ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్యాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్ధాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకూలు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవోన కశ్చిత్" అనుచున్నది. అనగా దేవుడు లేడని అర్ధము. ఇక శూన్యవాదులగు బౌద్ధులు అంతా శూన్యమే కావున పరమాత్మయు శూన్యమే అన్నారు. ఒక కుగ్రామమునకు ఒక విద్యావంతుడు వెళ్ళి వారిని విద్యావంతులుగా చేయదలచినాడు. ఆ కుగ్రామములో జనులందరును ఒక్క అక్షరము గూడ వ్రాయటము చేతకాని వారే. అప్పుడు వారికి చదువు నేర్పుటాకు ఆ విద్యావంతుడు స్కూలు పెట్టునా, కాలేజి పెట్టునా లేక యూనివర్సిటి పెట్టునా. అతడు స్కూలు పెట్టి ముందు అక్షరముల నేర్పును. నాస్తికులు కూడ ఆ కుగ్రామ వాసుల దశలోనే ఉన్నారు. వారికి ముందు పరమాత్మ ఉన్నాడని స్ధాపించి పరమాత్మను గురించిన వివరములన్నియు చెప్పవలెను. ఇదే జ్ఞానము. ఆ కుగ్రామ వాసులను స్కూలుకు రప్పించుటకై మీరు ఈ స్కూలుకు వచ్చి అక్షరములను నేర్చుకొన్నచో కలెక్టరు పదవిని పొందుదురు అని చెప్పును. అది వారిని ఆకర్షించుట కొరకై ఈ స్కూలు తరువాత కాలేజి ఆ తరువాత యూనివర్సిటిలో చదివిన కాని కలెక్టరు పదవి రాదన్నచో అంత శ్రమకు భయపడి అసలు స్కూలులోకే రాడు. అట్లే మీరు పరమాత్మను గురించి తెలుసుకున్నంతనే మీరు పరమాత్మ అగుదురు అని శంకరులు "జ్ఞానా దేవత కైవల్యం" అని చెప్పినారు. అనగా జ్ఞానము చేత కైవల్యము సిద్ధించును అని అర్ధము. స్కూలుకు పోయి అక్షరములు నేర్చుకొనగనే కలెక్టరు పదవి లభించును అన్నపుడు ఆశతో ఉత్సాహము లభించి స్కూలుకు వచ్చి అక్షరములు నేర్చుకొందురు. అక్షరములు నేర్చుకొను శ్రమకు కూద భయపడినవరికి అవి చాలా సులభము ఒక్కసారి వ్రాసిన చాలును అని చెప్పి స్కూలుకు రప్పించవలెను. అట్లే బ్రహ్మజ్ఞానము తెలుసుకొను శ్రమకు కూడ బద్దకించిన వారికి "నీవే బ్రహ్మము"అను ఈ విషయము వచ్చి కొంచెము విచారణ చేసుకున్నచో చాలును. నీవే పరమాత్మవు అగుదువు అని ప్రలోభ పెట్టి భగవంతుని గూర్చిన వివరణమును కొంచమైనను వినుటకు ఉత్సాహము కల్గించినారు శంకరులు. ఈ విధముగా అప్పుడున్న కాల పరిస్ధితిని అనిసరించి స్కూలును మాత్రమే పెట్టి స్కూలు సిలబస్‌ను మాత్రమే బోధించినారు శంకరులు. ఇట్లు అని శంకరులు స్కూలు టీచరు మాత్రమే అని భావించరాదు. ఒక యూనివర్సిటి ప్రొఫెసరు ఆ కుగ్రామమునకు వచ్చినను స్కూలునే పెట్టవలెను. స్కూలు సిలబస్‌నే బోధించవలెను. అదే శంకరులు మరల రామానుజ రూపమున వచ్చినారు. అప్పటికి గ్రామస్తులందరును స్కూలులో చేరి స్కూలు చదువును పూర్తి చేసుకొనియున్నారు. ఆ కాల పరిస్ధితిలో యూనివర్సిటి ప్రొఫెసరు అయిననూ ఆ గ్రామములో కాలేజిని మాత్రమే పెట్టవలయును గాని యూనివర్సిటిని పెట్టరాదు.జ్ఞానము తర్వాత మెట్ట్టు భక్తి. అనగా జ్ఞానములో పరమాత్మ ఒక్క వివరమును ఆయన యొక్క గొప్పతనమును తెలుసుకొన్నగొలది ఆయన పై ఆకర్షణ కలుగును. ఆ ఆకర్షణయే భక్తి. బ్రహ్మము అనగా గొప్పది అని అర్ధము. కావున పరమాత్మ యొక్క గొప్పతనమును తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము. స్కూలు సిలబస్ కన్న కాలేజి సిలబస్ వేరుగా యుండును. కావున శంకరులు చెప్పిన దానికి రామానుజులు చెప్పిన దానికిని తేడా ఉండును. కాలేజి పెట్టినవారు రామానుజులు. జ్ఞానము వలన పుట్టిన ఆకర్షణచే ఏర్పడిన వేదన అని భక్తికి పరమాత్మ లభించును అని "వేదనా దేవ కైవల్యం" అని రామానుజులు అన్నారు. ఈ రెండింటికిని తేడా కనిపించినను ఇవి పరమాత్మను చేర్చు ఒక మెట్టునకు తరువాత యున్న మరియొక మెట్టు. మొదటి మెట్టు రెండవ మెట్టు వేరగా యున్నను అని రెండు ఒక దానికొకటి విరుద్ధములు కావు. రెండవ మెట్టు ఎక్కి ఇంటిలోనికి పోయినావు.
కావున ఇంటిలోనికి పోవుటకు రెండవ మెట్టే కారణమా. ఆ రెండవ మెట్టు ఎక్కుటకు మొదటి మెట్టు కారణము. ఇంటిలోనికి పోవుటకు రెండు మెట్లును కారణమే. జ్ఞానము మూల కారణమైనచో భక్తి ప్రాప్తి కారణము. జ్ఞానము వలన భక్తి, భక్తి వలన పరమాత్మ లభించును. ఇప్పుడు కాలేజి చదువు పూర్తియైన ఆ కుగ్రామములో రామానుజులే మధ్వులుగా వచ్చినారు. ఇప్పుడు మూడవ మెట్టుయగు యూనివర్సిటిని పెట్టినారు. అదియే సేవ్య సేవక సంభంధః అనగా పరమాత్మను వ్యక్తిగతముగనే, కాకుండా ఆయన కార్యములో పాల్గొనుచు సేవను చేయవలయును. ఇదే పరిపూర్ణ కైవల్యము పరిపూర్ణ ముక్తి. అట్టి దాసులకు స్వామి తాను దాసుడై యుండును. రామునకు దాసుడైన రామ దాసునకు నేను దాసుడను, జవానును అన్నాడు రాముడు. అట్టి సేవకులు స్వామి వెంట నుండి ప్రతి అవతారములోను ఆయన యొ్క్క సామీప్యము బొంది బ్రహ్మానందమున ఓలలాడుదురు. "ఇది సాధన యొక్క ఫలము, దీనికి మరియొక ఫలము లేదు". అనగా యూనివర్సిటి చదువుతో, చదువంతా పూర్తి అయినట్లే. ఈ విధముగా శంకర, రామానుజ, మధ్వులు అయా సాధకుల దశలను బట్టి తేడాలు కనిపించినను ఒకే లక్ష్యమును చేర్చు మెట్లు వరుసవలే ఏకత్వమును కలిగియున్నవి. ఇది మొదటి కారణము.
ఇక రెండవ కారణము ఏమనగా గురుదత్త స్వరూపులగు అవతార పురషులు బోధించిన విషయములను శిష్యులు తాళపత్ర గ్రంధములందు నిక్షిప్తము చేసినారు. ఆ గ్రంధములు ఒకరి చేతి నుండి మరియొకరి చేతికి సంక్రమించు చున్నప్పుడు వారి వారి భావములను మధ్య మధ్యలో దూర్చినారు. ఈ శిష్యులు భావములే ప్రక్షిప్తములు అనబడుచున్నవి. గురువులు చెప్పనవి గంగా జలము వలె శుద్ధమైన ఒకే తత్త్వము కల్గినవి. శంకర, రామానుజ, మధ్వుల భాష్యములు మూడు పాత్రలలోఉన్న ఒకే జలము. ఆ మూడు పాత్రలలోని జలము మూడు బావుల నుండి తేబడినవి. ఆ జలములలో కొంచెము రుచి బేధమున్నది. కాని తత్త్వములో విరోధము లేదు. రుచి బేధమునకు కారణము వారు అవతరించిన సమయములందు వేరు వేరు దశలలో ఉన్న సాధకులే కారణము. అవి హైస్కూలు, కాలేజీ, యూనివర్సిటి సిలబస్‌ల వంటివి. ఒక మెట్టు తర్వాత మరియొక మెట్టు ఎక్కినట్లు కేవలము స్ధాయి బేధము మాత్రమే. కాని ఆయా శిష్యుల చేతులలో పడిన ఈ భాష్యములు వారు వారు చేర్చిన పక్షిప్తములు అను రంగుతో కలసి వేరు వేరు రంగుల జలము వలె మారిపోయినవి. అసలే ఆయా కాలముల సాధకుల స్ధితులననుసరించి కొంత బేధమును కలిగియే యున్నవి. ఆ బేధములు సమన్వయమునకు అందుచుచు తాత్పర్యములో ఏకత్వము కలిగియున్నవి. ఈ విధముగా పురాణములు అన్నియును ప్రక్షిప్తములతో సంకరములైనవి. వ్యాస మహర్షి జయము అను పేరుతో 7000 శ్లోకముల గ్రంధము రచించెను. దానిలో పండితుల ప్రక్షిప్తములు కలిపి 1,25,000 శ్లోకముల గ్రంధముగా మారి దాని యొక్క అసలు పేరును కూడా పోగొట్టుకొని "మహాభారతము" అను కొత్త పేరు ధరించినది. వేదము మాత్రము బ్రహ్మదేవుని ముఖము నుండి అనగా సాక్షాత్తు గురుదత్తుని నోటి నుండి బ్రహ్మర్షుల పరంపరలో అధ్యయనము ద్వారా ఎట్టి ప్రక్షిప్తములు లేకుండా రక్షింపబడి ఈనాటికిని చెక్కుచెదరక యున్నవి. అయితే వేదములో చాలా భాగము నష్టమైపోయినది. దీనినే ఖిల భాగము అందురు. బ్రహ్మ దత్తుడు చెప్పిన జ్ఞాన సరస్వతి రూపమగు వేదములను భరద్వాజ మహర్షి చదవనారంభించినాడు.
మూడు వందల సంవత్సరములు తర్వాత తాను చదివినది ఒక చిన్న మట్టి కుప్పగాను, తాను చదవలసిన మిగిలిన వేదరాశి శిఖరమే కనిపించని మేరు పర్వతము గాను గోచరించినది. ఆయన చదివిన మూడు వందల సంవత్సరముల వేద భాగములు ఒక్క సంవత్సర భాగమే భూమిలో నిలచినది. అదియును క్రమ క్రమముగా విస్మరణము వలన సన్నగిల్లుచు వచ్చి ఈనాడు నాలుగు ఘడియల కాలము భాగము మాత్రమే మిగిలినది. ఇవియే ఉపనిషత్తులు. మరి ఈనాడు మనకు మిగిలిన వేదమంతయును ఉపనిషత్తులు మాత్రమే కాక సంహిత ఆరణ్యకములు, బ్రాహ్మణములు, నామములతో ఇప్పుడు లభించుచున్న వేదము ఋషులు చెప్పినదే. ఆ సూక్తములకు ఋషులు పేర్కొనబడినారు. ఈ వేద భాగములో ఎక్కువ భాగము యజ్ఞమును, చేయు విధానమును వివరించు కర్మ స్వరూపము గాను, ఇంద్రాది దేవతలను స్తుతించు స్త్రోత్రములతో నిండియున్నది. ఈ యజ్ఞము వచ్చిన బ్రహ్మ జ్ఞానియగు అతిధికి పెట్టు అన్నమును వండు పాక శాస్త్రమునకు సంబంధించి యున్నది. ఇక దేవతల స్త్రోత్రములన్నియును, ఆరోగ్యము, శత్రుసంహారము, ఐశ్యర్యము, సంతానము, బలము మొదలగు కాకములను కోరు స్త్రోత్తములుగా యున్నవి. ఇవి అన్నియు ఋషులు చెప్పినవే కావున ఈ భాగమును పురుష శబ్ధముచే చెప్పబడు జీవులు రచించినవే కావున వాటిని బుద్ధుడు పౌరుషేయములు అని అన్నారు. సంతోషించవలసినది ఏమనగా ఉపనిషత్తుల మధ్యలో ఋషులు ఎట్టి మంత్రములని చేర్చలేదు. ఏలననగా అవి అధ్యయన పరంపరల ద్వారా వచ్చుచున్నవి. కావున వేదము జ్ఞాన కాండము, కర్మ కాండము అని రెండు భాగములుగా విభజింపబడినది. జ్ఞానకాండమగు ఉపనిషత్తులు సాక్షాత్తు బ్రహ్మదత్తునిచే చెప్పబడినవి. ఆయన జీవుడు కాడు కావున ఆ భాగమును అపౌరుషేయమని చెప్పవచ్చును. జ్ఞాన, కర్మ కాండములు రెండును వేదమే అపౌరుషేయమే అని మన పండితులు వాదింతురు. ఇచ్చట నేను ఒక ప్రశ్నను అడుగుచున్నాను. వేద శబ్ధమునకు అర్ధమేమి?
"విదుః జ్ఞాని" అని కదా. అనగా వేదము అన్న జ్ఞానము అని అర్ధము. కావున జ్ఞాన కాండము మాత్రమే వేదము. కర్మ కాండము కర్మయే కావున వేదము కాదు. కాని పూర్వ మీమాంసకులు కేవలము కర్మ కాండనే తీసుకొని దానిని మాత్రమే వేదముగా భావించి జ్ఞాన కాండము చెప్పు ఈశ్వరుని నిరాకరించి నాస్తికులైనారు. వారు కేవలము అన్నమును వండు కర్మ కాండను మాత్రమే తీసుకొని కేవలము ఉదర పూరణ భోగమాత్రులై నాస్తికులుగా మారినారు. కావుననే వీరిని భగవద్గీత "వేదవాదరతాః పార్ధ నాన్య దస్తీతి వాదినః" అని చెప్పుచున్నది. అనగా వీరు కేవలము కర్మ కాండమునే వేదమని భోగలాలసులై నాస్తికులుగా మారినారు అని అర్ధము. కావున జ్ఞాన కాండము ఉత్తర మీమాంస అనబడు వేదాంత శాస్త్రము మాత్రమే గురుదత్తునిచే చెప్పబడిన గ్రంధము. ఆ గురుదత్తుని అవతారములగు శంకర, రామానుజ, మధ్వ గురువులు వారి భాష్యములందు ఈ ఉపనిషత్తులనే శ్రుతి ప్రమాణమునే ఉదహరించుచు వ్రాసినారు. ఇక శ్రుతి ప్రమాణమును అనుసరించి ఉన్న పురాణములలోని శ్లోకములను మాత్రమే గ్రహించినారు. శ్రుతి ప్రమాణమునకు విరుద్ధములైన పురాణ శ్లోకములను త్యజించినారు. ఏలననగా అవి ప్రక్షిప్తములు. ఈ పురాణములు చాలక సంప్రదాయములు అను మరియొక ప్రమాణమును తీసుకొనుచున్నారు. సంప్రదాయములు అనగా మన పెద్దలు ఆచరించినవి. కాని సంప్రదాయమునకు కూడ శ్రుతి ప్రమాణము ఉన్నప్పుడే దానిని గ్రహించవలెను. లేకున్నచో త్యజించవలెను. సంప్రదాయమే ప్రమాణమైనచో రాక్షస వంశమున పుట్టిన ప్రహ్లాదుడు సంప్రదాయ విరుద్ధముగా నారాయణ ఆరాధన ఏల చేసినాడు? కావున సంప్రదాయమును గుడ్డిగా అనుసరించరాదు. దానిని తర్కించి దానికి శ్రుతి ప్రమాణము ఉన్నదా లేదా అని చుడవలెను. శ్రుతి "బ్రహ్మశ్చనారాయణః శివశ్చనారాయణః" అనుచున్నది. అనగా సృష్టి ఆరంభమున సృష్టిని చేయుచున్న కాలములో పరబ్రహ్మ యొక్క పేరు బ్రహ్మ దేవుడు. సృష్టి అంతఃకాలమున సృష్టిని లయము చేయు బ్రహ్మము పేరు శివుడు. ఇది స్ధితి కాలము. స్ధితిని రక్షించుచు పాలించు పరబ్రహ్మము యొక్క పేరు నారాయణుడు. కావున వర్తమాన పరబ్రహ్మ నామధేయము నారాయణుడు అని మాత్రమే. ఊర్ధ్వ లోకములకు దేవతలు ఋషులు పోయినప్పుడు కనిపించునది నారాయణుడు మాత్రమే. కొందరు బ్రహ్మ స్త్రోత్రములను, శివ స్త్రోత్రములను చేసినప్పుడు నారాయణుడే బ్రహ్మ దేవునిగా, శివునిగా క్షణకాలము దర్శనమిచ్చును.
అంతే కాని వర్తమాన స్వరూపము నారాయణుడే.రాక్షసులకు బ్రహ్మ పైన, శివుని పైనన భక్తి గలిగి నారాయణునిపై ఏల ద్వేషము కలిగెను? రాక్షసులు అసూయ, మాత్సర్య స్వరూపులు. ప్రత్యక్షముగా ఎదురుగా యున్నస్వరూపమును ద్వేషింతురు. కంటికి కనిపించని స్వరూపములనే ఆరాధింతురు. కవున వారికి నారాయణునిపై ఈర్ష్యా ద్వేషములు కలుగుటలో ఆశ్చర్యము లేదు. దేవతలు, రాక్షసులు, ఋషులు ఎక్కడో లేరు. ఈ నరులలోనే ఉన్నారు. అసూయ, మాత్సర్యములను పరిపూర్ణముగా నాశనము చేసుకున్న వారే ఋషులు, దేవతలు అట్టి నరులు ప్రత్యక్షముగా వర్తమాన నరావతారముగా వచ్చిన స్వాముని అంగీకరించి ఆరాధింతురు. కాని అసూయ, మాత్సర్యములతో నున్న రాక్షస స్వభావము కల నరులు పరోక్ష నరాకారములనే అంగీకరించి ఆరాధింతురు. ప్రహ్లాదుడు దేవతాంశ సంభూతుడు. అనగా పరిపూర్ణమైన అనసూయ తత్త్వము కలిగినవాడు. కావున వర్తమాన స్వరూపుడగు నారాయణుని ఆరాధించినాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad
No comments:
Post a Comment