Monday, February 1, 2010

హనుమంతుడు (జీవేశ్వరులు)

హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినపుడును కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తినపుడును, ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో, జీవేశ్వరుల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మ సూత్రములలో "అనుప్సత్తేస్తు శారీరః" ఇత్యాది సూత్రములలో శంకరులు కూడ జీవేశ్వరులకు గల బేధమును స్ధాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు తన శరీరమును పర్వతము కన్న ఎక్కువ ప్రమాణములో పెంచియున్నాడు. అంత పెద్ద పరిమాణము గల శరీరములో ఇమిడియున్న శక్తి కూడ చాలా పెద్దది. కావున స్వల్ప శక్తి గల పర్వతమును ఎత్తుట మన బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. ఒక పెద్దరాయి చిన్నరాయిని మోసినట్లు తర్క బద్ధమైన విషయమై యున్నది. కాని చాలా చిన్న శరీరము గల బాలకృష్ణుడు తన శరీర పరిమాణమును పెంచకయే పర్వతమును ఎత్తుట బుద్ధికి అందక తర్కాతీతమైన విషయముగా యున్నది. మానవునిలో శక్తి లలితములైన డెబ్బది రెండువేల నాడుల యందు ప్రవేశించుచున్నది. ఒక బాలుని శరీరములో ఈ శక్తినంతయు కలిపి చూచినచో ఆ బాలుడు చిన్న బండను మాత్రమే ఎత్తగల శక్తి కలిగి యున్నాడు. ఇంత కన్న ఎక్కువ శక్తి లలితములైన ఆ నరముల యందు ప్రవహించినచో ఆ నరములన్నియు మాడిపోయి శరీరము భస్మమగును. ఒక కొండ ఎత్తుటకు ఒక పెద్ద క్రేన్‌ యంత్రము ఉపయోగించినపుడు ఎంత విద్యుత్‌చ్ఛక్తి కావలయునో ఆలోచించుడు. ఇప్పుడు మన బాలకృష్ణుడు ఆ కొండ నెత్తినాడన్నచో అంత శక్తి ఆ బాలును నరములందు ప్రవహించుచున్నదని అంగీకరించక తప్పదు. కాని ఆ విద్యుత్‌చ్ఛక్తిలో కోటి వంతు ఒక మనిషికి తగిలినను ఆ మనిషి మాడిపోవుచున్నాడు. కాని హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు శరీరము యొక్క పరిమాణము పెరుగుట వలన ఆ శరీరము యొక్క శక్తి పెరిగినది కావున శక్తి చేత శరీరము ఏ మాత్రము బాధించబడదు. ఒక చెంబు పెద్ద బిందెగా మారినపుడు చెంబు నీటి కన్నను ఎక్కువ పరిమాణములో పది చెంబుల నీరు బిందెలో పట్టుచున్నది. కావున జీవునిగా ప్రవర్తించుచున్న హనుమంతుడు కొండ నెత్తుట తర్కమునకు అందుచున్నది. కాని గోవర్ధన పర్వతమును ఎత్తినపుడు కృష్ణుడు శరీరమును పెంచలేదు. కొండ నెత్తు శక్తి మాత్రము పెరిగినది. ఆ అధిక శక్తికి బాలుని శరీరము బాధపడలేదు. బిందెడు నీరు చెంబులో పట్టినవి. ఇది తర్కమునకు అందదు.

శ్రుతులు అన్నియును పరమాత్మ తత్వము తర్కాతీతమని ఘోషించుచున్నవి. "అతర్క్యః" "నైషతర్కేణ", "నమేధయా", "యోబుద్ధేపరతః", "యస్యానతమ్‌ తస్యమతమ్‌" అను శ్రుతులు ఎన్నటికిని ఎవరికిని అర్ధము కాని వాడు పరమాత్మ అని చెప్పుచున్నవి. గీతలో కూడా "మాంతువేదాన కశ్చన" అనగా నన్ను ఎవ్వడును అర్ధము చేసుకొనజాలడు అని చెప్పుచున్నది. కావున జీవుడు ఎన్ని అష్ట సిద్ధులను సంపాదించినను ఈశ్వరత్వము రాదు. అష్ట సిద్ధులు మానవుని తర్కమునకు అందకున్నను ఋషులు దేవతల యొక్క మేధాశక్తి యగు తర్కమునకు అందుచున్నవి. కావుననే ఋషులు దేవతలు అష్ట సిద్ధులను వింతగా చుడరు. మనము నిత్యము చేయు కర్మలకు ఎట్లు ఆశ్చర్యపడమో, దేవతలు ఋషులు అష్ట సిద్ధులకు ఆశ్చర్యపడరు. కావున పరమాత్మ తత్త్వము తర్కాతీతము అనుటకు పరిమితమైన నరాకారములోనే పరమాత్మ ఉన్నప్పుడు అది సాధ్యమగును. విశ్వరూపమును సందర్శించినపుడే అనాది అనంతమైన అకారమున స్వామి గోచరించినాడు. అంత పెద్ద ఆకారముతో ఈ అనాది అనంతమైన విశ్వమును భరించుటలో ఆశ్చర్యమేమున్నది? ఒక పెద్దకొండ ఏనుగును మోయునపుడు ఎట్లు ఆశ్చర్యము లేదు. అది తర్కమునకు అందుచున్నది. మరి శ్రుతులు పరమాత్మ తర్కాతీతుడనుచున్నవి. కావున ఈ విశ్వరూపము పరమాత్మ ఎట్లుగును? కాని పుత్రుడైన చిన్నబాలుడైన కృష్ణునిలో అనాది అనంత విశ్వమును యశోద దర్శించినది. అనంతమైన విశ్వరూపములో ఈ పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. కాని బాలకృష్ణుని చిన్ననోటిలో ఇంత పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధము కాక తర్కాతీతమై యున్నది. కావున శ్రుతులు చెప్పిన దాని ప్రకారము పరమాత్మ విశ్వ రూపమా? లేక బాలాకృష్ణుడా? యుక్తి ద్వారా కూడా ఇదే సిద్ధించును. ఏలననగా, బ్రహ్మము అను శబ్ధమునకు అర్ధము ఏమి? గొప్పది అని అర్ధము. తర్కబద్ధమైన విశ్వరూపము గొప్పదా? తర్కాతీతుడైన బాలకృష్ణుడు గొప్పవాడా? ఇక అనుభూతిని తీసుకున్ననూ, "ఆశ్చర్యవత్‌ పశ్చ్యతి కశ్చిదేనమ్‌" అని శ్రుతి. అనగా పరమాత్మ దర్శనము ఆశ్చర్యమును కలిగించును అని అర్ధము. విశ్వరూపము భయమును కలిగించినది. "భీతభీతః ప్రణమ్య" అని గీత. "అధతస్య భయం" అను శ్రుతి అజ్ఞానము భయమును కలిగించునని చెప్పచున్నది. విశ్వరూపము తర్కబద్ధము కావున అజ్ఞానమే. ఇది యొక సిద్ధియే. కాని కృష్ణుని నోటిలో విశ్వము చూచినపుడు ఆశ్చర్యము చెందుటకు తర్కాతీత స్ధితియే కారణము. విచిత్రమే ఆశ్చర్యకారణము. ఈ విచిత్రమే మాయ. "మయవైచిత్ర్యే" కదా. ఈ విచిత్రము అనగా మాయ కలవాడే ఈశ్వరుడు. "మాయినంతు మాహేశ్వరమ్‌" అని గీత. కావున చర్మ చక్షువులకు గోచరించిన వసుదేవుని పుత్రుని స్వరూపమే పరబ్రహ్మము అని తెలియువాడు అసలు దొరకడని "వాసుదేవస్సర్వమితి" అను శ్లోకము చెప్పుచున్నది. "యత్సాక్షాదపరోక్షాత్‌" అను శ్రుతి పరబ్రహ్మము ప్రత్యక్షమగుచున్నది. "ఇహచేదవేదీత్‌" అను శ్రుతి ఈ లోకమున నున్న సత్యరూపమును కనుగొన్న వాడే సత్యముగా బ్రహ్మమును పొందినవాడనియు లేకున్నచో శాశ్వతముగ నష్టపోవునని చెప్పుచున్నది.

విశ్వరూప ప్రదర్శనము మహాతేజో దర్శనము. ఇది ద్రవ్యయజ్ఞము అయిన ఒక మహిమ. దీని కన్న జ్ఞాన యజ్ఞము గొప్పది. "శ్రేయా ద్రవ్యమయాత్‌" అని గీత. వసుదేవ పుత్రుని బ్రహ్మముగా తెలియుటయే బ్రహ్మ ప్రాప్తిని పొందును. "జ్ఞానావాన్మాం ప్రపద్యతే" అని గీత కదా. ద్వాదశాక్షరిలో కూడ "వాసుదేవ" శబ్దమే ఉన్నది. కృష్ణాది శబ్ధములు విశ్వరూపమునకు కూడ అన్వయించును. విశ్వరూపము ఆకర్షించునని చెప్పవచ్చును గదా. కానీ, వసుదేవ పుత్రుడను శబ్దము విశ్వరూపమునకు సమన్వయించదు. విశ్వరూపము వసుదేవునికి పుట్టినది కాదు కదా. "పరం భావమజానన్తః" అని గీత. ఈ వాసుదేవుడే జననమరణాది అనిత్య ధర్మములను కలిగి, పరమితుడై , అదే సమయమున అనాద్యమృతనిత్యుడై అనంతుడగుట చేత ఈ విచిత్ర తత్త్వమగు మాయను అర్ధము చేసుకొనలేని మూఢజనులు వాసుదేవుని నిర్లక్ష్యముగ చూచి పరాభవింతురు. దీనికి కారణము అసూయయే. ఈ అసూయ ఒకసారి సున్నా వచ్చి, మరి యొకసారి వందగా హెచ్చును. కావున అసూయ నిత్యనాశనము పొందినపుడే చిత్తశుద్ధి పూర్తియగును. అప్పుడే అసలు సిసలైన బ్రహ్మ స్వరూపము బోధకెక్కును. కావున చిత్తశుద్ధి లేనిదే జ్ఞానాధికారము లేదని శంకరులు అన్నారు. ఇట్టి వాసుదేవుని నరునిగా ఇంద్రాది దేవతలు, ఉదంకుడు మొదలగు ఋషులు సైతము తెలియక భ్రమలో పడినారు. కావున దేవతలు సైతము బ్రహ్మమును తెలియజాలరని యముడు నచికేతనునికి బోధించెను. నరుడు అనగా "నరీయతే" అను అర్ధము ప్రకారము నిత్యుడు అని అర్ధము. నారాయణడు నిత్యుడు కావున నారాయణుని నరుడు అనవచ్చును. కావున నరనారాయణ తత్త్వమును ఒకే పరబ్రహ్మము యొక్క లక్షణము. నారాయణుడనగా జ్ఞాన స్వరూపుడని అర్ధము. నరనారాయణుడనగా నిత్యమైన జ్ఞానస్వరూపుడని అర్ధము. నిత్యమనగా అంతములేనిది. అనగా అనంతము. నిత్యమే సత్యము కావున సత్యమైన అనంతమైన జ్ఞాన స్వరూపమే బ్రహ్మము. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి. ఈ విధముగా నరనారాయణ తత్త్వములు అవినాభావములు. అనగా వేరు చేయలేనివి. సూర్యుని యొక్క కాంతి, వేడి, అను రెండు లక్షణములను ఒక దాని నుండి యొకటి వేరు చేయుటగాని, సూర్యుని నుండి విడదీయుట గాని చేయలేము. ఇవి ఒక్క రూపాయి యొక్క రెండు తలముల వంటివి. నారాయణుడు ఎప్పుడును నరస్వరూపుడే ఇది కృష్ణుని గురించిన తత్త్వము. ఇక కృష్ణుని ప్రక్కనే ఉన్న అర్జునుడు కేవలము నరుడు. అనగా జీవుడు. జీవుడును తాను ధరించిన స్ధూల శరీరముతో పోల్చినచో నిత్యుడే. అంతే కాని నారాయణుని వలె నిత్యుడు కాడు. జీవుడు సృష్టికి పూర్వము లేడు. జీవుడు పరాప్రకృతి యనబడు సృష్టిలోని భాగము. కావున కేవలము స్ధూల శరీరము దృష్ట్యా మాత్రమే నిత్యుడు. "అజో నిత్యః హన్యమానే శరీరే" అని గీత చెప్పుచున్నది. అనగా స్ధూల శరీరము నశించినను జీవుడు నశించడు కావున జీవుడు నిత్యుడు అని చెప్పుచున్నది. కావున నారాయణుడు నరుడే కాని, నరుడు నారాయణుడు కాడు.

వజ్రము ఘన పదార్ధము. కాన ఘన పదార్ధములన్నియు వజ్రములు కావు. ఘన పదార్ధములలో శ్రేష్టమైనది వజ్రము. ప్రతి వర్గములోను నేనే శ్రేష్టుడను అని విభూతి యోగములో గీతలో స్వామి చెప్పినాడు. మనకు కనపడు ఈ సర్వ సృష్టి వస్తువుల యందు చైతన్యము కల ప్రాణి జడముల కన్నను శ్రేష్టమైయున్నది. ఆ ప్రాణులలో నరుడు మరింత శ్రేష్టుడు కావున స్వామి నరుడై యున్నాడు. ఐతే అందరు నరులు స్వామియని అర్ధము కాదు. ఉదాహరణకు "వైనతేయశ్చ పక్షిణం" అన్నారు స్వామి. అనగా పక్షులలో గరుత్మంతుడను అని అర్ధము. గరుత్మంతుడు పక్షియే కాని ప్రతి పక్షి గరుత్మంతుడు కాదు. ప్రతి పక్షి గరుత్మంతుడైనచో సర్వ పక్షులును నేనే అని చెప్పియుండెడివాడు. నారాయణుడు పురుషుడు. కాని ప్రతి పురుషుడు నారాయణుడు కాడు. "పురి, దేహే, శేత ఇతి పురషః" అనగా శరీరమును ధరించిన వాడు పురుషుడు అని అర్ధము. కావున నారాయణుడును శరీరధారియే కాని శరీరధారులందరు నారాయణులు కాదు. పురషులలో ఉత్తముడు నారాయణుడు కావున పురుషోత్తముడనబడుచున్నాడు. గీతలో "ప్రకృతిం పురుషం చైవ" అని శ్లోకములో సృష్టి ప్రకృతి పురుషుడు. సృష్టికర్త యగు పరమాత్మ అని చెప్పబడినది. ఇంత మాత్రమున ప్రతి పురుషుడు అనగా ప్రతి జీవుడు పరమాత్మ యని భావించురను సంశయమును నివారించుటకు "ఉత్తమ పురుషన్తన్యః పరమాత్రే త్యుదాహృతః అతోస్మి లోకే వేదేచ ప్రధితః పురుషోత్తమః" అని చెప్పబడినది. అనగా పురషులలో ఉత్తముడగు పరమాత్మ మామూలు పురుషుని కన్నను వేరు. కావున పురుషోత్తముడు అను దీని భావము. పురుషోత్తమ శబ్ధములో పురుష శబ్ధము ఆయన యొక్క బాహ్యమైన నరస్వరూపమును సూచించుచున్నది. ఉత్తమ శబ్ధము పరమాత్మయైన అంతఃస్వరూపమును సూచించుచున్నది. ఈ రెండునూ విడదీయలేని తత్త్వములు. విద్యుత్‌ తీగెలో ప్రవహించు సమయమున తీగె నుండి విద్యుత్‌ను వేరు చేయలేము. ఈ ప్రకరణమున శంకర, రామానుజ భాష్యములు ఇట్లున్నవి. శంకర భాష్యము ఇట్లు చెప్పుచున్నది. ప్రకృతి - పురుషుడు అను రెండు తత్త్వములున్నవి. ప్రకృతియే సృష్టి. పురుషుడే సృష్టికర్త యగు పరమాత్మ. ఈ పురషుడే ఉత్తముడు కావున పరమాత్మ యనబడుచున్నాడు. ఈ శంకర భాష్యమును శిష్యులు అపార్ధము చేసుకున్నారు. ప్రకృతి యనగా సృష్టి. పురుషుడు అనగా జీవుడు. ప్రతి జీవుడు పరమాత్మయే అని అర్ధమును తీసినారు. కాని శంకరుల హృదయము అది కాదు. అయన జీవులను పరాప్రకృతిగా, ప్రకృతిలోకే అనగా సృష్టిలోకే త్రోసివేసినారు. ఇక్కడ ఆయన చెప్పు పురుష శబ్ధము పురుషునిగా అనగా జీవునిగా కనిపించు పరమాత్మయే. జీవ శబ్దము కూడా పురుష శబ్దము వలె పరమాత్మకు అన్వయించ వచ్చును. అప్పుడు జీవ రూపమున కనిపించు పురుషోత్తముడే జీవుడని చెప్పవచ్చును. అపుడు "జీవో బ్రహ్మైవ" అనుట సత్యమే. ఈ అపార్ధమును నివృత్తి చేయుటకే శంకరులు మరల రామానుజుడుగా అవతరించి పురుషోత్తమ తత్త్వమును వివరించినాడు. పురష శబ్దము చేత ప్రతి పురుషుడు పరమాత్మ అనుకుందురేమో అను సంశయమును నివారించుటకు స్వయముగా గీతయే పురుషుల కన్న భిన్నుడు పురుషోత్తముడు అని "ఉత్తమ పురుషస్యన్యః" అని చెప్పుచున్నది. కనుక బాహ్య రూపమే పురుషుడు అంతస్వరూపమే పురుషోత్తముడు. బాహ్య రూపమే పక్షి. అంతస్వరూపమే గరుత్మంతుడు. అన్ని గద్దల వలే గరుత్మంతుడును ఒక గద్దయే. కాని ఆ గద్దలలో ఒక గద్ద మాత్రమే గరుత్మంతుడు. ఇదే పురషోత్తమ తత్త్వము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment