Friday, January 2, 2009

కాలము-శక్తి-కర్తవ్యములు

[15. 11. 2002] కర్తవ్యములు: కర్తవ్యముల వరకు సంబంధించిన లౌకిక జ్ఞానము అవసరమే. అదియును సాధనలో ఒక భాగమే. ఏలననగా సాధన చేయుటకు అన్నపాన వస్త్రములు కావలయును. “శరీర యాత్రా పిచతే” అను గీత ప్రకారముగా ఈ మూడును కలిపి శరీర యాత్రా అనబడును. సంన్యాసికి సైతము ఈ మూడు కావలయును. ఇక గృహస్తునకు వీటితో పాటు గృహము మరియును దారాపుత్రులకు అన్నపాన వస్త్రములు కావలయును. మానవ జీవితము ఒక నిర్ధిష్టమైన ఆయుఃప్రమాణము కాలము కలిగి యుండును. కావున కాలము పరిమితము. ఇక తిను అన్నమును అరిగించి శక్తిని పుట్టించుటకు జీర్ణకోశము రోజుకు రెండు లేక మూడు సార్ల కన్న ఎక్కువ పని చేయదు. ఈ రెండు మూడు సార్లలో ప్రతిసారి పరిమితాహారమును గ్రహించి పరిమితమైన శక్తినే పుట్టించగలవు. ఈ విధముగా కాలశక్తులు పరిమితములై యున్నవి. ధనము వ్యర్ధమైనచో ఎంత ధనమునైనను మరల సంపాదించవచ్చును. కాని కాలశక్తులలో ఒక్కచుక్క వ్యర్ధమైనను మరల సంపాదించలేము. ఈ కాలశక్తుల గురించిన జ్ఞానమే అర్ధనారీశ్వర స్వరూపము. శివుడు కాలము, పార్వతి శక్తి. అదే కాలభైరవ స్వరూపము. అది గురుతత్వమై యున్నది. గురువు అనగా జ్ఞానము. కావున కాలభైరవుడు గురువు. అనగా కాలము యొక్క, శక్తి యొక్క విలువను తెలుసుకొనుటయే. ఇది తెలుసుకొని లాభపడుటయే కాలభైరవుని అనుగ్రహము. ఓ జీవా! కాలమును, శక్తిని వ్యర్ధ పరచకుము. కర్తవ్యములు పోను మిగిలిన కాలశక్తులను భగవదర్పణము చేయుము. కర్తవ్యముల పేరుతో లౌకికమును పొడిగించకుము.
1) సంన్యాసి వైనచో అన్నపాన వస్త్రముల వరకే కర్తవ్యము.
2) గృహస్తుడైనచో దారాపుత్రుల అన్నపానముల వరకే పరిమితము కమ్ము.
3) పుత్రికలు అత్తవారింటికి పోగా, పుత్రులు వారి వారి కాళ్ళపై నిలబడగా అప్పుడైనను వెనుకకు తిరుగుము. అంతే కాని తరతరములకుసరిపోవు ధనమును సంపాదించుట వలదు.
4) మనుమలు మనుమరాళ్ళ భాధ్యత నీకనవసరము. అంత్య కాలము కొన్ని ఘడియలలో యుండగా అప్పుడును మనుమలు మనుమరాళ్ళతో తైతక్కలాడి కాలశక్తులను వ్యర్ధము చేయుచున్నావు. ఈ జన్మయను సినిమా షూటింగు మిగియగనే నీవును, నీవారును శతృవులుగా యుద్ధము చేయు పాత్రలో చేరవచ్చును. లేక నీవే మరు జన్మమున కుక్కవైపుట్టి నీవారిని చూచుటకు పోగా నీవు లాలించిన మనుమలు మనుమరాళ్ళు నిన్ను నీ ఇంటిలోనికి రానీయక రాళ్ళతో కొట్టగా ఎంతో దుఃఖముతో నీవు విలపించుచు పోవుచుండగా పరమాత్మ దయతో ఒక సద్భక్తుని ఆవేశించి నిన్ను పిలచి నీకింత అన్నము పెట్టించును. ఇప్పటికి సిగ్గు తెచ్చుకున్నావని తెలిసి మరల నీకు మానవ జన్మ ప్రసాదించగా, మరల “కుక్క తోక వంకర” యును రీతిలో లౌకిక బంధమలలో మునిగి తైతక్కలాడుచున్నావు. ఇట్లు నాలుగు ఐదు సార్లు చూసి వీనికి ఇంక బుద్ధిరాదని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలే ఇవ్వబడుచున్నవి. కాలశక్తులు ముచ్చట్లతోను, కధల పుస్తకములతోను, టివి సినిమాలతోను వ్యర్ధపరచువాడు శాశ్వతముగా నష్టపోవును. కనీసము కాలశక్తులను ధనార్జనలో వినియోగించువాడు ఒకనాటికైననూ తరించవచ్చును. ఒకనాటికైనను ఆ కాలశక్తులను వ్యయము చేసి సంపాదించిన ధనములో కొంత స్వామి సేవకు వినియోగించినప్పుడు ఆ కొంత ధనమును సంపాదించుటకు ఎంత కాలశక్తులను వినియోగించినాడో అంత కాలశక్తులను భగవత్పరము చేసినవాడగును. కావున తరించగలడు.
5) కావున అతి ముఖ్యమైన కర్తవ్యములు పోను మిగిలిన కాలశక్తులను దత్తసేవలో వినియోగించుము లేదా ఆ మిగిలిన కాలశక్తులతో ధనమును ఆర్జించుము. ఈ రెండింటికి కాక ముచ్చట్లు మొదలగు వ్యసనములతో కాలశక్తులు దుర్వినియోగ పరచి ఇహపరములకు దూరమగుచున్నావు.
6) ధనమును దత్త సేవలో వినియోగించు విధానము కూడా తెలియవలెను. చాలా మంది గుళ్ళు, ఆశ్రమములు నిర్మించి దైవసేవ చేసినామని తలచుచున్నారు. ఉన్న దేవళములన్నియు పాడు పడుచుండగా కొత్త గుడులు ఏల? పెద్ద దేవాలయములు ఎందుకు నిర్మించబడినవి? గుడి యొక్క ప్రధాన లక్ష్యము సత్సంగము జరుపుటకే గాని, అర్చనలు ప్రసాదముల వరకు కావు. దైవ ప్రతిమ గల గర్భాలయము చాలా చిన్నదిగా యుండును. ఈనాడు గుడిలో సత్సంగము యను మాటయే లేదు. కోరికల జాబితాతో క్యూలో నిలబడి దైవముతో వ్యాపారము చేయు వారితో గుడి కిటకిటలాడు చున్నది. కొత్త గుడులు వ్యాపారాభివృద్ధికై నిర్మించబడిన కొత్త దుకాణాల వలెయున్నవి. మరియు ఆశ్రమములు సామంత రాజుల రాజ్యములవలె యున్నవి. శ్రీ దత్తుడు చేసిన అద్భుతములను తానే చేశానని గర్వముతో మత్తెక్కి భక్తులు పొగుడుచుండగా తానే దత్తుడనని పలుకుచూ ఆశ్రమములను విస్తరించుకొనుచున్నారు. ఇట్టి వారిని గురువులుగా చేసికొని ఆజ్ఞానులగు జీవులు గుడ్డివానిని పట్టుకున్న గుడ్డివాని వలె భావిలో పడుచున్నారు.
7) కావున సత్సంగములను చేసి వాటిని గ్రంధములుగా ముద్రించి ఆ గ్రంధములు సంచార దేవాలయములుగా మారి జ్ఞానప్రచారము చేయవలెను.
8) అట్లే భజనలు పాడుచు కాసెట్ల రూపములో భక్తి ప్రచారము చేయవలెను. పూర్వకాలమున ముద్రణము లేనందున శంకరులు సత్సంగ చర్చలతో జ్ఞానప్రచారమము చేసెను. అట్లే ఆ కాలములో కాసెట్లు లేనందున మీరాబాయి భక్త బృందములతో పాడుచు భక్తి ప్రచారము చేసెను. శంకరులు గాని, మీర గాని దేవాలయములును గాని, ఆశ్రమములను గాని ఎచ్చటను ఎప్పుడును నిర్మించలేదు. ఇట్లు అంతరార్ధము తెలిసి సేవ చేసిననే జ్ఞానరూపుడగు శ్రీ దత్తునికి ప్రీతికలుగును.

No comments:

Post a Comment