పరమాత్మ అద్వితీయునిగా ఏకాకిగా ఉండెను. ఆ పరమాత్మ స్వరూపము పరమాత్మకే తెలియును. "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. దీని అర్ధము బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మమే అని. బ్రహ్మమును గురించి బ్రహ్మము కన్న భిన్నులైన ఇతరులు అనగా జీవులు ఏ మాత్రము తెలియజాలరు. కాని శ్రుతిని తప్పుగా సమన్వయము చేయుచున్నారు. బ్రహ్మమును గురించి ఏ జీవుడు తెలుసుకొన్నను ఆ జీవుడు బ్రహ్మమగును అను అర్ధమును చెప్పుచున్నారు. ఇది సరియైన అర్ధము కానేకాదు. ఏలననగా, బ్రహ్మము వాక్కులకు గాని, కన్నులు మొదలగు ఇంద్రియములకు గాని, మనస్సుకు గాని, బుద్ధికి కాని, తర్కమునకు గాని అందదు. శ్రుతులు "యతోవాచః, నచక్షుషా, అప్రాప్య మానసా, నమేధయా, నైషతర్కేణ" అను శ్రుతులు ఇందుకు ప్రమాణములు. “మాన్తు వేదన కశ్చన” అని గీతలో నున్న ఏ జీవుడును తెలియజాలడు అని స్వామి వచించినాడు. దీనికి కారణము జీవుల ఊహలన్నియు ఆకాశ తత్త్వము వరకే వ్యాపించగలవు ఆకాశమనగా ఖాళీ స్ధలము. ఆకాశామునకు అతీతమైన "ఆకాశః" అను శ్రుతి ప్రకారము ఆకాశమును సృష్టించిన పరమాత్మను ఏ జీవుడును, ఎప్పటికిని అర్ధము చేసుకొనజాలడు.ఆకాశము అదృశ్యమైనకాని, పరమాత్మ గోచరించడు. ఆకాశమే అదృశ్యమైనచో జీవుడు, జీవుడు యొక్క మేధాశక్తి, జీవుని ఊహలు అన్నియు అదృశ్యమైపోవును. కావున ప్రకృతి స్వరూపుడగు జీవుడు ప్రకృతి అంతయు అదృశ్యమైనపుడు మాత్రమే గోచరించు పరమాత్మను ఎంత ప్రయత్నించినను తెలియజాలడు. ఐతే పరమాత్మను తెలియజాలడు అను విషయము ఎట్లు తెలిసినది? తెలియలేని వస్తువు అసలు లేదనియు భావించవచ్చును గదా! ఈ ప్రశ్నకు శ్రుతి "అస్త్రీత్యేవోపలబ్ధః" అని చెప్పుచున్నది. దీనికి అర్ధము తెలియుటకు వీలుకాని తాను ఉన్నానని మనకు చక్కగా తెలియునట్లు చేయును. అది ఎట్లు అనగా అవతారము ద్వారా . అవతారము యొక్క ముఖ్యోద్దేశము ఇదే. ఇది పరమాత్మ చేయనిచో సర్వజీవులు నాస్తికులగుదురు. ఊహకు అందని కొన్ని పనులను అవతారము చేసి జీవులకు చూపించును. ఊహాతీతమైన పనుల ద్వారా ఊహాతీతమైన పరమాత్మ ఉన్నాడని ప్రత్యక్ష ప్రమాణము ద్వారా నిరూపించుటయే సిద్ధులను ప్రదర్శించుటలోని ముఖ్యోద్దేశము.
దీని వలన జీవులలో నాస్తికత్వము పోయి ఆస్తికత్వము నిలబడును. కావున నాస్తికుని మార్చుటకే ఈ సిద్ధులు. ఆస్తికునకు సిద్ధులు అక్కరలేదు. శ్రుతిలో అవతారమును గురించిన ప్రస్తావన లేదని త్రైతమత పండితులు వాదించుచున్నారు. కాని ఇది సరి కాదు. "అజాయమాన్తో బహుధా విజాయతే" అను శ్రుతి పుట్టుకలేని వాడు అనేక సార్లు పుట్టు చున్నాడు అనియు, “తత్ సృష్టా తదేవాను ప్రావిశతు” అను శ్రుతి పరమాత్మ ఈ జగత్తును సృష్టించి, ఈ జగత్తులోనికి ప్రవేశించుచున్నాడు చెప్పుచున్నది. ఈ అను ప్రవేశ శ్రుతికి కూడా కొందరు అపార్ధమును చెప్పుచున్నారు. వీరి ప్రకారము పరమాత్మ పంచ భూతములతో జడములను మాత్రమే సృష్టించినాడు. తరువాత తన స్వరూపమగు చైతన్య స్వరూపముతో జగత్తులోని జీవునిలో ప్రవేశించినాడు అని చెప్పుచున్నారు. ఇది సరికాదు ఏలననగా "ఆకాశాత్ వాయుః" ఇత్యాది శ్రుతులు మొదట ఆకాశము దాని నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి వృక్షములు, వృక్షముల నుండి జీవులు పుట్టినారని జీవుని పంచభూతముల వికారమగు అన్నము నుండి జీవుడు పుట్టుట చెప్పుచున్నది. జీవుడే పరమాత్మ అయినచో "అన్నాత్ పురుషః" అన్నము నుండి జీవుడు పుట్టినాడని శ్రుతి ఎట్లు చెప్పినది. కావున ఏకాకిగా వినోదము లేని పరమాత్మ ఈ జగత్తును తన ఊహారూపముగా సృష్టించినాడు అన్నప్పుడే జీవుల సృష్టి కూడా జరిగినది. ఆ సృష్టిని చూచి వినోదించి తృప్తి చెందక పరమాత్మ తానును ఒక జీవరూపమున ప్రవేశించినాడు అనియే అను ప్రవేశ శ్రుతికి అర్ధము చెప్పవలెను. మరియును గీతలో ప్రకృతి రెండు భాగములని చెప్పబడినది. ఒకటి జడమగు అపరా ప్రకృతి. రెండవది జీవుడు లేక చైతన్యమగు పరా ప్రకృతి. ప్రకృతి యనగా సృష్టి అని అర్ధము. పరా ప్రకృతి యనగా ఆయన సృష్టించిన పదార్ధములలో జీవుడు శ్రేష్టుడని అర్ధము.
ఈ విధముగా పరమాత్మ వినోదమను ప్రయోజనము ఒక్కటే కాక తన భక్త జీవులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను అనుగ్రహించి, వారిని తరింపచేయుటకై పరమాత్మ నిరంతరము జగత్తులో అవతరించుచునే ఉన్నాడు. పరమాత్మ అవతరించునప్పుడు మాతృ గర్భమున జడమైన శరీరము ఏర్పడును. ఈ శరీరములో ఎట్టి గుణములు లేని శుద్ధ చైతన్యము అగు జీవుడు వ్యాపించియే యున్నాడు. అయితే ఈ శుద్ధచైతన్యమును జీవుడని ఖచ్చితముగా చెప్పరాదు. జీవుడనగా కొన్ని గుణముల సమూహము. ఈ గుణ సమూహమగు జీవుడు పరమాణు ప్రమాణముతో తేజోబిందువుగా యుండను. ఈ జీవుడే యాతనా శరీరముతో పైలోకములలో కర్మఫలమును అనుభవించి మేఘము వర్షము భూమి యొక్క ధాన్యపుగింజ ద్వారా మాతృ గర్భమున ఏర్పడిన శుద్ధచైతన్య సహితమైన జడ శరీరము లోనికి ప్రవేశించుచున్నాడు. ఇక్కడ శుద్ధచైతన్యము కూడా జీవుని యొక్క స్వస్వరూపమే కావున జీవుడు అనవచ్చును గాని ఈ శుద్ధ చైతన్యము చేతన అను శబ్ధముతో పిలవబడుచున్నది. పరమాత్మ అవతరించినపుడు శుద్ధచైతన్యముతో కూడిన జడశరీరము లోనికి పరమాత్మయే ప్రవేశించును. గుణ సమూహమగు జీవుడు ప్రవేశించడు. కావున అవతారపురషునకు ఎట్టి గుణ సమూహము లేనందన నిర్గుణుడై కర్మఫలములనంటక ఉండును.
భక్తుడు: భక్తుడు అనగా తన కర్మఫలములను స్వామి అనుభవించునని తెలిసి వాటిని తానే అనుభవించెదననియు వాటిని స్వామి రద్ధు చేయవద్దు అని ప్రార్ధించెడివాడు. రద్దు చేయుట అనగా స్వామియే స్వయముగా అనుభవించుట అని తెలిసినవాడే నిజమైన భక్తుడు. అజ్ఞానియగు భక్తుడు కర్మఫలములను రద్దు చేయగల శక్తి స్వామికి ఉన్నది కావున వాటిని రద్దు చేయమని అర్ధించును. అట్టివాడు స్వామి యందు నిజమైన భక్తి కలవాడు కాడు. అట్టివాడు స్వామిని అరాధించుచు మొండిపట్టును పట్టుచూ ఉండును. స్వామి ఎన్నడును కర్మ ఫలములను రద్దు చేయడని వానికి చెప్పినను వినక కర్మఫలములను రద్దు చేయగల శక్తిని ఉపయోగించమని స్వామిని కోరును. నా కర్మఫలములను అనుభవించి యైనను నాకష్టములను తొలగించమని మాట బయిటకు అనడు. అట్లు అన్నచో స్వామిపై తనకు భక్తిలేదని నిరూపించబడును కావున తనకు భక్తిలేదను మాట బహిరంగముగా తెలియరాదని భావించును. కాని లోలోపల " నీవు అనుభవిస్తావో లేక రద్దు చేస్తావో నాకు తెలియదు.నా కష్టమును తొలగించుము" అని ప్రార్ధించును. దాని కొరకై ఎక్కువగా ఆరాధనము చేయును. ఇది సత్యమైన భక్తి కానేకాదు. ఇట్టి భక్తుడు భగవంతుని తన సుఖమును సాధించుకొనుటకు పనిముట్టుగా వాడుకొనుటయే అగును. ఇట్టివాని భక్తి అనగా ప్రేమ అంతయును తన మీదనే ఉండును. ఇదియే స్వార్ధము. తన కష్టములను తొలగించనిచో ఆ రూపమును వదలి మరియొక రూపమును పట్టును.
ఇట్టి భక్తుని కష్టముల సైతము తొలగించి లోకములో దైవ విశ్వాసమును కాపాడుచున్నాడు. అయితే ఇట్టి భక్తుని కష్టములు తొలగించుటలో పద్ధతి వేరుగ యుండును. ఇట్టి కపట భక్తుని కర్మఫలములను స్వామి అనుభవించడు. వాని కర్మ ఫలములను తరువాత జన్మలకు స్వామి త్రోసివేయును. ఈ కపట భక్తుడు తన కష్టములను స్వామి రద్దు చేసినాడని భావించుచున్నాడే కాని తరువాత జన్మలలో వాటిని పెరిగిన వడ్డీతో అనుభవించవలయును. కావున కపట భక్తునకు స్వామియును కపటముగనే ప్రవర్తించినాడు. బయుటకు ఒకటి పలికి లోపల ఒకటి తలచి ఒక మానవుడు అల్పజ్ఞుడగు మరియొక మానవుని మోసగించవచ్చునేమో గాని సర్వజ్ఞుడగు పరమాత్మను ఎట్లు మోసగించగలడు?
సత్యమైన భక్తుడు జ్ఞాని కావున ఇట్లు ఆలోచించును. "నా కష్టములను రద్దు చేయమని పరమాత్మను నేను ప్రార్ధించినచో స్వామి నా కష్టములను అనుభవించవచ్చును. స్వామి భాధపడుట నేను ఏ విధముగను సహింపజాలను. కావున ఈ మార్గమును అంగీకరించజాలను. కాని రెండవ మార్గమున కర్మ ఫలములను తరువాత జన్మలకు త్రోసినచో అనవసరముగా పెరిగిన వడ్డీతో వాటిని ఏల అనుభవించవలెను? ఇప్పుడే తక్కువ వడ్డీతో అనుభవించెదను" అని నిజభక్తుడు ఎప్పుడును తన కష్టములను గురించి చింతించడు. ఇంకనూ, మహాజ్ఞాని యగు సద్భక్తుడు రాబోవు జన్మలలో ఏర్పాటు చేయబడి ఉన్న దుష్కర్మఫలములను ముందుకు లాగి ఈ జన్మలోనే తక్కువ వడ్డీతో అనుభవించి లాభమును పొందగోరి ఆ విధముగా కర్మ నిశ్శెషము చేయమని స్వామిని ప్రార్ధించును. ఇట్టి సద్భక్తుల కష్టములను కూడా స్వామి తొలగించను. కాని ఏ మార్గమున తొలగించును అన్నచో స్వామి వాటిని ఆకర్షించుకొని వాటిని తానే అనుభవించి వారిని కష్ట్టవిముక్తులను చేయును. ఇట్లు స్వామి తాను చేసితినని ఆ సద్భక్తునకు తెలియనీయడు తెలిసినచో ఆ సద్భక్తుడు అంగీకరించడు. స్వామికి కర్మ ఫలములను రద్దు చేయగల అధికారమున్నను దానిని దుర్వినియోగము చేయడు. అంతేకాదు ఆ కర్మ ఫలములను అనుభవించునప్పుడు స్వామి ధరించిన శరీరము మన శరీరము వంటిదే అగును. కావున మనకు ఎంత బాధకలుగునో అంతే బాధ స్వామికి కలుగును. బాధను అనుభవించునపుడు తన దివ్యశక్తని ఉపయోగించి ఓర్చుకొనగలడు. కాని అట్లు చేసినచో "నా భక్తుల కర్మఫలములను నేను అనుభవిస్తానని" స్వామి ధర్మ దేవునకు వాగ్దానమును మోసముతో భంగపరచినట్లగును. ఏ భక్తుడు ఏ రూపమున ఆరాధించినను అన్ని రూపములలో యున్న వ్యకి స్వామియే కావున సమస్త సృష్టిలో ఉన్న అందరి సద్భక్తుల కర్మ ఫలములను తానొ్క్కడే అనుభవించుచుండును. కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే గదా! ఈ కారణము చేతనే అవతార శరీరము కూడా మన శరీరము వలె అన్ని ప్రకృతి ధర్మములను కలిగియుండును. ఈ రహస్యమును తెలియక భక్తులు మూర్ఖముగా ప్రవర్తించుదురు. అవతార శరీరము మనకన్న విశిష్టమని భావించి ఒక మూఢ భక్తురాలు అవతార పురుషుని కాలి మీద టెంకాయ పగులకొట్టినది. స్వామి యొక్క పాదము వాచి పదిరోజులు బాధపడినారు. స్వామి మహిమలను చూచి స్వామికు ఆకలి దప్పికలు ఉండవని తలచి యశోద ఒకనాడు స్వామికి చద్దిఅన్నము మూట కట్టకుండా పంపినది. ఆ రోజు స్వామి గోవులను కాచి తిరిగి తిరిగి శ్రమతో అలసిపోయి ఆకలితో నీరశించి ఋషులు చేయు చున్న యజ్ఞవాటికను చేరి ఆ వండిన చెరువును పెట్టమని మునిపత్నులను అర్ధించినాడు. స్వామి దివ్య దర్శనములను సద్భక్తులకు అనుగ్రహించునపుడు కూడ ఒక మహాశక్తి ఈ సామాన్య శరీరము నందు ప్రవేశించుట చేత ఆయన శరీరము కూడ ఎంతో కష్టమును అనుభవించును.
కావుననే జ్ఞానులైన సద్భక్తులు స్వామిని దివ్యదర్శనముల కొరకు అర్ధించరు. స్వామిపై పరిపూర్ణ విశ్వాసము లేకపోవుటయే ఆ దివ్యదర్శన కుతూహలము అని తెలియవలయును. చూచి నమ్మిన వాని కన్నను చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈ విధముగా స్వామి అవతరించినపుడు ఆయన శరీరము ఎన్నో ముళ్ళతో గుచ్చబడి యుండును. ఆ ముళ్ళు మన కంటికి కనిపించవు. స్వామి సింహాసనముపై కూర్చునవలయునని స్వామితో కైవల్యము సాధించవలయునని జీవులు తహతహలాడుదురే తప్ప ఆయన కూర్చున్న సింహాసనము మీద ఉన్న ఎన్నో ముళ్ళు ఆయన శరీరములో దిగబడినవి మన కంటకి కనిపించవు. జీవుడు యదార్ధము తెలియక కైవల్యమునకై అర్ధించు చున్నాడే తప్ప నిజముగ స్వామి కైవల్యము ఒక్క క్షణకాలము పొంది ఆ సింహాసనముపై కూర్చున్నచో వాడు ఒక్క దూకుతో దాని నుండి బయిటకు వచ్చి పరుగుతీయును. అప్పుడు వాడు ఎప్పటికు స్వామి పదవి వద్దు భక్తునిగనే ఉండుదును అని మొరపెట్టును. ఆ ఒక్క క్షణకాలపు బాధకూడా ఎంతో తీవ్రాతి తీవ్రము కనుకనే స్వామి తన బిడ్డలైన జీవులు బాధపడుదురని కరుణతో జీవులు ఎంత అర్ధించినను కైవల్యము ఇచ్చుటలేదు. ఇది తెలియక జీవులు స్వామి కైవల్యమును ఇచ్చినా స్వామితో సమానత్వము పొందినచో స్వామి ఓర్వలేక అసూయతో కైవల్యము ఇచ్చుట లేదని అపార్ధము చేసుకొందురు. అయిననూ స్వామి వారు ఒక్క క్షణకాలమైనను ఈ బాధకు తట్టుకొనలేరని కైవల్యము ఇచ్చుటలేదు. మహాశక్తిమంతుడు మహాబలవంతుడు అగు హనుమంతుడే ఒక్క క్షణకాలము స్వామితో కైవల్యమును అనుభవించి ఆ బాధలను తట్టుకొనలేక కైవల్యము వదలి "దాసోహం" అన్నాడు. జగత్తు యొక్క సృష్టి, స్ధితి, లయ బాధ్యతలైనను నిర్వర్తించుటకు హనుమంతుడు ముందుకు వచ్చినాడే కాని కైవల్య పదవిని మాత్రము వద్దని సదా దాసోహం అన్నాడు. అందుకే రామకృష్ణ పరమహంస పంచదారను తిను చీమగా ఉంటాను గానీ పంచదారను మాత్రము కాను అని అన్నాడు. అందుకే మధ్వాచార్యులు స్వామికి జీవునకు మధ్య సేవ్య సేవక సంబంధమే ఉత్తమమని బోధించాడు.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు
No comments:
Post a Comment