‘‘మానవ సేవయే మాధవ సేవ’’ అను వాక్యము సరిగా అర్ధము చేసుకొననిచో చాలా ప్రమాదకరము. అన్నము, వస్త్రము, ఔషధములను ఆర్తులకు ఇచ్చుటయే సేవ కాదు. ఆర్తుడు స్వామిచే విధించబడిన తన పూర్వపాప శిక్షలను అనుభవించుచున్నాడు. నీవు వాని పూర్వ పాపములను చూడలేదు. ఇప్పుడు శిక్షలను చూచి కరుణించుచున్నావు. నీవు వానికి శాశ్వత సహాయమును చేయలేవు. వానికి జ్ఞానము, భక్తిని దానము చేసి భక్తునిగా మార్చినచో వానికి భగవంతుడే శాశ్వత సహాయము చేయును. కావున అన్నాది దానమే సేవ కాదు. నీ అన్నమును భుజించినవాడు పాపములను మరల చేసినచో ఆ పాప భాగమును నీవు పొందెదవు. నీవు వానికి అన్నాదులతో పాటు జ్ఞానమును, భక్తిని కూడా దానము చేసినచో అట్టి కార్యము దైవ కార్యము కావున నీవు చేసినది మానవ సేవయే. ధనవంతులకును జ్ఞానము, భక్తిని దానము చేయుము. దారిద్ర్యము అనగా డబ్బు లేకపోవుటయే కాదు. జ్ఞానము, భక్తి లేక పోవుట కూడా. అన్న దానము ఈ దేహముతో నశించుచున్నది. జ్ఞానము, భక్తి లేనిచో జీవుడు శాశ్వతముగా పశు-పక్షి జన్మలయందు పడుచున్నాడు.
ఈ వాక్యము యొక్క అసలు అర్ధము వేరు. మానవుడు మాధవునిగా అవతరించినప్పుడు మానవునిగా కనిపించును. అట్టి వానిని ఆయన స్వభావమైన ఆనందప్రదమైన జ్ఞానము చేత గుర్తించి ఆయనను సేవించినచో అట్టి ఆ మానవుని సేవ మాధవ సేవ అగునని అర్ధము. స్వామి కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయనను కొందరు మానవునిగా, మరికొందరు మాధవునిగా భావించినారు. కావున ఇది ఒక క్లిష్ట సమస్య అయినది. కరెంటు, లోహపు తీగను వ్యాపించినట్లు మాధవుడు ఆ మానవ శరీరమును వ్యాపించినాడు. కరెంటు, తీగవలె మానవుడు, మాధవుడు ఇద్దరు ఉన్నారు. ఈ సమస్యను శంకరాచార్యులు చర్చించి ఇద్దరూ ఉన్ననూ ఒక్కరే ఉన్నట్లు గ్రహించవలయునని అద్వైత సిద్ధాంతమును చేసినారు. కరెంటు, తీగ రెండూ ఉన్ననూ తీగను ఎచ్చట తగిలిననూ కరెంటు షాకు కొట్టుచున్నది. కావున తీగయే కరెంటు. ఈ విధముగా అవతరించిన మానవ శరీరమే మాధవుడు. కృష్ణుని స్పృశించినచో పరమాత్మను స్పృశించినట్లే. కాని ఈ సిద్ధాంతమును మానవులు వక్రముగా సర్వ మానవులకు విస్తరించి మానవుడే మాధవుడు అన్నారు. అందుకే శంకరులు కరిగిన సీసమును తాగి శిష్యులను కూడా తాగమని సత్యమును బోధించినారు. అనగా శంకరులే దైవము. కాని శిష్యులు కారని నిరూపించినారు. ప్రతి మానవుడు మాధవుడైనచో ఇంక ఈ సాధన ఎందులకు? అనగా మాధవునకు మోక్షము కావలయునా? ప్రహ్లాదుడు తన తండ్రిని కూడా మాధవునిగా ఏల అంగీకరించలేదు? నరసింహుడు హిరణ్యకశిపుడు ఇరువురును మాధవులే అయినచో నరసింహుడు హిరణ్యకశిపుని చంపినప్పుడు మాధవుని చంపినందున మాధవుడు ఆత్మహత్య చేసుకున్నాడా?
నాదో సందేహం. నా సందేహం తీర్చేముందు బ్లాగు నిర్వహించుచున్నది స్వామిజీనా లేక వారి తరుపున శిష్య బృందమా అనేది నేను తెలుసుకోగోరుతున్నాను.
ReplyDeleteDear Sir,
ReplyDeleteనా పేరు దుర్గాప్రసాదు. I am a Swamiji follower. With his permission, I am posting his discourses in this telugu blog. There is an exlusively other site for english like
http://www.universal-spirituality.org
"అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును" అంటారు స్వామి.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad