Monday, November 30, 2009

ఏ జీవుని ఆక్షేపించకుము

సాధకుని యొక్క గొప్పతనము అతడు చేసిన సాధన యొక్క గొప్పతనము మీద ఆధారపడియుండును. ఆ సాధన యొక్క గొప్పతనము ఆ సాధకుడు పొందిన ఫలము యొక్క గొప్పతనము పై ఆధారపడి యొండును. ఒకడు సాధించిన ఉద్యోగము యొక్క హోదా జీతమును పట్టి అతడు చదివిన చదువును నిర్ణయించి వచ్చును. ఆ చదువు యొక్క గొప్పతనము బట్టియే అతని గొప్పతనముండును. ఈ సృష్టిలో పరమాత్మ నుండి అత్యుత్తమ ఫలమును పొందిన సాధకులు ఇద్దరే ఇద్దరు. వారు హనుమంతుడు, రాధ. హనుమంతుడు 14 లోకముల యొక్క ఆధిపత్యమును సృష్టికర్త, సృష్టిభర్తగా, సృష్టిహర్తగా పొందినాడు. ఈ లోకములే సృష్టి. రాధ 14 లోకముల పైన పరమాత్మచే ప్రత్యేకముగా సృష్టించబడిన 15 లోకమగు గోలోకమునకు ఆధిపత్యము పొందినది. ఇంతకు మించి ఫలములు లేవు. కావున ఇరువురిని మించిన సాధకులు లేరు. కావున ఆ ఇరువురి సాధనను మించిన సాధన లేదు. అయితే ఆ ఇరువురికి అనుగ్రహించిన ఫలములలో తారతమ్య మున్నది. ఒకరిని హైస్కూలుకు హెడ్‌మాస్టర్‌గా చేసినాడు. మరి యొకరిని హైస్కూలుకు పైనున్న కాలేజ్‌కి ప్రిన్సిపాల్‌గా చేసినాడు. అనగా 14 లోకముల అధిపత్య పదవియే హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే గోలోక ఆధిపత్యము. హనుమంతుడు పరమాత్మను నిలదీశినాడు. పరమాత్మ హనుమంతుని బుజ్జగించుచు "హనుమా! నీ రాజ్యము 14 లోకములు. రాధ రాజ్యము ఒక్క లోకమే గదా అన్నాడు. కాని బుద్ధిమంతులలో వరిష్టుడుగు హనుమంతుడు దీనిని అంగీకరించలేదు. 2000 మంది విద్యార్ధులు గల హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి కన్నను 200 విద్యార్ధులు గల కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే ఎక్కువ. హెడ్‌మాస్టర్‌ జీతము కన్నను ప్రిన్సిపాల్‌ జీతము ఎక్కువగా యుండును. ఈ రెండు పదవులలో పెద్ద తారతమ్యము లేకపోయినను రాధ యొక్క పదవియే హనుమంతుని పదవి కన్న కొంచెము ఎక్కువయని పరమాత్మ అంగీకరించక తప్పలేదు. అప్పుడు హనుమంతుడు "స్వామీ! లంకలో నా తోక మండుచున్ననూ ఇంత బాధపడలేదు. ఇప్పుడు నీవు చేసిన పనికి నా కడుపు మండుచున్నది అన్నాడు. కావున హనుమంతునకు కారణము వివరించక తప్పలేదు". స్వామి ఇట్లు వివరించినాడు.

"బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన హనుమా! నిన్ను మభ్యపెట్టుట స్వామికి కూడా తరము కాదు. కావున సావధానముగా ఆలకించుము. సముద్రమైన నన్ను ఒక నది నేరుగా వచ్చి చేరుచున్నది. మరియొక నది వంకరులుగా తిరిగి చేరుచున్నది. కాని నేరుగా వచ్చునది అహంకారముతో వంకరలుగా వచ్చునదిని చూచి ఆక్షేపించుచున్నది. ఈ ఆక్షేపణము చేయకున్నచో నేరుగా వచ్చు నది త్వరగానే చేరును. ఇందు ఎట్టి సందేహము లేదు. కాని అహంకారముతో రెండవ నదిని ఆక్షేపించినందులకు సముద్రుడగు పరమాత్మ యొక్క సంకల్పము చేత మొదటినదికి అడ్డముగా మానవులు ఆనకట్టను కట్టిరి. మొదటినది యొక్క జలములన్నియును పొలములకే మరలింపబడి ఒక్క చుక్కయైనను సముద్రమునకు చేరలేదు. నీవును ఇదియే పొరపాటు చేసియున్నావు. నేను రామావతారము తరువాత కృష్ణావతారము నెత్తితిని. నేను చేయు అల్లరి పనుల వలన నీ విశ్వాసము సడలి నన్ను గుర్తించలేకపోయినావు. అందుకే నన్ను దర్శించుటకు నీవు ఎప్పుడును రాలేదు. ఈ కృష్ణుడు పరమాత్మ కాదని భావించినావు. కాని భగవద్దూషణమునకు భగవంతుడు ఎట్టి పాప ఫలమును అందించడు. హిరణ్యకశిపుడు నన్ను నిందించినను నేను వానిని దండించలేదు. కాని నా భక్తుడైన ప్రహ్లాదుని జోలికి వెళ్ళి నందున హిరణ్యకశిపుని దండించితిని. కావున భగవదపచారము కన్నను బాగవత అపచారము గొప్పది. ఒక భక్తుడు ఇతర భక్తుల పై ఎట్టి ఆక్షేపణలు చేయరాదు. నీవు రాధను, గోపికలను చూచి ఆక్షేపించినావు. ఈ భక్తులు అధర్మవర్తనులు. వీనిని భగవంతుడు అధర్మమునే ప్రోత్సహించుచున్నారు" అని నా భక్తులగు గోపికలను చులకనగా చూచినావు. కావున నా వద్దకు నీవు రాలేదు. ఐతే కౌరవసభలో నేను ప్రదర్శించిన విశ్వరూపమును చూచి, నన్ను చేరి నా కార్యమగు ఆ యుద్ధమున సాయపడినావు.

"ఏ యధామాం ప్రపద్యన్తే తాం స్తదైవ భజామ్యహం మమ వర్మాను వర్తన్తే మనుష్యాః పార్ధ సర్వశః" నన్ను ఎవరు ఏ భావమున ఇష్టపడుదురో ఆ భావములోనే వారిని నేను సమీపించెదను. భావములో ఎట్టి గొప్పదనము లేదు. భావములో యున్న ప్రేమయను బరువును చూడవలెను. నీవు నన్ను దాస భావమున ఆరాధించినావు. రాధ, గోపికలు నన్ను ప్రియ భావమున ఆరాధించినారు. దాస భావము కన్నను ప్రియ భావము గొప్పది కాదు. చిలుక యైనను, గాడిద యైనను పంచదార బరువును పట్టియే ధర పలుకును. ఒక వేశ్య ఒకనిని ప్రియ భావమున సేవించుచున్నది. దాని దృష్టి యంతయు వాని ధనము పైనే యున్నది. కావున ఈ భావము ఈ ఉదాహరణములో గొప్పది యుగుచున్నదా? నీవు నీ యజమాని అగు సుగ్రీవుని వద్దకు పోయి నీవు సుగ్రీవుడికి దాసుడవై యున్నను "నేను రామునకు దాసుడను అని చెప్పినచో అతడేమి చెప్పును".

నిజమే నేనును రామునకు దాసుడనే కావున రామునికి దాసుడగుటలో అభ్యంతమేమున్నది? నీవు అని పలుకును. ఇట్లే పరమాత్మను తండ్రిగా, సోదరునిగా, గురువుగా భావించిన వారు వారి తండ్రులకు, వారి సోదరులకు, వారి గురువులకు చెప్పినచో వారును హర్షింతురు. కాని రాధ యొక్క అవతారమగు మీరాబాయి యొక్క భర్తకు మీరాబాయి కృష్ణుడే నా భర్తయని చెప్పినప్పుడు మీరాబాయి యొక్క భర్త ఆమెను విషమునిచ్చి హింసించినాడే తప్ప నిజమే జగద్భర్తయగు కృష్ణుడు నాకును భర్తయే అని చెప్పలేదు. మీరాబాయి సమయములో కృష్ణుడు కేవలము విగ్రహముగా యున్నాడు. కాని గోపికలు యున్న సమయములో కృష్ణుడు నరాకారమున ఉన్నాడు. కాని గోపికలు వారి భర్తలకు ఇదే సమాధానము నిచ్చినారు. వారిచే ఎంతో హింసించబడినారు. కావున ఆ గోపికలు ఆ గోపికల నాయకురాలగు రాధ ఎంత గొప్పవారో ఆలోచించుము. అంతే కాదు వారు బృందావమునకు వచ్చినప్పుడు నేను కూడా వారికి బోధించినాను. "ఓ గోపికలారా! మీకేమైనా పిచ్చి పట్టినదా? మీ గృహములనను, పతిపుత్రులను, తల్లితండ్రులను, భాంధములను త్యజించచి ఈ అర్ధరాత్రి నా వద్దకు వచ్చినారు. ఒకవేళ వారు నిద్రించుచున్న మీరు శిక్ష తప్పించుకున్నను చిత్రగుప్తుని, యమధర్మరాజును తప్పించుకొన లేరుగదా! ధర్మ శాస్త్రమున మీకు ఏమి శిక్ష విధించబడునో మీకు తెలియునా? ఇనుముతో తయారు చేసిన కృష్ణ విగ్రహములను ఎర్రగా అగ్నిలో కాల్చి ఆ విగ్రహములను ఆ లింగనము చేసుకొనునట్లు యమదూతలు చేయుదురు. కావున మీ తమోగుణమును వదలి ఇండ్లకు పొండు అని చెప్పితిని. దానికి వారు మందహాసములను చేసి "కృష్ణా! నీవు చెప్పిన శిక్షను మేము సంతో్షముగా స్వీకరింతుము. కాని నిన్ను విడజాలము" అని అన్నారు. కావున నా కొరకు ఎట్టి శిక్షలను అయినా అనుభవించుటకు సిద్ధపడిన ఆ గోపికల ప్రియ భావములో వారి ప్రేమ భారమును చూడుము. కిలో పంచదారతో చేయబడిన గాడిద బొమ్మ యొక్క ధర అరకిలో పంచదారతో చేయబడిన చిలుక కన్న ఎక్కువ పలుకును. కనుక భారము ప్రధానము కాని చిలుక కాదు. కావున నన్ను ప్రియునిగా భావించుటలో గొప్పతనము రాలేదు. ఆ భావములో వారికి కల భక్తి యొక్క బరువు వలన విలువ వచ్చినది. భావములోనే విలువ యున్నచో ఒకని ప్రియునిగా చూచు వేశ్యకు కూడా ఫలము వచ్చును గదా. కావున గోపికలు వేరు, వేశ్యలు వేరు. "గోపి వేశ్య అనిన మూఢా దత్తుడెపుడు వేశ్య రతుడే భాగవతము రంకు కాదు జ్ఞానమదియే ఓరి శుంఠా!" 7 రోజులలో ముక్తి నిచ్చు గ్రంధమేది యని పరీక్షిత్తు శుకుని ప్రశ్నించినపుడు, నీ చరిత్ర గల రామాయణమును చెప్పలేదు. గోపికల చరిత్రయుగు భాగవతమును చెప్పినాడు. పండితులు కూడా "విద్యావతాం భాగవతే పరీక్షా" అనగా భాగవతమును గురించి చెప్పినారు గాని, రామాయణము గురించి చెప్పలేదు. కావున నీవు ఏ మార్గమును వంకర మార్గమని ఆక్షేపించినావో, అదియే నీ మార్గము కన్న గొప్పదియని తెలుసుకొనుము. భాగవతము గాడిద బొమ్మలో ఉన్న కిలో పంచదారను గురించి చెప్పుచున్నది కాని గాడిద బొమ్మను గురించి కాదు. కావున భాగవతము ప్రియ భావమును గురించి బోధించుటలేదు. ప్రియ భావ మార్గమున ఉన్న భక్తి యొక్క బరువును గురించి బోధించుచున్నది. నీవు గాడిదను, చిలుకనే చూచినావు తప్ప ఆ బొమ్మలలో ఉన్న పంచదార బరువును చూడలేదు. కావుననే దుకాణము యజమానిని పంచదార గాడిద రు 100/- లు పంచదార చిలుక రు 50/- లు అన్నప్పుడు ఛీ ఛీ గాడిద ధర వంద రూపాయిలా అని గాడిదను ఆక్షేపించినావే తప్ప, వాడు ఆ బోమ్మలోని పంచదార బరువును పట్టి ధర చెప్పినాడని గ్రహించకున్నావు. కావున నీ ఆక్షేపణ నీ అజ్ఞానము నుండి జనించినది. కావున ఏ జీవుని ఆక్షేపించకుము. ఏ పుట్టలో ఏ పామున్నదో నీకేమి తెలియును. పాములను పట్టు వానికే తెలియును. వారి మార్గములో గొప్పతనము ఉన్ననూ నేను గోలోకము సృష్టించి యుండెడివాడను కాను. వారిని నా హృదయములో నుంచుకొని దాచుకొనెడి వాడను. ఈ చతుర్ధశ భువనాధిపత్యము కన్ననూ, నా హృదయ స్ధానము గొప్పది. కాని బహిరంగముగా అందరికిని కనపడునట్లు ఈ గోలోక సృష్టిని చేసినది నీకును నీవలె ఆక్షేపణము చేయు ఇతరులకు బోధించుట కొరకే అని పరమాత్మ తన ఉపన్యాసమును ముగించినాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment