అహంకారముతో ఉన్న జీవులకు ప్రభువు బోధ చేయ తలచినప్పుడు తన యదార్ధ స్ధితిని దాచి అధముడైన పాత్రలో ప్రవేశించి చండాలాది వేషములలో అధమునిగా నటించుచు ఆ అహంకారి వద్దకు స్వామి చేరును. అహంకారి వద్ద స్వామి తన నిజస్ధితిని ప్రకటించుకున్నచో అతడు అంగీకరించక స్వామిని దూషించుచూ స్వామి చెప్పు బోధలను వినడు. అప్పుడు సాధనలో మొదటి అవస్ధ యగు శ్రవణమే లేకుండా పోవును. కావున అహంకారియగు జీవునకు శ్రవణము కలిగించుటకై స్వామి వినయముతో అధమునిగా వచ్చును. అహంకారమునకు ఆకర్షణను కలిగించునది వినయము.
అహంకారమునకు అహంకారము వికర్షణ కల్గించి దూరముగా పోవును. కావున ముందు వాని అహంకారమును ఉపశమింప చేసిన కాని వాడు శ్రవణమునకు అవకాశమునీయడు. ముందు లంఖిణిని లొంగదీసిన గాని లంకాప్రవేశము జరుగదు. కావుననే అహంకారియైన బలి వద్దకు స్వామి అమిత దుర్భలుడగు పసి బాలునిగా అనగా అధమునిగా వామనుడై వచ్చినాడు. కావున గురుస్వరూపుడగు దత్తుడు ఎప్పుడును వినయముతో తన్ను తాను అధమ స్ధితిలో నుంచుకొనును, ఏలననగా జీవులందరు అహంకారులే. కుక్క తోకకు వంకర తనము ఎట్లు స్వభావ గుణమో జీవునకు అహంకారము అట్లు స్వభావగుణము. ఎంత జ్ఞాని యైనను జీవునకు ఏదో ఒక సమయములో అహంకారము ప్రవేశించును. వాని అహంకారము అణిగి ఉన్నప్పుడు స్వామి తన స్వరూపమును ప్రకటించును. వానిలో ఆహంకారము లేచినప్పుడు స్వామి మరల దాసుడిగా అధముడిగా ప్రకటించుకొనుచు వానిలోని అహంకారమును శాంతింప చేయును.
శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు మరి కొందరు ఎక్కువ అహంకారము కలవారు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు. మరికొందరు ఇంకనూ అహంకారము కలవారు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. కావున బ్రహ్మమగు శంకరులు చెప్పు వాక్యములను ఎవడును గ్రహించలేరు. ఆ బ్రహ్మము చెప్పు వాక్యములను బ్రహ్మమగు నేను వినవలయును అను అహంకారము ప్రవేశించినది.మీరు బ్రహ్మము గాదు జీవులు అని స్వామి అన్నచో నీవును జీవుడవే. జీవుడు చెప్పు మాటలను జీవుడు విననేల? అని శిష్యులు భావింతురు. ఒక టోపీలు అమ్ముకొను వాడు నిద్రించుచుండగా వాని టోపీలను కోతులు ఎత్తుకొని పోయి చెట్లు ఎక్కి టోపీలను తలపై ధరించినవి. అవి టోపీలను ధరించుటకు కారణము ఆ వర్తకుడు టోపీను నెత్తిన ధరించుటయే. ఆ వర్తకుడు లేచి ఎంత ప్రాధేయపడినను, ఎంత బోధించినను అవి ఇకిలించినవే కాని తలలపై టోపీలను తీయలేదు. కారణము బోధించువాడు తలపై టోపీని ధరించి యుండగా కోతుల వంటి శిష్యులు వారి టోపీలను తీయరు. అప్పుడా వర్తకుడు తన టోపీని తీసి క్రింద పారవేయగా, ఆ కోతులును టోపీలను క్రింద పార వేసినవి. కావున శంకరులు ఉన్నంత కాలము శిష్యులు అద్వైత మతమునే అవలంభించి ఆయన బ్రహ్మము అన్నాడు కావున మేము కూడా బ్రహ్మమే యని శిష్యులు అన్నారు. జీవులకు శోభాయము అహంకారము స్వరూపము అసూయ.
కావున శంకరులు రామానుజులుగా అవతరించి తాను స్వామికి భక్తుడను అని అన్నారు. భక్తిని గుర్తించి బోధించినప్పుడు స్వామి భక్తుడు గానే అవతరించవలయును. అప్పుడు శిష్యులందరును "మేము స్వామి భక్తులమే" అన్నారు. అప్పుడు రామానుజులు "ఓ జీవులారా!మీరు భక్తులైనంత మాత్రమున చాలదు. స్వామి కార్యములో పాల్గోని సేవకులు కావలయును. నిజమైన భక్తియే సేవయని బోధించినారు. కాని జీవులు రామానుజులు ఎట్లు విష్ణువు అంశయో తాము కూడా విష్ణువు యొక్క అంశయే అని భావించినారు. జగత్తు స్వామి యొక్క శరీరము. ఈ శరీరములో ఒక భాగము జీవుడు. కావున మేము కూడా స్వామి యొక్క భాగములమే. మహాగ్ని నుండి వచ్చిన నిప్పురవ్వలమే అన్నారు భక్తులు. అప్పుడు రామానుజులు మధ్వాచార్యునిగా అవతరించినారు. స్వామి దాసుడగు హనుమంతుని తనకు స్వామిగా చేసుకొని నేను దాసానుదాసుడను అని అన్నారు. జగత్తు స్వామి యొక్క శరీరము కాదు. స్వామి కన్న విడిగా యున్న పదార్ధము అని బోధించినారు. అప్పుడు జీవులు కూడా స్వామి యొక్క దాసానుదాసులమని భావించిరి. కావున "యధా రాజా తధా ప్రభూ" "యధా గురు తధా శిష్యః" అను సిద్ధాంతమును అనుసరించియే స్వామి కూడా దత్తునిగా కాకుండా భక్తునిగానే ప్రవర్తించు చుండును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad
No comments:
Post a Comment