Thursday, December 24, 2009

నిష్కామము

భగవంతుని నిష్కామముగా ప్రేమించుట లేక ఆరాధించుట అసంభవమని కొందరు తలచుచున్నారు. ఏలయనగా "ప్రయోజన మనుద్దిశ్యస మందోపి ప్రవర్తతే" అను సామెత ప్రకారము ఎంతటి మూర్ఖుడైనను ప్రయోజనము లేకుండా ఏ పనిచేయడు. మనకు ఏ ఉపకారము చేయకుండా ఒకరి మీద మనకు ప్రేమ ఎలా కలుగుతుంది. ఇచ్చిపుచ్చుకుంటే ఆపేక్షలు అని అందుకే అంటారు. తండ్రి ధనమును సంపాదించి, మన యొక్క అవసరములు తీర్చుచున్నాడు కావున తండ్రిని ప్రేమించి సేవించెదము. తల్లి పదార్ధములు వండి పెట్టి మన యొక్క ఆకలి తీర్చుచున్నందున మనము తల్లిని ప్రేమించి సేవించు చున్నాము. అట్లే భగవంతుడు మన కష్ణములను పోగొట్టి మనము అడిగిన వరములను ఇచ్చినచో ప్రేమించి సేవించుట సహజము. కాని ఎన్ని కష్టములు వచ్చినను వాటిని తీసివేయమని యాచింపక ఎట్టి వరమును కోరక, స్వామిని ప్రేమించి సేవించుట కంచి గరుడ సేవయే అగును. స్వామి తాను ఆయుధము పట్టనని తన సేన యగు పదివేల యాదవులు ఆయుధము ధరించి యుద్ధము చేయుదురని ఈ రెండింటిలో ఏది కావలయునని పార్ధుని అడిగినాడు. ఆ పదివేలు యాదవులు "నారాయణ సేన " అను పేరుతో గొప్ప వీరులు. దుర్యోధనుడు చాలా భయపడినాడు. పార్ధుడు తప్పక నారాయణ సేననే కోరుననియు ఇక మిగిలిన కృష్ణుడే తనకు గతియని యుద్ధము చేయని కృష్ణునికి ప్రతిరోజు వెన్నముద్దల నైవేద్యములతో వ్యర్ధమగు సేవ చేయవలసి వచ్చునని బాధపడినాడు. కాని కౌంతేయుడు నారాయణ సేనను వదలి నారాయణునే వరించినాడు. దుర్యోధనుడెంతయో సంతోషించి ఇంక కొంచెము సేపు ఉన్నచో ఈ కృష్ణుడు ఏమి తారుమారు చేయునో అని భయపడి అప్పుడు కృష్ణుడు నవ్వుచు, "అర్జునా! నీకేమైనా పిచ్చి పట్టినదా నీకు యుద్ధములో ఉపయోగించు నారాయణ సేనను వదలుకున్నావే.

నీకు ఏ విధముగను ఉపయోగించని నన్నేల కోరుకొంటివి" అని స్వామి నెత్తి బాదుకున్నాడు. అప్పుడు అర్జునుడు "స్వామీ! నీ నుండి నాకు ఎట్టి ప్రతిఫలాపేక్షయు లేదు. నీవు నా వద్ద ఉండిన చాలును. నీ వంటే నాకు పిచ్చి ఇష్టము" అన్నాడు. కానీ, నిజముగా ఆలోచించినచో జరగబోవు యుద్ధములో ఉపయోగించక పోయినను, జరిగిన ఎన్ని విషయములలో కృష్ణుడు వారికి సాయపడినాడు. అవి అన్నియు పార్ధునకు గుర్తు ఉన్నవి కావుననే కృష్ణుడన్న అంత ఇష్టము. భీమునికి విషాన్నము పెట్టించినప్పుడు, యమునలో పడ త్రోయించి, లక్క ఇంటిలో కాల్చినపుడు, ద్రౌపది వస్త్రాపహరణ సమయమునను ఇట్లు ఎన్నిసార్లు స్వామి ఆదుకున్నాడు. అట్లే మానవుడును తనకు ఈ క్షణము వరకు స్వామి విధములుగాఅ సాయపడినాడో, గుర్తుకు తెచ్చుకొన్నచో, అవి చాలవా? స్వామిపై భక్తి ఏర్పడుటకు. ఇప్పుడు అడిగిన వరము ఈయకున్ననూ, నీవు అడుగకయే ఎన్ని వరములు ఇచ్చినాడు. అతి దుర్లభమైన మానవ జన్మ నీకు ఇచ్చినాడు. పూర్ణాయుర్ధాయమును ఇచ్చినాడు. ఆరోగ్యము నిచ్చినాడు. తిన్న అన్నము అరిగించు శక్తిని అరుగుదలను ఇచ్చి నీకు కావలసిన అన్నమును ధనమును ఇచ్చినాడు. సంతానము యిచ్చినాడు. కీర్తి ఇచ్చినాడు. శీతాకాలములో సుఖమును కల్గించు వెచ్చని ఎండ నిచ్చినాడు. ఎన్ని విధముల ఫలములను సృష్టించినాడు. ఎన్ని రుచుల ఆహారమును సృష్టించినాడు. వాటిని చక్కగా తయారుచేయు పాక శాస్త్రమును అందించినాడు. ఇన్ని వరములను ఇచ్చిన స్వామిపై భక్తి కలుగుటకు ఇప్పుడు ఒక్క వరము కావలయునా? ఇచ్చిన వంద వరములకు గతి లేదు. ఇంత వరకు స్వామిపై భక్తి పుట్టలేదు. ఇప్పుడు 101 వరము ఇచ్చినచో నీకు స్వామిపై భక్తి పుట్టుననిన నమ్మమందువా? లేదా 101 వరము తరువాత 102 వరము అడుగుదువు. ఇచ్చిన వంద వరములకు నోటారా ఉచ్చరించి ఒకనాడైనా కృతజ్ఞతలు చెప్పితివా? మానవుడు ఇంత కృతఘ్నుడు కనుక ఇచ్చిన వరములను మరచి 101వ వరమును కోరుచు వరమీయకున్నచో ఎట్లు ప్రేమింతును అని అనుచున్నాడు. నిస్కామముగా సేవించమని స్వామి గీతలో చెప్పుటలో అంతరార్ధ మేమి? పాతబాకీలు వాటి వడ్డీలలో ఏమియు చెల్లించక కొత్త బాకీ అడుగ వద్దనియే నిష్కామ కర్మ యోగము. అంతే కాని స్వామి పిచ్చివాడు కాదు. 40 రోజుల తపస్సు తరువాత క్రీస్తు మహాత్ముడు కొండ మీద తనను చూడవచ్చిన 4000 మందికి 4000 వేల రొట్టెలు ఇయ్యమని భగవంతుని అడుగక బుట్టలో యున్న 4 రొట్టెలను పైకి చూపి "ప్రభూ! ఈ నాలుగు రొట్టెలు ఇచ్చినందులకు నీకు కృతజ్ఞతా స్తుతులను చెల్లించుచున్నాను అని మాత్రమే అన్నాడు. ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలిపినందుకు పరమాత్మ సంతోషిస్తాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment