శ్లో|| ఇంద్రియా దీనాం అగ్రాహ్యం బ్రహ్మ
కించిత్ గ్రాహ్యం ఆశ్రిత్య విద్యుత్
తంత్రీవ అద్వైతం వర్తతే||
తాత్పర్యం: ఇంద్రియాదులకు అందని పరబ్రహ్మము వాటికి అందు ఒకానొక పదార్ధమును ఆశ్రయించి తీగ యందు వ్యాపించిన కరెంటు వలె దాని కన్న వేరు కాక అద్వైతమై యుండును.
శ్లో|| "ఇహ చేత అవేదీక్ అధ సత్య మస్తి
న చేత్ ఇహవేదీత్ అవేదీత్ మహతి వినష్టిః
ఇహ చేదవేదీ దధ సత్య మస్తి నచేది వావేదీ న్మహతీ వినిష్టిః" అని శ్రుతి
దీనిని గ్రహించి మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమును బ్రహ్మముగా గ్రహించి ఉపాసించియు, వారు మరల తమ శరీరముతో సమానమైన మనుష్య శరీరము పై గల మాత్సర్యముతో మరల అద్వైతమును వదలి ద్వైతముగా చూచి అపార్ధమును ఆశ్రయించి ఆ నరావతారుని అవమానింతురు. ఇదే గీతలో శ్రీ కృష్ణభగవానుడు చెప్పినది.
శ్లో|| అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్||
తాత్పర్యము: నా పరతత్త్వమును తెలియని మూఢులు, సర్వ భూతములకు ప్రభువును మానవదేహమును ఆశ్రయించిన నన్ను అవమానించు చున్నారు. మనుష్య శరీరమును ఆశ్రయించిన పరమాత్మను గ్రహించినవాడే నిజముగా పరమాత్మను పొందుచున్నాడు. ఇంత కన్న వేరు మార్గము లేదు. కాన అట్టి నరాకారమును త్యజించిన వాడు మహానాశనమును పొందుచున్నాడు. బ్రహ్మము ఆశ్రయించు పదార్ధములలో శిలాది విగ్రహముల కన్ననూ సంభాషణ, సహవాసములను అనుగ్రహించు నరాకారమే పరిపూర్ణమైన ఆనందము నిచ్చును. కావున అత్యుత్తమము.
ఐతే పరబ్రహ్మమును గుర్తించు మార్గమేది? బ్రహ్మమును గుర్తించుటకు అష్టసిద్ధుల ప్రదర్శనము ప్రధానము కాదు. జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తంచు లక్షణము. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” జ్ఞాన సాగరుము ముందు అష్టసిద్ధులు అల్పాది అల్పములు. మండనమిశ్రుడు (సురేశ్వరులు) శ్రీ శంకరులను పరబ్రహ్మముగా గుర్తంచి జీవితాంతము శిష్యుడై సేవించుటకు కారణమేమి? అష్టసిద్ధుల ప్రదర్శనమా? కాదు. కాదు. ఆనాడు మండనమిశ్రుడు ఆబ్దీకము పెట్టుటకు జైమిని, వ్యాస మహర్షులను ఆ మంత్రణము చేయునప్పుడు, శంకరుల మూసియున్న తలుపులలోనుండి లోనికి ప్రవేశించుట అష్టసిద్ధుల ప్రదర్శనమే కదా! జైమిని, వ్యాసులకు ఆ ఆష్టసిద్ధులు క్రొత్తయా? వారేమి ఆశ్చర్యచకితులు కాలేదు. మరి మండనమిశ్రుడు ఆశ్చర్యచకితులైనారా? కాలేదు కాలేదు. పైగా “ఎవరు ఈ బొడి గుండు”అని శంకరులను సంబోధించినాడు గదా. కనుక పరబ్రహ్మమును గుర్తంచుటకు అష్టసిద్ధులు లక్షణము కానేకాదు. మరేమి? అంటే జ్ఞానమే లక్షణము. మండనమిశ్రుడు శ్రీ శంకరులతో 21 రోజులు నిర్విరామముగా జ్ఞాన చర్చ చేసి ఆనందించి, పరవశుడై, జైమిని, వ్యాసులు “భేష్ భేష్”అనగా ఆ జ్ఞానసముద్రములో మునక వేసి శంకరులను పరబ్రహ్మముగా గుర్తించి, శిష్యుడై సన్యసించి సురేశ్వరాచార్యులుగా జీవించియున్నంత కాలము శిష్యుడై సేవించితరించారు. కనుక జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తించుటకు లక్షణము.
No comments:
Post a Comment