవతార పురుషునిలో త్రిగుణములు ఉన్నవి అనియే అర్ధము. ఈ రజస్తమో గుణములు కూడా అవతార పురుషుని క్రీడలోను, మరియు భక్తులను పరిక్షించుటలోను ఉపయోగపడుతుంది. శ్రీ రాముడు సహితము జాబాలిని కోపగించుట అను రజోగుణమును, బంగారు లేడిని వెంబడించుట అను తమోగుణమును కలిగియున్నాడు. ఈ గుణముల వల్లనే దత్తుడు కోపముతో యున్న చండలాది రూపములలో కనబడుచుండును, అయితే ఈ త్రిగుణ మాయ అవతారపురుషుని వశములోయుండును. కావున అతడు వశీకృతమాయుడు. దత్తుని యొక్క ఆరు చేతులు, స్వీకరించిన మనుష్య శరీరము పుట్టుక మొదలగు ఆరు వికారములను కలిగియే ఉండునని సూచించుచున్నది. శంఖము, ఢక్క శబ్ధమును, జపమాల వాక్యమును సూచించగా ఆయన జ్ఞానమున బోధించుట చెప్పుచున్నది. చక్రము, శూలము శక్తితోనున్న మంత్రజలముకల కమండలము ఆయన యొక్క శక్తి మంతములైన సిద్ధులను చెప్పుచున్నవి.
మొదటి మూడును ప్రధాన దక్షిణార్ధమగు గురు స్వరూపమును, రెండవ మూడును వామార్ధమగు భగవత్స్వరూపమును మనుష్యావతారమున ఉండునని చెప్పుచున్నవి. కావున త్రిముఖ షడ్బుజ దత్తుడు అనగా త్రిగుణములతోయున్న మాయా మానవఆవతార పురుషుడేనని తాత్పర్యము. అట్టి అవతార పురుషుని సేవించక దత్తచిత్రములను, శిల్పములను సేవించి ప్రయోజనమేమి? శిలావిగ్రహములు కేవలము ప్రతీకలే అనగా ప్రతినిధులే. “ఆదిత్యం బ్రహ్మేతి” అను శ్రుతి సూర్య మండలమును పరమాత్మగా ధ్యానించమని చెప్పగా, మందమతులు, సూర్యుడినే పరమాత్మయని భావించినారు. అందుకే వేదము"నేదంతత్” అని మరల యీ జడగోళము అగు సూర్యమండలము పరమాత్మకాదని బోధించినది. విగ్రహములు దర్శన, ధ్యాన యోగ్యములే కాని నైవేద్యాది సేవా యోగ్యములు కావు. త్రివర్ణ పతాకము భారతదేశ ప్రతీక. అనగా ఆ పతాకము భారత దేశము కాదు. భారత దేశమును సూచించు ప్రతినిధియే. ఇక గోవు విషయము. దత్తుని వెంట గోవు వచ్చుచున్నది. ఆవు ధర్మదేవత యొక్క రూపముగా చెప్పబడుచున్నది. దీనిలోని అంతరార్ధము ఏమనగా ఆయన నడకను ఆవు అనగా ధర్మము వెంబడించుచున్నది కాని ఆయన ధర్మమును అనగా ఆవును వెంబడించి నడచుటలేదు. అనగా ఆయన నడచిన మార్గమే ధర్మమని అర్ధము. ఆయన గోపాలుడు అనగా ధర్మ రక్షకుడు. ఆయనచే రక్షింపబడు ధర్మము కన్న ధర్మమును రక్షించు ఆయనయే గొప్పవాడు.
కుక్కలు: అట్లే ఆయన పాదముల వద్ద వేదములు కుక్కలుగా పడియున్నవి. పాదములు అనగా ఆయన శ్లోక రూపముగా బోదించుచున్న జ్ఞానములో శ్లోకములోని నాలుగు పాదములు అను అర్ధముతో ఆ నాలుగు పాదములను అనుసరించి వేదములు ఆయనపై ఉండవలసిన స్ధిర విశ్వాసమునకు ప్రతీకలుగా నిలచియున్నవి. అనగా ఆయన చెప్పు జ్ఞానవాక్యములను వేదములే అనుసరించుచున్నవి. అనగా ఆయన చెప్పిన ప్రతిమాటయు వేదమే అని అర్ధము. పండితులు వేదమును అనుసరించి వాక్యములను పలికెదరు. ఆయన వేదకర్త వేదము ధర్మమూలము. కావున ఆయన చెప్పినది వేదము. ఆయన చేసినది ధర్మము అని తాత్పర్యము. “అస్య మహతో భూతస్య వేదోఖిలో ధర్మమూలం” అను ప్రమాణములు ఆయన వేదకర్తయనియు, వేదము ధర్మమూలము అని చెప్పబడినది గదా.
అవతార పురుషుడు జ్ఞానబోధ చేయునప్పుడు మామూలు స్ధితిలో ఉన్నట్లుగాను, మహిమలను చేయుచున్నప్పుడు ఎక్కువ శక్తితో చేరి ఉన్నాడని మీరు తలచుట చాలా పొరపాటు. అవతారపురుషులు జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన పరమాత్మతో పూర్ణశక్తితో చేరియున్నాడు. అట్టి స్ధితిలో అవతార పురుషుడు 100 వాట్స్ బల్బుతో సమానము. మహిమలను చేయునప్పుడు అత్యల్ప శక్తితో కూడిన '0' వాట్స్ బల్బువలెయుండును. కావున క్షుద్ర జనులు కూడా ఆ సిద్ధులను సాధించగలుగుచున్నారు. కాని బ్రహ్మజ్ఞానమును సాధించుటలేదు. శ్రీ కృష్ణుడు కౌరవులకు బోధ చేయునప్పుడు మరియు అర్జునకు బోధ చేయునప్పుడు పరిపూర్ణమైన విశ్వరూప స్ధితిలో నున్నతన స్వరూపమును చూపినాడు. కావున జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన శక్తి స్వరూపుడైన పరమాత్మయే చేయగలడు. కేవలము గ్రంధస్ధమైన జ్ఞానమును బోధించు పండితులు కూడా '0' వాట్స్ బల్బుల వంటివారే. కావుననే పరమాత్మ చెప్పు జ్ఞానము ప్రజ్ఞానమని “ప్రజ్ఞానం బ్రహ్మ”అని వేదము చెప్పుచున్నది. ప్రజ్ఞానము అనగా జీవులకు సాధ్యము కాని ప్రకృష్టమైన అనగా అతి విశేషమైన జ్ఞానము అని అర్ధము. ఇట్టి ప్రజ్ఞానము చేతనే పండితులగు గురువుల నుండి సద్గురువగు అవతార పురుషుని వేరు చేయవలయును. సత్ అనగా పరబ్రహ్మము. సద్గురువు అనగా గురుస్వరూపమున ఉన్న పరబ్రహ్మము అని అర్ధము. అజ్ఞానము పతన కారణము మరియు అమితమైన బలము కలది. జ్ఞానము ఉద్ధరణ కారణము అనగా క్రింది నుండి పైకిపోవుట. దానికి బలము తక్కువ. అజ్ఞానము స్వభావ సిద్ధమైనది. కావున బోధించు ప్రయత్నమక్కరలేదు. నీరు స్వభావ సిద్ధముగాఎంతో వేగముతో పై నుండి క్రిందకు పడి పతనము చెందును. అదే క్రింద పడిన నీరు స్వయముగా పైకి పోవుటకు వేగము కలిగియుండదు. దానిని పైకి తెచ్చుటకు ఎంతో బాహ్యప్రయత్నము అవసరము. అట్లే అజ్ఞానులను ఉద్ధరించుటకు సద్గురువు ఎంతో శ్రమ పడుచుండును.
శిలా విగ్రహములకు తైలాభిషేకము చేసి తైలము వ్యర్ధము చేయుచున్నారు. నరాకారములో వచ్చిన సద్గురువు అగు పరమాత్మ యొక్క తలకు తైలము అంటుటయే నిజమైన తైలాభిషేకము. విగ్రహములు కేవలము దర్శన యోగ్యములే. వాటిపై దుమ్ముపడకుండా నీటితో కడిగి శుభ్రపరచుట అను స్నానోపచారము ఒక్కటి చేసిన చాలునని చెప్పియే యుంటిని గదా! పరమాత్మ మానవ శరీరమును ఆవహించి అవతరించును. విద్యుత్ తీగెను ఆశ్రయించి వ్యాపించి యున్నది కదా. కనక తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున విద్యుత్తును తీగెను వేరు చేయలేము. విద్యుత్తే తీగె, తీగెయె విద్యుత్తు. అయితే ఇంత మాత్రమున విద్యుత్ తీగెగా మారలేదు. విద్యుత్ పోయిన తర్వాత తీగెను ముక్కలు చేసినను విద్యుత్ ముక్కలు కాలేదు. ఇదేవిధముగా పరబ్రహ్మము మానవ శరీరమును ఆశ్రయించి శ్రీకృష్ణునిగా అవతరించిది. పరబ్రహ్మము మానవ శరీరమును ఆపాదమస్తకము వ్యాపించియున్నది. “అంతర్బహిశ్చ తత్సర్వం” కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము, పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. ఐతే శ్రీకృష్ణుని నిర్యాణ సమయమున పరబ్రహ్మమైన నారాయణుడు శ్రీకృష్ణుని శరీరము నుండి నిష్క్రమించగా ఆ కృష్ణుని శరీరమునకు పార్ధుడు దహనసంస్కారము చేసెను. ఇంత మాత్రమున దానిచేత నారాయణుడు దహింపబడలేదు. ఏలననగా నారాయణుడు నర శరీరమును ఆశ్రయించినాడే కాని నారాయణుడు నరునిగా మారలేదు. ఇది తెలియక అజ్ఞానులు నారాయణుడు మరణించెను, దహింపబడెను అని తలచెదరు. ఈ విషయమే గీతలో “మానుషీం తనుమాశ్రితమ్” అనగా పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించి అవతరించును. వేదములో చెప్పినట్లు “అవ్యక్తం వ్యక్తమాపన్నం” అనగా పరమాత్మ నరశరీరముగా మారి అవతరించినాడు అని ఆజ్ఞానులు తలచెదరు. కావున శ్రీకృష్ణుడు జీవించినంత కాలము సాక్షాత్తు నారాయణుడే కాని నిర్యాణానంతరము శ్రీకృష్ణ శరీరము మామూలు నరశరీరమే.
No comments:
Post a Comment