శిష్యుల యొక్క సాధన స్ధితిని బట్టి ఏది చెప్పవలయునో ఎచ్చట ఆరంభించవలయునో, ఎచ్చట ముగించవలయునో, ఎట్లు చెప్పవలయునో శ్రీ దత్త్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియును. శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టును గురించి బోధింపడు. అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టునుండి భ్రష్టుడగును.ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము. ప్రత్యక్షమును తప్ప విశ్వసించని నాస్తికులగు బౌద్ధులకు ఎక్కడో పరోక్షమున వైకుంఠమున శ్రీ మన్నారాయణుడు ఉన్నాడు అని బోధించకూడదు. వానికి ప్రత్యక్షముగా అనుభవమునకు అందు వస్తువును చూపించి "ఇదే భగవంతుడు" అనవలయును. ఆ వస్తువు వీలగునంత వరకు భగవంతునుతో ఎక్కువ పోలిక కలగియుండవలయును. సృష్టిలో ఉన్న అన్ని పదార్ధములలోను అత్యంత శ్రేష్టమైన తత్త్వము చైతన్యము అనగా జీవుడు. కావున పరమాత్మ అసలు లేడు అను బౌద్ధులకు అత్యంత శ్రేష్టమైన చైతన్యమును చూపి ఇదియే పరమాత్మ అన్నారు శంకరుడు. చైతన్య తత్త్వము కొంత ఊహకు అందుచున్నది. కొంత అందుట లేదు. అన్నరసము యొక్క పరిణామము వలన ఏర్పడు అత్యంత సూక్ష్మ శక్తియే చైతన్యము. "అన్నాత్ పురుషః" అని శ్రుతి. అనగా అన్నము నుండి పురుషుడు పుట్టుచున్నాడని అర్ధము.అన్నము తినకున్నచో శరీరములోని చైతన్యము అస్తమించుచున్నది. ఇంత వరకు చైతన్యము తత్త్వము ఊహకు అందుచున్నది. ఇక ఊహకు అందని తత్త్వము ఏది అనగా ఒక జడపదార్ధములో అన్నరసమును పోయగా చైతన్యము పుట్టుటలేదు. ఈ విధముగా చైతన్యము ఊహకు అందుట, ఊహకు అందకపోవుట అను రెండింటి మధ్య సంధి స్ధానముగా యున్నది. ఊహకు అందుచున్నది కావున నాస్తికులు దీనిని అంగీకరింతురు. అనగా చైతన్యము ఉన్నదని చెప్పి చైతన్యమే భగవంతుడు అని చెప్పి కావున భగవంతుడు ఉన్నాడని నాస్తికులచేత అంగీకరింప చేయవచ్చును. ఇప్పుడు చైతన్యము యొక్క ఊహకు అందని విషయమును బోధించి భగవంతుడు ఊహకు అందడు అని చెప్పి వానిచేత క్రమముగా అంగీకరింప చేయవచ్చును. ఇట్లు శిష్యులు యొక్క స్ధితిని బట్టి బోధయుండును. అంతేకాని ఒక్కసారిగా నాస్తికునకు వైకుంఠవాసియగు విష్ణువును అర్చించమని చెప్పినచో వాడు అంగీకరించడు.
క్రమముగా బౌద్ధులు జీవుడున్నాడనియు జీవుడే అన్ని సృష్టి పదార్ధములకు గొప్పవాడు కావున భగవంతుడనియు విశ్వసించరి. ఈ నాస్తికులు ఆరాధన విధానములను నమ్మరు. తమకన్న గొప్పవాడగు భగవంతుడు ఉన్నాడని అంగీకరించరు. ఏలననగా వారిలో అహంకార మాత్సర్యములు అత్యధికముగ యుండును. కావున అట్టివారికి నీకన్న అధికుడైన భగవంతుడున్నాడని చెప్పినచో వాడు అంగీకరించడు. కావున వానికి జీవుడవైన నీవే పరమాత్మవని చెప్పవలయును. ఈ వాక్యము చేత వానిలోని అహంకార మాత్సర్యములు శాంతించును. పరమాత్మను పొందుటకు తపస్సు చేయమన్నచో వాడుచేయడు. కావున వానికి నీవే పరమాత్మవని తెలుసుకున్నంత మాత్రమున " పరమాత్మవు అగుదువు" అని చెప్పవలయును. నేనే బ్రహ్మమని తెలుసుకున్నంత మాత్రమున వాడు బ్రహ్మమగు చున్నాడు అను జ్ఞానమార్గముననే వానికి చెప్పవలయును. అట్లుకాక భగవంతుని పొందుటకు ప్రయత్నమును చేయవలయును అని చెప్పుటకు తనకన్న అధికుడైన భగవంతుడు వేరుగా ఉన్నాడని చెప్పవలెను. అట్లు చెప్పినచో అహంకార మాత్సర్యముతో భగవంతుడే లేడని వాడు పలుకును. కావున నాస్తికుడు శిష్యుడైనప్పుడు గురువుకు ఇంతకన్న వేరు మార్గము లేదు. నేవే బ్రహ్మము దానిని మరరచిపోయినావు అది తెలుసుకొన్నచో బ్రహ్మము అగుదువు అను అద్వైతమే అచ్చట ఏకైక శరణ్యము. దీనికి కారణము కూడా శంకరుల వారు ప్రతిపాదించినారు.భగవంతుడు చైతన్యస్వరూపుడు జీవుడును చైతన్యస్వరూపుడు కావున జీవుడే భగవంతుడు అని చెప్పినప్పుడు నాస్తికుల విషయమున ఆస్తికత్వము నిలచియుండును. శంకరులు బౌద్ధులకు బోధించిన సిద్ధాంతమిది. కావుననే ఆయనను "ప్రచ్ఛన్న బౌద్ధుడు" అన్నారు. అనగా శంకరుల అద్వైత మతము వేదాంతము ముసుగు ధరించిన బౌద్ధమతమే అని అర్ధము.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు
No comments:
Post a Comment