Monday, December 21, 2009

హనుమంతుడు మరియు రాధ

హనుమంతుడు, రాధ, సత్యభామ, రుక్మిణి మొదలగు పాత్రలన్నియును జీవులుగా నటించుచున్న శ్రీ దత్తుని వేషములే. వీరందరును జీవులకు ఆదర్శములను సాధనలో నిలుపము ఎట్లుండును అని జీవులకు బోధించుటకై గెలుపు, ఓటమిలను పొందుచు,లోపమునట్లు నటించుచున్న వారే తప్ప నిజముగా వారిలో ఎట్టి లోపములు లేవు. కానీ, మానవులు యీ నాటకముల నుండి గుణపాఠములను నేర్చుకొనక, నిజముగా వారిలో లోపమునట్లు భావించుచుందురు. ఒక సినిమాలో సుబ్బయ్య అను ఒక నటుడు భీమునిగాను దుర్యోధనునిగాను నటించుచున్నారు. భీముడు దుర్యోధనుని పడగొట్టెను. అనగా సుబ్బయ్య సుబ్బయ్యను పడగొట్టెనా? అక్కడ పడిపోయినది దుర్యోధనుని వేషము కాని నిజముగా దుర్యోధనుడు అక్కడ లేడు. అట్లే హనుమంతుడు మొదలగునవి శ్రీ దత్తుని వేషములే. సత్యభామ చుప్పనాతి అని చెప్పుదురు. సత్యభామ అనునది ఒక వేషము. చుప్పనాతి తనము పనికి రాదని మనకు ఉపదేశించుటయే అక్కడి ముఖ్యోద్దేశ్యము. అసలు సత్యభామ ఎవరు? భూదేవి. భూదేవికి ఉన్న సహనము ఎవరికిని లేదు. అందుకే ఆమె చుప్పనాతి సత్యభామ పాత్ర వేషమునకు అంగీకరించి, అందరు నిందించుటను సహనముతో ఓర్చుకొనుటకు అంగీకరించినది. కావున పాత్రధారియైన భూదేవి చుప్పనాతి కాదు. ఇక సత్యభామ అనునది బాహ్య వేషమే. వేషమునకు చుప్పనాతి తనము ఉండునా? కావున, అక్కడ చుప్పనాతి ఎవరును లేరు. చుప్పనాతివి నీవే. నీ చుప్పనాతి తనము పోగొట్టుటకై ఆ వేషము వేసి నీకు బోధించ వలసి వచ్చెను. నీవు చుప్పనాతివని నీకు బోధించినచో నీవు అంగీకరించవు అహంకారముతో. కావున నేరుగాకాక, పరోక్షముగా బోధించుట ఒక పద్ధతి. "కారితా సమ్మిత తయోపదేశయుజే" అన్నారు పండితులు. అనగా భార్య ఎట్లు మెత్త మెత్తగా తియ్యగా ఉపదేశమును చెప్పునో, అట్లే జీవులకు బోధించవలెను. చుప్పనాతి ఒకరు ఇట్లు గర్వభంగము పొందినని ఒక నాటక కధను చెప్పినచో, అది విన్న జీవుడు "చుప్పనాతి తనము మంచిదికాదు" అని తెలుసుకొని, తనకోని చుప్పనాతి తనమును విడచి పెట్టుటకు ప్రయత్నించును. అట్లు కాక, నీ చుప్పనాతి తనమును విడిచిపెట్టమని నేరుగా బోధించినచో " నీవు చుప్పనాతివి, నీ తాత తండ్రులు చుప్పనాతులు" అని అహంకారము దెబ్బతిన్నందున ఎదురు చెప్పును. కావున, వ్యాసుడు పురాణములను కాంతా వాక్కులతో పరోక్షముగా బోధించుచు, కధలను చెప్పినాడు. కావున రాధ హనుమంతుడు, సత్యభామ మొదలగు వారి పొరపాట్లు, గెలుపు ఓటములను చెప్పినపుడు జీవులను దృష్టిలో పెట్టుకొని చెప్పినవే కాని వారిలో అట్టి లోపములు ఉండవు. హనుమంతుడు ఎవరు? శివుని అవతారము. శివుడు ఎవరు? సాక్షాత్తు దత్తుడు. కావున, జీవుల బోధ కొరకు అలా హనుమంతుడు నటించినాడే తప్ప, హనుమంతుడు పొరపాటు అన్న సాక్షాత్తు దత్తుడే పొరపాటు పడినాడని చెప్పినట్లు అగును.
త్రిమూర్తులు కూడ దత్తుని వేషములే. కావున పురాణములలో ఒకచోట శివుడు విష్ణువును గెలిచినట్లు శివపురాణములో చెప్పబడును. నరసింహుని, శరభావతారము నెత్తి శివుడు ఓడించినట్లు వ్రాయబడినది. అచ్చట దీర్ఘ కోపము పనికిరాదని జీవులకు బోధించుటకై నరసింహుడు దీర్ఘ కోపమును నటించెను. అది పనికిరాదని అట్టి దీర్ఘ కోపమునకు గర్వ భంగము తప్పదని నిరూపించుటయే తప్ప ఇక్కడ శివుడు, విష్ణువును ఓడించెనని శైవులు గంతులు వేయుట పామర దృష్టియే. అట్లే భాగవతమున బాణాసురుని రక్షించుటకు వచ్చిన శివుని కృష్ణుడు ఓడించెను. ఇది వైష్ణవులకు ఆనందము నిచ్చుచున్నది. శివుడు ఎవరు? విష్ణువు ఎవరు? సృష్టి హర్తయే, సృష్టి భర్త. ఆరెండూ వేషములే. వ్యక్తియగు నటుడు దత్తుడు ఒక్కడే. కావున ఓడినది, గెలిచినది దత్తుడే. వేషములు జడములు గెలుపు ఓటమి ఉండదు. అట్లే శివుడు పెరుగుచుండగా, విష్ణువు వరాహరూపమును ధరించి కిందకు, బ్రహ్మ హంసరూపమున పైకి పోయినారు. ఆయన పాదములు విష్ణువుకు, తల బ్రహ్మకు కనిపించ లేదు. బ్ర్హహ్మ తలను చూచినానని అబద్ధమును చెప్పినాడు కావున ఆయన తలను శివుడు తుంచివేసినాడు. ఇందులో అంతరార్ధమము పరమాత్మ అనాది, అనంతుడనియును, అసత్యము చెప్పుట పనికిరాదని జీవులకు బోధించుటయే. బ్రహ్మ ముఖమును తుంచివేయుట అనగా వేషము యొక్క ముఖమును తుంచుటయే. నిజమముగా బ్రహ్మ ముఖమును శివుడు తుంచినచో, దత్తుడు తన ముఖమును తానే తుంచుటయగును. " బ్రహ్మచ నారాయణః, శివశ్చ నారాయణః" అని శ్రుతి. త్రిమూర్తులు ఒక్కరేయని చెప్పుచున్నది. ఆ ఒక్క వ్యక్తియే శ్రీ దత్త పరబ్రహ్మము.
రాధ యనగా ధార. ధార యనగా తన సాధనలో ఎట్టి పరీక్షలోను ఓడిపోక కుంటుపడక ఆగిపోక ఎన్ని బలమైన అడ్డంకులు వచ్చినను మహా తీవ్రమైన వేగముతో ఉప్పొంగి వాటిని అతిక్రమించి పరమాత్మను చేరిన మహాప్రవాహము. సృష్టి మొదలు ఇంత వరకును ఏ జీవునకు ఆ స్ధానము లభించలేదు. ఒక కళాశాలలో బంగారు పతకము ఒక విద్యార్ధికే లభించును. అట్టి బంగారు పతకము పొందినది రాధ. 14 లోకములకును పైన ఉన్నది గోలోకము. ఆ గోలోకమను శ్రీ మత్సింహాసనమును అధిష్టించిన సామ్రాజ్ఞయే రాధ. ఆమెయే లలిత యని పిలువబడుచున్నది. లలిత యనగా చాలా తక్కువ బలము కలది అని అర్ధము. ఈ జగత్తు అంతయు స్వామి యొక్క ఊహయే. ఊహ యొక్క బలము ఊహించు వ్యక్తి యొక్క బలముతో పోల్చినచో చాలా తక్కువ. ఈ సమస్త జగత్తు స్వామి యొక్క ఊహ. ఈ ఊహాజగత్తులో ఒక బిందువు మాత్రమే జీవుడు. ఈ జగత్తులో జడము చైతన్యము అను రెండు భాగములున్నవి. అవియే అపరా ప్రకృతి, పరా ప్రకృతి. జగత్తుకు ప్రతినిధిగా మానవుడు కూడా జగత్తులోనే ఉన్నాడు. మానవునిలో కూడా జడమగు శరీరము, చైతన్యమగు జీవుడు ఉన్నారు. ఊహ సముద్రమగు ఈ జగత్తులో మానవుడు ఒక చిన్ననీటి బిందువు కావుననే ఈ మానవుడు చాలా బలహీనుడు అమిత దుర్బలుడు. కావున మానవుడు లలిత యనబడు చున్నాడు. రాధ కూడా ఒక మానవాకారము కావున లలితయే. ఇట్టి మానవుడు పరమాత్మ యుండు పదునాలుగవ లోకమగు బ్రహ్మ లోకమునకు పైన ఉన్న గోలోకమున శ్రీ మత్సింహాసనమున ఆశీనురాలైన లలిత యగు రాధ యొక్క చరణముల క్రింద దత్త పరబ్రహ్మము యొక్క శిరస్సు ఉండు స్ధానమును ఆక్రమించినాడు. రాధను ఒక మానవ రూపము ఉన్న స్త్రీగా తీసుకొనుటలో అంతరార్ధము మానవ రూపములో యున్న జీవులందరు అనియే అర్ధము. ఈ స్త్రీ పురుష రూపమున ఉన్న మానవులందరును ప్రకృతి రూపులే. ప్రకృతి యనగా స్వామి చేసిన శ్రేష్టమైన కార్యము అని అర్ధము. ఒకడు ఒక పెద్ద భవనమును నిర్మించినపుడు ఆ భవనమును వాడు చేసిన కార్యము అని చెప్పుదురు. ఆ భవనములో యున్న ఒక చిన్న గోడయు వాడు చేసిన పనియే అగును. భవనమంతయును సిమెంటు ఇటుకలతో నిర్మింపబడినట్లే ఆ చిన్న గోడ కూడా సిమెంటు ఇటుకలతోనే నిర్మించబడి యున్నది. అట్లే పర అపర ప్రకృతులతో నిర్మించబడిన ఈ జగత్తు అను భవనము ఎట్లు స్వామి కార్యమగు ప్రకృతి అనబడుచున్నదో ఈ జగత్మ్భవనమగు ఒక చిన్న భాగమగు మానవుడు అన్న చిన్న గోడ కూడ పరా అపరా ప్రకృతులచే నిర్మింపబడి స్వామి కార్యమగు ప్రకృతియే అగుచున్నది. ఈ అర్ధమునే రామానుజాచార్యుడు "తత్త్వమసి" అను మహా వాక్యము యొక్క భాష్యములో "స్ధూల చిదచిత్విషష్ట విశ్వము" అన్ననూ "సూక్ష్మ చిదచిద్విశిష్ట"మానవుడన్ననూ ఒకటియేనని విశిష్టా ద్వైత వాదమున వినిపించినాడు. అనగా తత్త్వ పరముగా సముద్రము నీటి బిందువు రెండు నీవే యనుట. కావున లలిత యనగా అతి బలహీనమైన ఒక మానవుడు రాధ యనగా అట్టి మానవుడు నిరంతర భగవత్ప్రేమ ధార స్వరూపుడి తన సాధనలో అన్ని దత్త పరీక్షలను దాటిన వాడని అర్ధము. అట్టి జీవునకు దత్తుడు దాసుడై వాని చరణములను నెత్తి మీద పెట్టుకొనుటయే గోలోకము యొక్క అంతరార్ధము. దత్త పరీక్షలలో ముఖ్య తత్త్వము మన ప్రతి వస్తువు కన్నను, ప్రతి వ్యక్తి కన్నను చివరకు ధర్మము కన్నను స్వామికే ఎక్కువ విలువ నిచ్చుట. చివరకు నీ ప్రాణములతో పోటీ పడినపుడు కూడా ప్రాణముల కన్నను స్వామి ఎక్కువ యని నిరూపించు మరణమే భక్తి యొక్క దశావస్ధలలో చిట్ట చివరిది యగు మరణంతతః అని చెప్పబడినది. ఈ ప్రాణ త్యాగ పరీక్షలో గెలువ వలయునన్నచో, దాని ముందు భగవత్ప్రేమ ఉన్మాదావస్ధకు రావలయును. అందుకే మరణావస్ధకు ముందు తొమ్మిదవ మెట్టు ఉన్మాదమని "ఉన్మాదో మరణం తతః" అని చెప్పబడినది. ఇట్టి ఉన్మాదావస్ధలో ప్రహ్లాదుడు ప్రాణ త్యాగమునకు హిరణ్యకశిపుని హింసలకు సిద్ధమైనాడు. మరియును జీవతో వాక్య కరణాత్‌ అను ధర్మమును సైతము ఉల్లంఘించి ధర్మము కన్నను స్వామికి విలువ నిచ్చినాడు. ఈ విధముగా దత్త పరీక్షలలో దత్తుడు ధర్మముతో పోటీ పడినపుడు మహా భక్తులు సైతము ఒక్కొక్కసారి స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువ నిచ్చి పరమపదసోపాన పటములో ధర్మము అను మహా సర్పము యొక్క నోటిలోపడి క్రిందకు జారినారు. అనగా చిట్టచివరి పరీక్షలో తప్పి వారి భగవత్ప్రేమ ప్రవాహము కుంటుపడి సాగక పోవుట వలన నిరంతర ధారకానందున రాధాతత్త్వమును పొందలేకపోయినారు. కావుననే సర్వధికమైన గోలోకమునకు ఆధిపత్యము అను కైవల్యమునకు మించిన ఫలమును పొందలేకపోయినారు. అద్వైత కైవల్యములో బ్రహ్మత్వమును పొంది బ్రహ్మముతో సమానుడైన దత్త పరబ్రహ్మమే తానై బ్రహ్మలోకము నందుండుట కానీ గోలోక నివాసములో బ్రహ్మమునకే స్వామియై బ్రహ్మమునే దాసునిగా చేసుకున్న సర్వోత్తమ స్ధానము లోకపాలకులగు దేవతలు రాజులు అనబడుదురు. అట్టి దేవతలు దేవుడే యగు దేవ దేవ పదవియగు దత్త పరబ్రహ్మమే రాజరాజు. అట్టి దత్త పరబ్రహ్మమునకే స్వామిగా నిలుచుటయే ఈశ్వరీ పదవి. దీనినే రాజరాజేశ్వరి అందురు. దేవతలు తేజో రూపులగుట వలన శ్రీ మంతులు అనబడుదురు. అట్టి వారికి దేవుడగుటయే దేవదేవ పదవి యగు శ్రీ మత్సింహాసనము. అట్టి దేవదేవుని శాసించు ఈశ్వర పదవియే శ్రీ మత్సింహాసనేశ్వరి. ఈ స్ధానము అన్ని దత్త పరీక్షలలో గెలిచి ఎచ్చటను ఆగని నిరంతర ప్రేమధారయగు రాధకే చిక్కినది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

2 comments:

  1. అయ్యా - ఇక త్రిమూర్తులు, హనుమంతుడు, రాధ, సత్యభామ, రుక్మిణీ వీరంతా ఒకటే రూపం, దత్త రూపం ఐతే మీరూ - నేనూ - వేషం వేసిన సుబ్బయ్య, సర్వంసహా మానుష, జంతు, పశు పక్ష్యాదులు, సర్వప్రాణికోటీ కూడా దత్త రూపమే....సర్వం దత్తరూపాయ నమహ. జై బోలో దత్త భగవానులకు

    ReplyDelete
  2. అయ్యా! వంశీ గారు, మీరు first para చదివి concusion చేసినట్లున్నారు. అందరూ దత్తుడైతే, ఇక ఆధ్యాత్మిక సాధనే అక్కర్లేదు. Swami message లో, అందరూ దత్తవేషములే అని లేదు. దుర్యోధనుడు జీవుడే. సర్వం శరణాగతి చేసిన వారికి ఏ position భగవంతుడు ఇస్తాడో చెప్పటానికి ఆయనే, practical గా చేసి చూపిస్తాడు. When God preaches about himself and service to him, somebody may say, oh! it is very difficult to follow. To show, how it is possible practically (not just theoretically), he shows us the way by such rolls. For example, he gave a position higher than him self in Goloka to Radha, Bhavisha Brahma to Hanuman. It does not mean that I also become God (Datta).

    He also shows how a devotee can slip in the way, he showed as Hanuman when he fought with Rama for the sake of his mother. When he came again as Shankara, he left his mother and showed that God is higher than all other bonds.

    Also, the births of animals and birds are condemned births. There is no chance for reform for such souls.

    From all such practical rolls, we have to learn how to serve when he comes as human incarnation.

    జీవుడు జీవుడే. దేవుడు దేవుడే
    AT the lotus feet of Shri Dattaswami
    -Durgaprasad

    ReplyDelete