Monday, March 16, 2009

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! (Part-3)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా!
[శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము)]

వేదార్ధమును బోధించిననాడు పురోహితుడు ఆచార్యుడై వెలుగునని వేద ధర్మము (ఆచార్యవాన్ పురుషో వేద...). ఉదాహరణకు- ఉపనయనములో మూడు పోగులుగల యఙ్ఞోపవీతమును ధరించుటలో త్రిగుణ స్వరూపమైన ప్రకృతి రూపమగు మనుష్య తనువును ఆశ్రయించిన పరబ్రహ్మమగు సద్గురువును ఆశ్రయించి గానముతో కీర్తించవలయునని చెప్పుటకై జందెమును పట్టుకొని గాయత్రిని జపించుతలోని అంతరార్ధము. ఊహలకు సైతము అందని పరబ్రహ్మము త్రిగుణ ప్రకృతి రూపమును ఆశ్రయించి అవతరించునని బోధించుటయే బ్రహ్మోపదేశము. సాక్షాత్తు పరబ్రహ్మమును పట్టలేము కావున అది ఆశ్రయించిన ప్రకృతి ఉపాధిని ఆశ్రయించుటచేత పరబ్రహ్మము యొక్క సమీపమునకు (ఉప) పోగలమే (నయనము) తప్ప అన్య మార్గము లేదు. సూర్యోపస్థాన ప్రకరణములో అచేతన ప్రకృతి రూప మానవ రూపమగు సద్గురువును అన్వేషించుట కష్టముగాన, అచేతన ప్రకృతి రూపమును ప్రతీకగా ఉపాసించునప్పుడు సృష్టి అంతయు త్రిగుణ స్వరూపమే కావున మూడు పోగుల జందెము ఇచ్చట కూడా సమన్వయించును. బ్రహ్మచర్యమునుండి తిరిగి వచ్చిన తరువాత (సమావర్తనము) సద్గురువును ముక్తి మార్గమునకు అన్వేషించుట వేదోక్తము (సగురు మేవాభి గచ్ఛేత్). ఇట్లు మంత్రములను ఆయా ప్రకరణ విషయములకు అనుసంధానము చేసి అన్వయించి వివరించవలయును. ప్రకరణార్ధమే తెలియని వారు ఇక మంత్రార్ధ సమన్వయమును ఎట్లు చేయగలరు? ఇట్లు అసలు అర్ధము తెలియక పోవుట వలన వేడుకలు దూరి ఈ సంస్కారములను పెడ ద్రోవను పట్టించుట వలన బ్రహ్మఙ్ఞాని అగు వటువుని సైతము పెళ్ళికొడుకని పిలచుచున్నారు. వివాహమును జరిపించునపుడు స్నాతకము, వరపూజ, స్థాలీపాకము, నాకబలి, హోమము అనునవి ముఖ్య ప్రకరణములు. స్నాతకము అనగా బ్రహ్మచర్యాశ్రమమును ముగించి ఙ్ఞానియై బయటకు వచ్చుటయే. వేదవచనము ప్రకారముగా పరబ్రహ్మస్వరూపుడగు సద్గురువును అన్వేషించుచు సంన్యాసాశ్రమమునకు బయలుదేరుటయే (తదహరేవ ప్రవ్రజేత్...). అట్లు అన్వేషించుచు శంకరులు గోవింద భగవత్పాద సద్గురువులను ఆశ్రయించినారు. కానీ ఈ మార్గము భగవదవతార పురుషులగు శంకరాచార్యులకే సాధ్యము. ఈ మార్గములో ధర్మార్ధ కామములు త్యజించబడుచున్నవి. కేవలము మోక్ష మార్గమగు సంన్యాసమే సూచించబడుచున్నది. ఇది సామాన్య జీవులకు అసాధ్యము. ఈ తత్త్వమును తెలియక్ స్నాతకుడైన యువకుడు ఆవేశముతో సంన్యాసమునకు బయలుదేరుటయే కాశీ యాత్ర. కాశీ యనగా జ్ఞానముతో ప్రకాశించి సద్గురు స్వరూపమే (కాశతే ఇతి..). అట్టి సద్గురువుని చేరుటకు చేయు ప్రయాణమే కాశీ యాత్ర.. సామాన్య జీవుడగు యువకుడు దానిని సాధించలేక పతితుడగునని ఆశయముతో ఆచార్య ప్రేరితుడై కన్యాదాత అట్టి యువకుని గృహాస్థాశ్రమమును ప్రవేశించి, ధర్మార్ధ కామములను నిర్వర్తించి, భార్యా సహాయుడై మోక్ష మార్గమును సాధించు వానప్రస్థమును ప్రవేశించమని బోధించుచున్నాడు. అట్టి స్నాతకునకు కన్యాదానము చేసి, వాని క్రమముక్తి మార్గమునకు సహాయపడు కన్యాదాత వరుని, సత్పాత్రుడగుట వలన లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి, సత్పాత్ర దానము యొక్క పుణ్యమును ఆర్జించుటకై వరపూజను చేయుచున్నాడు. ఈ క్రమముక్తి మార్గములో కూడా తుదకు దైవాన్వేషణయే లక్ష్యము. వానప్రస్థములో భార్య ఆహారమును వండి పెట్టుట చేత, భిక్షాటన క్లేశము లేక కాలమును సత్సంగముతో సద్వినియోగము చేసుకొనవచ్చును. సంన్యాసాశ్రములో భిక్షాటనలో కొంతకాలము వ్యర్ధమగును. అందుకే తన శిష్యుడగు మండనమిశ్రుని భార్యయగు ఉభయభారతిని శంకరులు తమ వెంట ఉంచుకొని భిక్షాటన కాల క్లేశమును పరిహరించి, సర్వ కాలమును జ్ఞాన చర్చలతో గడిపినారు. ఇట్టి సహకారమును కన్య చేయగలదు అని నిరూపించుటయే స్థాలీపాక ప్రకరణము. గిన్నెతో వంట చేయుటయే స్థాలీపాకముజ. దీనిని జ్ఞానులకు నివేదించుటయే నాకబలి అర్థముల్. నాకము అనగా స్వర్గము. స్వర్గవాసులగు దేవతలు చెప్పబడుచున్నారు. ఆహారమును నివేదించుటయే నాకబలి. ఉభయభారతి వంట చేసి శంకరులకు వారి శిష్యులకు వడ్డించెడిది. వంటచేయునపుడు భార్య సత్సంగములో పాల్గొనలేదు కావున ఆ సత్సంగ సారమును భర్త తన భార్యకు వివరించ వలసిన అధ్యాత్మిక బాధ్యతను స్వీకరించుటయే మరియొక జందెమును ధరించుట. సంన్యాసము ఒంటరిగా నడచు కాలి నడక వంటిది. గృహస్థాశ్రమములో ఇట్టి సౌకర్యము ఉండుట వలన త్వరగా గమ్యమును చేరు అర్ధమే వివాహ శబ్దమునకు కలదు (విశేషో వాహః). ఒక విశేష వాహనము ద్వారా గమ్యమును చేరుటయే వివాహము. ఇక హోమము అనగా ఆకలి మంటయగు జఠరాగ్ని స్వరూపమైన వైశ్వానరాగ్నిలో ఆహారమును సమర్పించుటయే కాని నిప్పులో నేతిని పోయుటకాదు. ఈ విధముగా వివాహము యొక్క అంగములన్నియు దైవమే లక్ష్యముగా కలిగి దైవ స్తుతి స్వరూపమగు జ్ఞాన యజ్ఞముగా ఆచార్యుడు జనులకు వివరించుటయే వివాహముయొక్క ముఖ్య లక్ష్యము. ఈనాడు ఈ లక్ష్యముయొక్క అణుమాత్ర జ్ఞానము కూడా తెలియక కేవలము లౌకికములైన వేడుకలుగా వివాహము ముగియుట హిందూమతము యొక్క అత్యంత శోచనీయమైన దురవస్థ.

కావున పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి. కేవలము బట్టీపట్టి వేదములను చదివి, ద్రవ్యములతో కర్మలను చేయించి కూలీని సంపాదించు కూలీలుగా జీవించవలదని బోధించిన యాస్క మహర్షి హితోపదేశమును గుర్తు తెచ్చుకొనుడు (స్వర్ణ భార హరః ...). ఇట్టి బట్టీపట్టిన వారు దేవ పశువులనియు, బ్రహ్మర్షులగు బ్రాహ్మణులకు బంధువులు మాత్రమే తప్ప బ్రాహ్మణులు కాదనియు ఆక్షేపించుచున్నది (దేవానాం పశు రహహ..., బ్రహ్మబంధురివ...). పురోహితుదు జ్వలించు అగ్నియని ఋగ్వేదముచే ఆది మంత్రములో కీర్తించబడుచున్నాడు. అట్టి పురోహితుడు జ్ఞానమును వదలి, వేదమును కేవలము బట్టీ పట్టి చదువుటచేత ఎంత నవ్వులపాలు అయినాడో ఆలోచించండి. పురీషము, రోషము, హింస, తస్కరుడు అను నాలుగు శబ్దములయొక్క ఆద్యాక్షరములే పురోహితుడని ఆక్షేపించుట ఎంత బాధాకర విషయము (ఆద్యాక్షరాణి సంగృహ్య చక్రేధాతా పురోహితం...). మండుచున్న నిప్పులవలె ప్రకాశించి బ్రహ్మర్షులు నాడు జనులచే ఎంత గౌరవించబడినారు. నేదు అవే నిప్పులు చల్లారి బొగ్గులై, బూడిదయై జనుల పాదములచే తొక్కబడుచున్నారు గదా(జ్వలితం న హిరణ్య రేంసం, చయమాస్కందతి భస్మనాం జనః - భారవి).


శ్రీ దత్త స్వామి వారు (శ్రీ జన్నాభట్ల వేణు గోపాల కృష్ణ మూర్తి) హిందూమతోద్ధరణమును గురించి ఇచ్చిన దివ్యోపన్యాసములలో నుండి గ్రహింప బడిన ప్రధమోపన్యాసము.

Saturday, March 14, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: సద్గురువును గుర్తించుట

ఈనాడు మీరు అందరును ఈ దివ్య దత్త జ్ఞాన-భక్తి ప్రచార సేవకై నా చరణముల వద్ద గురుదక్షిణలను సమర్పించినారు. గురుపూర్ణిమ నాటి పూర్ణ చంద్రబింబము బంగారము లేక వెండి నాణెమును అనగా ధనమును సూచించుచున్నది. ఇది నీవు గురువుకు సమర్పించవలసిన గురుదక్షిణలను గుర్తుచేయుచున్నది. ప్రతి నెలా గురుదక్షిణనీయవలెనని ప్రతిపూర్ణిమ నీకు చెప్పుచున్నది. గురువు నరుడు కారాదు. అతడు నరరూపమున వచ్చిన నారాయణుడగు సద్గురువు కావలెను. అప్పుడే నీ గురుదక్షిణకు సద్వినియోగము జరుగును. ధనమే నీ సత్య ప్రేమను నిరూపించుచున్నది. నీవు ధనమును ఎవరికి ఇచ్చుచున్నావు? నీ సంతానమునకు ఇచ్చుచున్నావు. కావున నీ నిజమైన ప్రేమ నీ సంతానముపైనే ఉన్నది. అదియే చక్కని నిజమైన పరీక్ష. నీకు భగవంతునిపై అట్టి నిజమైన ప్రేమ ఉన్నచో నీవు ధనమును భగవంతునకే ఇచ్చెదవు. దీనిలో ఇంక వాదము లేదు. ఇది క్రియాత్మకమైన పరీక్ష. మనస్సుతో ధ్యానము, నోటితో స్తోత్రము నీ అసత్యమైన దైవ ప్రేమను ఇతరులకు సత్యమని చూపించు వంచనయే. అయితే కంచములో అన్నము ఉన్నచో పక్కన ఉన్న ఊరగాయ ముక్కలవలె ఈ ధ్యాన, స్తోత్రములు గురుదక్షిణలకు పక్కనే చేరి ఉన్నచో సార్థకములగును. ఈ గురుదక్షిణలే కర్మఫలత్యాగము అని గీతలో అడుగడుగనా ఘోషించబడినది. కర్మయొక్క ఫలమును ఆశించక దానిని ఈశ్వరార్పణము చేయుటయే కర్మఫల త్యాగము లేక గురుదక్షిణ. గురుదక్షిణ లేని ధ్యాన స్తోత్రములు కేవలము ఊరగాయ ముక్కలు మాత్రమే ఉండి అన్నము వడ్డించని విస్తరి వలే ఉండును. గురుదక్షిణ సార్థకము అగుటకు సద్గురువును గుర్తించవలెను. "సత్యం, జ్ఞానం" అని వేదము సద్గురువును సత్యమైన, అనంతమైన జ్ఞానముచేత గుర్తించవలయును అని చెప్పుచున్నది. నాలుగు వేదముల మహావాక్యములలో మొదటి మూడు వాక్యములు పరమాత్మ నావలె, నీ వలె, వాని వలె మనుష్యాకారమున ఉండునని చెప్పుచున్నవి. నాలుగవ మహావాక్యము అట్టి నరావతారుడు ఎట్టి నరులు చెప్పలేని విశేష జ్ఞానముతో ఉండునని పలుకుచున్నది. పండితులు చెప్పు జ్ఞానము తల నొప్పిని కలిగించును. అవతరించిన సద్గురువు చెప్పు జ్ఞానము మాత్రమే హృదయములోనికి చొచ్చుకొని పోయి ఆనందమును కలిగించుచున్నది.

ఆనందము బ్రహ్మమని వేదవాక్య ప్రమాణము. వేడిచేత అగ్నిని గుర్తించినట్లు ఆనందప్రదమైన జ్ఞానము చేత సద్గురువును గుర్తించవలెను. మహిమలు గుర్తులు కావు. రావణుడు మొదలగు రాక్షసులు సైతము మహిమలను ప్రదర్శించెను. మొండి బిడ్డలగు ఈ రాక్షసులు తపస్సు అను మొండి పట్టుదలద్వారా స్వామికి సొమ్ములవలెనున్న ఈ మహిమలను స్వామి నుంది పొందెదరు. వారు స్వామి నుండి జ్ఞాన గుణములను పొందలేరు. కావున వారు స్వామి కాలేరు. మహిమలచేత వారు దేవుడని ప్రకటించుకున్నను ఈ కారణమువలన ఋషులు అంగీకరించలేదు. ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము: "ఈ విశ్వమంతయు ఈశ్వర ధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్న ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని" చెప్పుచున్నది.

Friday, March 13, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము

ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము: "ఈ విశ్వమంతయు ఈశ్వర ధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్న ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని" చెప్పుచున్నది.

గోపికలు తమ సర్వకర్మఫలమగు వెన్నను నరాకారమున ఉన్న కృష్ణునకు పెట్టి వారి పిల్లలకును పెట్టక అత్యుత్తమమైన గోలోకమును పొందినారు. ప్రారబ్ధ కర్మఫలమగు శరీరములను సైతము స్వామికి సమర్పించి ధర్మభంగమునకు, నరకమునకునూ భయపడక సర్వార్పణ త్యాగమును చేసి అత్యుత్తమ స్థితిని పొందినారు. వారు గురుదక్షిణగా స్వామికి అర్పించనిది ఏమున్నది?

స్వామి గోపికలతో ఉన్నాడె తప్ప పురుషులతో కలసి ఏల ఉండలేదు? అని స్వామిని స్త్రీ లోలునిగా నిందించుచున్నారు. దీనిలోని రహస్యమేమి? పురుషుడు అహంకార రజోగుణములతో ఉండును. స్త్రీ ఎప్పుడునూ వినయము, భయము మొదలగు సాత్త్వికమైన మోక్షగుణములతో ఉండును. అందుకే ఋషులు గోపికలుగా జన్మించినారు. ఏ జీవుడైనా ముక్తికి ముందు కడపటిజన్మగా స్త్రీ జన్మను పొందవలసినదే. అయితే దీని అర్థము ప్రతి స్త్రీ జన్మ చివరి జన్మ అని కాదు.

కన్నప్ప అను కిరాతుడు దేహములో ప్రధానమైన కన్నులను స్వామికి సమర్పించినాడు. అది అత్యుత్తమ గురుదక్షిణ. నీకు నీ కుటుంబమునకు కావలిసిన ధనమును ఆర్జించుకొనుటకు స్వామి అనుమతించును. నీవు ఎక్కువ తీసుకొన్నచో దానిని స్వామికి ఇచ్చివేయమని వేదము బోధించుచున్నది. నీవు మిత్రుని ఇంటికి పోయినప్పుడు కప్పుతో పాలను ఇచ్చినాడు. పాలను త్రాగుము. కాని కప్పును దొంగిలించకుము. దొంగిలించినచో నీవు దొంగవు పాపివి అగుదువు అని వేదము చెప్పుచున్నది. ఆ ఎక్కువ పాప ధనము నిన్ను కష్టముల పాలు చేయుచును. కొందరు భక్తులు వారి కనీస ధనమును కూడా మొత్తము లేక కొంత స్వామికి సమర్పించుచున్నారు. పాటిల్ పండించిన సంవత్సర ధాన్యమంతయు షిరిడీ సాయిబాబాకు తెచ్చి ఇచ్చి ఆయన ప్రసాదించినది తీసుకొని పోయెడివాడు. ఒక ధనికుడు బ్రహ్మ జ్ఞానమీయమని సాయిని వెంటబడగా సాయి నాకు కావలసిన ఐదు రూపాయలను నీ జేబు నుండి తీసి ఇవ్వలేనివాడవు నీవు బ్రహ్మమును ఎట్లు తెలుసుకొందువు? అని చెప్పినాడు. ఈ కర్మఫలత్యాగమును నేర్పుటకే సాయి అందరినీ గురుదక్షిణ అడిగెడివాడు.
అసలు స్వామికి నీ ధనము అక్కరలేదు. నీవు తీసుకొన్న పెచ్చు ధనమును ఇచ్చటనే వదలి ఆ పాపముతో ఒక్కడవే పైకి పోవుచున్నావు. ఈ విశ్వమంతయును స్వామి ధనాగారమే. ఆయన ధనాగారములోనే నీవు తీసుకొనుట, అనుభవించుట, వదలివేయుటయు జరుగుచున్నది. నీవు దొంగిలించిన హెచ్చు ధనము నీ చేతులతో స్వామికి సమర్పించని పాపమును మాత్రమే మూటగట్టుకుని ఆ హెచ్చుధనమును ఇచ్చటనే వదలిపోవుచున్నావు.