Friday, August 20, 2010

భగవద్గీత

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్‌ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్‌ సాంగ్‌లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్‌ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad