Monday, August 31, 2009

శంకరులు (Part-2)

నిజమే! శిష్యులు బౌద్ధులైనప్పుడు గురువు ప్రచ్ఛన్న బౌద్ధుడే కావలయును. బురదలోని వారలను పైకి లాగుటకు గురువు బురదలో దిగవలయును. ఇది గురువుకు తప్పదు. ఆ గురువుకు బురద అంటుకొనక తప్పదు. ఇట్లు నాస్తికులగు బౌద్ధులను ఆస్తికత్వమను మెట్టు ఎక్కించి శంకరలు నిష్క్రమించిరి. శిష్యులు అపార్ధము చేసుకొని నేనే భగవంతుడనని భ్ర్రమించి వాగుచూ అహంకారము పరాకాష్ఠకు చేరి పతితులైనారు. శంకరులు నిష్క్రమించక ముందే జీవుడు భగవంతుడు కాదని కరిగిన సీసమును తాగి శిష్యులు అది తాగలేకపోగా యదార్ధము బోధించినారు. అద్వైత పండితులు ఈ ఘట్టమును గురించి ఎప్పుడునూ మాట్లాడరు. శంకరుల భాష్యమంతయును వివరరింతురే కాని శంకరులు ఒక్కరే సీసమును త్రాగినారని కావున శంకరులు అను జీవుడొక్కడే బ్రహ్మమ అనియు, ఇతరులు బ్రహ్మము కాదనియు ఎప్పుడును పలుకరు. ఈ ఘట్టము వారి అహంకార, మాత్సర్య, మొండితనమునకు అనుకూలము కాదు. తమ కన్న అధికుడైన భగవంతుడు ఒకడున్నాడని చెప్పినంత మాత్రముననే ఓర్వలేని నాస్తికులు, ఆ భగవంతుడు నరరూపమున అవతరించును అని చెప్పిన నమ్ముదురా! కావున శంకరులు నేను బ్రహ్మము, నీవు బ్రహ్మము. ఇరువురము సమానమే అని చెప్పి నాస్తికులను మెల్లమెల్లగా సన్మార్గము వైపునకు లాగెను. ఈ సిద్ధాంతమునకు వారి అహంకాము, మాత్సర్యము సంతృప్తి చెందినది. కావున, ఈ సిద్ధాంతము చాలా బాగున్నదని వారు శంకరులకు శిష్యులైనారు. కొంతకాలము గడచిన తర్వాత కరిగిన సీసము తాను త్రాగి మీరు నేను బ్రహ్మమే కదా కావున మీరును త్రాగుడు అనెను.

ఇట్లు కొంతకాలము గడచిన తర్వాత మెల్లగా జీవుడు కన్నా పరమాత్మ అధికుడనియు, ఆ పరమాత్మ నరరూపమున కూడా అవతరించుననియు బోధించెను. ఇదే శంకరుల వారి చిట్ట చివరి బోధ. ఈ బోధతో కొందరు శిష్యులు మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు ఆయన నరరూపములో కూడా వచ్చును అని విశ్వసించి తరించరి. కాని మరికొందరు మాత్రము మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు కాని ఆయన నరరూపమున ఉండడు అని తలచినారు. అనగా వీరిలో అహంకార మాత్సర్యములు కొంత శాంతించినవి. అనగా అధికుడైన భగవంతుడు ఉన్నాడు అంతవరకు అవి శాంతించినవి. కాని సాక్షాత్తుగా తమవంటి నరరూపమున ఉండుననుట వారు ఓర్చలేకపోయినారు. కావున వీరికి అకూలముగా బోధచేయుటకు దత్తుడు రామానుజ రూపమున అవతరించినారు. అధికుడైన భగవంతుడు వైకుంఠమున నారాయణ స్వరూపముగా ఉన్నాడు. ఆయనను జడ స్వరూపములైన పటములు, విగ్రహముల రూపమున అర్చించు విధానమును ఏర్పరచినాడు. తమమవంటి నరుని భగవంతునిగా అర్చించుటలో అసూయ పుట్టునుగాని, జడములైన పటములు విగ్రహరూపములలో అర్చించుట అంత అసూయ జనించదు. తమ వంటి నర స్వరూపమున ఉన్న భగవంతుడు ఈ లోకమున లేడ ఎక్కడో వైకుంఠమున ఉండును. మన కంటపడడు. కావున మనము ఎట్టి నరుని అర్చించ పనిలేదు అను మతమును రామానుజుడు ప్రవేశపెట్టినాడు. ఎప్పుడు అసూయ పూర్తిగా నశించునో అప్పుడు అట్టి జీవుడు అనసూయ యగును. అట్టి జీవునకు నరస్వరూపమున ఉన్న పరమాత్మ దత్తుడగును. అనగా చిక్కును.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, August 27, 2009

Few Gems from discourses of H H Shri Dattaswami

Few Gems from His divine messages, which come in a series of books, are given below.

1. It is not correct to say ‘Worship is work.’ If you carry on the worship as full time work, you will have to depend upon the devotees for your livelihood. People will neglect you and your preaching. It is also not correct to say ‘Work is worship’ because you are engaged in the process of earning for the sake of your family which will lead you to the cycle of animal births. Both are extreme ways. The best way is ‘Work and Worship’. You work for your livelihood and worship in your leisure time. Worship means Service of God. Service means spreading the knowledge of God among all the human beings for their salvation.

2. Do your duty to earn your livelihood and take sufficient rest. Instead of spending the remaining time and energy in watching TVs, Movies, Gossips and reading novels and storybooks, utilize the remaining time and energy for the service of Lord Datta. It is sufficient for your salvation.

3. Datta means ‘Daana’ (Donation). Veda says ‘only by magnanimity Brahman is obtained.’ Donate food, clothes and medicines to the poor who are in need of them. Apart from this there are several people who are in need of knowledge and devotion. Imparting knowledge and devotion to such people is more valuable. Great Saints like Swami Vivekananda, Shankara and Meera preached the same throughout their lives.

4. If you are not able to devote your time and work to God’s service, don’t get disappointed. Do not get scared by the statement ‘Even camel may pass through the eye of the needle but a rich man cannot reach the God’. There is a way for you also. As per the saying of the Gita ‘Karma Phala Tyagah’ means donating some part of your earnings to the service of God is equivalent to spending time and energy for God’s service. By Karma Phala Tyaga, you too can attain the salvation.

5. Knowledge is knowing about God. To praise Him by words is devotion. Both knowledge and devotion are proved in service (Karma/Seva). So service is higher than knowledge and devotion. Vibhishana asked Hanuman ‘Though both of us are devotees of Rama, why you were only blessed by Rama?’ Hanuman replied, O Vibhishana ‘This is because I have participated in His work in addition to devotion.’ So those who do service of God by participating in the propagation of God’s knowledge and devotion will be really blessed by God. Satyabhama confined Lord Krishna to herself. Rukmini shared Him with all His eight wives. Radha shared Him with all the 16,000 Gopikas. Meera spread the message of Lord Krishna to all the human beings and that is why Meera alone attained ‘Sasareera Kaivalya.’

6. The Vanaras (monkeys) who are involved in constructing the ‘Varadhi (Bridge)’ has stopped the work when the stones started submerging in the sea. But the tiny squirrel, which was dropping a few sand particles in the sea, did not stop the work. Even though the monkeys are throwing big stones in to the sea Rama did not appreciate the work of monkeys as they are not serving with complete faith. But the squirrel which has full faith that the work of Rama is not anyway going to stop, continued the dropping the sand particles and kept on doing the work to the best of its ability. Rama has appreciated the little work done by the squirrel by patting its back. So serve the Lord with full faith and to the best of your ability.

7. Remember! Even though you do a little service to the Lord, you will get enormous benefits. The same is proved when Draupadi tore a piece of her sari and used the piece as a bandage to Lord Krishna when His finger got injured. For this timely service, which Draupadi did to Lord Krishna, she has been blessed with a chain of saris at the time of ‘Vasthrapaharana’.

8. Arjuna did not have any temple for him, because he used God for his work. But, Hanuman has temples everywhere because He engaged Himself in the service of Lord Rama. So, set aside for atleast sometime using the God as an instrument in your work and think of engaging yourself in the service of God.

9. It is very difficult to concentrate on Nirakara (the one which do not have any physical form). The Sakara meaning idols and photographs can be seen and touched. But, in Naravathara i.e., when Lord incarnates in the form of human being, you can see, touch, talk and live along with Him. Hanuman and Radha who worshipped the human incarnation in their time attained the highest stage of salvation. Gita says ‘I will always take a human form (Manusheem Tanum Aasritham)’. The meaning of all the four Mahavakyas of four Vedas is also the same. Shankara told that God comes in human form but His disciples misinterpreted it and thought that all the human beings are God. Then Shankara drank molten lead and asked His disciples to drink the same. By this He proved that the human incarnation alone is Brahman and not His disciples.

10. The Lord incarnates in all countries and preaches the same message simultaneously to all generations. Otherwise God becomes partial if the same philosophy is not propagated and preached among all the generations at all times.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Wednesday, August 26, 2009

శంకరులు (Part-1)

శిష్యుల యొక్క సాధన స్ధితిని బట్టి ఏది చెప్పవలయునో ఎచ్చట ఆరంభించవలయునో, ఎచ్చట ముగించవలయునో, ఎట్లు చెప్పవలయునో శ్రీ దత్త్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియును. శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టును గురించి బోధింపడు. అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టునుండి భ్రష్టుడగును.ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము. ప్రత్యక్షమును తప్ప విశ్వసించని నాస్తికులగు బౌద్ధులకు ఎక్కడో పరోక్షమున వైకుంఠమున శ్రీ మన్నారాయణుడు ఉన్నాడు అని బోధించకూడదు. వానికి ప్రత్యక్షముగా అనుభవమునకు అందు వస్తువును చూపించి "ఇదే భగవంతుడు" అనవలయును. ఆ వస్తువు వీలగునంత వరకు భగవంతునుతో ఎక్కువ పోలిక కలగియుండవలయును. సృష్టిలో ఉన్న అన్ని పదార్ధములలోను అత్యంత శ్రేష్టమైన తత్త్వము చైతన్యము అనగా జీవుడు. కావున పరమాత్మ అసలు లేడు అను బౌద్ధులకు అత్యంత శ్రేష్టమైన చైతన్యమును చూపి ఇదియే పరమాత్మ అన్నారు శంకరుడు. చైతన్య తత్త్వము కొంత ఊహకు అందుచున్నది. కొంత అందుట లేదు. అన్నరసము యొక్క పరిణామము వలన ఏర్పడు అత్యంత సూక్ష్మ శక్తియే చైతన్యము. "అన్నాత్‌ పురుషః" అని శ్రుతి. అనగా అన్నము నుండి పురుషుడు పుట్టుచున్నాడని అర్ధము.అన్నము తినకున్నచో శరీరములోని చైతన్యము అస్తమించుచున్నది. ఇంత వరకు చైతన్యము తత్త్వము ఊహకు అందుచున్నది. ఇక ఊహకు అందని తత్త్వము ఏది అనగా ఒక జడపదార్ధములో అన్నరసమును పోయగా చైతన్యము పుట్టుటలేదు. ఈ విధముగా చైతన్యము ఊహకు అందుట, ఊహకు అందకపోవుట అను రెండింటి మధ్య సంధి స్ధానముగా యున్నది. ఊహకు అందుచున్నది కావున నాస్తికులు దీనిని అంగీకరింతురు. అనగా చైతన్యము ఉన్నదని చెప్పి చైతన్యమే భగవంతుడు అని చెప్పి కావున భగవంతుడు ఉన్నాడని నాస్తికులచేత అంగీకరింప చేయవచ్చును. ఇప్పుడు చైతన్యము యొక్క ఊహకు అందని విషయమును బోధించి భగవంతుడు ఊహకు అందడు అని చెప్పి వానిచేత క్రమముగా అంగీకరింప చేయవచ్చును. ఇట్లు శిష్యులు యొక్క స్ధితిని బట్టి బోధయుండును. అంతేకాని ఒక్కసారిగా నాస్తికునకు వైకుంఠవాసియగు విష్ణువును అర్చించమని చెప్పినచో వాడు అంగీకరించడు.

క్రమముగా బౌద్ధులు జీవుడున్నాడనియు జీవుడే అన్ని సృష్టి పదార్ధములకు గొప్పవాడు కావున భగవంతుడనియు విశ్వసించరి. ఈ నాస్తికులు ఆరాధన విధానములను నమ్మరు. తమకన్న గొప్పవాడగు భగవంతుడు ఉన్నాడని అంగీకరించరు. ఏలననగా వారిలో అహంకార మాత్సర్యములు అత్యధికముగ యుండును. కావున అట్టివారికి నీకన్న అధికుడైన భగవంతుడున్నాడని చెప్పినచో వాడు అంగీకరించడు. కావున వానికి జీవుడవైన నీవే పరమాత్మవని చెప్పవలయును. ఈ వాక్యము చేత వానిలోని అహంకార మాత్సర్యములు శాంతించును. పరమాత్మను పొందుటకు తపస్సు చేయమన్నచో వాడుచేయడు. కావున వానికి నీవే పరమాత్మవని తెలుసుకున్నంత మాత్రమున " పరమాత్మవు అగుదువు" అని చెప్పవలయును. నేనే బ్రహ్మమని తెలుసుకున్నంత మాత్రమున వాడు బ్రహ్మమగు చున్నాడు అను జ్ఞానమార్గముననే వానికి చెప్పవలయును. అట్లుకాక భగవంతుని పొందుటకు ప్రయత్నమును చేయవలయును అని చెప్పుటకు తనకన్న అధికుడైన భగవంతుడు వేరుగా ఉన్నాడని చెప్పవలెను. అట్లు చెప్పినచో అహంకార మాత్సర్యముతో భగవంతుడే లేడని వాడు పలుకును. కావున నాస్తికుడు శిష్యుడైనప్పుడు గురువుకు ఇంతకన్న వేరు మార్గము లేదు. నేవే బ్రహ్మము దానిని మరరచిపోయినావు అది తెలుసుకొన్నచో బ్రహ్మము అగుదువు అను అద్వైతమే అచ్చట ఏకైక శరణ్యము. దీనికి కారణము కూడా శంకరుల వారు ప్రతిపాదించినారు.భగవంతుడు చైతన్యస్వరూపుడు జీవుడును చైతన్యస్వరూపుడు కావున జీవుడే భగవంతుడు అని చెప్పినప్పుడు నాస్తికుల విషయమున ఆస్తికత్వము నిలచియుండును. శంకరులు బౌద్ధులకు బోధించిన సిద్ధాంతమిది. కావుననే ఆయనను "ప్రచ్ఛన్న బౌద్ధుడు" అన్నారు. అనగా శంకరుల అద్వైత మతము వేదాంతము ముసుగు ధరించిన బౌద్ధమతమే అని అర్ధము.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు

Sunday, August 23, 2009

శివ స్వరూపము - శంకరులు

శ్రీ దత్తుని శివస్వరూపమే శంకరులుగా అవతరించినది. అప్పటి పరిస్ధితులు చాలా దారుణముగా ఉండెను. అందరును భౌద్ధమతమును స్వీకరించిరి. బుద్ధుడు కూడా దత్తావతారమే. బుద్ధుడు అవతరించిన సమయమున తత్త్వవిచారణ లేక కేవలము యజ్ఞములను చేయుచు యజ్ఞములలో పశువులను వధించుచు ఉన్న రోజులవి. బుద్ధుడు పశువధలనే కాక యజ్ఞములను కూడ మాన్పించినాడు. ఏలననగా దానయోగ్యులగు వారి జఠరాగ్నిలో హుతము చేయవలసిన శ్రేష్టమగు ఆహారమైన ఆవునేతిని అగ్నిలో పోసి అంతరార్ధము తెలియక వాతావరణ కాలష్యమును పెంచుచున్నకాలమది. జ్ఞానము అను అగ్నిలో కోరికలు అను ఆద్యమును హుతము చేయవలసిన బ్రహ్మ యజ్ఞమును చేయక తత్త్వవివేక శూన్యులై మూఢులై దురహంకారులై యున్న కాలమది. "కామ ఆద్యం మన్యుపశుః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా జ్ఞానము అను అగ్నిలో కోరికలను ఆద్యమును హుతము చేయవలెను. మరియు మన్యువును అనగా మొండితనముతో కూడిన మూర్ఖత్వము గలిగిన పశువును అనగా తన పశుత్వమును అని తెలియవలెను. ఇది తెలియక కోరికలతో మూర్ఖత్వముతో యజ్ఞములను చేసిన రోజలవి. అందుకే బుద్ధుడు సర్వ దుఃఖములకు కారణమైన కోరికలను త్యజించమన్నాడు. యజ్ఞములను పశువధలనుమాని అన్నార్తులైన ప్రాణుల యొక్క జఠరాగ్నిలో ఆహారమును హుతము చేసి కరుణను కలిగి దైవత్వమును సాధించమని బుద్ధుడు బోధ చేసినాడు. తర్కమునకు సైతము అందని భగవంతుని విషయమున బుద్ధుడు మౌనము వహించనాడు. ఏలననగా వాక్కుకు పరబ్రహ్మము అందదు. ఇట్లు బ్రహ్మమును గురించి వివరించలేమని మౌనము ధరించువాడే ముని. మౌనము చేతనే పరబ్రహ్మ తత్వమును చెప్పవలెననే శంకరులు "మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వమ్‌" అని అన్నారు. బుద్ధుడు భగవంతుని విషయమున మౌనము వహించినాడు. ఈ మౌనమునకు అర్ధము భగవంతుడు లేడని బుద్ధుని అభిప్రాయమని శిష్యులు అపార్ధము చేసుకున్నారు. అందుకే బౌద్ధులందరు నాస్తికులైనారు. పశువధ ఆగినను నాస్తికత్వమను పెద్ద ప్రమాదము వచ్చినది. సన్నిపాత జ్వరము శాంతించి పక్షవాతము వచ్చినట్లైనది. ప్రతి అవతారమునకు ఇదే గతి పట్టుచున్నది. ఆయన చెప్పేదొకటి జీవులు చక్కగా వక్రీకరించి ఆచరించునది మరియొకటి. అందుకే ఆయన అవతారములను ఎత్తి ఎత్తి విసుగు జనించి చివరకు కంఠశోషయే మిగిలినది అన్నాడు.

ఈ నాస్తికత్వమును నివారించుటకు శ్రీ దత్తుడు శంకరులుగా అవతరించినారు. నాస్తికత్వములో అహంకారము విపరీతముగా యుండును. అహంకారులైన బౌద్ధులను సరియగు దోవలో తీసుకునిరావలయున్న చాలా కష్టము. దీని కొరకు శంకరులు తన మేధాశక్తినంతయు ఉపయోగించినారు. మదించి పరిగెత్తుచున్న ఒక వృషభమును ఆపుటకు దాని చిక్కమును పట్టుకొని కొ్న్ని అడుగులు దానితో పాటు వేసి తరువాత ఒక అడుగులో దానిని నిలుపవలయును. దురహంకారులైన బౌద్ధుల విషయములో శంకరులు ఇదే పద్ధతిని ఉపయోగించినారు. బౌద్ధులలో మాధ్యమిక మతాచార్యుడగు నాగార్జునుడు శూన్యవాదమును స్ధాపించినాడు. ఈ వాదము ప్రకారము అంతయును శూన్యమే. వారి మతము ప్రకారము మట్టిరేణువులను విడదీసినచో కుండ శూన్యమగుచున్నది. ఒక మట్టిరేణువులోనున్న మట్టి పరమాణువు విడదీసినచో మట్టిరేణువు శూన్యమగుచున్నది. ఈ విధముగా మనము సృష్టిలోని పదార్ధములను విడదీతీయుచు పోయినచో అంతయును శూన్యమే అగును. కావున జగత్తు శూన్యము. భగవంతుడును శూన్యమే. ఈ మతమును శంకరులు ఇట్లు ఖండించినారు. "ఓయీ! అంతయును శూన్యమే. కాని అంతయును శూన్యమే అని తెలియువాడు ఒకడుండవలయును గదా. అట్టి వాడు లేనిచో అంతయును శూన్యమేయని ఎట్లు చెప్పగలవు? కావున అంతా శూన్యము అని తెలియు చైతన్యము ఒకటి ఉన్నది అని అంగీకరించవలెను. ఈ వాదముతో బౌద్ధమతమును భారతదేశపు పొలిమేరలను దాటించి తరిమికొట్టినాడు. కావున ఈ భారతదేశములో భగవంతుడు ఉన్నాడు అను అస్తికత్వమునకు ఆదిగురువు శంకరులే. బౌద్ధ పండితుడైన దిజొన్నాగాచార్యుడు శంకర మతమును అంగీకరించి బౌద్ధమతమునే శూన్యవాద మతము నుండి ప్రజ్ఞావాద మతముగా మార్చినాడు. ప్రజ్ఞ యనగా చైతన్యము. చైతన్యము ఉన్నది అనువాదమే ప్రజ్ఞావాదము. శంకరుల గురువైన గౌడపాదులు జగత్తు శూన్యమనియు ఈ శూన్యమును గ్రహించు చైతన్యము అనగా ప్రమాత ఉన్నదయనియు ఈ జగత్తు అసలు పుట్టనే లేదనియు కారికల ద్వారా అజాతి వాదమును స్ధాపించినాడు. అజాతి అనగా పుట్ట లేదని అర్ధము. కాని శంకరులు ఈ వాదమును కొంచెము సవరించినారు. జగత్తు పూర్తిగా లేదని అనరాదు. పూర్తిగా ఉన్నదని అనరాదు. జగత్తు అసత్యము గాదు సత్యము కాదు. ఈ రెండింటి కన్నను భిన్నమైనది. అనగా మిధ్య. "సదసద్‌ విలక్షణా మిధ్య" అన్నారు శంకరులు. జగత్తులేదు అని ఆయన ఎప్పుడు అనలేదు. జగత్తు లేనిచో "సయిదం సర్వమ సృజతా" అనగా పరమాత్మ ఈ జగత్తును సృష్టించెను అన్న శ్రుతి వ్యర్ధము కావలసి వచ్చును.

మిధ్య అనగా అత్యల్పమైన సత్యము. నీ వంటి మీద ఒక చీమ ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అందువే కాని ఇద్దరు జీవులము ఉన్నాము అని అనవు. కావున అత్యల్పమును అసత్యముగా పరిగణించ వచ్చును. నీలగతీసినచో సత్యమే. ఈ విధముగా బౌద్ధుల శూన్యవాదమును చాలా వరకు సంతృప్తి పరచినాడు. మొండిగా యున్న అజ్ఞానులను వారి మొండితనముకు చాలా దగ్గరగా యున్న మార్గము లోనికి మరలించుట సులభము. కావున జగత్తు అసలు లేదు అను బౌద్ధులను జగత్తు దాదాపు లేనట్లే అను వాదమునకు మార్చుట సులభము. వారిని వారి మొండి శూన్యవాదము నుండి మిధ్యావాదమునకు మరలించినాడు. అట్లే భగవంతుడు లేడు అను నాస్తికులను భగవంతుడు ఉన్నాడు అను మార్గమునకు తీసుకొనిరాలేము. ఏమిలేదు అనువారికి దేవుడు ఉన్నాడు అని చెప్పినచో వినరు. వారిచే దేవుడు ఉన్నాడు అని ఎట్లు చెప్పించవలెను. ఏమయ్యా! ఏమీ లేదని గ్రహించి చెప్పెనీవు ఉన్నావా? లేవా? అని అడగవలయును. నేను కూడా లేను అన్నచో మరి నేను లేను అని గ్రహించి చెప్పెవాడు మరియొకడు ఉన్నాడా? లేడా? ఉన్నాడని అంగీకరించక తప్పదు. ఏమీ లేదను వారి చేత కనీసము జీవుడు అను చైతన్యము ఉన్నది అని అంగీకరింప చేసినారు శంకరులు. ఆ జీవుడే అనగా చైతన్యమే భగవంతుడు. ఇప్పుడు చెప్పుము భగవంతుడున్నాడా? లేడా? భగవంతుడున్నాడని వాడు అంగీకరించకతప్పదు. ఈ విధముగా జీవుడు ఒకడు ఉన్నాడు అని స్ధాపించునప్పటికే తల ప్రాణము తోకకు వచ్చినది. కావున ఆ పరిస్ధితిలో జీవుడు బ్రహ్మము అనవలశి వచ్చినది.

At the lotus feet of Shri Dattaswami
దుర్గాప్రసాదు

Saturday, August 15, 2009

భగవంతుని ఎందుకు ఆరాధించాలి?

ప్రశ్న: మనకు ధనం ఉన్నది. పిల్లలంతా బాగున్నారు. ఏ కష్టాలు లేవు. అయితే భగవంతుని ఎందుకు ఆరాధించాలి?

స్వామి: నాయనా విను! మనం మరణించిన తర్వాత జీవుడు మర్త్య లోకంలో నుండి ప్రేత లోకం లోకి వెళ్ళుతాడు. ప్రేతలోకంలో పదిరోజులు విచారణ జరుగుతుంది. అక్కడ నిర్ణయిస్తారు.

1) పుణ్య కర్మలకు జీవుని స్వర్గలోకమునకు పంపుతారు.
2) పాప కర్మలకు జీవుని నరకలోకమునకు పంపుతారు.
3) మిశ్రమ కర్మలకు జీవుని పితృలోకానికి పంపుతారు.

పై లోకాలలో ఈ జీవుని ఉతికి, పాప ప్రక్షాళనము చేసి పంపుతారు. తర్వాత కర్మ శేషంతో మర్త్య లోకంలో మరల పుడతాడు. ఆ లోకాలలో ఎంత ఉతికినా ఇంకా కొంత కర్మశేషంతో మర్త్యలోకంలో ఆ జీవుడు ఒక పాపగా పుడతాడు. ఈ లోకంలో పెరుగుతూ మరల కొంచెం కొచెం కర్మలు పెంచుకుంటాడు. చేసిన కర్మలే ఫలాలను ఇస్తున్నాయి.

కనుక దేవుణ్ణి ఎందుకు భజించాలి- అంటే కర్మఫలం తప్పనప్పుడు ఇంకా దేవుణ్ణి ఎందుకు భజించాలి అని సందేహం. ఇది ప్రశ్న. నాయనా! నీ సందేహం తీరాలంటె అసలు ఏమి జరుగుతున్నదో నీకు పూర్తి అవగాహన కావాలి. అప్పుడు నీకే అంతా బోధ పడుతుంది. కనుక శ్రద్ధగా విను. తర్వాత నీకే బోధపడుతుంది. సంతృప్తి చెందుతావు.

ఎవరు చేసిన కర్మ ఫలాలను వారె అనుభవించాలి. ఇది సత్యం. మనం చేసే కర్మల యొక్క తీవ్రతను బట్టి మనం చేసే కర్మ ఫలాలకు వెంటనే ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని కర్మ ఫలాలు ఆ లోకంలో అనుభవించాలి. మిగిలిన కర్మఫలాలతో మళ్ళీ పుడతాడు. భగవంతుడు ఇట్లు సమ ఏర్పాట్లు చేస్తున్నాడు. నిరంతరం తీపి తినిన ఎట్లు వెగటు వేస్తుందో, అట్లే దుఃఖం తర్వాత దుఃఖం వచ్చినట్లైతే ఎలా భరించలేని బాధ అవుతుందో అని భగవంతుడు జీవుని సౌకర్యం కోసమే జీవులందరికి కర్మ చక్రం చక్కగా ఏర్పాటు చేశాడు. భగవంతుడు మన కర్మ ఫలాలను మార్చి మార్చి జన్మ చక్రం ఏర్పాటు చేశాడు.

భగవంతుడు మనకు ఏర్పాటు చేసిన చక్రాన్ని మనం చక్కగ అనుభవించుచూ, భగవంతునకు మనం కృతఙ్ఞులమై యుండవలసి యుండగా, మనం ఏం చేస్తున్నామో చూడండి. సుఖాలు వచ్చినప్పుడు భగవంతునే మరచి పోయి సుఖాలను అనుభవిస్తున్నాము. అయితే కష్టాలు వచ్చినప్పుడు జపాలు చేయించి కర్మ ఫలములను రద్దు చేయించుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. అంటే మన ఉద్దేశ్యం ఏమిటి? కర్మ సిద్ధాంతాన్ని సృష్టించిన పరమాత్మ మనకు చేసిన కర్మ ఫలాలను రద్దు చేసి, మనం చేయని మంచి ఫలాలను మనకు ఇవ్వాలనేగా? ఇది ధర్మమా? ఇది ఎట్లా కుదురుతుంది?

స్వామి మన కర్మ ఫలాలను ఎలా రద్దు చేస్తాడు? మనం చేయని పుణ్య ఫలాలను ఎలా ఇస్తాడు? ఐతే స్వామి ఏమి చేస్తాడు? మన పాప కర్మ ఫలాలను వచ్చే జన్మకు తోసివేస్తున్నాడు. అంతే. మనం ఏమనుకుంటున్నాము. మనం అఙ్ఞానులమై మనం చేసిన పూజలు, జపాల వలననే భగవంతుడు మన కర్మ ఫలాలను రద్దు చేశాడని భావిస్తున్నాము. మనం సంతోషిస్తున్నాము. కానీ, నిజానికి భగవంతుడు మన కర్మ ఫలాలను రద్దు చేయలేదు. వచ్చే జన్మకు బదిలీ చేశాడు. అంతే. పైగా దీని ఫలితమేమిటి? ఈ కష్టాలు వచ్చే జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి. ఇక పుణ్యఫలం విషయమేమిటి? వచ్చే జన్మలోని పుణ్యఫలాన్ని తగ్గింపుతో ఈ జన్మకు బదిలీ చేశాడన్న మాట. రెండు వైపులా నష్టమే. కనుక - మనం చేసే పూజల వల్ల ఆయన వేసిన తీర్పును మార్చమంటున్నామని అర్ధము. ఇది మన అఙ్ఞానము కాదా. "అహం బీజ ప్రద పితా" అను పరమాత్మ తన బిడ్డల కోసమే కర్మ చక్రం నిర్ణయించారు. "అవస్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభమ్" కనుక మనం చేసిన కర్మ ఫలాలను మనం అనుభవించవలసినదే. అంతే. కనుక మనం ఏ కోరికలు కోరరాదు. మన కష్టాలు తీసివేయడు. మనం కోరిన సుఖాలు ఇవ్వడు. అయితే ఆయనను ఎందుకు పూజ చేయాలి?

అంటే భగవంతుని కల్యాణ గుణాల వల్ల ఆకర్షించబడి ఆయనను ప్రేమించి సేవించాలి. మనం ఏ ఫలాలు స్వామి నుండి కోరరాదు. భగవంతునిపై అట్టి భక్తి మనకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఆయన మనుష్య శరీరం ఆవహించి అవతరిస్తాడు. ‘‘సంభవామి యుగే యుగే’’ అన్నాడు గీతలో. త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, నరావతారము దాల్చి వచ్చాడు గదా. ప్రతి తరంలో స్వామి నరావతారములో వస్తున్నాడు.

భగవంతుని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోవటం చాలా అవసరమే. భగవంతుని ఆరాధిస్తే ఆయనయే జీవుని ఆదుకుని నడిపిస్తాడు. ఏమి ప్రతి ఫలాపేక్ష లేని మహా భక్తుల పాప కర్మ ఫలాలను తాను ఆకర్షించి ఆయన అనుభవించి ముక్తులను చేస్తాడు. అది నరావతారంలోనే సాధ్యమవుతుంది. అట్టి భక్తులకు స్వామికి ఎన్ని సౌకర్యాలు ఉన్నవో వాళ్ళకు అవే సౌకర్యాలు ఉంటాయి. స్వామి కలుగ చేస్తాడు. వారికి పుట్టుట, మరణకష్టం ఉండదు. అట్టి భక్తులు మరణించినప్పుడు స్వామి వారితో వస్తాడు. యమధర్మరాజు ఎదురు వచ్చి విచారణ లేకుండా ఆ భక్తుని బ్రహ్మలోకానికి పంపుతాడు. ఇప్పుడర్ధమయినదా! భగవంతుని ఎందుకు పూజించాలో.

ఇంకా విను. నీకుమారులలో ఎవరైతే నీ ఆస్తిలో ఒక పైసాకూడా ఆశించక నీకు సేవ చేస్తాడో అప్పుడు నీవు సంతోషించి వాడికి నీ ఆస్తి రాసి ఇస్తావు. అట్లే భగవంతుని ఏమి ఆశించక, నీయొక్క సర్వస్వము ప్రాణములతో కూడా సమర్పిస్తావో అప్పుడు స్వామి సంతోషించి నీకు తనను తానే సమర్పించుకుంటాడు. బైబిలులో ఏసుక్రీస్తు ఏమన్నాడు అంటే-‘‘నేను శాంతి కొరకు రాలేదు. కత్తి తీసుకు వచ్చాను. కుటుంబములో కలహం పెడతాను. కుటుంబంలో ఇద్దరికి ముగ్గురు కలహిస్తారు. తండ్రి కొడుకు, తల్లి కూతురు, అత్త కోడలు ప్రతిఘటిస్తారు. ఎందుకు? ఆ బంధాలు తెంపితే గాని, నీకు భగవంతుడు చిక్కడు గనుక. అదే వేదములో ఏమని చెప్పబడి ఉన్నది? భగవంతుడు అందరి కంటే ఎక్కువ అని తెలుసుకొని సర్వాన్ని, తన ప్రాణాన్ని కూడా యివ్వటానికి సిద్ధమై యుండాలి అని గదా!

హనుమంతులవారు, కన్నప్ప, వీరిని చూడండి. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు స్వామి నుండి ఏ ప్రతిఫలం కోరలేదు. స్వామీ! నీవే కావాలి. నిన్నే నమ్ముకున్నాను. అని సర్వస్వ శరణాగతి చేశారు. స్వామి కార్యంలో పాల్గొన్న హనుమంతుని చూడండి. ఐతే మనం ఏం చేస్తున్నాము? ఏమంటున్నాము. ‘‘స్వామీ! ఈ తుచ్ఛమైన ధనాన్ని, ఈ తుచ్ఛమైన పిల్లలకు, బంధు వర్గానికి ఇస్తున్నాము. కానీ పవిత్రమైన మా మనస్పును, హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాము.’’ అని అసత్యాలను పలుకుచున్నాము. స్వామిని మోసం చేస్తున్నాము. ఆలోచించండి. ఇది ఈ జగత్తులో జరిగే నగ్న సత్యమౌనా కాదా? విమర్శించుకోండి. కనుక- స్వామి మనం ఏం చేస్తున్నామో సర్వం ఎరిగిన పరమాత్మ-‘‘యేయధామాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం, అని గీతలో చెప్పినట్లే చేస్తున్నాడు. అనగా ఎవరు నన్నే విధముగా సేవింతురో వారిని ఆ విధముగనే నేను అనుగ్రహింతును’’ అని కనుక మనం ఏమి చేశామో స్వామి కూడా అదే చేస్తారు. నీవు మాటలు అర్పిస్తున్నావు. స్వామి కూడా నీకు మాటలతోనే సమాధానము చెప్పుచున్నారు.

నీవు రామాయణం చదువు. ఎక్కడైనా హనుమంతుడు ఒక దీపారాధన గాని, రామకోటి వ్రాయటం గాని చూడలేదు. ఐతే ఏం చేశాడు? నరాకారంగా వచ్చిన శ్రీరాముని గుర్తించి, శ్రీరాముని కార్యంలో పాల్గొని క్రియాత్మకంగా ఆచరించాడు. స్వామి హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ పదవినిచ్చారు. సృష్టి, స్థితి, లయాలను పూర్తిగా సర్వాధికారాలను హనుమంతునికి ఇచ్చారు. వాల్మీకి రామాయణం ప్రమాణం. రాముని కార్యం తప్ప స్వకార్యం ఏమీ లేదు. తన గుండె చీల్చి రాముని తన హృదయంలో చూపించాడు. రాముని కల్యాణ గుణములకు ఆకర్షించబడి స్వామి సేవ చేశాడు. కావున అలా చేసి తరించాలి. ఏ స్వార్ధం ఉండకూడదు. కన్నప్ప తన కన్నులను పెకలించి స్వామికి సమర్పించి ధన్యుడయ్యాడు. ఇక్కడ కూడ నిష్కామ సేవ, ఏ స్వార్ధం లేదు.
At the lotus feet of Shri Datta Swami
-దుర్గాప్రసాదు

Thursday, August 6, 2009

బ్రహ్మము-జీవుడు-పరమాత్మ

బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్ధము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్ధములలో అన్నింటికన్న గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే "చిత్‌, చిత్తము, జీవుడు, క్షేత్రజ్ఞుడు, శరీరి, దేహి, ఆత్మ" మొదలగు శబ్ధములచే పండితులు పిలుచుచున్నారు. చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణము జడ పదర్ధము చేయలేని కొన్ని పనులను చైతన్యము చేయుచున్నది. చైతన్యము చేయు పనిని బట్టి ఆ చైతన్యము వేరు వేరు పేరులను ధరించుచున్నది. చైతన్యము ఒక వస్తువును తెలియునప్పుడు, మరియు తెలిసిన వస్తువును గుర్తుకు తెచ్చుకున్నపుడు "చిత్తము" అనబడుచున్నది. "చితి సంజ్ఞానే స్మరణేచ" అని శాస్రము. అదే చైతన్యము ఒక విషయమును సంకల్పంచి ఇది సరియా, కాదా అని ఊగులాడినపుడు "మనస్సు" అని పిలువబడుచున్నది. "సంకల్ప, వికల్పాకం మనః" అని శాస్త్రం. అదే చైతన్యము ఒక విషయమును గురించి నిర్ణయము తీసుకున్నప్పుడు "బుద్ది" అని పిలువబడుచున్నది. "బుద్ధి రధ్యవ సాయాత్మికా" అని శాస్త్రము. అదే చైతన్యము "నేను నేను" అను స్ఫురణతో పని చేయునపుడు "అహంకారము" అనబడుచున్నది. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడు చైతన్యక్రియలే అంతఃకరణములు అనబడుచున్నవి. ఎట్లు ఒకే పరమాత్మ సృష్టి, స్ధితి, లయములు అను పనులను బట్టి బ్రహ్మ, విష్ణు, శివ నామాలను ధరించినాడో అట్లే ఒకే జీవుడు ఆయా పనులను బట్టి అంతఃకరణముల నామాలతో పిలువబడుచున్నాడు. ఈ జీవుడు లేక చైతన్యము జడము కన్నా ఎందుకు గొప్పది? జడము స్వాతంత్రియము లేక చేతనములగు ప్రాణుల అధీనములో ఉండుచున్నది.

కావున జడము గొప్పది కాదు. ఆట్లే ఆలోచించుట మొదలగు క్రియలను చైతన్యము చేయగలదు. కాని జడము చేయలేదు. కావున ఈ సృష్టిలో అన్నింటి కన్నను చాలా గొప్పది చైతన్యమే. కావున చైతన్యమును బ్రహ్మము అనవచ్చును. ఐతే ఈ సర్వ సృష్టి కన్నను సృష్టికర్త గొప్పవాడు. కావున చైతన్యము కన్నను సృష్టికర్తయే అధికుడు కావున సృష్టికర్తనే బ్రహ్మము అనవలెను. కావున బ్రహ్మము అనబడు శబ్దము నిజముగా, పరిపూర్ణముగా సృష్టికర్త యందే ప్రయోగించవలయును. కాని సృష్టికర్తను వదలివేసి కేవలము సృష్టినే అనగా సృష్టి పదార్ధములనే విచారించినపుడు చైతన్యమునే బ్రహ్మము అనవలయును. సృష్టికర్త ఇంద్రియములకు గాని, మనస్సు, బుద్ది మొదలగు అంతఃకరణములకు గాని, తర్కమునకు గాని, అందని వాడు. సృష్టికర్తను గురించి ఇప్పటి వరకు దేవతలు ఋషులు వేదశాస్త్రములను చర్చించి చర్చించి ఆయనను గురించి తెలుసుకున్నది ఏమనగా ఆయన గురించి ఏమియు తెలుసుకొనలేము అనియే. నచికేతుడు బ్రహ్మమును గురించి బోధించమని యమధర్మరాజును అడుగగా ఆయన ఈ విధముగా చెప్పి ఆ దేవతలలో ఒకడనైన నేను మాత్రము బ్రహ్మమును గురించి ఎట్లు తెలియగలను అని తన సుదీర్ఘోపన్యాసమును ముగించినాడు. మన బుద్ధి ఆకాశతత్వమును ఆక్రమించలేదు. ఆకాశము అనగా శూన్యమైన ఖాళీ స్ధలము. ఈ ఆకాశమును పరమాత్మ సృష్టించెను అని "ఆత్మనా ఆకాశ సంభూతః" అని శ్రుతి చెప్పుచున్నది. ఆకాశతత్త్వమునకు లోబడి మన బుద్ధులు ఆకాశతత్వమును అతిక్రమించి ఆకాశమునే సృష్టించిన పరమాత్మను ఎట్లు ఊహించగలవు? కావున సృష్టికర్త మనకు ఏ విధముగను చిక్కుటలేదు. ఇటు వంటి సమయమున సృష్టికర్త చాలా గొప్పవాడు అని చెప్పుట హాస్యాస్పదమగును. కావున మన బుద్ధికి అందు సృష్టి పదార్ధములలో ఏది అత్యధికమగు గొప్పదో దానినే బ్రహ్మమనుట తప్ప వేరు గతిలేదు. కావున చైతన్యమును బ్రహ్మముగా ఆచార్యులు ముగ్గరు అంగీకరించి యున్నారు. ఎవరి బుద్ధికిని అందనిదిని, ఏ ఆచార్యుడును బోధించలేడు. బుద్ధికి అందిన విషయములతోనే బోధించవలయును. గురువు గారు "పరమాత్మ ఉన్నాడు" అన్నారు . శిష్యుడు "పరమాత్మ అంటే ఎవరు" అని అడిగినాడు. "నాకు తెలియదు, నీకు తెలియదు" అట్టి వాడే పరమాత్మ అని గురువు చెప్పినచో, శిష్యుడు "ఐతే నేను మీ నుండి వినవలసినది ఏదియు లేదు" అని లేచిపోవును. ఇది గురుసాంప్రదాయ విరుద్ధము. ఒకనికి అరుంధతి నక్షత్రమును చూపుచున్నాము. ఆ నక్షత్రము కనపడుటలేదు. అప్పుడు వశిష్ఠ నక్షత్రమును చూపి దానికి దగ్గరగా ఉన్న నక్షత్రమే అరుంధతి అని చెప్పుదురు. దీనినే అరుంధతి వశిష్ఠ న్యాయమందురు. అదే విధముగా పరమాత్మను గురించి బోధించవలసి వచ్చినప్పుడు పరమాత్మకు అతి దగ్గరగా పోలికలు ఉండు సృష్టి పదార్ధమును చూపించి దాని వంటిదే పరమాత్మయని చెప్పవలసివచ్చును. అయితే అన్ని విషయములలోను పరమాత్మతో పోల్చదగిన వస్తువు సృష్టిలో లేనేలేదు. "నతస్య ప్రతిమా" అని శ్రుతి ఇదే చెప్పుచున్నది. ఒక వస్తువును మరియొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా పోలికలు ఉండునే తప్ప అన్ని పోలికలు సమానము కావు. అన్ని పోలికలు సమానమే అయినచో ఆ వస్తువు ఆ వస్తువే అగును. చంద్రుని వంటి ముఖము అన్నాము. చంద్రుని వలె ఆహ్లాదముగ యున్నది ముఖము అని అర్ధము. ఇచ్చట ఆహ్లాద గుణము నందే పోలిక గాని మిగిలిన గుణములందు పోలిక లేదు.

చంద్రునకు ఉదయా స్ధమయముల ఉన్నవి. కాని ముఖమునకు లేవు. చంద్రునకు శుక్లపక్షము వృద్ధి, కృష్టపక్ష క్షీణత్వము ఉన్నవి. అవి ముఖమునకు లేవు. కావున ముఖచంద్రుడు అనగా ముఖమే చంద్రుడు అన్నప్పుడు ఒక్క ఆహ్లాద గుణములోనే ముఖము చంద్రునితో సమానమగు చున్నది. అట్లే చైతన్యము బ్రహ్మము అన్నప్పుడు ఆ రెండింటిలోను సమానగుణము ఏది? ఆ గుణము ఏది అనగా పరమాత్మ చిత్ర విచిత్రమైన జగత్తును సృష్టించుచున్నాడు. అట్లే చైతన్యము కూడా చిత్ర విచిత్రమగు ఊహల జగత్తును సృష్టించుచున్నది. చైతన్యమునకు అనగా చేతనుడగు మానవునకు ప్రొద్దుపోక తన కన్న రెండవ వస్తువు గాని రెండవ వ్యకిగాని లేనప్పుడు ఎట్లు చిత్ర విచిత్ర ఊహలతో వినోదించునో అట్లే రెండవ వస్తువు లేని అద్వితీయమైన పరమాత్మ చిత్ర విచిత్రములైన ఊహలను సృష్టించి వినోదించెను. ఈ సమస్త లోకములు ఆయన ఊహలే. ఆయన ఊహలలోని ఒక ఊహయే ఈ జీవుడు. కావున జీవునకు ఈ లోకములు ఊహలు కావు. తన ఊహలు మాత్రమే తనకు ఊహలగును గాని పరమాత్మ ఊహలు తన ఊహలు కావు. ఏలననగా, పరమాత్మ ముందు తాను ఒక ఊహయే. అనగా తాను సృష్టిలోని భాగమే. ఈ సృష్టి రెండు భాగములగ యున్నది. ఒకటి జడము లేక అపరాప్రకృతి. రెండవది చైతన్యమగు జీవుడు లేక పరాప్రకృతి. సృష్టి యనగా ప్రకృతియే. ప్ర=శ్రేష్టమైన; కృతి=కార్యము అనగా పని అని అర్ధము. ఈ సృష్టి పరమాత్మ చేసిన శ్రేష్టమైన పని కావున ప్రకృతి అనబడుచున్నది. జీవుడు ఎట్లు వినోదార్ధము ఊహాలోకమును సృష్టించుటకు సంకల్పించెనో అట్లే వినోదార్ధము పరమాత్మ ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించెను. ఇచ్చట పరమాత్మలోను జీవుడు అనగా చైతన్యములోను సంకల్పము అను క్రియ సమానముగా యున్నది. ఇట్లు సంకల్ప క్రియ, చిత్ర విచిత్రముగా ఊహించు సామర్ధ్యము మొదలగు కొన్ని పోలికలు ఉండుట వలన చైతన్యము పరమాత్మయనినారు. సంకల్ప క్రియ ఊహానిర్మాణ సామర్ధ్యములను గురించి "సయిదం సర్వమ సృజతా, తదైక్షత్వా" ఇత్యాది శ్రుతులును వినోదార్ధము ఊహ సృష్టి "ఏకాకి నరమతే" అను శ్రుతియు చెప్పుచున్నది. ఈ కారణముల వలనే చైతన్యమును బ్రహ్మమన్నామని "ఈక్షతే ర్నాశబ్ధం" అను బ్రహ్మసూత్రము చెప్పుచున్నది. ఇంత మాత్రమున చైతన్యము బ్రహ్మమని భ్రమించరాదు. పోలికలు లేని అంశములు అనేకములు కలవు. చైతన్యము సర్వవ్యాపకము కాదు. కాని పరమాత్మ సర్వవ్యాపకుడు. చైతన్యము అనగా జీవుడు సూర్యప్రతాపమునకు భయపడి శరీరమున విలవిలలాడుచున్నాడు. కాని పరమాత్మ సూర్యునే శాసించు చున్నది. కావున ఇది ముఖచంద్రుని వంటి ఉపమ అను అలంకారమేనని గ్రహించవలెను.

దత్త జయంతి అంతరార్ధము: ఉపవాసము అనగా

ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవుట. అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. కొందరు అన్నమునకు బదులుగా అప్పచ్చులను తిని ఉపవాసమనుచున్నారు. ఇదే నిజమైనచో కేవలము గోధుమ రోట్టెలనే తిను ఉత్తర దేశీయులు నిత్యోపవాసులగుదురు. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది. అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నముగావదలి వేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమగుట అంత ఉన్నత స్ధాయికి పోలేక మధ్యలో అకలి అగుచో క్షీర ఫలాదులను స్వీకరింతురు. "పయో బ్రహ్మణస్య వ్రతమ్‌" అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో అట్టి రోజే "దత్త జయంతి".

Saturday, August 1, 2009

దత్త స్వరూపము - విశ్వమతము

దేవదేవుడైన దత్తుడు పవిత్ర సద్గుణవంతుడైన పండితునిగా దర్శనమిచ్చును. ఒక్కొక్క సారి మద్యపాన వేశ్యాలోలునిగా దర్శనమిచ్చును. దీని ద్వారా స్వామి సద్గుణవంతులు కాని దుర్గుణవంతులు కాని తనను చేరవచ్చునని సూచించుచున్నాడు. బ్రహ్మ రజో గుణము. విష్ణువు సత్త్వగుణము. శివుడు తమో గుణము. ఈ త్రిమూర్తుల ముఖములతో ఉన్న పరమాత్మ సర్వ గుణములతో చేరి ఉన్నాడని అర్ధము. సగుణ బ్రహ్మము అనగా అన్ని గుణములతో చేరి ఉన్న బ్రహ్మము అని అర్ధము. ఈ త్రిగుణములలో ఉన్న రజస్సు, తమస్సు దుర్గుణములు. అనగా ఎక్కువ (2/3 వంతు) దుర్గుణవంతులే అని తెలియుచున్నది. విష్ణువు సత్త్వ గుణము కావున వైష్ణవులు విష్ణువును అత్యధికునిగా తలచుచున్నారు. వీరు బ్రహ్మను తక్కువ గాను, శివుని రాక్షస దైవముగాను నిందించుచున్నారు. ఈ త్రిగుణములు అనగా త్రిమూర్తులు స్వామి యొక్క మూడు రంగు వేషములే. స్వామి ఈ మూడు గుణములచేతను అంటబడుట లేదు. వేదము విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడని చెప్పుచున్నది. వేషధారియొక్క రంగు వేషములయొక్క రంగుల చేత మారుట లేదు.

సత్త్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమస్సు నలుపు. కావున విష్ణువు తెల్లగాను, శివుడు నల్లగాను ఉండవలయును. కాని వారి ఇరువురి రంగులు మారినవి. విష్ణువు నల్లగాను, శివుడు తెల్లగాను గాను ఉన్నారు. శివుడు సత్త్వగుణములతో శాంతముగా ధ్యానములో ఉన్నాడు. విష్ణువు తమోగుణముతో గోపికలతో క్రీడించుచున్నాడు. ఇప్పుడు చెప్పుము. ఎవరు గొప్ప? కావున త్రిమూర్తులలో ఉన్న దేవుడు ఒక్కడే. అతడే దత్తుడు. అతడు ఏ గుణములచేతను అంటబడడు. నిర్గుణ బ్రహ్మము అనబడుచున్నాడు. వస్త్రముల రంగుల వలన ఏ రంగూ లేని స్వామి ఎర్రగా, తెల్లగా, నల్లగా కనబడుచున్నాడు. ఈ దత్తస్వరూపము ద్వారా త్రిగుణములలో ఉన్న భక్తి గుణములచేత అంటబడదు అని చెప్పుచున్నది. భక్తి గుణముయొక్క రంగును కలిగినట్లుగా కనిపించుచున్నది. కాని భక్తి ఏ రంగూ లేక నిర్మలమైనది. అనగా సద్గుణవంతుడైననూ, దుర్గుణవంతుడైననూ మంచి మార్గము, లేక చెడు మార్గమున కాని భగవంతుని చేరవచ్చును. భక్తుని లోను మార్గములోను భక్తి ఉన్నప్పుడు అది ఏ గుణములను అంటని మహాశక్తి స్వరూపముగా ఉండును. తమోగుణములతో శివుడు తామసునిగా రాక్షసులను సైతము చెడు మార్గమున కూడా తనను చేరవచ్చునని సూచించుచున్నాడు. అట్లే సత్త్వగుణమగు విష్ణువు మంచివారుగా దేవతలు తనను సన్మార్గమున చేరవచ్చునని సూచించుచున్నాడు. అయితే విష్ణువే శివుడని మరచిపోకుము. రాక్షసులైనా, దేవతలైనా భక్తి సమానముగా ఉన్నచో ఒకే భగవంతుని చేరుచున్నారు. లోకశాంతికి భంగము కలిగించిన కారణమునకే స్వామి రాక్షసులను శిక్షించినాడు. స్వామి మూడు ముఖములు విశ్వముయొక్క సృష్టి, స్థితి, లయములను సూచించుచున్నవి. మూడు పనులను ఒకే ముఖము చేయుచున్నది అని వేదము చెప్పుచున్నది. కావున దత్తుడు పరబ్రహ్మము. త్రిమూర్తుల అవతారములగు మధ్వ, రామానుజ, శంకరులే గురుత్రయము. అనగా ఈ గురుత్రయమే గురుదత్తుడు. ఈ గురుత్రయము యొక్క మూడు భాష్యములలో ఉన్న ఏక సిద్ధాంతమే శ్రీదత్తవాణి.

దత్త భక్తి, ప్రతిఫలమును కోరక సత్యముగా, నిర్మలముగా ఉండవలయును. బిచ్చగాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగుడుచున్నాడు. నీవు వానిని పొమ్మనుచున్నావు. కాని నీ అతిథికి సర్వ సపర్యలను చేయుచున్నావు. ఇరువురిలో తేడా ఏమి? బిచ్చగాడు అన్నమును ఆశించి నీ వద్దకు వచ్చినాడు. అతిధి కేవలము నిన్ను చూచిపోవుటకు వచ్చినాడు. ఇరువురి లక్ష్యములు వేరు కావున వానిపై చూపబడిన నీ ప్రవర్తన కూడా వేరువేరగా ఉన్నది. కావున దత్తుని వద్దకు అతిథిగా రమ్ము. నీవు ఏ ప్రతిఫలమును ఆశించక దత్తుని వద్దకు వచ్చినచో అతిథికివలె నీకు దత్తుడు సర్వమునూ ఇచ్చును.

దత్త మతములోనికి ప్రవేశించిన తరువాత సాక్షాత్తు దత్తుడే నీకు జ్ఞానమును బోధించును. జ్ఞానము ద్వారా భక్తి కలిగి ఆ భక్తి నిస్వార్థమై కర్మఫలత్యాగముచే నిరూపితమైనచో దత్తకైవల్యము లభించును. ఈ మతములో ప్రత్యేకత ఏమనగా నీవు బ్రతికి ఉండగానే దత్తుడు నీలో లీనమై పోవును. అసలు దత్తుడు అనగా తనను తాను నీకు దత్తము చేసుకొన్న వాడని అర్ధము. దత్తమతము సముద్రము వలె ప్రత్యేకముగా ఉన్ననూ ఇతర మతములను నదులలో ఉన్న జలమే. నదులన్నియును సముద్రములో చేరవలసినదే. దత్త దిగంబరుడు అనగా అన్ని పాత్రల వేషములు తీసి తన సహజమైన వేషములో ఉన్నవాడని అర్ధము. అవధూత దత్త అనగా దత్తుని రుచి చూసినచో సమస్త జీవులతో మరియు సమస్త వస్తువులతో ఉన్న నీ బంధములన్నియు తెగి విసిరి వేయబడునని అర్ధము. దత్తుడనిగా తన భక్తులయొక్క పాప ఫలములను అనుభవించుటకు ఒక మనుష్య శరీరమును ఆశ్రయించి తనను తాను భక్తునకు దానము చేసుకొన్నవాడని అర్ధము. నీకు జరిమానా విధించినప్పుడు నీ ఆత్మీయుడగు నీ తండ్రి తాను కట్టి నిన్ను విడిపించును. పాపఫలములను నిజముగా అనుభవించవలయును. కావున దత్తుడు మనుష్య శరీరములను గ్రహించును. ఈ శిక్షను అనుభవించునప్పుడు తన శక్తిని ఉపయోగించి దత్తుడు బాధనుండి తప్పించుకొనడు. అట్లు తప్పించుకొన్నచో దత్తుడు ధర్మదేవుని మోసగించినట్లు అగును. కావున దత్తుడు ఆశ్రయించిన మనుష్య శరీరము బాధలను నిజముగా అనుభవించుటకై ప్రకృతి నియములను అనుసరించి ఉండును. ఈ అనుభవము నిరంతరము ఉండును. కావున స్వామియొక్క శరీరము త్వరగా దెబ్బ తినుచున్నది. ఆయన దివ్య దర్శనములను ఇచ్చినప్పుడు మహావిద్యుచ్ఛక్తి ఆ శరీరమునో ప్రవహించును. దాని వలన ఆ శరీరము మరింత దెబ్బ తినుచున్నది. నీవు కొద్ది కర్మఫలమునే అనుభవించవలెను. ఆయన అనేక భక్తుల కర్మలను అనేక జన్మలనుండి అనుభవించుచున్నాడు. నీవు బాధతో విలపించవచ్చును. కాని ఆయన నవ్వుచుండవలెను. భక్త కర్మఫలములను అనుభవించుట ఒక్క క్షణము ఆపిననూ ఆ క్షణములో ఆయన దత్తుడు కాదు. నీవు సింహాసనమును చూచుచున్నావే కాని ముళ్ళను చూచుటలేదు. దత్తుడనగా ఆచరణము. బ్రహ్మము అనగా అఖండానంద స్వరూపమైన భావము. బ్రహ్మము కాగానే దత్తుడు కావలసిందే. అద్వైతులు బ్రహ్మమును గురించి తెలిసిన వారు. కానీ వారు దత్తుని గురించి తెలుసుకొన్నచో దత్తసేవకులుగనే ద్వైతములో ఉందురు. చూపులకు, స్పర్శకు సంభాషించుటకు కలసి మెలసి జీవించుటకు వీలుకాని పరమాత్మ వాటిని భక్తులకు అందచేయుటకు మనుష్యాకారమున తనను తాను భక్తులకు అందచేసుకున్న వాడే దత్తుడు. దత్త మతములో ప్రవేశించుటకు కావలసిన అర్హత అగు ‘‘ప్రాణిగా పుట్టుటను’’ ప్రతి మానవుడు కలిగియే ఉన్నాడు. ఇతర మతములలో విధించబడిన ప్రవేశార్హత అగు ‘‘దుర్గుణములను వదలించుకొనుట’’ ఏ మానవుడును ఇంతవరకు చేయలేదు. ఇది అసాధ్యము. కావున ఎన్నటికిని చేయలేరు. దీని అర్ధము ప్రతి మానవుడునూ దత్తమతములోనికి పుట్టగానే ప్రవేశించియున్నాడు. మరియు ఇతర మతములలోనికి ఎన్నటికినీ ప్రవేశించలేడు. నీవు నిజముగా ఏ మతములో ఉన్నావో అట్టి విశ్వమతముయొక్క పేరును నీకు జ్ఞాపకము చేయుచున్నాను.