Thursday, October 15, 2009

భీముడు

ధర్మరాజు అర్జునుల కన్నను ఆంజనేయ అంశ గల భీముడు ఉత్తమ సేవకుడు. భీముడు వాయుపుత్రుడు. "వాయుర్వై ఛేపిష్టో దేవతా" అను శ్రుతి ప్రకారము వాయువు అనగా దేవతలలో శ్రేష్టుడైనవాడు అనగా దేవదేవుడైన శివుడే. కావుననే శివావతారము హనుమంతుడు. హనుమంతుడు, భీముడు, మధ్వుడు ఈ మువ్వురు వాయుదేవుని అవతారములని ప్రసిద్ధి. ధర్మరాజు సత్వగుణము. అర్జునుడు రజోగుణము. భీముడు తమోగుణము. శివుడును తమోగుణ స్వరూపుడని శాస్త్రము. రజస్సు బ్రహ్మ, సత్వము విష్ణువు, తమస్సు శివుడు. "జ్ఞానం మహేశ్వరాధి ఛేత్‌" అని జ్ఞాన కారకుడు శివుడే. తమోగుణము అజ్ఞానము. శివుడు ఆది గురువని ప్రసిద్ధి. గురువుకు జ్ఞానము అజ్ఞానము రెండు తెలియవలయును. ఏ అజ్ఞానము వలన శిష్యుడు పొరపాటు పడునో దానిని గురించి శిష్యునకు గురువు వివరించును. శిష్యుని దోషములను బట్టి వాటికి కారణమగు ఆ అజ్ఞానమును వివరించిన కాని వాడు వానిని దిద్దుకొన లేడు. కావున గురువు జ్ఞానముతో పాటు అజ్ఞానమును కూడా వివరించవలయును. అసలు అజ్ఞానమును గురించి తెలుసుకొని దానిని తొలగించినచో, నిర్మలమైన జ్ఞానము బావినీటిలో మురికిని తొలగించినచో అదే స్వచ్చమైన జలమైనట్లు అచ్చటనే జ్ఞానము ప్రకాశించునని శంకరులు చెప్పినారు. "మత్తః స్ముతిః జ్ఞానం ఆపోహనంచ" అను గీతా శ్లోకము కూడా నా నుండియే జ్ఞానమును అజ్ఞానమును గురించి తెలియవలయునని చెప్పబడినది. స్వామి కురుక్షేత్ర రణమును నిశ్చయించినాడు. రజోగుణముతో యున్న అర్జనుడు అహంకారముతో స్వామి నిర్ణయమునకు విరుద్ధముగా యుద్ధము చేయరాదని తర్కించి విరమించినాడు. స్వామి ఎంతో బోధించి విశ్వరూపము చూపినగాని మరల దోవకు రాలేదు. కాని భీముడు స్వామి నిర్ణయమునకు వ్యతిరేక తర్కమును చేయక స్వామి నిర్ణయించినదే ధర్మమని యుద్ధమునకు సిద్ధమైనాడు. కావున పరిపూర్ణ విశ్వాసము గలవాడు సంపూర్ణ శరణాగతి చేసినవాడు భీముడే. స్వామి ధర్మరాజును అశ్వర్ధామ మరణించమని అబద్ధమాడమన్నాడు. కాని అది అధర్మమని ధర్మరాజు నిరాకరించినాడు. స్వామికి ఇష్టమైనదే ధర్మము. స్వామికి ఇష్టము కానిది అధర్మము. అను మహాభావమే పరాభక్తి, కాన ధర్మజుని విశ్వాసము పరిపూర్ణము కాదు. కానీ భీముడు స్వామి అశ్వర్ధామ యని నామకరణము చేసిన శతృసేనలోని ఒక ఏనుగును చంపి ఆశ్వర్ధామ మరణించెనని ద్రోణాచార్యునకు చెప్పమన్నాడు.భీముడు దానికి ఎట్టి వితర్కము చేయక అట్లే చేసి, అట్లే చెప్పినాడు. కాని ద్రోణుడు నీమాటను నమ్మను ధర్మరాజు చెప్పినచో నమ్ముదును అన్నాడు. మరల స్వామి ధర్మరాజును బ్రతిమిలాడగ ధర్మరాజు ససేమీరా అన్నాడు. సరే! చివరకు అశ్వర్ధామ యను గజము చంపబదెను అని అయినా అనమన్నాడు. ధర్మరాజు అట్లే అన్నాడు. అశ్వర్ధామ మరియు చంపబడెను అను రెండు శబ్ధముల వున్న "అను ఏనుగు" అను శబ్ధము వినబడకుండా పాంచజన్యమును పూరించినాడు. అప్పుడు ద్రోణునకు అశ్వర్ధామ చంపబడెను అను రెండు శబ్ధములే వినిపించినవి.

సత్వగుణ ప్రధానుడైన ధర్మరాజు ఇంత మొండిపట్టు ఏల పట్టినాడు? అట్లే అర్జునుడు 18 అధ్యాయములు గీత చెప్పు వరకును ఎందుకు మొండిగా కూర్చున్నాడు? ఆ మొండితనము భీమునిలో ఏలలేదు? అర్జునుడు రజోగుణము, ధర్మరాజు సత్వగుణము అన్నాము. రజో గుణము, సత్వగుణము ఉన్న వారిలో లోక జ్ఞానము ఎక్కువగా యుండును. వారిలో వారికి కనిపించని అహంకారము, అసూయ ఉండును. స్వామి చెప్పినట్లు వినవలయునా? అన్న అహంకారము అట్లు వినుటకు స్వామి గొప్పదనము ఏమున్నదిలే అన్న అసూయ వారికి తెలియకుండానే వారిలో ఉండును. కాని తమోగుణము కలవారికి లోకజ్ఞానము ఉండదు. కావున అహంకారము అసూయ వారిలో ఉండదు. స్వామికి తాను బానిస వంటి వాడినని సంపూర్ణమైన ప్రపత్తి భావము ఉండును. కావున అజ్ఞానము చాలా అవసరము. కాని దేని యొక్క అజ్ఞానము, లోకము యొక్క అజ్ఞానము. నీలో లౌకికము ఎంత ఎక్కువగా యుండునో నీవు స్వామి అంత దూరముగా యున్నావని తెలియుము. నీలో లౌకిక జ్ఞానము ఎంత తక్కువగా యుండ, అజ్ఞానిగా ఛాంధసునిగా ఎంత ఎక్కువగా యుండువో నీవు స్వామికి అంత సమీపమున ఉందువు. అమాయకుడగు బిడ్డ వెంట ఎప్పుడు తండ్రి యుండును. లోకవ్యవహార సమర్ధుడగు బిడ్డకు దూరముగా యుండును. రజోగుణములోను, సత్వగుణములోను అతి తెలివి ఎక్కువగా యుండును. తమోగుణియగు భీముడు లౌకిక శూన్యుడు. స్వల్పమైన జ్ఞానము మాత్రమే ఉన్నది. అది ఏమనగా పరమాత్మ కృష్ణునిగా అవతరించియున్నాడు. ఆయన ఆజ్ఞ శిరోధార్యము, ఆయన సేవయే కర్తవ్యము. ఇంతే అతడిలో స్వార్ధము, అహంకారము అసూయ లేనేలేవు. అదే నిజమైన సేవకుని లక్షణము. సేవకునకు అతితెలివి, ఎక్కువగా తర్కించుట పనికిరావు. గోపికలు కూడా పూర్వజన్మలో బ్రహ్మర్షులై యుండిరి. వారు మహా జ్ఞానులు సత్వగుణ సంపన్నులు కాన వారికి తన ఆలింగనము నీయ స్వామి నిరాకరించెను. వారు చదువులేని పామరులుగా పాలుపెరుగు అమ్ముకొను అజ్ఞానులుగా పుట్టి పురష అహంకారము కోల్పోయి స్త్రీ వినయముతో ఉన్నప్పుడే స్వామి వారితో రాస క్రీడ సల్పి వారిని తరింపచేసినారు. "అతర్క్యః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా స్వామిని గురించి ఎట్టి వితర్కము, విమర్శ మనస్సులో కూడా రాకూడదు. "నైషాతర్కెణ మతిరాపనీమ్‌" అను శ్రుతి కూడా మానవ మేధస్సు ఎంత తర్కించినను ఆయనను అర్ధము చేసుకొనలేమని చెప్పుచున్నది. ఆయన స్వతంత్రుడు, ఆయన సంకల్పమే ఈ సృష్టి, ఆయన ఇష్టమే ధర్మము, ఆయన చెప్పినదే వేదము, ఆయన నడచినదే మార్గము అను విశ్వాసము పరిపూర్ణముగా యుండుటయే పరాభక్తి. అహంకారము, అసూయ అను రెండు చీడపురుగులను వదిలించుకున్న చాలును. ఆయన మన చేతికి చిక్కినట్లే. స్వామి ఎల్లప్పుడును ఒక మానవ శరీరముతోనే ఈ భూమిపై నున్నాడనియే మహా వాక్యముల తాత్పర్యమని తెలిసినవాడే పండితుడు. "పండా" గలవాడె పండితుడు. "పండా" అనగా పరమాత్మ జ్ఞానమని అర్ధము అనగా పరమాత్మను గురించిన సత్యమైన జ్ఞానము.

1) "ఇహచేదదేతీత్‌" అను శ్రుతి ఈ లోకమున ప్రతితరములోను నరాకారమున ప్రత్యక్షమగుచున్న పరమాత్మను గుర్తించిన వాడే ఆస్తికుడనియు అట్లు గుర్తించక పరోక్ష భ్రమ ఉన్నవాడు శాశ్వత నష్టము పొందునని చెప్పుచున్నది.
2) "మానుషీంతను మాశ్రితమ్‌" అనుగీత నేను ఎల్లప్పుడు మనుష్య శరీరమునే ఆశ్రయించి యున్నాను. నన్ను మూఢులు తెలుసుకోలేరని చెప్పుచున్నది.
3) "యత్సాక్షాత్‌" అను శ్రుతి కూడా పరమాత్మ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పుచున్నది.
4) "ప్రజ్ఞానం బ్రహ్మ" అను మహావాక్యము ఆయన ప్రశస్త వేదాన్త జ్ఞానము గల పండిత గురువు అని చెప్పుచున్నది. ప్రజ్ఞానము ఎక్కువగా కలవాడు"ప్రజ్ఞాని" అని కాకుండా "ప్రజ్ఞానము" అనియే అనబడును. ఇది వ్యాకరణ శాస్త్ర సంప్రదాయము.
5) "అయమాత్మ బ్రహ్మ" అను మహావాక్యము ఇడుతో బ్రహ్మము జీవ రూపమున ఉన్నాడని చెప్పిచున్నది.
6) "తత్త్వమసి శ్వేతకేతో" అను మహావాక్యము ఓ శ్వేత కేతూ! ఆ పరమాత్మ నీ వలె మనిషిగా ఉన్నాడని చెప్పుచున్నది.
7) "అహం బ్రహ్మస్మి" అను మహావాక్యము అవును నేనే బ్రహ్మమును. నరరూపమున ఉన్నాను అని చెప్పుచున్నది.
8) "జీవభూత స్సనాతనః" అను గీత - ఆ సనాతనుడు ఒక జీవునిగా మారివున్నాడు అని చెప్పుచున్నది.
9) "జీవభూతాం మహాబాహో ఎ ఎదం ధార్యతే జగత్‌" అనుగీతా శ్లోకము నేను ఒక సామాన్య జీవ రూపమున ఉన్నను ఈ సర్వ జగత్తును ధరింయున్నాను అని చెప్పుచున్నది. మనుష్యరూపమున ఉన్న కృష్ణుడు సర్వజగత్తును ధరించి యుండుట విశ్వరూపము ద్వారా నిరూపించినాడు. ఆ మనుష్య రూపము పసిబాలునిగా అల్ప ప్రమాణముతో ఉన్నను జగత్తును ధరించియే ఉన్నానని యశోదకు తన నోటిలో సమస్త జగత్తును చూపెను.

At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాద్

No comments:

Post a Comment