పురోహితులగు
బ్రాహ్మణోత్తములారా!
[శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము)]
బ్రాహ్మణోత్తములారా!
[శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము)]
'ప్రవృత్తించ నివృత్తించ జనాన విదు రాసురాః' అని గీతలో భగవానుడు చెప్పియున్నాడు. దీని అర్ధము- రాక్షస స్వభావముగల ఈ మానవులకు మోక్ష మార్గమే కాదు, లౌకిక మార్గము కూడ తెలియదు అనియే. రాక్షస స్వభావము అనగా— స్వయముగా తెలియదు, పరులు చెప్పినది వినరు అనియే. అజ్ఞానముతో కూడిన అహంకారమే దీనికి కారణము. లౌకిక కర్తవ్యములగు వివాహము మొదలగు శుభకార్యములు ఎట్లు చేయవలెనో తెలియక, అవసరమైనది చేయక, అనవసరమైనది చేయుచు, ప్రవృత్తిలోకూడ మూఢులగుచున్నారు. ఒక భక్తుడు లక్షన్నర కూతురికి కట్న కానుకుల క్రింద ఇచ్చి, ఐదు లక్షలు పెట్టి పెళ్ళి చేసినాడు. దీనికి తారుమారుగా చేయవలెను. ఐదు లక్షలు కూతురికి ఇచ్చి లక్షన్నరతో పెళ్ళి చేయవలెను. అసలు ఆరు లక్షలు కూతురికి ఇచ్చి, అర లక్షతో పెళ్ళి చేయుట ఉత్తమము. ఒకరు, ఎంత ఎక్కువ ఖర్చు చేసిన అంత ప్రేమ కూతురిపై ఉన్నట్లు అని అన్నారు. ఈ మాట ఎంతమాత్రము నిజము కాదు. ఎంత కూతురి పేరుమీద పెట్టినావో అంత ప్రేమ కూతురిపై ఉన్నది అనుట ముమ్మాటికి నిజము. నీవు ఖర్చు పెట్టినదంతయూ నీ అహంకారమును వ్యక్తము చేయు ఆడంబరమే కాని ఇది నిజముగా ప్రేమ కాదు. ఇట్టి భావమే రాక్షసత్వమని గీతా వచనము (ఈశ్వరోహమహం ...). ఇట్లు ఖర్చు పెట్టుట జీవితములోని మధుర స్మృతి అని కొందరు వాగుచుందురు. ఇట్లు వాగువారిలో రెండు వర్గములున్నవి . మొదటి వర్గము- పెళ్ళి ఖర్చులో దోచికొనుపోవు మేళము, పూల పందిరి మొదలగు వ్యాపారులు. వీరు తమ వ్యాపారము సాగుటకై ఇట్టి మాటలు కల్పించినారు. వీరు వ్యాపార వృద్ధికై ఇట్లు చెప్పుటలో కొంత న్యాయమున్నది. ఇక రెండవ వర్గము వారు బంధు మిత్రులు. వీరు ఇట్లు చెప్పుటకు కారణము- పెళ్ళి ఖర్చు చేత నీవు నలిగి బీద వాడైనచో నీ కన్న వారు సంపన్నులుగా పై స్థాయిలో ఉండగోరుటయే. ఇట్టి కోరిక వారికి తెలియకయే అంతరాత్మలో దాగియుండును. దీనిని అవ్యక్త ప్రాక్తన సంస్కారమందురు (subconscious state). దీని వలన అకారణముగ కొన్ని మాటలు పలుకుట, కొన్ని పనులను చేయుట జరుగుచుండును. కన్యాదాత మనస్సులో కూడా అతడు గుర్తించని సంస్కారము దాగి యుండును. అట్టి సంస్కారము ఏమనగా - అతని మనస్సులో కీర్తి కాంక్ష దాగి యుండును. పది మంది తన చుట్టూ చేరి తాను చేయు ఘనకార్యమునకు ప్రశంసాభావముతో తన చుట్టూ జనులు చేరి యుండవలయుననియే. అట్టి అవకాశము తాను ఏదో ఒక లోకోద్ధరణ కార్యము చేసినపుడు జనులు అట్లు చుట్టూ చేరవలయును గానీ ఈ విధముగా కాదు. కానీ తన జీవితములో అట్టి అవకాశము లేనపుడు ఈ విధముగానైననూ సంతృప్తిపడు అవకాశముగల కీర్తి కాంక్షయే దీనికి అసలు కారణము. ఈ కారణమును కప్పిపుచ్చి కూతురిపై గల ప్రేమతో పెళ్ళి బాగుగా చేయుచున్నానని పలుకు చుండును. ఈ సంస్కారము చాలామందికి తెలియకపోవుట వలన, అది వారిలో ఉన్నట్లు ఎవరైననూ చెప్పినను అంగీకరించజాలరు.
నీవు నీ స్థాయిని అనుసరించి ఖర్చు చేయవలెను. ధనవంతులను అనుకరించి పులిని చూచి నక్క వాతపెట్టుకొన్నట్లు చేయరాదు. నీవు ఆరు లక్షలను కూతురి పేర పెట్టినచో అది ఎన్నో రెట్లు అగును. ఆమె కష్టములలో అక్కరకు వచ్చి ఆమె జీవితము మధురముగనుండును. కష్టములు వచ్చినపుడు ఆ మధుర స్మృతిని ఎంత తలచినా కష్టములు పోవునా? దోచుకొని పోయిన మేళము, పూల పందిరి వారు వచ్చి కష్టములను తీర్చెదరా?
నీవు పెళ్ళి చేయునపుడు బంధు మిత్రులను పిలచి అన్న వస్త్రాది దాన మర్యాదలను చేయుచున్నావు. దానము అపాత్రులకు చేసినచో పాపఫలము వచ్చి, వధూవరులు కష్టముల పాలు అగుదురు. పాత్రులకు ఇచ్చినచో పుణ్యము వచ్చి వధూవరులు సుఖ పడుదురు. పాత్రులకు దానము చేయక పోవుట, అపాత్రులకు దానము చేయుట— ఈ రెండునూ పాపములని భారతములో వ్యాస వచనము. నీవు పెండ్లికి పిలచినపుడు పాత్రులు ఎవరు అను విచక్షణతో పిలువలేదు. కేవలము గుడ్డిగా బంధు మిత్రులను పిలచినావు. వారిలో చాల మంది నిజముగా అపాత్రులే. నివృత్తిలోనే కాదు కనీసము ప్రవృత్తిలో కూడా ధర్మము లేని వారే. ఇట్టి వారి అశీస్సులతో వధూవరులు అనేక కష్టముల పాలగుచున్నారు. కావున గీత ఆరంభములో గుడ్డి బంధు వ్యామోహముతో నున్న అర్జునుని వలె కాక, విచక్షణతో పరులైనను పాత్రులను పిలచి సన్మానించినచో వధూవరులు సుఖింతురు. అట్టి పాత్రులు దొరకనిచో బిచ్చ గాండ్రకు అన్నదానము చేయుము. వారు కనీసము అన్నము పారవేయక తిందురు. వడ్డించిన ఆహారమును కణము కూడ పారవేయక తినుటయే భోక్త యొక్క కనీస యోగ్యతా లక్షణమని వేద శాసనము (అన్నం న పరిచక్షీత...). ఈ నాడు పెళ్ళి విందులో ఎంత ఆహారమును పార వేయుచున్నారు! ఒక చోట విందు జరుగు చున్నది. గోడకు ఇటువైపు ఆహారమును పార వేయుచు కొందరు విందును ఆరగించుచున్నారు. గోడకు అటువైపు పారవేసిన ఆహారమును బిచ్చగాండ్రు వెతికి వెతికి తినుచున్నారు. అప్పుడు అచట ఉన్న శ్రీ సత్య సాయి భగవానుని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించినాడు. 'ఏమిటి ఈ సృష్టి వైపరీత్యము! ఒకవైపు అట్లు పారవేయుట! మరొక వైపు అట్లు ఏరు కొనుట!' బాబా ప్రశాంతముగ పలికినారు. 'ఆ ఏరుకొను వారు పూర్వ జన్మమున ఇట్లు పారవేసిన వారే. నాడు పారవేసిన దానిని నేడు వెతుకు కొను చున్నారు'. కావున ఆహారమను పారవేసినవారు మరు జన్మములో బిచ్చ గాళ్ళ జన్మమునెత్తుదురు. అంతే్కాదు పెళ్ళి విందును ఏర్పాటు చేసిన కన్యాదాతయు, అట్టి వారిని తీసుకువచ్చిన వరుని తండ్రియు, ఆ పాపముయొక్క భాగస్వాములై (కర్తా కారయితాచైవ ...), ఎన్ని విస్తర్లలో ఆహారము పారవేయబడినదో అన్ని జన్మములు బిచ్చగాళ్ళుగా పుట్టుదురు. ఆహారమును కణముకూడా పారవేయరాదని వేద వచనములో (పరిచక్షీత...) పరి అను ఉప సర్గ బోధించుచున్నది. అట్లే ధనమును పైసయు దుర్వినియోగము చేయరాదు. అట్లు చేసినచో దరిద్రులుగా జన్మింతురు. కూతురికి ఇచ్చుట, పాత్రులకు ఇచ్చుట, బిచ్చ గాళ్ళకు దానము చేయుట ధన సద్వినియోగము. అపాత్ర దానము, అనవసరముగా స్థాయికి మించిన ఖర్చు ధన దుర్వినియోగము.
అన్నమును పారవేసిన వారు అన్నపూర్ణను, ధన దుర్వినియోగము చేసిన వారు లక్ష్మీ దేవిని, అవమానము చేసినవారు కావున శివకేశవుల క్రోధమునకు గురియగుదురు. కన్యాదాత, వర పక్షము వారిని తన శక్తి భక్తుల ననుసరించి అథిధి మర్యాదలను చేయుచున్నాడు. ఈ మర్యాదలే పెళ్ళి ఖర్చుయొక్క స్వరూపము. మర్యాదలను ఎవరైనను సహజముగా మనఃస్ఫూర్తిగా చేయవలయునే గాని, ఫలానా మర్యాదలు చేయవలయునని అడుగరాదు. అడిగి బలవంతముగా చేయించుకొన్నవి మర్యాదలు అనబడవు. అభిమానముతో మనఃస్ఫూర్తిగా చూపించు భక్తి గౌరవములే నిజమైన మర్యాదలు. కన్యాదాతచేయు సహజమైన మర్యాదలను మంచి దృష్టితో స్వీకరించుటయే ఉత్తమ సంప్రదాయము.
No comments:
Post a Comment