గురు దత్త నామములో గురు శబ్దము జ్ఞానమునకు దత్త శబ్దము దానమునకు నిలచియున్నది. జ్ఞానమే వేదము. వేదమే విద్య. విద్య యొక్క ఫలమే వినయము. మరియు జ్ఞానము సత్వగుణము వలన పుట్టును. "సత్వాత్ సంజాయతే జ్ఞానం" ప్రకారముగా జ్ఞాన కారణమే సత్వగుణము. సత్యగుణము యొక్క తత్వము అహంకారరాహిత్యమే. అనగా వినయమే. కావున గురుదత్త శబ్ధము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది. రజోగుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్టల కొరకు స్వార్ధముతో కూడి యుండును. కాని గురుదత్తుని తత్త్వము గుప్తదానమైయున్నది. అనగా దానము చేసి తన పేరును బయిటకు రానీయకుండుట. ఇదే సాత్విక వినయము. ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను, ఏ మహిమ జరిగినను దాని యొక్క కర్త గురుదత్తుడే. కాని ఆయన తన పేరును రానీయక వాటి కీర్తి ప్రతిష్టలను దేవతలకును భక్తులకును ఇచ్చుచున్నాడే తప్ప తన పేరును ప్రకటితము కావించుటలేదు. లక్ష్మణుడు మూర్ఛపోవగా రాముడు ఏద్చుచున్నాడు. హనుమంతుడు సంజీవి పర్వతమును తెచ్చి లక్ష్మణుని బ్రతికించినాడు. ఇచ్చట రాముని శక్తియే హనుమంతుని ద్వారా సంజీవిని పర్వతమును తెచ్చినది. ఆ కీర్తి తనకు రాకుండా ఆడిన నాటకమే లక్ష్మణ మూర్ఛ సమయమున రాముడు అసమర్ధునిగా విలపించుట జరిగినది. తనకన్న హనుమంతుడు గొప్పవాడని రామాంజనేయ యుద్ధమున నిరూపించి ఆ కీర్తి ప్రతిష్టలను హనుమంతునికి బలవంతముగా అంటకట్టి తాను గుప్తముగా యున్నాడు. అనగా స్వామి తన శక్తిని హనుమంతునకు గుప్తదానము చేసినాడు. ఇదే దత్త తత్త్వము. దత్త సేవకులును దత్త సేవ చేయునపుడు తాము స్వామికి సహకరించినా మన్న భావమును కలిగియుండక తమ పేరు ప్రతిష్టలు ఆశించక సేవ చేయవలెను. అట్టి గోరంత సేవకే దత్తుడు కొండంత ఫలము నిచ్చును. అట్లుకాక తమ పేరు ప్రతిష్టలను సేవను చేసినచో కొండంత సేవకు గోరంత ఫలమునే దత్తుడు ఇచ్చును. నిజముగా నీవు చేసిన సేవ ఒక సత్కర్మ. సత్కర్మను ఎప్పుడును దత్తుడే చేయును. కావున నీ ద్వారా దత్తుడు చేసిన ఈ సత్కర్మ యొక్క పేరు ప్రతిష్టలు దత్తునకే చెందవలెను. కావున నీ సేవను జనులు ప్రశంసించునపుడు "నేను నిమిత్తమాత్రుడను స్వామియే నా ద్వారా ఈ మహత్తర కార్యమును చేసినాడు. నేను తీగెను మాత్రమే. నేను ఫ్యానును తిప్పలేదు. నా ద్వారా ప్రవహించు కరెంటు మాత్రమే ఫ్యానును తిప్పినది అని చెప్పవలెను. ఇట్లు నీవు చెప్పుటలో అసత్యమేమియు లేదు. ఆ పనిని నీవే చేసి నీ యొక్క వినయము వలన దాని కీర్తిని స్వామికి ఇచ్చుచున్నానని భావించకుము. ఏలననగా అట్లు నీవు భావించినచో అది అసత్యమే కదా.
కావున నీవు వినయముతో పలుకుచున్నను అది సత్యమేనని గ్రహించుము. ఏలననగా కొందరు ఇట్లు పలుకుచు తమ వినయమునకు తామే మురిసిపోవుదురు. ఇది వినయము అన్న ముసుగులో దాగిన అహంకారము. కావున త్రికరణ శుద్ధిగా దత్తుడే చేసినాడని పలుకుము. ఇచ్చటనే వినయముతో మాట్లాడు వారు కూడ అహంకార సర్పము యొక్క నోట పడుచున్నారు. దీనినే సాత్విక అహంకారమందురు. అనగా నేను అహంకారము లేనివాడను అని అనుకొను అహంకారము. నిజముగా దత్తుడే చేసినపుడు దత్తుడే చేసినాడని చెప్పుటలో నీవు ఎందుకు పొంగి పోవుచున్నావు. నీ పొంగుకు కారణము నిజముగా నేను చేసిన పనిని నా వినయగుణము వలన దత్తునకే కీర్తిని అంటకట్టుచున్నాను అని భావించుట తెల్లని పాలగ్లాసులో యున్న చిన్న నల్లని నలుసు కణము వలె అహంకారము సంచరించుచున్నది. దీనినే ఆత్మాహంకారము లేక ఆత్మాభిమానము అందురు. ఇక రెండవది రాజసాహంకారము. ఇందులో దేహమే నేను అను అధ్యాస భావముతో ఈ దేహము యొక్క బలము శక్తి నేను అని భావించి నేను ఈ సత్కర్మను చేసినానని తన కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడుటయే రాజసాహంకారము. ఇక మూడవది తామసాహంకారము. ఇందు దేహము యొక్క శక్తియే కాక తన ధనము తన బంధువులు మొదలగు వారి శక్తి మొదలగు వాటి శక్తిని కలుపుకొని భావించుట. ఈ మూడు అహంకారములు లేని జీవుడే అత్రి. కావున రాజస తామస అహంకారములు లేకపోయినను శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ తానని భావించి ఆ ఆత్మ శక్తితో తాను చేసినానని తలచు సాత్వికాహంకారము కూడ దాటి తన ఆత్మ యొక్క ఈశ్వరుడగు పరమాత్మ యొక్క శక్తిచేతనే తాను చేసినానని తలచిన గాని అత్రి తత్త్వము సిద్ధించదు. కాని ఈనాడు అనేకులు తాము దత్తావతారములమని చెప్పుకొనుచు తమ తమ ఆశ్రమములగు రాజ్యములను నిర్మించుకొనుచు దత్తుడు తమ ద్వారా చేసిన సత్కర్మలను, మహిమలను తామే చేసినామని చెప్పుకొనుచు అనేక విధములుగా చిట్ట చివరి కీర్తికాంక్ష యను మహాకాల సర్పము యొక్క నోటిలోపడి పరమపదసోపాన పటమున జారి క్రిందకు పడుచున్నారు. వీరు 99 మార్కులు తెచ్చుకొని చిట్టచివరి ఒక్క మార్కులో పరీక్ష తప్పినవారు. భక్తులు వీరి చుట్టును చేరి నీవే పరబ్రహ్మవు అని గాలి పంపును కొట్టుచున్నారు. దానికి కారణము వారి స్వార్ధమే. ఒక మాహాత్ముడు తన శక్తిచేత ఒకరి రోగమును పోగొట్టినాడు. ఆ శక్తిని ఉపయోగించి తన రోగమును కూడ పోగొట్టుకొనవలెనని దాని కొరకు ఆ భక్తుడు ఆ మహాత్ముని ఆశ్రయించి నీవు పరమాత్మవు అని ప్రశంశించుచున్నాడు. మొదట మౌనముగా యుండి ఆ మహాత్ముడు అర్ధాంగీకారము తెలుపుచున్నాడు. ఆ తరువాత భక్తుల సంఖ్య పెరిగిన కొలది ఆ మహాత్ముడు నేనే దత్తావతారమని పదిమందిలో ప్రకటించుచున్నాడు. ఆ తరువాత మాయపొరలు దట్టము కాగా ఈ తరములో నేనొక్కడినే దత్తావతారమని ప్రకటించుచున్నాడు. కృష్ణుడు కూడా తాను పరమాత్మను చెప్పుకున్నాడు. కాని తాను పరమాత్మనని ఎప్పుడును అందరి ఎదుట మైకులో ప్రకటించలేదు. కేవలము అర్జునునకు మాత్రమే ఏకాంతముగా గీతాబోధ సమయమున అర్హుడైనందున ప్రకటించియున్నాడు. కావున అర్హత లేనివారికి, దత్తుడు ఎప్పుడును తాను దత్తుడనని ప్రకటించడు. అట్లు తనను తాను ప్రకటించినపుడు దానిని అర్ధము చేసుకొని అంగీకరించుటకు ఎన్నో జన్మల తపస్సు వలన కలిగిన చిత్తశుద్ధి కావలయును. అట్టివాడు కోటాను కోట్లలో ఒకడుండును.
"కచ్చిన్‌మాం వేత్తి తత్త్వతః" అని గీతలో చెప్పినాడు. ఎన్నో జన్మల తపస్సు వలన చిత్త శుద్ధుడై జ్ఞానియైన ఏ ఒక్కడో ఈ వాసుదేవుని కుమారుడే పరబ్రహ్మమని గ్రహించు వాడు మహాత్ముడనియు అట్టివాడు ఈ లోకములో దుర్లభుడనియు స్వామి గీతలో "బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః" అని గీతలో చెప్పినారు స్వామి. కావున కోటాను కోట్ల జీవులలో ఏ ఒక్కనికో ఏకాంతమున ప్రకటించవలసిన ఆత్మ రహస్యమును ఈనాడు నకిలీ అవతార పురుషులు మైకులలో వేలాది భక్తుల ముందు ప్రకటించుచున్నారు. దీనిని బట్టియే వీరు దత్తావతారులు కాదనియు చాలా ఎత్తుకు పోయిన ఉన్నత సాధకులనియు చిట్ట చివరిలో కీర్తి కాంక్షయను ఒక్క మారులో దత్త పరీక్షలో తప్పిన జీవులనియు పరమాత్మ జ్ఞాన సంపన్నులగు జ్ఞానులు తెలియుదురు. పామరులు నూటికి ఒక్క మార్కు తెచ్చుకున్న వారినే దత్తుడనుచున్నారు. ఇక 99 మార్కులు తెచ్చుకొని ఒక్క మార్కులో తప్పిన వారిని దత్తునిగా ఏలభావించరు? కాని పరమాత్మ జ్ఞానమును నిశితముగా క్షుణ్ణముగా కలిగిన పండితులు ఈ స్వల్ప లోపమును కనిపెట్టగలరు. పరమాత్మను గురించిన పరిపూర్ణ జ్ఞానమే పండా అని చెప్పబడుచున్నది. పండాను కల్గిన వాడే పండితుడు. వజ్రము యొక్క లక్షణములను సంపూర్ణముగా తెలిసిన నిపుణుడు మాత్రమే నకిలి వజ్రముల నుండి అసలు వజ్రమును వేరు చేయగలడు. ఇది సామాన్య మానవులకు సాధ్యము కాదు. దత్తుడెప్పుడును గుప్తముగనే యుండును. తనను తాను ఎప్పుడును ప్రకటించుకొనడు. కారణము తన సత్యమైన తత్త్వమును ప్రకటించినచో గ్రహించ గలవాడు ఈ సృష్టిలోలేడు. ఏలననగా దేవతలు బ్రహ్మర్షులు సహితము సాత్వికాహాంకారమును దాటలేక ఉన్నారు. సాత్వికులగు దేవతలు అసురులను జయించినప్పుడు తమశక్తి చేతనే జయించినామని ఉత్సవములు చేసుకొనుచున్నారు. అందులో సురపతి యగు ఇంద్రుడు తమ యొక్క ప్రాధాన్యతను భావించుకొనుచున్నాడు. అప్పుడు వారి ఎదుట ఒక పెద్ద యక్షరూపము గోచరించినది. యక్ష రూపమనగా మహా తేజస్సు. అప్పుడు దేవతలు దాని వద్దకు పోయినారు. ఆ తేజస్సే కరెంటు. ఈ దేవతలే తీగెలు. దీనిని తెలియచెప్పుటకే దత్త పరబ్రహ్మము ఒక మహా తేజస్సు రూపములో సాక్ష్కాత్కరించినది. అగ్నిని "నీ శక్తి ఏమి" అని ఆ తేజస్సు ప్రశ్నించినది. "నేను అన్నింటిని కాలుస్తాను" అన్నాడు అగ్ని. అప్పుడు ఎండిపోయిన ఒక గడ్డిపోచను అగ్ని ముందు పడవేసి దీనిని కాల్చమన్న అగ్ని ఎంత ప్రయత్నించినను, దానిలోకి కనీసము వేడికూడ ఎక్కలేదు. ఇట్లు దేవతలందరును దత్త పరీక్షలో ఓడిపోయినారు. చివరిలో అహంకారము ఎక్కువ మోతాదులో ఉన్న ఇంద్రుడు వచ్చినాడు. ఆ ఇంద్రునితో మాటలాడుటకు కూడా తిరస్కరించి ఆ తేజస్సు అదృశ్యమైనది. అప్పుడు ఇంద్రుడు బాధపడుచుండగా ఆ దత్తుని సహధర్మచారిణి అగు ఉమ గోచరించి ఆ తేజస్సు పరబ్రహ్మ మని చెప్పినది. అప్పుడు ఇంద్రుడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా గుర్రమును నడుపు శక్తి ఆ పరబ్రహ్మమేనను జ్ఞానము తలకెక్కినది. సర్వకర్మలను చేయు శక్తి పరమాత్మయే. కాని దుష్కర్మలను జీవుల యొక్క సంకల్పముల వలన చేయుచుందురు. సత్కర్మలు మాత్రము స్వసంకల్పము చేత చేసి తన భక్తులకు ఆ కీర్తి నిచ్చుచుండును. కావున అహంకారములను మూడింటిని దాటి అత్రియైన ఒకానొక జీవునకు మాత్రమే దత్తుడు తనను తాను ప్రకటించుకొనును. ఏలననగా ఆ ఒకానొక జీవుడు ఒకానొక సమయమున మాత్రమే ఆ అత్రి తత్త్వమును నిలుపుకొనగలుగు చున్నాడు. అర్జునుడు గీతాబోధ సమయమున మాత్రమే ఆ పరమాత్మ తత్త్వమును గ్రహించినాడు. పద్దెనిమిదో రోజు సాయంకాలమునకే మరల అహంకారమునకు వశుడై జారిపోయినాడు. కావున దత్తుడెప్పుడును అధమాధమ రూపములలో కనపడుచూ తన ఆత్మ తత్త్వమును మాయతో కప్పుకొనియే క్రీడించు చుండును. ఆత్మ తత్త్వమును ప్రకటించుటకు ఇష్టము లేకకాదు. దానిని గ్రహించు యోగ్యత గలవాడు లేడు కావున.
At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad
No comments:
Post a Comment