Thursday, January 7, 2010

సర్వమత సమన్వయము

హిందూ మతము ప్రకారముగా మూడు మతములు ఉన్నవి. అవియే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. హిందూమతము ఒక మానవ శరీరము వంటి పిండాండము. పిండాండమే బ్రహ్మాండమని పెద్దలు చెప్పుదురు. పిండాండమైన నర శరీరములో ఉన్న పదార్ధములే బ్రహ్మాండమున ఉన్నవి. జడమైన పంచభూతములు అనబడు అపరా ప్రకృతి. చైతన్యమగు పరా ప్రకృతి. రెండింటిలోను సమానముగా ఉన్న తత్త్వములే. కావున హిందూ మతమును పోలి విశ్వమతములు ఉన్నవి. భారతదేశము పిండాండమైనచో ఈ భూమి అంతయు బ్రహ్మాండము. ఈ భూమియగు ప్రపంచములో కూడా ముఖ్యమైన మతములు మూడున్నవి. హిందూమతము, క్రైస్తవమతము, ఇస్లాంమతము. హిందూమతములోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములలో ఏకత్వమును చూడలేని వాడవు హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతములలో ఏకత్వము ఎట్లు చూడగలవు. ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా? శంకర, రామునుజ, మధ్వాచార్యుల భాష్యములలో ఏకత్వమును చూడలేనప్పుడు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ గ్రంధములలో ఏకత్వమెట్లు చూడగలవు. నీ ఇంటిలో ఉన్న మూడు గదుల మధ్య గోడలు పగులగొట్టి ఒక్క హాలును చేయలేని వాడవు, మూడు ఇండ్ల మధ్య నున్న గోడలను పగులగొట్టి ఒక్క ఇంటిగా ఎట్లు మార్చగలవు. హిందూ మతములో ఉన్నన్ని వేదాంత గ్రంధములు శాస్త్రములు నిజముగా ఏ మతములోను లేవు. అనగా హిందూమతములో సత్యమును దర్శించుటకు కావలసిన సామాగ్రి ఎంతో ఎక్కువగా యున్నది. ఇంత సాధన సామాగ్రితో నీవే సత్యమును కనుగొన లేనప్పుడు ప్రపంచములో మిగిలిన జీవులు సత్యమును కనుగొనగలరా? అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత పండితులు కలహించు కొనుచుండగా ప్రపంచములో కెల్ల సర్వ మతస్ధులు కలహించుకొనుటలో ఆశ్చర్యమేమున్నది. వీరశైవులు శివుడే దైవమందురు. వీర వైష్ణవులు విష్ణువే దైవ మందురు. శాక్తేయులు శక్తియే దైవ మందురు. ఈ కలహములకు భయపడి బ్రహ్మదేవుడు తనకు గుడి లేకుండా చేసుకున్నాడు. దీనిలో అంతరార్ధమేమి? బ్రహ్మదేవునిలో బ్రహ్మ శబ్ధమున్నది. బ్రహ్మము అనగా సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆయన వేదకర్త. అనగా జ్ఞాన స్వరూపుడు మరియు ఆయన జిహ్వపై వాణి యున్నది. అనగా వాక్కుతో జ్ఞానముతో బోధించు గురుస్వరూపుడు.అనగా సాక్షాత్తు దత్తుడే. అనగా ఈ కలహములను చూచి అసలు వ్యక్తియగు దత్తుడు జారిపోయినాడు. ఆయన యొక్క వేషములే విష్ణువు, శివుడు, శక్తి. కావున వీర శైవులకు మిగిలినది శివుడను పేరుగల కేవలము శివ వేషమే. వీర వైష్ణవులకు దక్కినది విష్ణువను పేరుగల విష్ణు వేషమే. అట్లే శాక్తేయులకు చిక్కినది అమ్మవారి యొక్క వేషమగు చీరె, అలంకారములు కిరీటము మాత్రమే. మూడు వేషములలో ఉన్న వ్యక్తిని కనుగొనలేనప్పుడు కేవలము వేషము పైననే నీ దృష్టి ఉన్నప్పుడును నటుడగు వ్యక్తి జారిపోవును. కావున ప్రపంచములో మూడ మత కలహములు చేయువారి దైవ స్వరూపములు కూడ కేవలము వేషమాత్రము గనే మిగిలిన ఒక ఉపాధ్యాయుడు ఒకే పాఠమును అనగా సిలబస్‌ను ఇంగ్లీషు భాషలో ఇంగ్లీషు మీడియం సెక్షనులో, ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి చెప్పుచున్నాడు. అదే ఉపాధ్యాయుడు అట్లే పాఠమును తెలుగు భాషలో తెలుగు మీడియం సెక్షనులో ధోవతి చొక్కాను ధరించి బోధించుచున్నాడు. ఈ రెండు సెక్షనులలో వ్యక్తిపై దృష్టి లేక కేవలము వేషమునందు దృష్టియున్న విద్యార్ధులు మా ఉపాధ్యాయుడు గొప్ప అంటే మా ఉపాధ్యాయుడు మరియు మా పాఠము గొప్ప ఆంటే మా పాఠము గొప్ప అని వాదించుకొనిచున్నారు. కాని రెండు సెక్షనులలో కొందరు తత్త్వమును పరిశీలించగల ఏకాగ్రతతో ఉన్న బుద్ధిమంతులగు విద్యార్ధులు మిగిలిన విద్యార్ధులతో ఈ వి్ధముగా చెప్పుచున్నారు.

ఓ! విద్యార్ధులారా! మీరు ఏల కలహించుచున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఆయా భాషలలో విద్యకు బోధించియున్నాడు. ఉన్నది ఒక ఉపాధ్యాయుడే కాని వేషములు రెండు. చెప్పినదీ ఒక పాఠమే. కాని భాషలు రెండు మీరు మీ ఉపాధ్యాయుల వేషముపై దృష్టి ఉంచక ఉపాధ్యాయుని యొక్క స్వరూపమును నిశతముగా పరిశీలించుడు. మీకు సత్యము తెలియును. అట్లే మీలో రెండు భాషలు వచ్చు విద్యార్ధి ఎవరైనను ముందుకు వచ్చి రెండు పాఠములను చదించుడు. అప్పుడు ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము అను విషయము బోధపడును. దీనిని ప్రపంచమునకు చాటి చెప్పిన వాడే స్వామి వివేకానందుడు. ఆయన ఒక్కొక్క మతస్ధుడగు వీరాభిమానిని ఒక్కొక్క బావి నుండి వచ్చిన బావి కప్పగా వర్ణించినాడు. వేషాలు వేరు దేవుడొక్కడే. భాషలు వేరు బోధింపబడిన తత్త్వము ఒక్కటే అని ఘోషించినాడు. కావున శ్రీ దత్తుడు ఒక్క హిందూమతమునకు సంబంధించిన వాడు కాడు. ప్రపంచములో యున్న సర్వ మతముల దైవ స్వరూపములగు వేషములలో ఉన్న ఒకే ఒక నటుడు శ్రీ గురు దత్తుడు. అన్ని మత గ్రంధములు ఆయన యొక్క పాఠములే. ఆయా దేశములకు అనుకూలమైన వేషములలో నుండి ఆయా భాషలలో ఒకే సిలబస్‌ను బోధించినవాడు. అయితే ప్రతి దేశాములోను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీలు ఉన్నవి. ఆట్లే ప్రతి దేశములోను అధమ, మద్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులగు జీవులు ఉన్నారు. కావున ప్రతి మతములోను ఆ మతములో వివిధ దశలలో ఉన్న సాధకుల దశలననుసరించి వివిధ పాఠములున్నవి. అన్ని దేశములలోను హైస్కూలు విద్యార్ధులకు ఒకే సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలో కాలేజి స్ధాయి విద్యార్ధులకు ఒకే స్ధాయి సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలోను యూనివర్సిటీ స్ధాయి విద్యార్ధులకును ఒక స్ధాయి సిలబస్‌ ఉన్నది. ఒకే దేశములో ఒకే భాషలో బోధించబడుచున్నను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ సిలబస్‌లు వేరు. మన హిందూ మతములో త్రిమతముల పండితులు కలహించుకొనుట మన ఊరిలో హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ విద్యార్ధులు కలలహించుకొనుట వంటిది. మరియు మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పర రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుచున్నారు. కావున భాష ఒక్కటే అయినను సిలబస్‌ తేడా వలన మన ఊరిలో విద్యార్ధుల కలహము, సిలబస్‌ ఒక్కటియే యైనను భాషలో తేడా వలన మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పరరాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుట జరగుచున్నది. ఇది చాలక మరియొక కలహమున్నది. మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధికి పరరాష్ట్ర భాష వచ్చును. ఐతే వీడు ఈ రాష్ట్ర హైస్కూలు సిలబస్‌ పరరాష్ట్ర కాలేజి సిలబస్‌తో పోల్చి ఈ రాష్ట్రములో విద్య లేదు ఆ రాష్ట్రములో విద్య లేదు అని కలహించుచున్నాడు. ఈ కలహములు ఎప్పుడు పోవును? అన్ని మతములలోను అధమ, మధ్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులున్నారు. ఒక మతములో అధమ స్ధాయి వారికి సంబంధించిన బోధన విషయములకు మరియొక మతములో అదే అధమ స్ధాయికి చెందిన సాధకుల యొక్క విషయమును పోల్చి చూచినచో ఒక్కటియే అని తేలును. ఇట్లే మధ్యమ, ఉత్తమమ స్ధాయిల వారు కూడ వారి వారి స్ధాయి విషయములను మాత్రమే అన్ని మతములలో పోల్చుకున్నచో ఏకత్వమును దర్శించి అన్ని మతముల పాఠ్యాంశములు ఒక్కటే యని తేల్చుకొనవచ్చును. ఇట్లు తేల్చి వివరించి నిరూపించుటయే ఈ జ్ఞాన సరస్వతి యొక్క ముఖ్యలక్ష్యము. మన హిందూ మతములో ఉన్న హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ స్ధాయిలే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతములు. అద్వైతములో శంకరులు చెక్కిన జ్ఞానము మొదలు మెట్టు హైస్కూలు విద్య లేనిదే కాలేజి, యూనివర్సిటీ విద్యలు లభించవు. కావున హైస్కూలు విద్య తక్కువ అని భావించరాదు. కావున జ్ఞానము మూల కారణము. ఆ తరువాత విశిష్టాద్వైతములో రామానుజులు చెప్పిన భక్తి భగవంతుని చేర్చు ప్రాప్తి కారణమగు రెండవ మెట్టు. రెండవ మెట్టుయగు కాలేజి. ఆ భగవంతుని పొందిన తరువాత నీవు క్రియలో నిరూపించు సత్యమైనన భక్తియే సేవ యనబడు మూడవ మెట్టు అగు అత్యుత్తమమైన యూనివర్సిటిగా ద్వైతమున మధ్యులు చెప్పనారు. క్రియలేని భావము వాక్కు వ్యర్ధములు. అసత్యములు. క్రియలో ఉన్నదా లేదా అని పరీక్షయే దత్త పరీక్ష.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment