సాధన అనగా నేమి? సాధన యనగా మంత్రమును జపించుట అని కొందరు, ధ్యానమును చేయుట అని మరి కొందరు, పూజలు చేయుట అని మరి కొందరు తలచుచున్నారు. ఇట్లు పలు విధములుగా తలచుచున్నారు. కాని వీటి వలన భగవంతుడు లభించును గాని, లభించిన భగవంతుడు నిలువజాలడు. ఇవి అన్నియును మనము స్వామిని పిలుచుట. పిలువగనే స్వామి వచ్చుచున్నాడు. కాని మన ఇంటిలోనికి రాగానే దుర్భరమైన కుళ్ళు కంపు కొట్టుచున్నది. దానికి మనము అలవాటు పడినాము. అది లేకుండ మనము జీవించజాలము. బురద గుంటయే పందికి పన్నీరు సరస్సు కాని ఆ బురద గుంట లోనికి మానవుడు ప్రవేశించగలడా? ఇక్కడ మన ఇల్లు అనగా మన శరీరము అని అర్ధము. మనము పిలువగనే మన శరీరము లోనికి దత్తుడు ప్రవేశించుచున్నాడు. దానికి ఎన్నోసార్లు జపము అక్కరలేదు. ఒక్కసారి నామోచ్చారణము చాలును. ఎన్నో సంవత్సరముల దానము అనగా తపస్సు అక్కరలేదు. ఒక్క క్షణము స్మరించిన చాలును దత్తుడు నీలో ప్రవేశించును. కాని ప్రవేశించిన వాడు నిలువలేకయున్నాడు. కారణము నీలో ఉన్న కంపు. ఆ కంపు నీలో ఉన్న మూడు బురద గుంటల నుండి వచ్చుచున్నది. ఆ మూడు గుంటలే అసూయ, అహంకారము, స్వార్ధము. ఈ మూడింటిని ఒక్క పరమాణువు మాత్రము కూడా లేకుండా తుడిచి వేయవలెను. అసూయ పోగానే అనసూయవగుదువు. ఏ జీవుడైనను అనసూయ కావచ్చును. ఇందు స్త్రీ పురుష బేధము లేదు. ఏలననగా జీవులందరును ప్రకృతి స్వరూపులగు స్త్రీలే. మాత్సర్యము యొక్క మరొక పేరే అసూయ. అసూయ పోగానే అనసూయ యైన జీవునిలోనికి దత్తుడు ప్రవేశించును. దత్తుడు అనసూయా గర్భస్తుడనుటలో అంతరార్ధమిదే. ఈ మూడు వరుసగా రజోగుణ, తమోగుణ, సత్వగుణములు. అసూయ తమోగుణము. అసూయ పోగానే తమోగుణి పతియగు శివుడు నీలోనికి ప్రవేశించును. తరువాత అహంకారము రజోగుణము. అహంకారము పోగానే రజో గుణాధిపతియగు బ్రహ్మ నీ లోనికి ప్రవేశించును. స్వార్ధము సత్వగుణము. దీనిలో మంచి చెడులు రెండును ఉన్నవి. లోకములోని వస్తువులను వ్యక్తులను నీవి నీవారు అనుకొనుట చెడు భాగము. ఏలననగా అవి, వారు అనిత్యములు ఈ జన్మ కాగానే ఈ జీవుడు వేరు వేరు జీవుల బంధములోనికి పోవుచున్నాడు. ఒక నటుడు ఒక సినిమా షూటింగ్ బంధముల నుండి మరియొక సినిమా షూటింగ్ బంధములోనికి పోవుట వంటిదే. కాని అన్ని షూటింగ్‌ల యజమాని యగు సినిమా నిర్మాతతో బంధము నిత్యముగా యుండును. అట్లే అన్ని జన్మములలోను జీవునకు సృష్టినిర్మాతతో బంధము నిత్యముగా యుండును. కావున అనిత్య బంధములు వదలి స్వామి నా వాడు అనుకొనుటలో విషయము స్వార్ధములో మంచి భాగమై యున్నది.
ఐతే స్వామి నా వాడు మాత్రమే అనుకొనుటలో మరల ఈ మంచి భాగము చెడు భాగమగుచున్నది. కృష్ణుని తన వాడుగా పోందుటకు సత్యభామ తన బంగారంతయు త్యజించినది కాని ఓడిపోవుటకు కారణము స్వామి నా వాడు మాత్రమే అనుకొనుట. కావున లోకబంధములన్నింటిని త్యజించి "స్వామి నా వాడు" అనుకొనుట మంచిదే. కాని స్వామి నాకు మాత్రమే దక్కవలయును అనుకొనుట తప్పు. రుక్మిణి స్వామి నా వాడు మాత్రమే కాదు అష్టభార్యలందరుకిని సమముగా దక్కవలయునని భావించినది. కావున సత్యభామ ఓడి రుక్మిణి గెలిచినది. కాని రుక్మిణి కూడా రాధ చేతిలో ఓడిపోయినది. రుక్మిణి అష్టభార్యలకు మాత్రమే స్వామి దక్కవలయును అనుకొనినది. కాని రాధ 16000 గోపికలకు దక్కవలయునని అనుకొన్నది. రాధకన్న మీర ఇంకనూ గొప్పది. స్వామిని గురించి సర్వ జీవులకు ప్రచారము చేసి, స్వామి సర్వజీవులకు దక్కవలయునని భావించినది. కావుననే స్వామి పూరీ జగన్నాధ దేవాలయములో మీరను సశరీరముగా తనలో ఐక్యము చేసుకున్నాడు. ఇట్టి సశరీర కైవల్యమును, రుక్మిణి, సత్యభామ, రాధలకు ఇవ్వలేదు. అట్లే శంకరాచార్యుడు సర్వజీవులు తరించవలయునని దేశమంతయును సంచరించి జ్ఞాన ప్రచారము చేసినాడు. కావున హిమాలయములోని దత్తాత్రేయగుహలో అదే సశరీర కైవల్యమును ఇచ్చినాడు. కావున దానము లేనిదే దత్తుడు లేడు. స్వార్ధము పోందే దత్తుడు రాడు. అహంకారము పోనిదే అసూయ పోదు. అసూయ పోనిదే అహంకారము పోదు. మీరా, శంకరులలో అసూయ పరమాణువు కూడా లేదు. వారితో మనము పోల్చుకున్నచో ఎంత దూరములో ఉన్నామో ఆలోచించుడు.
మీ ఇంటిలో కరెంటు పోయినదా అని ఎదురివారు అడుగగనే ఎదురువారిని మీ ఇంటిలో కూడా పోయినదా అని అడుగుదుము. వారింటిలో కరెంటు పోయిన వీరికి ఆనందము. మన యింటిలో కరెంటు పోయి ఎదురు వారింటిలో ఉన్నచో మన ముఖము అప్పుడే మండును. మన అసూయను పోగొట్టుటకు స్వామి ఒక్కొక్క నరావతారమున వచ్చి కొందరిని ఎన్నుకొని వారిని శుద్ధిచేయుటకు ఆరంభించును. మన మంచి కోసము ఆయన ప్రయత్నమును మనము గుర్తించము. మనము ఏమి మాట్లాడిన తప్పులు పట్టుచున్నాడని ఆయనను మనము నిందింతుము. శ్రీ రామ అన్నచో బూతుమాట అగుచున్నదే అని ఆయనను ఆక్షేపింతుము. కాని ఆయన మనలను పరిపూర్ణముగా శుద్ధిచేసి, మనలోనికి ప్రవేశించ తలచినాడని గుర్తించము. ఇట్లు ఆక్షేపించుటలో కారణము మన అహంకారము. స్వార్ధము పోవుట ఇంకనూ కష్టము.
ఒకసారి హనుమంతుడు శ్రీ రామునకు చామరముతో విసురు చున్నాడు. అక్కడ వున్న వానరుడు ఇట్లు తలచినాడు. ఈ మాత్రము సేవ నేను చేయలేనా? అని అనుకున్నాడు. శ్రీ రాముడు వెంటనే హనుమంతుని ఆపి ఆ వానరుని పిలచి ఆ చామరమును వానరున కిచ్చి విసర మన్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత గాలి మందగించి ఉక్కపోయుట ఆరంభించెను. వానరుని చేతిలోని చామరము కొంచెము పైకి లేచెను. అనగా తనకు స్వామికి గాలి వచ్చునట్లు విసరుచున్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత ఇంకా మందగించినది. ఉక్కపోయుట ఎక్కువైనది. అప్పుడు వానరుడు తన వరకే విసురుకొనుచున్నాడు. అప్పుడు స్వామి వాని వైపు చూచి చిరునవ్వు చిందించినాడు. ఇదే పరీక్షను హనుమంతునికి కిష్కింద గుహలో పెట్టినాడు. హనుమంతుని శరీరమంతయు చెమటలు కారుచున్నది. చామరము స్వామికి మాత్రమే విసరుచున్నాడు. దీని అర్ధమేమి? కావున అసూయ, అహంకారము, మమకారమనెడి స్వార్ధము ఈ మూడు నీలో నుండి పోయినపుడే త్రిమూర్తులు నీలోనికి ప్రవేశించుదురు. కాని త్రిమూర్తులకు మూలవిరాట్టు యైన దత్తుడు ప్రవేశించవలెనన్నచో నీవు దానమును ప్రారంభించవలెను. అనగా స్వామి నుండి నీవు పోందిన జ్ఞానాన్ని సర్వజీవులకు అందించి, వారు ఆనందించు చుండగా నీవు ఆనందించు సిత్ధికి రావలయును. ఇట్టి త్యాగము లేక దానము చేతనే దత్తుడు ప్రవేశించి స్ధిరముగ నిలచును. స్వామి నరాకారమున వచ్చినపుడు నీ విశ్వాసములోని లోపము చేతనే ఆయన నిన్ను పూర్ణముగా బాగు చేయలేక యున్నాడు. స్వామియే అను విశ్వాసము ఏర్పడిన తరువాత మరల స్వామి కాడేమో అని సంశయము వచ్చును. దీని వలన శ్రద్ధ తగ్గి అశ్రద్ధ ఏర్పడును. మరల ఒకవేళ స్వామి అయినచో అన్న అనుమానము వచ్చును. ఈ విధముగా విశ్వాసము ఊగులాడుట చేతనే యోగిరాజు నుండి నీవు యోగమును పూర్ణముగా పొందలేకున్నావు. విశ్వాసము యోగమునకు మూలాధారము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad
No comments:
Post a Comment