Monday, October 19, 2009

తర్కము

గీత చెప్పినవాడు కృష్ణుడు. భాగవతము కృష్ణుని జీవిత చరిత్ర. కావున గీతా శ్లోకములను గీతా శ్లోకముతో సమన్వయించవలెను. అంతే కాని మానసికములైన శుష్క తర్కములతో సమన్వయించరాదు. ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో అర్జునుడును పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మము సర్వజ్ఞుడు గదా. మరి అర్జునుడు పరబ్రహ్మమును ప్రశ్నలను ఎట్లు వేసినది? విశ్వరూపమును చూచి ఏల గడగడ వణికెను? ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో శంకరులు మాత్రమే ఏల కరిగిన సీసమును త్రాగెను. మిగిలిన శిష్యపరబ్రహ్మములు ఏల త్రాగలేకపోయిరి? సరె! దత్తుడు ఏల నిత్యము మనుష్య రూపమున ఉన్నాడు? దీనికి కారణము -దత్తుడనగా దానము. అనగా త్యాగము. దత్తుడు ఎల్లప్పుడును తన భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవించి నిత్యసుఖములను కలుగచేయుచున్నాడు. అయితే భక్తుల చేత వారి దుష్కర్మ ఫలమును నూటిలో ఒకపాలు మాత్రమే అనుభవింప చేయుచున్నాడు. ఏలననగా కర్మ చేసినవాడు ఆ మాత్రమైనను అనుభవించక పోవుట పరమ దారుణమైన అన్యాయము. ఐతే భక్తులు ఆ ఒక్క పాలును కూడా అనుభవించు ఓర్పులేక నా వంద రూపాయిల జరిమానాలో 99 రూపాయిలు కట్టి ఒక రూపాయిని మాత్రము ఏల కట్టాలని దత్తుని నిలదీయుచున్నారు. అట్టి వారు కృతఘ్నులు. స్వార్ధ దుర్గంధముతో కూడిన మురికి గుంటలు. అట్టి వారి మాయరోగమును దత్తుడు బాగుగనే కుదుర్చుచున్నాడు. ఎట్లు అనగా వాడు కోరినట్లే వారి దుష్కర్మ ఫలమును 100 పాళ్ళు తీసివేయుచున్నాడు. ఆ వంద రూకల జరిమానాను మరుజన్మకు త్రోయుచున్నాడు.
మరుజన్మలో వడ్డీ పెరిగి అట్టివాడు రెండువందల రూకల జరిమానాను కట్టుచున్నాడు. ఇది అంతయు తెలియక తన దుష్కర్మ ఫలమును తాను మహాభక్తుడు కావున దత్తుడే అనుభవించినాడనియు లేక తన దుష్కర్మ ఫలమును నిశ్శేషముగా దత్తుడు రద్దు చేసినాడనియు తలచుచున్నాడు. ఈ విధముగా వారి జ్ఞానము అజ్ఞానముచే ఆ వృతమైనందున భ్రమలో పడుచున్నారని "అజ్ఞాని ఆవృతం జ్ఞానంతేన ముహ్యంతి జంతవః" అని గీత చెప్పుచున్నది. కాని సాధకులైన సద్బక్తులు లేకపోలేదు. అట్టి వారి కష్ట నివృత్తిని ఎప్పుడును యాచింపరు. వారికి కష్ట నివృత్తి ఎట్లు జరుగునో తెలియును. దానిని దత్తుడు అనుభవించి భాధపడునని వారికి తెలియును. ఇప్పటి కష్టములనే కాక రాబోవు జన్మలలోని కష్టములను కూడా ఇప్పుడే ఇమ్ము త్వరగా అనుభవింతుమని దత్తుని ప్రార్ధింతురు. వారి ఉద్దేశమేమనగా, అన్ని దుష్కర్మ ఫలములను ఇప్పుడే అనుభవించినచో దత్తుడు గ్రహించి భాధపడు అవకాశము ఎప్పటికిని ఉండదు గదా అని. ఇంత నిర్మల ప్రేమ స్వరూపులైన సద్బక్తుల రాబోవు దుష్కర్మ ఫలములను కూడా వారు కోరినట్లే ఇప్పుడే దత్తుడు ధ్వంసము చేయును. కాని ఎట్లు? వారి యొక్క ఇప్పటి రాబోవు దుష్కర్మ ఫలములనన్నింటిని ఇప్పుడే తాను అనుభవించి వారిని శాశ్వతముగా పాప విముక్తులను చేయుచున్నాడు. కావున నీలో అణుమాత్రమైనా స్వార్ధము లేనిచో నీ సర్వ దుష్కర్మల ఫలమును ఇప్పుడే అనుభవించి నిన్ను నిత్య ముక్తునిగా చేయుటకు నీ సర్వ దుష్కర్మ ఫలములకు ఆత్మను అర్పణము చేసుకొని అనగా దానము చేసుకున్నందున దత్తుడనబడుచున్నాడు. అయితే దత్తుడు సర్వ శక్తిమంతుడు గదా. కావున సర్వ దుష్కర్మ ఫలములను ఒక్కసారిగా అనుభవించగల శక్తిని కలిగియున్నాడు అనుకొనుట పొరపాటు స్వామి ధర్మ దేవునితో చేసుకొన్న ఒప్పందము ఏమి అనగా "నా భక్తుల దుష్కర్మ ఫలములను నేను సామాన్య మానవ శరీరము ద్వారా నరుడెంత భాధపడునో అంత భాధను నేను అనుభవించుచు నా దివ్యశక్తిని ఉపయోగించక నేను అనుభవించెదనని " స్వామి ప్రమాణము చేసియునన్నాడు. కర్మ ఫలములను అనుభవించియే తీరవలయును. "అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ" అనునదే ధర్మదేవుని మూల సూత్రము - తన సేవకుడు భక్తుడు అగు ధర్మదేవుని శాసనమునకు భంగము కలుగకుండా స్వామి నిరంతరము శాశ్వతముగా తనను తానే బలి పశువుగా చేసుకున్నాడు. ఇదే "అభధ్నన్‌ పురుషం పశుమ్‌" అను శ్రుతికి అర్ధము. అనగా పురుషుడగు పరమాత్మను బలిపశువుగా బంధించిరి అని అర్ధము. కావున నీ సర్వ దుష్కర్మ ఫలములను ఒకేసారి ఇప్పుడే అనుభవించగల శక్తి దత్తావతార నరావతారమునకు లేదు. కావున ఒక్కొక్కటి ఒకటి తరువాత మరియొకటిగా అనుభవించవలెను. ఇట్లు ఎందరో సద్బక్తులను విముక్తులను చేయవలయును. అందుచేతనే శ్రీ దత్త పరబ్రహ్మము నిరంతరము శాశ్వతముగా నరరూపములతో ఈ లోకముననే అవతరించి సంచరించవలసియున్నది. కావున పరోక్షముగ ఏదియును లేదనియు అంతయు ప్రత్యక్షముగా ఇచ్చటనే ఉన్నదనియు పరబ్రహ్మ జీవునిగా ఇచ్చటనే ఉన్నాడనియు శంకరులు చెప్పినారు. ఆ జీవుడు ఎవరో కాదు. అప్పుడు అవతరించిన శంకరులే. కావుననే "అహం బ్రహ్మాస్మి" అని చెప్పియున్నారు. కరిగిన సీసము త్రాగి ప్రతి జీవుడు బ్రహ్మము కాదని నిరూపించియూ యున్నాడు.

కావున "పవిత్రాణాయసాధూనాం" అనగా సద్భక్తుల రక్షణము కొరకు నేను ప్రతియుగమున అవతరించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రతి మనుష్య తరమున అవతరించుచున్నానని అర్ధము. యుగము అనగా సంవత్సరము. చాలా ఎక్కువ సంవత్సరముల సమూహము కృతయుగమము మొదలను, తక్కువ సంవత్సరముల సమూహము మనుష్యతరము. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరము అవతరించుచున్నానని కూడా అర్ధము చెప్పవచ్చును. ఆ మనుష్య తరమున ఎందరి సద్భక్తుల దుష్కర్మ ఫలములననుభవింపవలయునో భాధను ఓర్చుకొను మనష్య శక్తి పరిమితముగా ఎన్ని మానవ శరీరములు తీసుకొనవలయునో స్వామి నిర్ణయించి అవతరించును. ఒకే సమయమున అనేక దత్తావతారములుండవచ్చును. ఒకే సమయమున శిరిడి సాయి, అక్కలకోట మహరాజ్‌ ఉన్నారు. నేను దత్తుడను అనుటయే అవివేకము. ఏలననగా తీగెలో ప్రవహించు విద్యుత్‌ ఫంకాను త్రిప్పుచుండగా తీగె నేను విద్యుత్‌ను నేనే ఫ్యానును త్రిప్పుచున్నాను అనుటయే అజ్ఞానము. ఇక ఒకేసారి నాలుగు తీగెలలో ఒకే విద్యుత్‌ ప్రవహించుచు ఒక తీగె ద్వారా ఫ్యాను త్రిప్పుచు, ఒకే తీగె ద్వారా లైటును వెలిగించుచు, ఒకే తీగె ద్వారా రెడియోను మ్రోగించుచు మరియొక తీగె ద్వారా ఉష్ణయానకమును వేడెక్కించుచూ ఉండగా ఫ్యానుకు అమరియున్న తీగే నేను మాత్రమే విద్యుత్తుననియు మిగిలిన తీగెలు మామూలు తీగెలేననియు వాగినట్లు నేను ఒక్కడనే దతత్తావతారుడను అని చెప్పు పౌండ్రక వాసుదేవుని అజ్ఞానము పరాకాష్టకు చెందినట్లుండును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment