Wednesday, December 16, 2009

గోరంత సేవకు కొండత ఫల పధకము

పరమాత్మ నరావతారమున భూలోకమునకు వచ్చినపుడు ఆయన మానవుల భక్తికి పరవశించు చుండును. ఈ భక్తి మద్యమును సేవించి ఆ మైకములో వారు కోరిన వరములు ప్రసాదించుచుండును. ఎంత నిష్కామ భక్తిని కలిగియున్నను ఎప్పుడో ఒకప్పుడు మానవుని యొక్క నైజము బయిటపడక మానదు. "ఆ నైజమే స్వార్ధము" ఆ స్వార్ధముతో కోరు వరములతో ఒక్కొక్కసారి భగవంతునికే కాక ఆ కోరిన మానవునకే అనర్ధము వాటిల్లును. భస్మాసురుడు కోరిన వరమట్టిదియే కదా! దాని వలన స్వామికి ముప్పు వచ్చుటయే కాక, చివరకు వాడే నశించినాడు. కావున వాని తపస్సు వానినే నశింప చేసినది. మరియు స్వామి వరమునీయకుండా తిరస్కరించ వచ్చును గదా! కాని వాడు యిచ్చిన భక్తి మద్యము అను మైకముతో స్వామి బోళా శంకరుడైనాడు. కావున అవతరించుటకు ముందు కాలభైరవునకు గట్టిగా ఈ విధముగా శాసనములనిచ్చును. "నేను భూలోకమునకు పోయినపుడు చాలా ప్రమాదకరమైన మానవుల మధ్యకు వెళ్ళుచున్నాను. వారు అతి తెలివి గలవారు. వారి అతి తెలివి వలన ఆత్మవినాశనము, పర వినాశము, గురు వినాశము సంభవించును. వారు అతి తెలివి చేత భక్తసులభుడైన నా చేత భక్తి మధ్యమును త్రాగించి అంతములో వినాశకరములగు వరములను కోరును. కొందరు నిష్కామ కర్మసేవా భక్తియను మహాశక్తివంతమైన మధ్యమును నాచే త్రాగింతురు. అట్టి భక్తులు నిష్కామముగనే ఉందురు. కాని ఎప్పుడో ఒకప్పుడు వారి నైజగుణమగు స్వార్ధము విజృంభించును. కావున ఆట్టి సమయములలో నేను మైకము లోపడి ఇచ్చిన వరములను నిష్పలములగునట్లు చేయుము. అప్పుడు నేను నిన్ను దూషించి నీపై ఆగ్రహించెదను. ఆ సమయమున భయంకరమైన రవమును అనగా గర్జనము వేసి నన్ను నియమించుము. ఇదే కాల = ఆ సమయము నందు; భైరవ = భయంకరమైన రవమును చేయుట. కావున కాలభైరవుడు నీ పేరు కాదు. భాధ్యతకు ఆ పేరు. నీవు ఇట్లు చేయకున్నచో నేను తర్వాత పైకి వచ్చినపుడు నిన్ను ఈ పదవి నుండి తొలగించవలసి వచ్చును". ఈ విధముగా అవతార కార్యక్రమ మంతయును ఒక నిర్ధిష్టమైన స్వామి స్వయముగా రచించి ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే జరుగును. స్వామి శాసనానుసారముగా ఆ ప్రణాళికను నిర్దాక్షిణ్యముగా అవసరమైనచో అవతార పురుషుని సయితము గర్జించి నియమించుటయే కాలభైరవుని కర్తవ్యము. ఇది అంతయును స్వామి శాసనమే కావున స్వామి యొక్క స్వాతంత్రయమునకు, అధికారమునకు, ఎట్టి భంగము లేదు. అందువల్లనే స్వామి మధ్యపానము చేయుచున్న వానిగా దర్శన మిచ్చు చుండును. ఆ దర్శనములోని అంతరార్ధమిది. అయితే అంతయును నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారమే జరుగుచున్నది కదా. మనము అవతరించిన స్వామిని సేవించుట వ్యర్ధము. ప్రణాళికలో ఉన్నచో అది మనకు లభించియేతీరును. దానికి సేవ యొక్క అవసరము లేదుకదా. ప్రణాళికలో లేనిచో ఎంత సేవ చేసిననూ లభించదు. అప్పుడు సేవ అవసరము లేదుకదా! అన్న సంశయము వచ్చును. దీనికి సమాధానము ఏమి అనగా కాలభైరవుని ప్రణాళికలో ఎవరు ఎట్టి సేవను చేసినచో వారికి ఎట్టి ఫలమును ఎక్కడ ఎచ్చట వారి యొక్క నిజమైనన అవసరములకు అందచేయవలయును అని స్పష్టముగా వ్రాయబడియే యున్నది. కావున నీవు చేసిన సేవకు సరియైన ఫలమును పొందుట ప్రణాళికలోని అంశమే కావున నీ సేవ వ్యర్ధము కాదు. కాకున్నచో ఏ సేవకు ఎట్టి ఫలము? ఆ సేవ యొక్క విలువ ఎంత? ఆ సేవ యొక్క ఫలము ఎంత? మొదలగునవి నిర్ణయించి ఇచ్చినవే ప్రణాళికలో యున్నవి. వాటిని ఆ ప్రణాళిక ప్రకారము జీవులకు నిష్పక్షపాతముగా అందచేయు అధికారమును కాలభైరవుని చేతిలో స్వామి పెట్టియున్నారు. అనగా స్వామి చేత కొండంత ఫలమమును దానవ స్వభావము వలన మానవుడు కోరవచ్చును. భస్మాసురుడు కోరినది అదేకదా. వాడు చేసిన తపస్సు గోరంత. వాడు కోరిన వరము స్వామిని కుడ భస్మము చేయగల శక్తి కొండంత. భక్తి మద్యము యొక్క మైకములో స్వామి వరము ప్రసాదించినాడు. పోనీ దాని వలన వాడు ఏమైనను లాభపడినాడా లేదు లేదు. వాడే చివరకు అంతమైనాడు. కావున ఇట్టి సమయము లందు ఆ భక్తుని శ్రేయస్సు కొరకే కాలభైరవుని నియమాధికారము అవసరమా కాదా? కావున దీని వలన చిట్ట చివరకు ఆలోచించి చూచినచో ఇది జీవులకే ఉపకారమగుచున్నది.
అయితే గోరంత సేవకు కొండంత ఫలము లభించి ఆ ఫలము మనకే సద్విని యోగమునకు అవకాశము లేదా? ఇట్టి అవకాశము కూడా గలదు. నీవు గోరంత సేవను చేసి ఆ సేవకు ఎట్టి ఫలమును ఆశించకుము. నీవు చేసిన సేవయే నీ పురాకృత పుణ్యకర్మఫలమని భావించుము. ఫలమునకు మరియొక ఫలము ఉండదు. ఇట్టి భావముతో నీవు చేసిన సేవకు ఎట్టి ఫలమును కోరక నిస్వార్ధ భావముతో ఉందువేని నీ గోరంత సేవకు కొండంత ఫలము అనుగ్రహించబడును. అయితే దానిపై నీకు కోరిక లేనందున ఆ కొండంత ఫలమును నీ ఖాతాలో జమచేయబడినట్లు నీకు తెలియదు. ఈ జమ చేసినది నీకు తెలియదు. ఏలననగా నీ గోరంత సేవయను వంద రూపాయిలు నీవు స్వామికి దానముగా సమర్పించియున్నాను అనుకొనుచున్నావు. దానము చేసిన తర్వాత దానిని వడ్డీతో కలిపి నాకు యివ్వమని అడుగుట లేదుకదా. కావున నీవు గోరంత సేవకు గోరంత ఫలమును కూడా కోరుట లేదు. ఇప్పుడు ఈ కొండంత ఫలము నీకు తెలియకుండా కాలభైరవుని అధీనములో యున్నది. ఇది నీకు తెలియదు కాన నీవు అవసరము లేకున్ననూ దానిని తీసుకొని ఖర్చుపెట్టకొనవు. ఆ కొండంత ఫలము స్వామి అధీనములో కూడ ఉండదు. ఏలననగా నీవు స్వామికి భక్తిమద్యమనను త్రాగించి నీకు అనవసరము లేనప్పుడు స్వామిని ధనమును ఇమ్మని కోరగా స్వామి ఆ మైకమములో దాని నుండి తీసి ఇచ్చును. కావున ఆ కొండంత ఫలము నీకు తెలిసినను, లేక స్వామి ఆధీనములో యున్ననూ అనవసరముగా దుర్వినియోగమై వ్యర్ధమగును. కాలభైరవునిచే నీవు భక్తిమద్యమును త్రాగించలేవు. ఏలననగా కాలభైరవుడు చాలా కఠోర హృదయుడు. నీ మద్యము నీ ప్రాత్రలోనే యుండును. దానిని ఎట్టి పరిస్ధితులలోను అంటడు. కావున సర్వము స్వామి ఇచ్చానుసారమే కాలభైరవుని అధీనములో యున్నది. నీవు భక్తిని త్రాగించినను ప్రయోజనము లేదు. కాలభైరవుని చేత త్రాగించలేవు. కావున స్వామికి మస్కాకొట్టి ఆత్మవినాశకరమగు వరములను కోరుకొనుటను విరమించుకొనుము. ఆ సమయమున నీకు వరములు లాభకరముగనే తోచును. కాని అవి భస్మాసురునివలె నిన్నే అంతమొందించును. కావున ఎట్టి ఫలములను ఆశించక నీవు స్వామికి చేసిన సేవ నీ పుణ్యఫలమే అని భావించుచు నీ యధాశక్తి స్వామిని సేవించుటయే నిజమైన అత్యుత్తమ మార్గము.
దీనికి చక్కని ఊదాహరణము రాజసూయ యాగమున స్వామి వేలు తెగి రక్తము కారుచుండగా అవభృధస్నాతమైన ద్రౌపది అమంగళకరమైనను, అనర్ధకరమని తెలిసియును, తన పట్టుచీరెను చించి స్వామి వేలుకు కట్టినది. అష్టపత్నులు అచ్చట ఉన్ననను అట్లు చేయు సేవ వారికి స్పురించలేదు. "ఇది నాకే స్పురించి నేనే చేసితిననగా, ఇచ్చట ఎవరును చేయని నేను మాత్రమే చేసిన పూర్వపుణ్య తపస్సు యొక్క ఫలము" అని ద్రౌపది భావించిదే తప్ప , ఈ సేవకు ప్రతి ఫలముగా నా వేలు ఎప్పుడైనను ఇట్లు తెగినచో పరమాత్మ ఎవరినైనను ప్రేరేపించి నావ్రేలికి గుడ్డముక్క కట్టునట్లు చేయునులే అని అనుకొనలేదు. ఆమె అట్లు భావించి యున్నచో ఆ గుడ్డముక్కను వడ్డీతో కలిపినచో చక్రవడ్డీ యైనను ఒక చీరె మాత్రమే దుశ్శాసన వస్త్రాపహరణ సమయమున లభించి యుండును. దుశ్శాసనుడు ఆ లభించిన ఆ రెండవ చీరెను లాగినప్పుడు అమె దారుణ దుఃఖమునకు గురియై యుండెడిది. కాని ఆ మె స్వామి వ్రేలికి చుట్టిన గుడ్డముక్క తన యొక్క పుణ్యఫలమని భావించి ఆ ఫలమునకు మరియొక ఫలము ఉండదని నిశ్చయించినది కావున అసలు ఆ విషయమునే మరచిపోయినది. అందుకే వస్త్రాపహరణ సమయమున "స్వామీ నేను ఆనాడు మీ వేలుకు గుడ్డముక్క కట్టినాను నాకు ఇప్పుడు ఆ ఫలము నిమ్ము" అని ప్రార్ధించలేదు. ఏలననగా ఆనాడు ఆమె చేసినది కర్మయని భావించలేదు. కావుననే ప్రాణము మీదికి వచ్చినను ఆ కర్మకు ఫలమును యాచించలేదు. కావుననే ఆమె గోరంత సేవకు కొండంత ఫలముగా ఆమె పేరున జమ చేయబడినది. ఆమెకు నిజమైన అవసరము రాగానే ఆ కొండంత ఫలము ఆమెకి అందచేయబడినది. ఆ గుడ్డముక్కయే అక్షయమై అనంతమైన సంఖ్యలో చీరెలుగా మారినది. కావున ఓ దత్తసేవకులారా! మీరు ఈ " గోరంత సేవకు కొండంత ఫలము" అను పధకములో చేరండి తరించండి.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment