దేవదేవుడైన దత్తుడు పవిత్ర సద్గుణవంతుడైన పండితునిగా దర్శనమిచ్చును. ఒక్కొక్క సారి మద్యపాన వేశ్యాలోలునిగా దర్శనమిచ్చును. దీని ద్వారా స్వామి సద్గుణవంతులు కాని దుర్గుణవంతులు కాని తనను చేరవచ్చునని సూచించుచున్నాడు. బ్రహ్మ రజో గుణము. విష్ణువు సత్త్వగుణము. శివుడు తమో గుణము. ఈ త్రిమూర్తుల ముఖములతో ఉన్న పరమాత్మ సర్వ గుణములతో చేరి ఉన్నాడని అర్ధము. సగుణ బ్రహ్మము అనగా అన్ని గుణములతో చేరి ఉన్న బ్రహ్మము అని అర్ధము. ఈ త్రిగుణములలో ఉన్న రజస్సు, తమస్సు దుర్గుణములు. అనగా ఎక్కువ (2/3 వంతు) దుర్గుణవంతులే అని తెలియుచున్నది. విష్ణువు సత్త్వ గుణము కావున వైష్ణవులు విష్ణువును అత్యధికునిగా తలచుచున్నారు. వీరు బ్రహ్మను తక్కువ గాను, శివుని రాక్షస దైవముగాను నిందించుచున్నారు. ఈ త్రిగుణములు అనగా త్రిమూర్తులు స్వామి యొక్క మూడు రంగు వేషములే. స్వామి ఈ మూడు గుణములచేతను అంటబడుట లేదు. వేదము విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడని చెప్పుచున్నది. వేషధారియొక్క రంగు వేషములయొక్క రంగుల చేత మారుట లేదు.
సత్త్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమస్సు నలుపు. కావున విష్ణువు తెల్లగాను, శివుడు నల్లగాను ఉండవలయును. కాని వారి ఇరువురి రంగులు మారినవి. విష్ణువు నల్లగాను, శివుడు తెల్లగాను గాను ఉన్నారు. శివుడు సత్త్వగుణములతో శాంతముగా ధ్యానములో ఉన్నాడు. విష్ణువు తమోగుణముతో గోపికలతో క్రీడించుచున్నాడు. ఇప్పుడు చెప్పుము. ఎవరు గొప్ప? కావున త్రిమూర్తులలో ఉన్న దేవుడు ఒక్కడే. అతడే దత్తుడు. అతడు ఏ గుణములచేతను అంటబడడు. నిర్గుణ బ్రహ్మము అనబడుచున్నాడు. వస్త్రముల రంగుల వలన ఏ రంగూ లేని స్వామి ఎర్రగా, తెల్లగా, నల్లగా కనబడుచున్నాడు. ఈ దత్తస్వరూపము ద్వారా త్రిగుణములలో ఉన్న భక్తి గుణములచేత అంటబడదు అని చెప్పుచున్నది. భక్తి గుణముయొక్క రంగును కలిగినట్లుగా కనిపించుచున్నది. కాని భక్తి ఏ రంగూ లేక నిర్మలమైనది. అనగా సద్గుణవంతుడైననూ, దుర్గుణవంతుడైననూ మంచి మార్గము, లేక చెడు మార్గమున కాని భగవంతుని చేరవచ్చును. భక్తుని లోను మార్గములోను భక్తి ఉన్నప్పుడు అది ఏ గుణములను అంటని మహాశక్తి స్వరూపముగా ఉండును. తమోగుణములతో శివుడు తామసునిగా రాక్షసులను సైతము చెడు మార్గమున కూడా తనను చేరవచ్చునని సూచించుచున్నాడు. అట్లే సత్త్వగుణమగు విష్ణువు మంచివారుగా దేవతలు తనను సన్మార్గమున చేరవచ్చునని సూచించుచున్నాడు. అయితే విష్ణువే శివుడని మరచిపోకుము. రాక్షసులైనా, దేవతలైనా భక్తి సమానముగా ఉన్నచో ఒకే భగవంతుని చేరుచున్నారు. లోకశాంతికి భంగము కలిగించిన కారణమునకే స్వామి రాక్షసులను శిక్షించినాడు. స్వామి మూడు ముఖములు విశ్వముయొక్క సృష్టి, స్థితి, లయములను సూచించుచున్నవి. మూడు పనులను ఒకే ముఖము చేయుచున్నది అని వేదము చెప్పుచున్నది. కావున దత్తుడు పరబ్రహ్మము. త్రిమూర్తుల అవతారములగు మధ్వ, రామానుజ, శంకరులే గురుత్రయము. అనగా ఈ గురుత్రయమే గురుదత్తుడు. ఈ గురుత్రయము యొక్క మూడు భాష్యములలో ఉన్న ఏక సిద్ధాంతమే శ్రీదత్తవాణి.
దత్త భక్తి, ప్రతిఫలమును కోరక సత్యముగా, నిర్మలముగా ఉండవలయును. బిచ్చగాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగుడుచున్నాడు. నీవు వానిని పొమ్మనుచున్నావు. కాని నీ అతిథికి సర్వ సపర్యలను చేయుచున్నావు. ఇరువురిలో తేడా ఏమి? బిచ్చగాడు అన్నమును ఆశించి నీ వద్దకు వచ్చినాడు. అతిధి కేవలము నిన్ను చూచిపోవుటకు వచ్చినాడు. ఇరువురి లక్ష్యములు వేరు కావున వానిపై చూపబడిన నీ ప్రవర్తన కూడా వేరువేరగా ఉన్నది. కావున దత్తుని వద్దకు అతిథిగా రమ్ము. నీవు ఏ ప్రతిఫలమును ఆశించక దత్తుని వద్దకు వచ్చినచో అతిథికివలె నీకు దత్తుడు సర్వమునూ ఇచ్చును.
దత్త మతములోనికి ప్రవేశించిన తరువాత సాక్షాత్తు దత్తుడే నీకు జ్ఞానమును బోధించును. జ్ఞానము ద్వారా భక్తి కలిగి ఆ భక్తి నిస్వార్థమై కర్మఫలత్యాగముచే నిరూపితమైనచో దత్తకైవల్యము లభించును. ఈ మతములో ప్రత్యేకత ఏమనగా నీవు బ్రతికి ఉండగానే దత్తుడు నీలో లీనమై పోవును. అసలు దత్తుడు అనగా తనను తాను నీకు దత్తము చేసుకొన్న వాడని అర్ధము. దత్తమతము సముద్రము వలె ప్రత్యేకముగా ఉన్ననూ ఇతర మతములను నదులలో ఉన్న జలమే. నదులన్నియును సముద్రములో చేరవలసినదే. దత్త దిగంబరుడు అనగా అన్ని పాత్రల వేషములు తీసి తన సహజమైన వేషములో ఉన్నవాడని అర్ధము. అవధూత దత్త అనగా దత్తుని రుచి చూసినచో సమస్త జీవులతో మరియు సమస్త వస్తువులతో ఉన్న నీ బంధములన్నియు తెగి విసిరి వేయబడునని అర్ధము. దత్తుడనిగా తన భక్తులయొక్క పాప ఫలములను అనుభవించుటకు ఒక మనుష్య శరీరమును ఆశ్రయించి తనను తాను భక్తునకు దానము చేసుకొన్నవాడని అర్ధము. నీకు జరిమానా విధించినప్పుడు నీ ఆత్మీయుడగు నీ తండ్రి తాను కట్టి నిన్ను విడిపించును. పాపఫలములను నిజముగా అనుభవించవలయును. కావున దత్తుడు మనుష్య శరీరములను గ్రహించును. ఈ శిక్షను అనుభవించునప్పుడు తన శక్తిని ఉపయోగించి దత్తుడు బాధనుండి తప్పించుకొనడు. అట్లు తప్పించుకొన్నచో దత్తుడు ధర్మదేవుని మోసగించినట్లు అగును. కావున దత్తుడు ఆశ్రయించిన మనుష్య శరీరము బాధలను నిజముగా అనుభవించుటకై ప్రకృతి నియములను అనుసరించి ఉండును. ఈ అనుభవము నిరంతరము ఉండును. కావున స్వామియొక్క శరీరము త్వరగా దెబ్బ తినుచున్నది. ఆయన దివ్య దర్శనములను ఇచ్చినప్పుడు మహావిద్యుచ్ఛక్తి ఆ శరీరమునో ప్రవహించును. దాని వలన ఆ శరీరము మరింత దెబ్బ తినుచున్నది. నీవు కొద్ది కర్మఫలమునే అనుభవించవలెను. ఆయన అనేక భక్తుల కర్మలను అనేక జన్మలనుండి అనుభవించుచున్నాడు. నీవు బాధతో విలపించవచ్చును. కాని ఆయన నవ్వుచుండవలెను. భక్త కర్మఫలములను అనుభవించుట ఒక్క క్షణము ఆపిననూ ఆ క్షణములో ఆయన దత్తుడు కాదు. నీవు సింహాసనమును చూచుచున్నావే కాని ముళ్ళను చూచుటలేదు. దత్తుడనగా ఆచరణము. బ్రహ్మము అనగా అఖండానంద స్వరూపమైన భావము. బ్రహ్మము కాగానే దత్తుడు కావలసిందే. అద్వైతులు బ్రహ్మమును గురించి తెలిసిన వారు. కానీ వారు దత్తుని గురించి తెలుసుకొన్నచో దత్తసేవకులుగనే ద్వైతములో ఉందురు. చూపులకు, స్పర్శకు సంభాషించుటకు కలసి మెలసి జీవించుటకు వీలుకాని పరమాత్మ వాటిని భక్తులకు అందచేయుటకు మనుష్యాకారమున తనను తాను భక్తులకు అందచేసుకున్న వాడే దత్తుడు. దత్త మతములో ప్రవేశించుటకు కావలసిన అర్హత అగు ‘‘ప్రాణిగా పుట్టుటను’’ ప్రతి మానవుడు కలిగియే ఉన్నాడు. ఇతర మతములలో విధించబడిన ప్రవేశార్హత అగు ‘‘దుర్గుణములను వదలించుకొనుట’’ ఏ మానవుడును ఇంతవరకు చేయలేదు. ఇది అసాధ్యము. కావున ఎన్నటికిని చేయలేరు. దీని అర్ధము ప్రతి మానవుడునూ దత్తమతములోనికి పుట్టగానే ప్రవేశించియున్నాడు. మరియు ఇతర మతములలోనికి ఎన్నటికినీ ప్రవేశించలేడు. నీవు నిజముగా ఏ మతములో ఉన్నావో అట్టి విశ్వమతముయొక్క పేరును నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
No comments:
Post a Comment