Saturday, February 20, 2010

శ్రీ కృష్ణుడు-విశ్వరూపము

శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్ధము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమైయున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశములేని ఒక బింబమాతృనిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళ జోడు తీయగనే మరల చూచుటకు వీలుకాని మహా ప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని యొక్క తేజస్సు సూర్యుని నుండి పోవుటలేదు. ఆ కళ్ళజోడు తీయగనే సూర్యునికి కొత్త తేజస్సు వచ్చుట లేదు. అందుకే విశ్వరూప ప్రదర్శనమునకు ముందు "దివ్యందదామి తేచక్షుః" అనగా నీకు దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను అన్నాడు. అనగా నీ కళ్ళకు ఉన్న నల్ల కళ్ళజోడును తీసివేసి నీ యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో నన్ను తిలకించుము అని అర్ధము. కావున పరమాత్మ అవతరించునపుడు మనుష్య రూపమున ఉన్నట్లు మనకు గోచరించుటకు కారణము మనకున్న అజ్ఞానమే కాని ఆయన నిజముగా అజ్ఞానము చేత కప్పబడిలేడు. కొందరు పచ్చని వర్ణములో ఉన్నారు. వారి మధ్యకు ఎర్రని వర్ణము ఉన్న వ్యక్తి రావలసి వచ్చెను. వారు ఎరుపు వర్ణమును సహించలేరు. అప్పుడు ఆ పచ్చని వర్ణము కలవారి కండ్లకు పచ్చని వర్ణము కల కళ్ళజోళ్ళను పెట్టించినాడు. ఇప్పుడు వారి మధ్యకు ఎర్రని రంగు కలవాడు వచ్చినాడు కాని వారందరికిని వారి కళ్ళజోళ్ళ ప్రభావము వలన వాడు పచ్చగనే కనిపించుచున్నాడు. ఇప్పుడు వారిలో ఒకని యొక్క కండ్ల జోడు తీసివేసి వాని యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో తనను చూడమన్నాడు. అప్పుడు వానికి ఎర్రని రంగుతో ఈ వ్యక్తి కనపడినాడు. వారందరికిని ఎరుపు రంగు చూచిన భయము కాన వాడు భయముతో కేకలు పెట్టు నీవు మరల పచ్చగనే కనిపించమని ప్రార్ధించినాడు. అప్పుడు ఈ వ్యక్తి వానికి మరల పచ్చ కళ్ళజోడును పెట్టి పచ్చగా కనిపించినాడు. ఇదే విధముగా అర్జునుడు మాయ యను పచ్చ కండ్లజోడును పెట్టుకున్నంత కాలము కృష్ణునిగా కనిపించినాడు. సర్వ జీవులకును ఈ మాయయను కళ్ళజోడు జన్మ నుండి మరణ పర్యంతము ఉండుచున్నది. ఈ కళ్ళజోడే అహంకార, మమకారములను రెండు కంటి పొరలు. స్వామి యొక్క నిజ స్వరూపమును దర్శించకోరినపుడు స్వామి అర్జునుని యొక్క కళ్ళజోడును తీసివేసినాడు. అప్పుడు అర్జునుడు తన నిజ నేత్రములతో సత్యమైన దృష్టితో స్వామి యొక్క నిజ స్వరూపమును చూచినాడు. దానిని చూడలేక భయపడినందున మరల అర్జునునకు ఆ కళ్ళజోడును పెట్టినాడు. కావున పరమాత్మ అవతరించునపుడు తన యొక్క నిజ స్వరూపముతోనే క్రిందకి వచ్చినాడు. దానిని జీవులు చూడలేరు.

కావున మాయ జీవుల కండ్లకు స్వామి మనుష్యునిగ కనిపించు భ్రమను కలిగించు కళ్ళజోళ్ళను జీవుల కండ్లకు పెట్టినది. అవ = అనగా క్రిందకు, తర = అనగా దిగుట. ఒక వ్యక్తి మేడపై నుండి క్రిందకి దిగునప్పుడు తన నిజ స్వరూపముతోనే క్రిందకు దిగుచున్నాడు. అంతే తప్ప దిగునపుడు ఒక ముసుగు వేసుకొని దిగుటలేదు. కావున పరమాత్మ అవతరించునపుడు నిజముగ మనుష్య శరీరమును ఆశ్రయించిలేడు. ఆయన మనుష్య శరీరములో ఉన్నట్లు మనకు మాయ భ్రమను కలిగించుచున్నది. కావున అవతార పురషుని శరీరము లోపల మరియొక పరమాత్మ శరీరము ఉన్నదని భావించుట జీవుల యొక్క అజ్ఞానమే. పచ్చ కళ్ళజోడు పెట్టుకునప్పుడు ఎర్రని వ్యక్తిపై పచ్చ రంగు పూయబడలేదు. నీవు కళ్ళజోడు తీయగనే ఆ వ్యక్తి పచ్చరంగును నీటితో కడుకుని మరల ఎర్రగా కనిపించుట లేదు. అతడు ఎప్పుడునూ ఎర్రగానే ఉన్నాడు. కావున శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును విశ్వరూపముతోనే ఉన్నాడు. ఆయన యొక్క పరిమితమైన మానవాకారము మన యొక్క కంటి భ్రమయే. కావున అవతార పురుషుడు దివ్య దర్శనములను చూపుచున్నప్పుడు ఆయనలో ఎట్టి మార్పులేదు. ఆయన చేయుచున్నది మన యొక్క కంటి పొరలను కొంచెము ప్రక్కకు త్రోయుచున్నాడు. ఇదియే వేదాంతము యొక్క చిట్ట చివరి కొస. కావున గోపికలు శ్రీ కృష్ణుని బాహ్య స్వరూపము అంతః స్వరూపము అను రెండు స్వరూపములున్న వానిగా చూడలేదు. వారికి శ్రీ కృష్ణుడు సాక్షాత్తుగా పరబహ్మమే. వారి కండ్లకు మాయలేనే లేదు. కావున వారికి కృష్ణుడు ఎప్పుడును మానవునిగ గోచరించలేదు. వాళ్ళు కళ్లద్దములు లేనివారు. వారికి పసుపు, ఎరుపు అను రెండు రంగులు లేవు. ఒకే ఒక ఎరుపు రంగు నత్త్యము కనిపించుచున్నది. కావున వారికి కృష్ణుని పైనున్న విశ్వాసము ఒక క్షణకాలము కూడ చలించలేదు. వారికి ఈ మాయ లేకపోవుటకు కారణమేమనగా, వారికి ఎన్నడును అజ్ఞానము రాలేదు. ఏలననగా వారి జ్ఞానము అగ్నివలె ప్రకాశించుచున్నది. వారు ఎన్నో జన్మల నుండి నిద్రహారములు లేక ఏ ఇతర విషయమును మనస్సుకు రానీయక నిరంతరము భగవంతుని సత్సంగములో కోటాను కోట్ల జన్మలు గడిపిన బ్రహ్మర్షులు. వారికి కల ఆ నిశ్చలమైన శ్రద్ధయే వారి బ్రహ్మ జ్ఞానాగ్నికి కారణము. "శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం" అనగా శ్రద్ధయే జ్ఞానమునకు మూల కారణము. శ్రద్ధలేని కారణముననే జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించుచున్నది. మిధిలా నగరము తగలబడుచున్నను బ్రహ్మ జ్ఞానము ఆస్వాదించు జనకుడు లేచిపోలేదు. ఆయన యొక్క శ్రద్ధ ఎంతయో ఆలోచించుడు. మనము సినిమా హాలులో కూర్చునప్పుడు నల్లులు పీకుచున్నను, దోమలు రక్తము త్రాగుచున్నను తలుపులు బంధించుట వలన ప్రాణవాయువు లేక శ్వాస ఆడక ఆయాసము వచ్చుచున్నను, ఇంత ఏల పిడుగులు పడినను చలించము. ఆ పిడుగు మూలకముగా సినిమా ఆగిపోయినపుడు ఈ లోకమునకు వచ్చి ఏమి జరిగినదని ఆలోచించెదము.

కాని సత్సంగము యున్నప్పుడు లేక పురాణమో భాష్య ప్రవచనమో వినుచున్నప్పుడు చీమ చిటుక్కు మన్నను ప్రక్కకు చూచెదము. అన్ని ముచట్లు అప్పుడే వచ్చును. ఏ పనియు లేకపోయినను కొంప మునిపోయినట్లు లేచిపోయెదము. పొయ్య మీద పాలు పెట్టివచ్చి క్షణమే అయిననూ అవి పొంగిపోవుటకు ఇంకనూ ఎంతో సమయమున్ననూ ఆ పొంగు సాకుతో వెంటనే లేచిపోయెదము. ఇటువంటి వీరికిని, రాజ్యము తగలపడినను లేవని జనకునకు ఎంత బేధము గలదు. కావున పరమాత్మ పై నిజముగా మనకు శ్రద్ధ లేదు. విలువ లేదు. లౌకికములకు ఉపయోగించునేమోయని, మరణానంతరము రక్షించునేమో అని, అదియును కొందరి విశ్వాసము. అనుమానముతో మనకు శ్రద్ధ లేకపోవుట వలన బ్రహ్మ జ్ఞానము మనలో ఇముడుటలేదు. ఇల్లు, వాకిలి, సంసారబంధము అను నీటితో చల్లారి అజ్ఞానమను పొగతో మనము చుట్టబడియున్నాము. ఇదే "ధూమేనా వ్రయతే వహ్నిః అశ్వతం జ్ఞానమేతేని" అని గీతలో చెప్పబడినది. ఈ అజ్ఞానము యొక్క పొరల వల్లనే మాధవుడు స్వస్వరూపమున క్రిందకు దిగివచ్చినను, మనము ఆయనను గుర్తించ లేక మానవునిగనే చూచున్నాము. మనకు ఆయన యొక్క మాధవ స్వరూపము గోచరించుట లేదు. కావున స్వామిని మాయకప్పి యున్నది. స్వామి స్వ స్వరూపమును ప్రకటించనక్కరలేదు. మన మాయ పొరలను తొలగించుకొన్నచో ఆయన యొక్క స్వ స్వరూపమును మనము చూడ గలుగుదుము. ఆయన యొక్క దివ్య దర్శనము కొరకు ఆయన ఎట్టి ప్రయత్నము చేయనక్కర లేదు. మనమే ప్రయత్నము చేయవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, February 15, 2010

జీవుడు

జీవుడు ఒక బురద నీటి పాత్రవలె ఉన్నాడు. పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము అగు జీవుడు. ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు, క్షేత్రజ్ఞడు, పరా ప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు. ఈ బురద నీటిలో యున్న మట్టికణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు. ఇక ఒక సుగంధ నీటి మహా సముద్రమే ఈశ్వరుడు. ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము. బురద నీటిలోని శుద్ధ జలము అనగా బ్రహ్మము అనబడును. శంకరులు అవతరించిన సమయమున జీవులు నాస్తికులై అసలు ఈశ్వరుడు లేడు అన్నారు. అనగా బురద నీటి ముందు ఈ బురద పాత్రలచేత సుగంధ జలసముద్రము ఉన్నది అనిపించవలెను. దీనికి శంకరులు ఒక చిట్కా చేసినారు. ఓ బురద నీటి పాత్రా! (ఓ జీవా!) నీకును సుగంధ జలసముద్రమునకును (ఈశ్వరునకును) ఏమియు తేడా లేదు. నీలో శుద్ధజలమున్నది. సుగంధ జలసముద్రములోను శుద్ధ జలమున్నది. అనగా జీవునిలోను ఈశ్వరునిలోను శుద్ధ చైతన్యమను ఒకే జలమున్నది. కావున జీవుడే ఈశ్వరుడు. నీవు ఉన్నావు కావున, నీవు ఈశ్వరుడవు కావున ఈశ్వరుడున్నాడు గదా! జీవుడు బురద నీటి పాత్రలోను, సుగంధ జసముద్రములోను ఒకే శుద్ధ జలము ఉన్నంత మాత్రమున బురద నీటి పాత్ర సుగంధ జలము ఎట్లగును. బురద నీటి పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా తక్కువ. సుగంధ జల సముద్రములోని శుద్ధ జల ప్రమాణము చాలా ఎక్కువ. మరియును బురద మట్టి కణములు (జీవగుణములు) వేరు, సుగంధ జల గుణములు (కల్యాణ గుణములు) వేరు. కావున జీవునకు ఈశ్వరునకు అద్వైతము కుదరదు.

శంకరులు:- శుద్ధ చైతన్యమగు (శుద్ధ జలము) బ్రహ్మము మాత్రమే సత్యము. బురద మట్టి కణములు సుగంధ కణములు (గుణములు) సృష్టిలోని భాగము. సృష్టి మిధ్య. కావున మట్టికణములు, సుగంధ కణములు లేనట్లే. నీవు పాత్రలోని శుద్ధ జలము. ఈశ్వరుడు సముద్రములోని శుద్ధ జలము. కావున జీవుడవగు నీవు ఈశ్వరుడవే.

జీవుడు:- పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా ఎక్కువ . కావున రెండును శుద్ధ జలము (శుద్ధ చైతన్యము) అయిననూ ప్రమాణములో బేధముండుట చేత అద్వైతము సత్యము కాదు.

శంకరులు:- ఒక పాత్రలోని జలము తక్కువ భాగము ఖాళీ స్ధలమును ఆక్రమించుచున్నది. ఒక బిందెలోని నీరు ఎక్కువ ఖాళీ స్ధలమును ఆక్రమించుచున్నది. ఈ ఖాళీ స్ధలమునే ఆకాశము అనుచున్నాము. ఆకాశము పంచభూతములలో ఒకటి. పంచభూతములు సృష్టిలో భాగములు. సృష్టి మిధ్య అన్నప్పుడు పంచభూతములు మిధ్య కనుక ఆకాశము (ఖాళీ స్ధలము) మిధ్యయే. ఈ శుద్ధ జలము (అనగా శుద్ధ చైతన్యము అనగా బ్రహ్మము) సృష్టికి అతీతమైనది. కావున ఆకాశతత్త్వమునకు అతీతమైనది. కావున ఆకాశ తత్త్వముపై ఆధారపడిన ప్రమాణ తత్త్వము కూడ మిధ్యయే అగును. అనగా "అంతా" "ఇంత" అను ప్రమాణ బేధము మిధ్యయగును. కావున జీవుడన్నను, ఈశ్వరుడన్నను కేవలము శుద్ధ చైతన్యమే.

ఈ విధముగా శంకరులు జీవుడు, ఈశ్వరుడు ఒక్కరే అని ఇరువురు బ్రహ్మమే అని వాదించి నాస్తికుని చేత ఈశ్వరుడు ఉన్నాడు బ్రహ్మము ఉన్నది అని అంగీకరింప చేసినాడు. ఇక్కడ శంకరులు కొన్ని మాయలను చేసినారు. కాని జీవుల శ్రేయస్సు కొరకు చివరలో ఒక మంచి ఫలితమును సాధించుట కొరకు మాయ మాటలు చెప్పుట తప్పుకాదు. ఇచ్చట సత్యము చెప్పుట గురుతత్త్వము కాదు. పెడత్రోవ పట్టిన జీవులను సరియైన మార్గమున మరలించుటకు అవసరమైనచో కొన్న మాయ మాటలు చెప్పియైనను మరలించుటయే గురుతత్త్వము. సత్యమేదో నిష్కర్షగా చెప్పి వింటే వినండి లేకపోతే చావండి అని చెప్పుట గురుతత్త్వము కాదు. అవసరమైనచో సత్యమును దాచి మాయమాటలు చెప్పియైననూ శిష్యులను ఒక మెట్టు ఎక్కించుటయే గురువు యొక్క లక్ష్యమై యుండును. తల్లి పిల్లవానిచే అన్నము తినిపించునప్పుడు చందమామ రావే అని పాట పాడుచు ఈ ఒక్క ముద్ధ తిన్నచో జాబిల్లి దిగివచ్చునని మాయమాటలు చెప్పును. ఇచ్చట తల్లి అసత్యమును చెప్పుట పాపము కాదు. అసత్యము చెప్పియైనను పిల్లవానిచే అన్నమము తినిపించి ఉపకారము చేయుట పుణ్యమే. ధర్మ శాస్త్రములో సహితము సత్యము చెప్పుట కన్నను అహింసయే ఉత్తమ ధర్మమని చెప్పబడియున్నది.

ఒక్కొక్కసారి సత్యము చెప్పుట వలన పాపము కూడా వచ్చును. ఒక సాధువును కిరాతకులు తరుముకు వచ్చుచున్నారు. ఆ సాధువు ఒక పోదలోనికి పోయి దాగుకున్నాడు. అది సత్యవ్రతుడు అని మహర్షి చూచినాడు. ఆయన సదా సత్యమునే చెప్పు వ్రతము కలవాడు. కిరాతకులు పరుగెత్తుకు వచ్చిన వ్యక్తిని గురించి సత్యవ్రతుని అడిగినారు. ఆ వ్యక్తి ఆ పొదలో దాగుకున్నాడని సత్యవ్రతుడు చెప్పినాడు. కిరాతకులు ఆ పోదలోనికి పోయి ఆ సాధువును చంపినారు. సత్యవ్రతుడు మరణించిన తర్వాత ఆయనను యమభటులు నరకమునకు తీసుకొనిపోయినారు. అప్పుడు ఆయన "నేను పాపము చేయలేదు. ఎన్నడును అసత్యము చెప్పలేదు. నన్నేల తీసుకునివచ్చినారు" అని యమధర్మ రాజుని ప్రశ్నించినాడు. అపుడు యమధర్మ రాజు "నీవు సత్యమును పలికినందుకే నరకమునకు వచ్చినావు" అన్నారు. ఏలననగా సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. ఇంత కన్నను అహింస పరమ ధర్మము. ఒక సజ్జనుడు హింసింపబడుట కన్నను సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. కావున మాతృ వాత్సల్యము కన్న ఎక్కువ వాత్సల్యము గల గురువు అవసరమైన చోట కొన్ని మాయమాటలు చెప్పినను శిష్యులను ఉద్ధరించుటకే ప్రయత్నించును.

శంకరులు కేవలము సత్యమును స్ధాపించి వాదించుటకు వచ్చిన పండితుడు కాదు. ఆయన లక్ష్యము సత్యమును స్ధాపించుట కాదు. సత్యమును చెప్పినచో నాస్తికులు ఒక్క మెట్టు కూడ ఎక్కరు. చందమామ దిగిరాడన్న సత్యమును చెప్పినచో పిల్లవాడు ఒక్క ముద్ద కూడా తినడు. అప్పుడు ఆ బాలుడు అన్నము తినక శుష్కించి మరణించును. అది హింస యగును. కావున నాస్తికులు ఒక్క మెట్టు అయిననూ పైకి ఎక్కుట కొరకు శంకరులు ఎన్నో మాయ మాటలు గురుతత్త్వమును అనుసరించి చెప్పినారు. బురద మట్టి కణములు, సుగంధ కణములు మిధ్య అన్నారు. మిధ్య అనగా అత్యల్పమైన సత్యము దాదాపు లేనట్లే అన్నారు. అనగా జగత్తు దాదాపు లేనట్లే అని అర్ధము. ఇచ్చట శంకరులు చేసిన మాయ ఏమనగా జగత్తు మిధ్యయే. కాని ఎవరికి? జీవునకు కాదు. అది పరమాత్మ దృష్టిలో మిధ్య. జగత్తు పరమాత్మ యొక్క ఊహా స్వరూపము. ఒక వ్యక్తితో పోల్చి చూచినచో ఆ వ్యక్తి ఊహించు ఊహ మిధ్యయే. కాని ఊహలోని ఒక భాగమగు ఊహా స్వరూపుడగు వ్యక్తికి ఆ ఊహా ప్రపంచము సత్యమే అగుచున్నది. ఊహా లోకము నిజమైన వ్యక్తికి అసత్యము కాని ఊహా లోకములో ఒక భాగమగు ఊహ వ్యక్తికి అసత్యము కాదు. ఈ రహస్యమును బయిటపెట్టనిచో నాస్తికులు ఆ మొదటి మెట్టును ఎక్కరు. కావున ఎవరి దృష్టికి మిధ్య అని పూర్తిగా చెప్పకుండా గోడ మీద పిల్లి వాటముగా జగత్తు మిధ్య, దీనితో జీవుని దృష్టిలోనే జగత్తు మిధ్య యని జీవుడు భావించినాడు. జగత్తులోని భాగములగు బురద మట్టి కణములు, సుగంధ కణములు అసత్యమే. జగత్తులోని భాగమగు ఆకాశము అసత్యము కావున ఆకాశము యొక్క గుణము పరిమాణము కావున, పరిమాణము అసత్యమే కావున చిన్న నీటి గుంటయు, పెద్ద సముద్రము ఒక్కటే అగుచున్నవి. కావున సారాంశము చిన్న బురద నీటి పాత్రయు, పెద్ద సుగంధ జలసముద్రము రెండునూ ఒక్కటే. కావున జీవుడే ఈశ్వరుడు. ఈశ్వరుడే జీవుడు. ఈశ్వరుడగు నేను ఉన్నాను అని అన్నాడు జీవుడు. అనగా ఈశ్వరుడు ఉన్నాడు అని మొదటి మెట్టు ఎక్కినాడు. ఈ విధముగా శంకరులను మనము వాత్సల్య స్వరూపుడైన గురువుగానే చూడవలయునే కాని కేవలము సత్యమును స్ధాపించి తనకున్న పాండిత్యమును ప్రకటించు ఒక పండితునిగా చూడరాదు. జీవుడు బోధకుడైనచో అతడు కేవలము పండితుడు మాత్రమే అగును. ఏలననగా ఒక జీవునకు సాటి జీవులపై వాత్సల్యము ఉండదు. అతడు కేవలము తన పాండిత్యమును ప్రదర్శించి కీర్తిని పొందవలయునన్న కోర్కె కలిగి ఆత్మోద్ధరణకు మాత్రమే ప్రయత్నించును. కాని స్వామి బోధకునిగా వచ్చినపుడు ఆయనకు ఆత్మోద్ధరణము అక్కరలేదు. కీర్తితో అసలు పనిలేదు. కనీసము ఒక్క జీవునియైనను ఉద్ధరించుటకు ఆయన సర్వశక్తిని ఉపయోగించును. ఆయనకు జీవులపై అపార వాత్సల్యము కలదు. కావున స్వామి బోధకుడుగా అవతరించినపుడు మాత్రమే గురువు అనవలెను. పండితులకు గురు శబ్దము వాడరాదు. పరబ్రహ్మమగు స్వామియైన దత్తుడు ఒక్కడే గురువు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, February 1, 2010

హనుమంతుడు (జీవేశ్వరులు)

హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినపుడును కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తినపుడును, ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో, జీవేశ్వరుల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మ సూత్రములలో "అనుప్సత్తేస్తు శారీరః" ఇత్యాది సూత్రములలో శంకరులు కూడ జీవేశ్వరులకు గల బేధమును స్ధాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు తన శరీరమును పర్వతము కన్న ఎక్కువ ప్రమాణములో పెంచియున్నాడు. అంత పెద్ద పరిమాణము గల శరీరములో ఇమిడియున్న శక్తి కూడ చాలా పెద్దది. కావున స్వల్ప శక్తి గల పర్వతమును ఎత్తుట మన బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. ఒక పెద్దరాయి చిన్నరాయిని మోసినట్లు తర్క బద్ధమైన విషయమై యున్నది. కాని చాలా చిన్న శరీరము గల బాలకృష్ణుడు తన శరీర పరిమాణమును పెంచకయే పర్వతమును ఎత్తుట బుద్ధికి అందక తర్కాతీతమైన విషయముగా యున్నది. మానవునిలో శక్తి లలితములైన డెబ్బది రెండువేల నాడుల యందు ప్రవేశించుచున్నది. ఒక బాలుని శరీరములో ఈ శక్తినంతయు కలిపి చూచినచో ఆ బాలుడు చిన్న బండను మాత్రమే ఎత్తగల శక్తి కలిగి యున్నాడు. ఇంత కన్న ఎక్కువ శక్తి లలితములైన ఆ నరముల యందు ప్రవహించినచో ఆ నరములన్నియు మాడిపోయి శరీరము భస్మమగును. ఒక కొండ ఎత్తుటకు ఒక పెద్ద క్రేన్‌ యంత్రము ఉపయోగించినపుడు ఎంత విద్యుత్‌చ్ఛక్తి కావలయునో ఆలోచించుడు. ఇప్పుడు మన బాలకృష్ణుడు ఆ కొండ నెత్తినాడన్నచో అంత శక్తి ఆ బాలును నరములందు ప్రవహించుచున్నదని అంగీకరించక తప్పదు. కాని ఆ విద్యుత్‌చ్ఛక్తిలో కోటి వంతు ఒక మనిషికి తగిలినను ఆ మనిషి మాడిపోవుచున్నాడు. కాని హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు శరీరము యొక్క పరిమాణము పెరుగుట వలన ఆ శరీరము యొక్క శక్తి పెరిగినది కావున శక్తి చేత శరీరము ఏ మాత్రము బాధించబడదు. ఒక చెంబు పెద్ద బిందెగా మారినపుడు చెంబు నీటి కన్నను ఎక్కువ పరిమాణములో పది చెంబుల నీరు బిందెలో పట్టుచున్నది. కావున జీవునిగా ప్రవర్తించుచున్న హనుమంతుడు కొండ నెత్తుట తర్కమునకు అందుచున్నది. కాని గోవర్ధన పర్వతమును ఎత్తినపుడు కృష్ణుడు శరీరమును పెంచలేదు. కొండ నెత్తు శక్తి మాత్రము పెరిగినది. ఆ అధిక శక్తికి బాలుని శరీరము బాధపడలేదు. బిందెడు నీరు చెంబులో పట్టినవి. ఇది తర్కమునకు అందదు.

శ్రుతులు అన్నియును పరమాత్మ తత్వము తర్కాతీతమని ఘోషించుచున్నవి. "అతర్క్యః" "నైషతర్కేణ", "నమేధయా", "యోబుద్ధేపరతః", "యస్యానతమ్‌ తస్యమతమ్‌" అను శ్రుతులు ఎన్నటికిని ఎవరికిని అర్ధము కాని వాడు పరమాత్మ అని చెప్పుచున్నవి. గీతలో కూడా "మాంతువేదాన కశ్చన" అనగా నన్ను ఎవ్వడును అర్ధము చేసుకొనజాలడు అని చెప్పుచున్నది. కావున జీవుడు ఎన్ని అష్ట సిద్ధులను సంపాదించినను ఈశ్వరత్వము రాదు. అష్ట సిద్ధులు మానవుని తర్కమునకు అందకున్నను ఋషులు దేవతల యొక్క మేధాశక్తి యగు తర్కమునకు అందుచున్నవి. కావుననే ఋషులు దేవతలు అష్ట సిద్ధులను వింతగా చుడరు. మనము నిత్యము చేయు కర్మలకు ఎట్లు ఆశ్చర్యపడమో, దేవతలు ఋషులు అష్ట సిద్ధులకు ఆశ్చర్యపడరు. కావున పరమాత్మ తత్త్వము తర్కాతీతము అనుటకు పరిమితమైన నరాకారములోనే పరమాత్మ ఉన్నప్పుడు అది సాధ్యమగును. విశ్వరూపమును సందర్శించినపుడే అనాది అనంతమైన అకారమున స్వామి గోచరించినాడు. అంత పెద్ద ఆకారముతో ఈ అనాది అనంతమైన విశ్వమును భరించుటలో ఆశ్చర్యమేమున్నది? ఒక పెద్దకొండ ఏనుగును మోయునపుడు ఎట్లు ఆశ్చర్యము లేదు. అది తర్కమునకు అందుచున్నది. మరి శ్రుతులు పరమాత్మ తర్కాతీతుడనుచున్నవి. కావున ఈ విశ్వరూపము పరమాత్మ ఎట్లుగును? కాని పుత్రుడైన చిన్నబాలుడైన కృష్ణునిలో అనాది అనంత విశ్వమును యశోద దర్శించినది. అనంతమైన విశ్వరూపములో ఈ పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. కాని బాలకృష్ణుని చిన్ననోటిలో ఇంత పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధము కాక తర్కాతీతమై యున్నది. కావున శ్రుతులు చెప్పిన దాని ప్రకారము పరమాత్మ విశ్వ రూపమా? లేక బాలాకృష్ణుడా? యుక్తి ద్వారా కూడా ఇదే సిద్ధించును. ఏలననగా, బ్రహ్మము అను శబ్ధమునకు అర్ధము ఏమి? గొప్పది అని అర్ధము. తర్కబద్ధమైన విశ్వరూపము గొప్పదా? తర్కాతీతుడైన బాలకృష్ణుడు గొప్పవాడా? ఇక అనుభూతిని తీసుకున్ననూ, "ఆశ్చర్యవత్‌ పశ్చ్యతి కశ్చిదేనమ్‌" అని శ్రుతి. అనగా పరమాత్మ దర్శనము ఆశ్చర్యమును కలిగించును అని అర్ధము. విశ్వరూపము భయమును కలిగించినది. "భీతభీతః ప్రణమ్య" అని గీత. "అధతస్య భయం" అను శ్రుతి అజ్ఞానము భయమును కలిగించునని చెప్పచున్నది. విశ్వరూపము తర్కబద్ధము కావున అజ్ఞానమే. ఇది యొక సిద్ధియే. కాని కృష్ణుని నోటిలో విశ్వము చూచినపుడు ఆశ్చర్యము చెందుటకు తర్కాతీత స్ధితియే కారణము. విచిత్రమే ఆశ్చర్యకారణము. ఈ విచిత్రమే మాయ. "మయవైచిత్ర్యే" కదా. ఈ విచిత్రము అనగా మాయ కలవాడే ఈశ్వరుడు. "మాయినంతు మాహేశ్వరమ్‌" అని గీత. కావున చర్మ చక్షువులకు గోచరించిన వసుదేవుని పుత్రుని స్వరూపమే పరబ్రహ్మము అని తెలియువాడు అసలు దొరకడని "వాసుదేవస్సర్వమితి" అను శ్లోకము చెప్పుచున్నది. "యత్సాక్షాదపరోక్షాత్‌" అను శ్రుతి పరబ్రహ్మము ప్రత్యక్షమగుచున్నది. "ఇహచేదవేదీత్‌" అను శ్రుతి ఈ లోకమున నున్న సత్యరూపమును కనుగొన్న వాడే సత్యముగా బ్రహ్మమును పొందినవాడనియు లేకున్నచో శాశ్వతముగ నష్టపోవునని చెప్పుచున్నది.

విశ్వరూప ప్రదర్శనము మహాతేజో దర్శనము. ఇది ద్రవ్యయజ్ఞము అయిన ఒక మహిమ. దీని కన్న జ్ఞాన యజ్ఞము గొప్పది. "శ్రేయా ద్రవ్యమయాత్‌" అని గీత. వసుదేవ పుత్రుని బ్రహ్మముగా తెలియుటయే బ్రహ్మ ప్రాప్తిని పొందును. "జ్ఞానావాన్మాం ప్రపద్యతే" అని గీత కదా. ద్వాదశాక్షరిలో కూడ "వాసుదేవ" శబ్దమే ఉన్నది. కృష్ణాది శబ్ధములు విశ్వరూపమునకు కూడ అన్వయించును. విశ్వరూపము ఆకర్షించునని చెప్పవచ్చును గదా. కానీ, వసుదేవ పుత్రుడను శబ్దము విశ్వరూపమునకు సమన్వయించదు. విశ్వరూపము వసుదేవునికి పుట్టినది కాదు కదా. "పరం భావమజానన్తః" అని గీత. ఈ వాసుదేవుడే జననమరణాది అనిత్య ధర్మములను కలిగి, పరమితుడై , అదే సమయమున అనాద్యమృతనిత్యుడై అనంతుడగుట చేత ఈ విచిత్ర తత్త్వమగు మాయను అర్ధము చేసుకొనలేని మూఢజనులు వాసుదేవుని నిర్లక్ష్యముగ చూచి పరాభవింతురు. దీనికి కారణము అసూయయే. ఈ అసూయ ఒకసారి సున్నా వచ్చి, మరి యొకసారి వందగా హెచ్చును. కావున అసూయ నిత్యనాశనము పొందినపుడే చిత్తశుద్ధి పూర్తియగును. అప్పుడే అసలు సిసలైన బ్రహ్మ స్వరూపము బోధకెక్కును. కావున చిత్తశుద్ధి లేనిదే జ్ఞానాధికారము లేదని శంకరులు అన్నారు. ఇట్టి వాసుదేవుని నరునిగా ఇంద్రాది దేవతలు, ఉదంకుడు మొదలగు ఋషులు సైతము తెలియక భ్రమలో పడినారు. కావున దేవతలు సైతము బ్రహ్మమును తెలియజాలరని యముడు నచికేతనునికి బోధించెను. నరుడు అనగా "నరీయతే" అను అర్ధము ప్రకారము నిత్యుడు అని అర్ధము. నారాయణడు నిత్యుడు కావున నారాయణుని నరుడు అనవచ్చును. కావున నరనారాయణ తత్త్వమును ఒకే పరబ్రహ్మము యొక్క లక్షణము. నారాయణుడనగా జ్ఞాన స్వరూపుడని అర్ధము. నరనారాయణుడనగా నిత్యమైన జ్ఞానస్వరూపుడని అర్ధము. నిత్యమనగా అంతములేనిది. అనగా అనంతము. నిత్యమే సత్యము కావున సత్యమైన అనంతమైన జ్ఞాన స్వరూపమే బ్రహ్మము. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి. ఈ విధముగా నరనారాయణ తత్త్వములు అవినాభావములు. అనగా వేరు చేయలేనివి. సూర్యుని యొక్క కాంతి, వేడి, అను రెండు లక్షణములను ఒక దాని నుండి యొకటి వేరు చేయుటగాని, సూర్యుని నుండి విడదీయుట గాని చేయలేము. ఇవి ఒక్క రూపాయి యొక్క రెండు తలముల వంటివి. నారాయణుడు ఎప్పుడును నరస్వరూపుడే ఇది కృష్ణుని గురించిన తత్త్వము. ఇక కృష్ణుని ప్రక్కనే ఉన్న అర్జునుడు కేవలము నరుడు. అనగా జీవుడు. జీవుడును తాను ధరించిన స్ధూల శరీరముతో పోల్చినచో నిత్యుడే. అంతే కాని నారాయణుని వలె నిత్యుడు కాడు. జీవుడు సృష్టికి పూర్వము లేడు. జీవుడు పరాప్రకృతి యనబడు సృష్టిలోని భాగము. కావున కేవలము స్ధూల శరీరము దృష్ట్యా మాత్రమే నిత్యుడు. "అజో నిత్యః హన్యమానే శరీరే" అని గీత చెప్పుచున్నది. అనగా స్ధూల శరీరము నశించినను జీవుడు నశించడు కావున జీవుడు నిత్యుడు అని చెప్పుచున్నది. కావున నారాయణుడు నరుడే కాని, నరుడు నారాయణుడు కాడు.

వజ్రము ఘన పదార్ధము. కాన ఘన పదార్ధములన్నియు వజ్రములు కావు. ఘన పదార్ధములలో శ్రేష్టమైనది వజ్రము. ప్రతి వర్గములోను నేనే శ్రేష్టుడను అని విభూతి యోగములో గీతలో స్వామి చెప్పినాడు. మనకు కనపడు ఈ సర్వ సృష్టి వస్తువుల యందు చైతన్యము కల ప్రాణి జడముల కన్నను శ్రేష్టమైయున్నది. ఆ ప్రాణులలో నరుడు మరింత శ్రేష్టుడు కావున స్వామి నరుడై యున్నాడు. ఐతే అందరు నరులు స్వామియని అర్ధము కాదు. ఉదాహరణకు "వైనతేయశ్చ పక్షిణం" అన్నారు స్వామి. అనగా పక్షులలో గరుత్మంతుడను అని అర్ధము. గరుత్మంతుడు పక్షియే కాని ప్రతి పక్షి గరుత్మంతుడు కాదు. ప్రతి పక్షి గరుత్మంతుడైనచో సర్వ పక్షులును నేనే అని చెప్పియుండెడివాడు. నారాయణుడు పురుషుడు. కాని ప్రతి పురుషుడు నారాయణుడు కాడు. "పురి, దేహే, శేత ఇతి పురషః" అనగా శరీరమును ధరించిన వాడు పురుషుడు అని అర్ధము. కావున నారాయణుడును శరీరధారియే కాని శరీరధారులందరు నారాయణులు కాదు. పురషులలో ఉత్తముడు నారాయణుడు కావున పురుషోత్తముడనబడుచున్నాడు. గీతలో "ప్రకృతిం పురుషం చైవ" అని శ్లోకములో సృష్టి ప్రకృతి పురుషుడు. సృష్టికర్త యగు పరమాత్మ అని చెప్పబడినది. ఇంత మాత్రమున ప్రతి పురుషుడు అనగా ప్రతి జీవుడు పరమాత్మ యని భావించురను సంశయమును నివారించుటకు "ఉత్తమ పురుషన్తన్యః పరమాత్రే త్యుదాహృతః అతోస్మి లోకే వేదేచ ప్రధితః పురుషోత్తమః" అని చెప్పబడినది. అనగా పురషులలో ఉత్తముడగు పరమాత్మ మామూలు పురుషుని కన్నను వేరు. కావున పురుషోత్తముడు అను దీని భావము. పురుషోత్తమ శబ్ధములో పురుష శబ్ధము ఆయన యొక్క బాహ్యమైన నరస్వరూపమును సూచించుచున్నది. ఉత్తమ శబ్ధము పరమాత్మయైన అంతఃస్వరూపమును సూచించుచున్నది. ఈ రెండునూ విడదీయలేని తత్త్వములు. విద్యుత్‌ తీగెలో ప్రవహించు సమయమున తీగె నుండి విద్యుత్‌ను వేరు చేయలేము. ఈ ప్రకరణమున శంకర, రామానుజ భాష్యములు ఇట్లున్నవి. శంకర భాష్యము ఇట్లు చెప్పుచున్నది. ప్రకృతి - పురుషుడు అను రెండు తత్త్వములున్నవి. ప్రకృతియే సృష్టి. పురుషుడే సృష్టికర్త యగు పరమాత్మ. ఈ పురషుడే ఉత్తముడు కావున పరమాత్మ యనబడుచున్నాడు. ఈ శంకర భాష్యమును శిష్యులు అపార్ధము చేసుకున్నారు. ప్రకృతి యనగా సృష్టి. పురుషుడు అనగా జీవుడు. ప్రతి జీవుడు పరమాత్మయే అని అర్ధమును తీసినారు. కాని శంకరుల హృదయము అది కాదు. అయన జీవులను పరాప్రకృతిగా, ప్రకృతిలోకే అనగా సృష్టిలోకే త్రోసివేసినారు. ఇక్కడ ఆయన చెప్పు పురుష శబ్ధము పురుషునిగా అనగా జీవునిగా కనిపించు పరమాత్మయే. జీవ శబ్దము కూడా పురుష శబ్దము వలె పరమాత్మకు అన్వయించ వచ్చును. అప్పుడు జీవ రూపమున కనిపించు పురుషోత్తముడే జీవుడని చెప్పవచ్చును. అపుడు "జీవో బ్రహ్మైవ" అనుట సత్యమే. ఈ అపార్ధమును నివృత్తి చేయుటకే శంకరులు మరల రామానుజుడుగా అవతరించి పురుషోత్తమ తత్త్వమును వివరించినాడు. పురష శబ్దము చేత ప్రతి పురుషుడు పరమాత్మ అనుకుందురేమో అను సంశయమును నివారించుటకు స్వయముగా గీతయే పురుషుల కన్న భిన్నుడు పురుషోత్తముడు అని "ఉత్తమ పురుషస్యన్యః" అని చెప్పుచున్నది. కనుక బాహ్య రూపమే పురుషుడు అంతస్వరూపమే పురుషోత్తముడు. బాహ్య రూపమే పక్షి. అంతస్వరూపమే గరుత్మంతుడు. అన్ని గద్దల వలే గరుత్మంతుడును ఒక గద్దయే. కాని ఆ గద్దలలో ఒక గద్ద మాత్రమే గరుత్మంతుడు. ఇదే పురషోత్తమ తత్త్వము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, January 15, 2010

నారాయణుడు

నారాయణుడు అనగా ఎవరు? "నారం ఆయనం యస్యసః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్ధమేమి? నరీయతే క్షీయతే ఇతి నరః అనగా నశించని వాడు నరుడు అని అర్ధము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు. శరీరము కూడ నశించినట్లు కనబడుచున్నదే కాని నశించుట లేదు. ఏలయనగా శరీరము లోని పంచభూతములు సృష్టిలోని పంచభూతములతో కలయుచున్నవి. ఆ పంచభూతములు ఇతర శరీరములకు కారకములగుచున్నవి. కావున జీవుడు నిత్యుడే. శరీరములోని పంచభూతములు కూడా నిత్యములే. ఈ శరీరము యొక్క రూపము మాత్రము నశించుచున్నది. కావున నరుడు అనగా నిత్యుడు అనగా జీవుడు మరియు శరీరము అని తీసుకొనవచ్చును. శరీరము బాల్య, యవ్వన, కౌమార, వార్ధక దశలు అన్నింటి యందును నిత్యముగనే ఉన్నది కదా. మనము నరుడు అన్నప్పుడు కూడ ఒక మనిషి అర్ధమునే తీసుకొనుచున్నాము. అనగా జీవునితో కూడిన శరీరమునే తీసుకునుచున్నాము. కావున శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవునితో కూడిన ఒక నర శరీరమును ఆశ్రయించిన వాడే నారాయణుడు. "మానుషీమ్‌ తను మాశ్రితమ్‌" అను గీత కూడా నేను మనుష్య శరీరమును ఆశ్రయింతును అని చెప్పుచున్నది. ఐతే పరమాత్మ అవతరించునప్పుడు ఆశ్రయించు నరశరీరములో ఉన్న జీవుడు నిర్గుణుడైన శుద్ధ చైతన్యము మాత్రమే. ఇట్టి శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవుని పైన శరీరమును మాతృ గర్భములో యున్నపుడు పరమాత్మ ఆశ్రయించ వచ్చును. లేక పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు ఆశ్రయించ వచ్చును. మరి మాతృ గర్భమున శరీర పిండమున ఉన్న శుద్ధ చైతన్యమును జీవుడన్నారు గదా. మరి పరలోకము నుండి దిగివచ్చిన ఈ రెండవ జీవుడెవరు? అనగా పిండ శరీరమున ఉన్న జీవుడు శుద్ధ చైతన్యము.

పరలోకము నుండి వచ్చిన జీవుడు నానా కర్మవాసనా గుణములతో కూడిన చైతన్యము ఒక ఉదాహరణము. ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర జడపదార్ధము. మాతృ గర్భలో యున్న జడమైన పిండ శరీరము జడమైన ఆ పాత్ర వంటిది. ఆ పాత్రలో శుద్ధ జలమున్నది. పిండ శరీరములో యున్న శుద్ధ చైతన్యము శుద్ధ జలము వంటిది. ఇప్పుడు ఈ పాత్రలో యున్న శుద్ధ జలములో కొంచెము బురద నీరు కలిపినాము. ఈ బురద నీరే పరలోకము నుండి దిగి వచ్చిన జీవుడు. ఈ బురద నీటిలో కూడ శుద్ధ జలము ఉన్నది. ఐతే బురద నీటిలో కూడ శుద్ధ చైతన్యము ఉన్నది. ఐతే బురద నీటిలో శుద్ధ జలముతో పాటు మట్టి కణములు కూడ వున్నవి. ఈ మట్టి కణములే దిగి వచ్చిన జీవునిలో ఉన్న కర్మ వాసనా గుణములు. ఇప్పుడు బురద నీరు పాత్రలోని శుద్ధ జలముతో కలసినప్పుడు ఏమైనది? బురద నీటిలోని శుద్ధ జలము పాత్ర నీటిలోని శుద్ధ జలముతో కలసి పోయినది. అనగా శరీరములోని శుద్ధ చైతన్యము దిగివచ్చిన జీవుని యొక్క శుద్ధ చైతన్యము కలసిపోయినది. కాని మట్టి కణములు మాత్రము శుద్ధ జలములో కలసిపోవు. అట్లే వాసనాగుణములు శుద్ధ చైతన్యముతో ఐక్యము కాజాలవు. కాని శుద్ధ జలము అది మట్టి కణములు వేరు చేయని స్ధితిలో కలసిపోయి శుద్ధ చైతన్యము కన్న విడిగానే యుండును. అట్లే వాసనా గుణములు కూడ శుద్ధ చైతన్యము నుండి వేరు చేయలేము. కాని గుణములు ప్రత్యేకముగా విడిగనే యుండును. ఇదంతయు జరిగిన తర్వాత చివరకు బురద నీరు మాత్రమే మిగిలినది. అనగా మాతృ గర్భస్ధ పిండ దశలో యందు పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు మాత్రమే ఉన్నాడు. పాత్రలో ఉన్న శుద్ధ జలముతో బురద నీటిని కలిపిన తరువాత బురద నీటి యొక్క ప్రమాణము పెరిగినది. కాని మట్టి కణముల సంఖ్య పెరగలేదు. అట్లే దిగివచ్చిన జీవుడు మాతృగర్భ పిండమున ప్రవేశించగనే వాని కర్మ వాసనా గుణములలో ఎట్టి మార్పురాదు. కాకున్న శుద్ధ జలము యొక్క ప్రమాణము అధికమైనందున బురద నీరు మరింత అయినట్లు పరలోకము నుండి వచ్చిన జీవుడు మరింత శుద్ధ చైతన్యముతో చేరినందున బాగుగా బలపడును. అనగా జీవనని వాసనా గుణములు పిండ ప్రవేశము చేత బలపడుచున్నది. ఆ తల్లి తిను ఆహారము వలన లభించిన శుద్ధ చైతన్య శక్తి రోజు రోజుకు ఎక్కువ అగుచుండగా ఈ జీవునిలో వాసనా గుణములు నానాటికి బలపడుచుండును. ఈ బలపడిన వాసనా గుణములు ఆ జీవ శిశువును ప్రసవించిన తరువాత ఆ శిశు శరీరములో అకారణముగా ఏడ్చుట, అకారణముగా నవ్వుట మొదలగు క్రియలను కల్గించుచుండును. ఆ శిశువు రోజు రోజుకు అన్నశక్తి చేత శుద్ధ చైతన్యము వృద్ధి యగుచుండగా ఆ వాసనా గుణములు బాల్యమున వాటికి అనుకూలమగు మంచి చెడు కర్మలను చేయించు చుండును. ఈ జీవుడు క్రమముగా బలపడి పెరిగి ఇతర జీవుల సంగము యొక్క ప్రభావము చేత కొత్త కొత్త వాసనలను సంపాదించుకొని, తదనుగుణముగా కొత్త కొత్త కర్మలను చేయుచుండును.

కాని పరమాత్మ అవతరించునపుడు జరుగు విషయము దీని కన్న వేరుగనున్నది. ఇదివరలో చెప్పిన పాత్రలో యున్న శుద్ధ జలమునకు కొంత చందన సుగంధ జలమును కలిపినప్పుడు ఆ పాత్రలో నున్న శుద్ధ జలమంతయు సుగంధ జలముగా మారుచున్నది. ఇదే విధముగా శుద్ధ చైతన్యముతో కూడిన గర్భస్ధ పిండ శరీరము లోనికి ఈశ్వరుడు ప్రవేశించుచున్నాడు. ఈ ఈశ్వరునిలో శుద్ధ చైతన్యమను శుద్ధ జలముతో పాటు కలిసిపోయిన చందన సుగంధ రేణువులను కల్యాణ గుణములున్నవి. కావున ఇప్పుడు మాతృ గర్భపిండ శరీరమున జీవునకు బదులు పై లోకము నుండి దిగివచ్చిన ఈశ్వరుడున్నాడు. ఆ తల్లి ప్రసవించగనే ఈశ్వరావతార పురుషుడు జన్మించినాడు. మానవ శిశువునకు, అవతార శిశువునకు బేధమేమి? ఇరువురిలోను జడ శరీరము అను రెండు పాత్రలున్నవి. ఇరువురిలోను శుద్ధ చైతన్యమను శుద్ధ జలమున్నది. అవతార శిశువులో చందన సుగంధ రేణువులగు కల్యాణ గుణములున్నవి. మానవ శిశువులో వాని పూర్వ కర్మ వాసనా గుణములను మట్టి రేణువులున్నవి. గుణములను తీసివేసినచో ఈశ్వరుడు జీవుడు ఒక్కటియే అగుదురు. బురద నీటి పాత్ర నుండి మట్టి కణములను వడపోసినాము. సుగంధ పాత్ర నుండి సుగంధ రేణువులను వడపోసినాము. ఇప్పుడు మిగిలినది శుద్ధ జలముతో కూడిన రెండు పాత్రలు. ఈ రెండు పాత్రలలో ఉన్న శుద్ధ జలము ఒక్కటే. ఈ శుద్ధ చైతన్యమునే బ్రహ్మము అన్నారు. కావున గుణములను తీసివేసిన నిర్గుణ చైతన్యము ఒక్కటే కావున జీవుడు బ్రహ్మమే ఈశ్వరుడు బ్రహ్మమే అన్నారు శంకరులు. ఇది నిజమే కాని శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేయలేము. శుద్ధ చైతన్యము గుణములకు ప్రాణము. ప్రాణము పోయిన కుక్కను కుక్క అని పిలువలేము. అది యొక రాయి వంటి జడ పదార్ధమే. ఆట్లే శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేసినపుడు వాటిని అసలు గుణములు అనలేము. గుణములను వదలి శుద్ధ చైతన్యము ఉండగలదు. కాని శుద్ధ చైతన్యమును వదిలి గుణములు ఉండలేవు. కాని నీటిని విడచి చేప ఉండలేదు. కావున సాధన యనగా జీవుడు తనలో నున్న పూర్వ కర్మ వాసనా గుణములను నిత్యము జ్ఞాన విచారణ అను వడపోత గుడ్డ సాయముతో వేరు చేయవలయును. అప్పుడు ఆ గుణములు నీటిని వదలినచో చేపల వలె నశించును. అయితే అది మరల ప్రవేశించకుండా ఎంతో శ్రద్ధతో ఉండవలయును. ఏలయనగా మహా భక్తులకే ఒక్కొక్కసారి అహంకార, మాత్సర్యాది గుణములు ప్రవేశించుచున్నవి. పెక్కు మాటలేల? సాక్షాత్తు హనిమంతునికే యయాతి రక్షణమున క్షణకాలము అహంకారము ప్రవేశించినది.

నారాయణ ఋషి వెంట జన్మ జన్మల వెంట యున్న నర ఋషియగు అర్జునుడే గయుని రక్షణ విషయమున అహంకారమును పొందెను. ఈ జీవుని గుణములలో పునాది వంటి మూల గుణమే అసూయ. ఈ అసూయనే ఈర్ష్య లేక మాత్సర్యమందురు. అసూయయే అహంకారమునకు కారణమగుచున్నది. తన కన్న గొప్పవానిని చూచినపుడు అసూయ కలుగును. వాడి కన్నను నేను గొప్పవాడను అను అహంకారము కాలక్రమముగా అసూయ నుండి జనించుచున్నది. ఈ అహంకారము యొక్క శాఖోపశాఖలే మిగిలిన జీవగుణములు. కావున అసూయ పోగానే సర్వజీవ గుణములు నీటి నుండి విసిరివేయబడిన చేపల వలె నశించుచున్నవి. నీ ఎదురుగ నరాకారమున పరమాత్మ యున్నపుడు నీవు ఎంత శ్రద్ధగా ఆరాధించినను ఒకానొక రోజుకు నీలో అసూయ గుణము బయిటపడక మానదు. ఆ నరాకార పరమాత్మ సిద్ధులను ప్రదర్శించినచో నీలో అసూయ మరింత బలముతో బయిటపడును. అందుకే శ్రీ రాముని ద్వేషించిన వారు చాలా తక్కువ. శ్రీ కృష్ణుని ద్వేషించిన వారు చాలా ఎక్కువ. షిరిడి సాయిని నిందించిన వారు చాలా తక్కువ. సత్యసాయిని నిందించిన వారు చాలా ఎక్కువ. సిద్ధులు విశ్వాసము కల్గించినను, కాలక్రమమున జీవునిలో మాత్సర్యము కల్గించును. జీవునిలో స్వామిపై పెరుగుచున్న మాత్సర్యము జీవునికే తెలియక ఒక్కసారి అనుకోకుండా అకస్మత్తుగా బయిటపడును. కాని ఆ మాత్సర్యము పెరుగుదల స్వామికి గోచరించును. అది బయిట పడక ముందే దానిని శాంతిప చేయుటకు స్వామి తన్ను తాను తగ్గించుకొనుచు చండాలాది రూపములతో గోచరించును. అధమ నరుండను నేను అని చెప్పుకొనును. అప్పుడు ఆ మాత్సర్యము వానిలో శాంతించును. జీవునిలో మాత్సర్యము శాతింపచేయుటకు స్వామి వాడు మరియొక ఔషధము ఏమనగా "సర్వజీవులు పరబ్రహ్మ స్వరూపులే" అనుట. దీనినే శంకరులు వాడినారు. ఈ ఔషధము చేత మాత్సర్యము పూర్తిగా శాంతించిన తరువాత కూడ గురువు చేసిన బోధ నిజమే అనుకొని "అహంబ్రహ్మస్మి" అను భావములో కొందరు శిష్యులున్న సమయములో వారికి నిజమును బోధించ తలచినారు శంకరులు. నిజము చెప్పినచో, ఇంక వారిలో మాత్సర్యము జన్మించదు అని నిశ్చయము చేసుకున్న తర్వాత తాను ఒకనాడు కరిగిన సీసమును త్రాగి మీరును బ్రహ్మమే అయినచో దానిని త్రాగమని శిష్యులను అడిగినాడు. అప్పుడు వారికి చిత్తశుద్ధి పూర్ణమైనందున మాత్సర్యము పుట్టలేదు. కావున దాసోహం అని శంకరుల పాదముల పడినారు. అయితే కొందరు చిత్తశుద్ధి పూర్ణముగా జరగని వారు మాత్సర్యము మరల విజృంభించుట చేత ఇది గారడి విద్యలెండు అని తలచి "అహం బ్రహ్మస్మి" అని భావించుచునే యుండిరి.

కావున జీవులను ఉద్ధరించుటకు శంకరులు రామానుజులుగ అవతరించినారు. తనను తాను స్వామి యని చెప్పుకొనుట జరిగిన ప్రమాదమును శంకరులు గుర్తించినారు. శంకరులు నిజముగా శంకరుడే ఇది శ్రుతి ప్రమాణ సిద్ధము. "నమో వ్యుప్త కేశాయచ" అని శ్రుతి. శివుడు ఎప్పుడును జటాజూటమును ధరించి యుండును. కాని రుద్ర నమకములో కేశములు గొరిగించుకున్నవాడని చెప్పబడినది. ఇది శ్రుతి వాక్యము కావున ఇది పరమ సత్యము. త్రోసివేయుటకు వీలులేదు. శివుడు శంకరులుగా అవతరించినపుడు సన్యాసాశ్రమమున శిరోముండనము చేయించుకున్నాడు. కావుననే "శివోహం శివోహం" అని వెలుగెత్తి చెప్పినాడు. అహంబ్రహ్మస్మి అని ఘోషించినాడు కాని ఈ జీవులు పరమానందయ్య శిష్యులు. ప్రతి శిష్యుడును శివోహం, అహం బ్రహ్మస్మి అన్నారు. పరమానందయ్యగారు శిష్యులతో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. వెంటనే శిష్యులు పరమానందయ్యగారితో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. అందుకే రామానుజులు సాక్షాత్తు విష్ణు స్వరూపులైనను, నేను విష్ణు భక్తుడగు శేషుని అవతారము అన్నాడు. అప్పుడు గాని శిష్యులు మేము స్వామి భక్తులము అని అనలేదు. రామానుజులు స్వామి అయినను తాను జీవుడనని చెప్పుకున్నారు. అప్పుడు జీవులు తాము కూడా జీవులమే అన్నారు. ఇదే జీవుల స్వభావము. దీనికి కారణము జీవుని కన్న అధికత్వమును ప్రత్యక్షముగ యున్న జీవుని రూపములో మాత్రము ససేమీరా ఒప్పుకొనరు. కావున స్వామి జీవుని రూపములో వచ్చినప్పుడు తనను తాను స్వామియని ప్రశంసించుకొనుట జీవులతో చాలా ప్రమాదకరము. ఎదో ఒక పరిపూర్ణ చిత్తశుద్ధి గల జీవునకు మాత్రమే అదియును ఏకాంతముగా తాను స్వామిని యని ప్రకటించును. ఒక్క అర్జునకు మాత్రమే ఏకాంతముగా గీతలో తన్ను తాను పరమాత్మనని చెప్పుచున్నాడు. అన్ని మహిమలను చేసినను యాదవులకు ఎన్నడును తనని తాను స్వామియని చెప్పుకొనలేదు. అంత పరిపూర్ణ చిత్తశుద్ధి గల, అంతకు ముందు వేయి జన్మలలో ఒక్కొక్క జన్మలో వేయి సంవత్సరములు తపస్సు చేసిన నరఋషి అవతారమగు అర్జునునికే చెప్పినాడు. ఆ మాటను భీష్మ ధర్మరాజాదులకు కూడా చెప్పలేదు. కాని అట్టి అర్జునుడే గీతాబోధ జరిగినా, 18 అధ్యాయములు విన్నా, పదునెనిమిదో రోజు సాయంకాలమునకే మాయలో పడినాడు. యుద్ధము ముగిసి పాండవ శిబిరమునకు రధము రాగానే ప్రతిరోజు సారధియగు తాను ముందు దిగి రధ ద్వారమును తెరచిన తరువాత రధికుడు అర్జునుడు దిగు సంప్రదాయము విడచి, పార్ధుని ముందుగా దిగమన్నాడు. ఆ క్షణములో రధికున కన్న సారధి గొప్పవాడు కానందున అహంకారముతో అర్జునుడు క్రిందకు దిగలేదు. కావున అర్జునిలోను అహంకారము ప్రవేశించినది. ఈ అహంకారమునకు కారణమేమి? కృష్ణునిపై గల అసూయయే. ఈ అసూయ ఎప్పుడు కలిగినది? భగవద్గీత చెప్పుటకు ముందు కృష్ణునిపై అసూయ కలుగలేదు.

ఏలననగా అంతకు ముందే జరిగిన గయోపాఖ్యానమున కృష్ణుని తాను గెలిచినాడు. కావున కృష్ణుడు తన కన్న తక్కువవాడు అన్న భావము వలన అసూయ కలగలేదు. మరియును తాను స్వామి యని అప్పుడును ప్రకటించలేదు. అప్పుడే పదునెనిమిది రోజుల ముందే కృష్ణుడు తాను స్వామియని ప్రకటించుట విశ్వ రూప దర్శనములో తాను గడగడ వణికి ఓడిపోవటము జరిగినది. కృష్ణుడు తాను పరబ్రహ్మమునని తెల్పుటయే కాక నిరూపించుట చేత అర్జునునకు అసూయ జనించినది. ఆ పదునెనమమిది రోజులలోఅసూయ పెరిగి పెరిగి అహంకారమును మొలకెత్తించినది. ఇది పార్ధునికి తెలియకుండగనే, పార్ధుని మనములో జరిగిన పరిణామము. కావున స్వామి అవతరించినపుడు తనను తాను స్వామియని ప్రకటించుకొనుటకు అర్హుడైన జీవుడు ఈ సృష్టిలో లేడు. ఒక్క జీవుడు తప్ప. ఆ జీవుడే రాధ. ఆ జీవుడు ఎప్పుడును ఓడిపోలేదు. ఆ జీవుడు ఎట్టి అడ్డునైనను దూకగల ఒక నిరంతతర భగవత్ప్రేమ మహాధార. అట్టి జీవుని కూడ దత్తుడు నిరంతర పరీక్షలోనే పెట్టుచున్నాడు. తన లోకమునకు పైన గోలోకమును సృష్టించి ఆమె పాదముల క్రింద తన శిరస్సును నిలిపి, ఆమెకు ఏ క్షణమైన అహంకారము వచ్చునేమో అని పరీక్షించుచునే ఉన్నాడు. కాని ఆ జీవునిలో ఇంతవరకు అహంకారము ప్రవేశించలేదు. భవిష్యత్తులో కూడా ప్రవేశించదు. కావుననే అమె పదవి పదిలముగనే యున్నది. ఉండును కూడా. కాని రాజరాజేశ్వరి భక్తులగు శక్తేయులు మాత్రము అహంకారముతో మిడిసిపడు చున్నారు. శక్తి యొక్క శ్రీ మత్సింహాసనము శక్తిలో అహంకారము ప్రవేశింపలేదు. శాక్తేయులలో అహంకారము ప్రవేశించినది. స్వామి కన్నను శక్తియే గొప్పదని వాదించుచున్నారు. అది శక్తికి పరీక్షయని వీరికి తెలియదు. పరీక్షించుట దత్తుని స్వభావ సిద్ధమైన గుణము. రామానుజుడు తనను తాను శేషుడు అనుటలో అర్ధము శేషుడు అనగా అవయవము అని అర్ధము. అనగా తాను విష్ణువు యొక్క అంశయని అర్ధము. సాక్షాత్తుగా స్వామి కాక పోయినను స్వామి యొక్క అంశయే అనుట చేత అద్వైతము మత్తు యొక్క నిషా కొంత తగ్గినది. మత్తును కూడా ఒక్కసారిగా క్రిందకు కుదించ కూడదు. ఆ తరువాత బ్రహ్మ దేవుని అవతారమగు మధ్వాచార్యులు వచ్చినారు. ఆయన నేను భగవంతునిలో అంశ కాదు. స్వామి కన్న వేరు. కేవలము స్వామి యొక్క దాసుడనే అని స్వామి సేవ్యుడు జీవుడు సేవకుడు అను సిద్ధాంతమును స్ధాపించినాడు. ఆయన స్వయముగా స్వామి అయిననూ తనను మూడవ వాయుపుత్రునిగా వర్ణించుకున్నారు.

హనమమంతుడు, భీముడు, మధ్వుడు అని వరుస చెప్పుకొని తనను తాను దాసుడనని శ్రీ వారి యొక్క కాలి కుక్కనని చెప్పుకున్నారు. అప్పుడు జీవుల యొక్క అద్వైత నిషా పూర్తిగా దిగినది. వారు మేము స్వామిలో భాగము కాదు. స్వామి కంటె వేరు. దాసాను దాసులము అన్నారు. ఇట్లు మూడవ అవతారమునకు గాని జీవుల వారి యొక్క సత్యమైన స్ధితికి రాలేదు. జీవుడు స్వస్ధితికి వచ్చుటకు స్వామి మూడు అవతారములు ఎత్తవలసి వచ్చినది. కావున ఒక్క జీవుని ఉర్ధరించుటకు స్వామి వేల అవతారములను ఎత్తవలెను. జీవుని చేత సత్య వాక్యమును పలికించుటకు స్వామి మూడు భాష్యములను చెప్పవలసి వచ్చినది. ఒక వ్యక్తి రైల్వేస్టేషనుకు పోయి, Who is tha station master? అని అడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I is tha stationa master" అన్నారు. ప్రశ్నించినవాడు తన ప్రశ్నలో ఏ క్రియను వాడినాడో (is) అదే క్రియను (is) తన సమాధానములో వాడినాడు. కావున గురువు తనను గురించి తాను ఏమి చెప్పునో శిష్యుడు కూడ తనను గురించి తాను ఆనాడు కాకపోయినను మరియొక నాటి కైనను అదే పలుకును. అప్పుడా వ్యక్తి "Are you the station master? అని ఆడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I are the station master" అన్నాడు. అప్పుడా వ్యక్తి ఆ స్టేషన్‌ మాస్టరు చేత సరియైన ఇంగ్లీషు వాక్యము పలికించవలయునని I am the station master అన్నాడు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు బల్లగుద్ది "I am the station master" అని కరెక్టుగా పలికినాడు. అట్లే శంకరుల తాను స్వామి అనగా, శిష్యులును తాను స్వామి అన్నారు. రామానుజులు తాను స్వామి యొక్క అంశలాగు భక్తుడననగా, శిష్యులు కూడ తాము స్వామి యొక్క అంశలాగ భక్తులమే అన్నారు. ఈ శిష్యుల చేత సత్యమును పలికించవలయునని మధ్వాచార్యులు "నేను వేరు స్వామి వేరు నేను స్వామి దాసుడను" అని చెప్పగా శిష్యులు కూడా "నేను వేరు, స్వామి వేరు, నేను స్వామి దాసుడను" అని పలికారు. ఈ విధముగా "సోహం" అని ఆరంభించి "దాసోహం" అను మాటతో ముగిసినది.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, January 12, 2010

గురుత్రయము

ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్యాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్ధాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకూలు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవోన కశ్చిత్‌" అనుచున్నది. అనగా దేవుడు లేడని అర్ధము. ఇక శూన్యవాదులగు బౌద్ధులు అంతా శూన్యమే కావున పరమాత్మయు శూన్యమే అన్నారు. ఒక కుగ్రామమునకు ఒక విద్యావంతుడు వెళ్ళి వారిని విద్యావంతులుగా చేయదలచినాడు. ఆ కుగ్రామములో జనులందరును ఒక్క అక్షరము గూడ వ్రాయటము చేతకాని వారే. అప్పుడు వారికి చదువు నేర్పుటాకు ఆ విద్యావంతుడు స్కూలు పెట్టునా, కాలేజి పెట్టునా లేక యూనివర్సిటి పెట్టునా. అతడు స్కూలు పెట్టి ముందు అక్షరముల నేర్పును. నాస్తికులు కూడ ఆ కుగ్రామ వాసుల దశలోనే ఉన్నారు. వారికి ముందు పరమాత్మ ఉన్నాడని స్ధాపించి పరమాత్మను గురించిన వివరములన్నియు చెప్పవలెను. ఇదే జ్ఞానము. ఆ కుగ్రామ వాసులను స్కూలుకు రప్పించుటకై మీరు ఈ స్కూలుకు వచ్చి అక్షరములను నేర్చుకొన్నచో కలెక్టరు పదవిని పొందుదురు అని చెప్పును. అది వారిని ఆకర్షించుట కొరకై ఈ స్కూలు తరువాత కాలేజి ఆ తరువాత యూనివర్సిటిలో చదివిన కాని కలెక్టరు పదవి రాదన్నచో అంత శ్రమకు భయపడి అసలు స్కూలులోకే రాడు. అట్లే మీరు పరమాత్మను గురించి తెలుసుకున్నంతనే మీరు పరమాత్మ అగుదురు అని శంకరులు "జ్ఞానా దేవత కైవల్యం" అని చెప్పినారు. అనగా జ్ఞానము చేత కైవల్యము సిద్ధించును అని అర్ధము. స్కూలుకు పోయి అక్షరములు నేర్చుకొనగనే కలెక్టరు పదవి లభించును అన్నపుడు ఆశతో ఉత్సాహము లభించి స్కూలుకు వచ్చి అక్షరములు నేర్చుకొందురు. అక్షరములు నేర్చుకొను శ్రమకు కూద భయపడినవరికి అవి చాలా సులభము ఒక్కసారి వ్రాసిన చాలును అని చెప్పి స్కూలుకు రప్పించవలెను. అట్లే బ్రహ్మజ్ఞానము తెలుసుకొను శ్రమకు కూడ బద్దకించిన వారికి "నీవే బ్రహ్మము"అను ఈ విషయము వచ్చి కొంచెము విచారణ చేసుకున్నచో చాలును. నీవే పరమాత్మవు అగుదువు అని ప్రలోభ పెట్టి భగవంతుని గూర్చిన వివరణమును కొంచమైనను వినుటకు ఉత్సాహము కల్గించినారు శంకరులు. ఈ విధముగా అప్పుడున్న కాల పరిస్ధితిని అనిసరించి స్కూలును మాత్రమే పెట్టి స్కూలు సిలబస్‌ను మాత్రమే బోధించినారు శంకరులు. ఇట్లు అని శంకరులు స్కూలు టీచరు మాత్రమే అని భావించరాదు. ఒక యూనివర్సిటి ప్రొఫెసరు ఆ కుగ్రామమునకు వచ్చినను స్కూలునే పెట్టవలెను. స్కూలు సిలబస్‌నే బోధించవలెను. అదే శంకరులు మరల రామానుజ రూపమున వచ్చినారు. అప్పటికి గ్రామస్తులందరును స్కూలులో చేరి స్కూలు చదువును పూర్తి చేసుకొనియున్నారు. ఆ కాల పరిస్ధితిలో యూనివర్సిటి ప్రొఫెసరు అయిననూ ఆ గ్రామములో కాలేజిని మాత్రమే పెట్టవలయును గాని యూనివర్సిటిని పెట్టరాదు.జ్ఞానము తర్వాత మెట్ట్టు భక్తి. అనగా జ్ఞానములో పరమాత్మ ఒక్క వివరమును ఆయన యొక్క గొప్పతనమును తెలుసుకొన్నగొలది ఆయన పై ఆకర్షణ కలుగును. ఆ ఆకర్షణయే భక్తి. బ్రహ్మము అనగా గొప్పది అని అర్ధము. కావున పరమాత్మ యొక్క గొప్పతనమును తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము. స్కూలు సిలబస్‌ కన్న కాలేజి సిలబస్‌ వేరుగా యుండును. కావున శంకరులు చెప్పిన దానికి రామానుజులు చెప్పిన దానికిని తేడా ఉండును. కాలేజి పెట్టినవారు రామానుజులు. జ్ఞానము వలన పుట్టిన ఆకర్షణచే ఏర్పడిన వేదన అని భక్తికి పరమాత్మ లభించును అని "వేదనా దేవ కైవల్యం" అని రామానుజులు అన్నారు. ఈ రెండింటికిని తేడా కనిపించినను ఇవి పరమాత్మను చేర్చు ఒక మెట్టునకు తరువాత యున్న మరియొక మెట్టు. మొదటి మెట్టు రెండవ మెట్టు వేరగా యున్నను అని రెండు ఒక దానికొకటి విరుద్ధములు కావు. రెండవ మెట్టు ఎక్కి ఇంటిలోనికి పోయినావు.

కావున ఇంటిలోనికి పోవుటకు రెండవ మెట్టే కారణమా. ఆ రెండవ మెట్టు ఎక్కుటకు మొదటి మెట్టు కారణము. ఇంటిలోనికి పోవుటకు రెండు మెట్లును కారణమే. జ్ఞానము మూల కారణమైనచో భక్తి ప్రాప్తి కారణము. జ్ఞానము వలన భక్తి, భక్తి వలన పరమాత్మ లభించును. ఇప్పుడు కాలేజి చదువు పూర్తియైన ఆ కుగ్రామములో రామానుజులే మధ్వులుగా వచ్చినారు. ఇప్పుడు మూడవ మెట్టుయగు యూనివర్సిటిని పెట్టినారు. అదియే సేవ్య సేవక సంభంధః అనగా పరమాత్మను వ్యక్తిగతముగనే, కాకుండా ఆయన కార్యములో పాల్గొనుచు సేవను చేయవలయును. ఇదే పరిపూర్ణ కైవల్యము పరిపూర్ణ ముక్తి. అట్టి దాసులకు స్వామి తాను దాసుడై యుండును. రామునకు దాసుడైన రామ దాసునకు నేను దాసుడను, జవానును అన్నాడు రాముడు. అట్టి సేవకులు స్వామి వెంట నుండి ప్రతి అవతారములోను ఆయన యొ్క్క సామీప్యము బొంది బ్రహ్మానందమున ఓలలాడుదురు. "ఇది సాధన యొక్క ఫలము, దీనికి మరియొక ఫలము లేదు". అనగా యూనివర్సిటి చదువుతో, చదువంతా పూర్తి అయినట్లే. ఈ విధముగా శంకర, రామానుజ, మధ్వులు అయా సాధకుల దశలను బట్టి తేడాలు కనిపించినను ఒకే లక్ష్యమును చేర్చు మెట్లు వరుసవలే ఏకత్వమును కలిగియున్నవి. ఇది మొదటి కారణము.

ఇక రెండవ కారణము ఏమనగా గురుదత్త స్వరూపులగు అవతార పురషులు బోధించిన విషయములను శిష్యులు తాళపత్ర గ్రంధములందు నిక్షిప్తము చేసినారు. ఆ గ్రంధములు ఒకరి చేతి నుండి మరియొకరి చేతికి సంక్రమించు చున్నప్పుడు వారి వారి భావములను మధ్య మధ్యలో దూర్చినారు. ఈ శిష్యులు భావములే ప్రక్షిప్తములు అనబడుచున్నవి. గురువులు చెప్పనవి గంగా జలము వలె శుద్ధమైన ఒకే తత్త్వము కల్గినవి. శంకర, రామానుజ, మధ్వుల భాష్యములు మూడు పాత్రలలోఉన్న ఒకే జలము. ఆ మూడు పాత్రలలోని జలము మూడు బావుల నుండి తేబడినవి. ఆ జలములలో కొంచెము రుచి బేధమున్నది. కాని తత్త్వములో విరోధము లేదు. రుచి బేధమునకు కారణము వారు అవతరించిన సమయములందు వేరు వేరు దశలలో ఉన్న సాధకులే కారణము. అవి హైస్కూలు, కాలేజీ, యూనివర్సిటి సిలబస్‌ల వంటివి. ఒక మెట్టు తర్వాత మరియొక మెట్టు ఎక్కినట్లు కేవలము స్ధాయి బేధము మాత్రమే. కాని ఆయా శిష్యుల చేతులలో పడిన ఈ భాష్యములు వారు వారు చేర్చిన పక్షిప్తములు అను రంగుతో కలసి వేరు వేరు రంగుల జలము వలె మారిపోయినవి. అసలే ఆయా కాలముల సాధకుల స్ధితులననుసరించి కొంత బేధమును కలిగియే యున్నవి. ఆ బేధములు సమన్వయమునకు అందుచుచు తాత్పర్యములో ఏకత్వము కలిగియున్నవి. ఈ విధముగా పురాణములు అన్నియును ప్రక్షిప్తములతో సంకరములైనవి. వ్యాస మహర్షి జయము అను పేరుతో 7000 శ్లోకముల గ్రంధము రచించెను. దానిలో పండితుల ప్రక్షిప్తములు కలిపి 1,25,000 శ్లోకముల గ్రంధముగా మారి దాని యొక్క అసలు పేరును కూడా పోగొట్టుకొని "మహాభారతము" అను కొత్త పేరు ధరించినది. వేదము మాత్రము బ్రహ్మదేవుని ముఖము నుండి అనగా సాక్షాత్తు గురుదత్తుని నోటి నుండి బ్రహ్మర్షుల పరంపరలో అధ్యయనము ద్వారా ఎట్టి ప్రక్షిప్తములు లేకుండా రక్షింపబడి ఈనాటికిని చెక్కుచెదరక యున్నవి. అయితే వేదములో చాలా భాగము నష్టమైపోయినది. దీనినే ఖిల భాగము అందురు. బ్రహ్మ దత్తుడు చెప్పిన జ్ఞాన సరస్వతి రూపమగు వేదములను భరద్వాజ మహర్షి చదవనారంభించినాడు.

మూడు వందల సంవత్సరములు తర్వాత తాను చదివినది ఒక చిన్న మట్టి కుప్పగాను, తాను చదవలసిన మిగిలిన వేదరాశి శిఖరమే కనిపించని మేరు పర్వతము గాను గోచరించినది. ఆయన చదివిన మూడు వందల సంవత్సరముల వేద భాగములు ఒక్క సంవత్సర భాగమే భూమిలో నిలచినది. అదియును క్రమ క్రమముగా విస్మరణము వలన సన్నగిల్లుచు వచ్చి ఈనాడు నాలుగు ఘడియల కాలము భాగము మాత్రమే మిగిలినది. ఇవియే ఉపనిషత్తులు. మరి ఈనాడు మనకు మిగిలిన వేదమంతయును ఉపనిషత్తులు మాత్రమే కాక సంహిత ఆరణ్యకములు, బ్రాహ్మణములు, నామములతో ఇప్పుడు లభించుచున్న వేదము ఋషులు చెప్పినదే. ఆ సూక్తములకు ఋషులు పేర్కొనబడినారు. ఈ వేద భాగములో ఎక్కువ భాగము యజ్ఞమును, చేయు విధానమును వివరించు కర్మ స్వరూపము గాను, ఇంద్రాది దేవతలను స్తుతించు స్త్రోత్రములతో నిండియున్నది. ఈ యజ్ఞము వచ్చిన బ్రహ్మ జ్ఞానియగు అతిధికి పెట్టు అన్నమును వండు పాక శాస్త్రమునకు సంబంధించి యున్నది. ఇక దేవతల స్త్రోత్రములన్నియును, ఆరోగ్యము, శత్రుసంహారము, ఐశ్యర్యము, సంతానము, బలము మొదలగు కాకములను కోరు స్త్రోత్తములుగా యున్నవి. ఇవి అన్నియు ఋషులు చెప్పినవే కావున ఈ భాగమును పురుష శబ్ధముచే చెప్పబడు జీవులు రచించినవే కావున వాటిని బుద్ధుడు పౌరుషేయములు అని అన్నారు. సంతోషించవలసినది ఏమనగా ఉపనిషత్తుల మధ్యలో ఋషులు ఎట్టి మంత్రములని చేర్చలేదు. ఏలననగా అవి అధ్యయన పరంపరల ద్వారా వచ్చుచున్నవి. కావున వేదము జ్ఞాన కాండము, కర్మ కాండము అని రెండు భాగములుగా విభజింపబడినది. జ్ఞానకాండమగు ఉపనిషత్తులు సాక్షాత్తు బ్రహ్మదత్తునిచే చెప్పబడినవి. ఆయన జీవుడు కాడు కావున ఆ భాగమును అపౌరుషేయమని చెప్పవచ్చును. జ్ఞాన, కర్మ కాండములు రెండును వేదమే అపౌరుషేయమే అని మన పండితులు వాదింతురు. ఇచ్చట నేను ఒక ప్రశ్నను అడుగుచున్నాను. వేద శబ్ధమునకు అర్ధమేమి?

"విదుః జ్ఞాని" అని కదా. అనగా వేదము అన్న జ్ఞానము అని అర్ధము. కావున జ్ఞాన కాండము మాత్రమే వేదము. కర్మ కాండము కర్మయే కావున వేదము కాదు. కాని పూర్వ మీమాంసకులు కేవలము కర్మ కాండనే తీసుకొని దానిని మాత్రమే వేదముగా భావించి జ్ఞాన కాండము చెప్పు ఈశ్వరుని నిరాకరించి నాస్తికులైనారు. వారు కేవలము అన్నమును వండు కర్మ కాండను మాత్రమే తీసుకొని కేవలము ఉదర పూరణ భోగమాత్రులై నాస్తికులుగా మారినారు. కావుననే వీరిని భగవద్గీత "వేదవాదరతాః పార్ధ నాన్య దస్తీతి వాదినః" అని చెప్పుచున్నది. అనగా వీరు కేవలము కర్మ కాండమునే వేదమని భోగలాలసులై నాస్తికులుగా మారినారు అని అర్ధము. కావున జ్ఞాన కాండము ఉత్తర మీమాంస అనబడు వేదాంత శాస్త్రము మాత్రమే గురుదత్తునిచే చెప్పబడిన గ్రంధము. ఆ గురుదత్తుని అవతారములగు శంకర, రామానుజ, మధ్వ గురువులు వారి భాష్యములందు ఈ ఉపనిషత్తులనే శ్రుతి ప్రమాణమునే ఉదహరించుచు వ్రాసినారు. ఇక శ్రుతి ప్రమాణమును అనుసరించి ఉన్న పురాణములలోని శ్లోకములను మాత్రమే గ్రహించినారు. శ్రుతి ప్రమాణమునకు విరుద్ధములైన పురాణ శ్లోకములను త్యజించినారు. ఏలననగా అవి ప్రక్షిప్తములు. ఈ పురాణములు చాలక సంప్రదాయములు అను మరియొక ప్రమాణమును తీసుకొనుచున్నారు. సంప్రదాయములు అనగా మన పెద్దలు ఆచరించినవి. కాని సంప్రదాయమునకు కూడ శ్రుతి ప్రమాణము ఉన్నప్పుడే దానిని గ్రహించవలెను. లేకున్నచో త్యజించవలెను. సంప్రదాయమే ప్రమాణమైనచో రాక్షస వంశమున పుట్టిన ప్రహ్లాదుడు సంప్రదాయ విరుద్ధముగా నారాయణ ఆరాధన ఏల చేసినాడు? కావున సంప్రదాయమును గుడ్డిగా అనుసరించరాదు. దానిని తర్కించి దానికి శ్రుతి ప్రమాణము ఉన్నదా లేదా అని చుడవలెను. శ్రుతి "బ్రహ్మశ్చనారాయణః శివశ్చనారాయణః" అనుచున్నది. అనగా సృష్టి ఆరంభమున సృష్టిని చేయుచున్న కాలములో పరబ్రహ్మ యొక్క పేరు బ్రహ్మ దేవుడు. సృష్టి అంతఃకాలమున సృష్టిని లయము చేయు బ్రహ్మము పేరు శివుడు. ఇది స్ధితి కాలము. స్ధితిని రక్షించుచు పాలించు పరబ్రహ్మము యొక్క పేరు నారాయణుడు. కావున వర్తమాన పరబ్రహ్మ నామధేయము నారాయణుడు అని మాత్రమే. ఊర్ధ్వ లోకములకు దేవతలు ఋషులు పోయినప్పుడు కనిపించునది నారాయణుడు మాత్రమే. కొందరు బ్రహ్మ స్త్రోత్రములను, శివ స్త్రోత్రములను చేసినప్పుడు నారాయణుడే బ్రహ్మ దేవునిగా, శివునిగా క్షణకాలము దర్శనమిచ్చును.

అంతే కాని వర్తమాన స్వరూపము నారాయణుడే.రాక్షసులకు బ్రహ్మ పైన, శివుని పైనన భక్తి గలిగి నారాయణునిపై ఏల ద్వేషము కలిగెను? రాక్షసులు అసూయ, మాత్సర్య స్వరూపులు. ప్రత్యక్షముగా ఎదురుగా యున్నస్వరూపమును ద్వేషింతురు. కంటికి కనిపించని స్వరూపములనే ఆరాధింతురు. కవున వారికి నారాయణునిపై ఈర్ష్యా ద్వేషములు కలుగుటలో ఆశ్చర్యము లేదు. దేవతలు, రాక్షసులు, ఋషులు ఎక్కడో లేరు. ఈ నరులలోనే ఉన్నారు. అసూయ, మాత్సర్యములను పరిపూర్ణముగా నాశనము చేసుకున్న వారే ఋషులు, దేవతలు అట్టి నరులు ప్రత్యక్షముగా వర్తమాన నరావతారముగా వచ్చిన స్వాముని అంగీకరించి ఆరాధింతురు. కాని అసూయ, మాత్సర్యములతో నున్న రాక్షస స్వభావము కల నరులు పరోక్ష నరాకారములనే అంగీకరించి ఆరాధింతురు. ప్రహ్లాదుడు దేవతాంశ సంభూతుడు. అనగా పరిపూర్ణమైన అనసూయ తత్త్వము కలిగినవాడు. కావున వర్తమాన స్వరూపుడగు నారాయణుని ఆరాధించినాడు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, January 7, 2010

సర్వమత సమన్వయము

హిందూ మతము ప్రకారముగా మూడు మతములు ఉన్నవి. అవియే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. హిందూమతము ఒక మానవ శరీరము వంటి పిండాండము. పిండాండమే బ్రహ్మాండమని పెద్దలు చెప్పుదురు. పిండాండమైన నర శరీరములో ఉన్న పదార్ధములే బ్రహ్మాండమున ఉన్నవి. జడమైన పంచభూతములు అనబడు అపరా ప్రకృతి. చైతన్యమగు పరా ప్రకృతి. రెండింటిలోను సమానముగా ఉన్న తత్త్వములే. కావున హిందూ మతమును పోలి విశ్వమతములు ఉన్నవి. భారతదేశము పిండాండమైనచో ఈ భూమి అంతయు బ్రహ్మాండము. ఈ భూమియగు ప్రపంచములో కూడా ముఖ్యమైన మతములు మూడున్నవి. హిందూమతము, క్రైస్తవమతము, ఇస్లాంమతము. హిందూమతములోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములలో ఏకత్వమును చూడలేని వాడవు హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతములలో ఏకత్వము ఎట్లు చూడగలవు. ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా? శంకర, రామునుజ, మధ్వాచార్యుల భాష్యములలో ఏకత్వమును చూడలేనప్పుడు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ గ్రంధములలో ఏకత్వమెట్లు చూడగలవు. నీ ఇంటిలో ఉన్న మూడు గదుల మధ్య గోడలు పగులగొట్టి ఒక్క హాలును చేయలేని వాడవు, మూడు ఇండ్ల మధ్య నున్న గోడలను పగులగొట్టి ఒక్క ఇంటిగా ఎట్లు మార్చగలవు. హిందూ మతములో ఉన్నన్ని వేదాంత గ్రంధములు శాస్త్రములు నిజముగా ఏ మతములోను లేవు. అనగా హిందూమతములో సత్యమును దర్శించుటకు కావలసిన సామాగ్రి ఎంతో ఎక్కువగా యున్నది. ఇంత సాధన సామాగ్రితో నీవే సత్యమును కనుగొన లేనప్పుడు ప్రపంచములో మిగిలిన జీవులు సత్యమును కనుగొనగలరా? అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత పండితులు కలహించు కొనుచుండగా ప్రపంచములో కెల్ల సర్వ మతస్ధులు కలహించుకొనుటలో ఆశ్చర్యమేమున్నది. వీరశైవులు శివుడే దైవమందురు. వీర వైష్ణవులు విష్ణువే దైవ మందురు. శాక్తేయులు శక్తియే దైవ మందురు. ఈ కలహములకు భయపడి బ్రహ్మదేవుడు తనకు గుడి లేకుండా చేసుకున్నాడు. దీనిలో అంతరార్ధమేమి? బ్రహ్మదేవునిలో బ్రహ్మ శబ్ధమున్నది. బ్రహ్మము అనగా సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆయన వేదకర్త. అనగా జ్ఞాన స్వరూపుడు మరియు ఆయన జిహ్వపై వాణి యున్నది. అనగా వాక్కుతో జ్ఞానముతో బోధించు గురుస్వరూపుడు.అనగా సాక్షాత్తు దత్తుడే. అనగా ఈ కలహములను చూచి అసలు వ్యక్తియగు దత్తుడు జారిపోయినాడు. ఆయన యొక్క వేషములే విష్ణువు, శివుడు, శక్తి. కావున వీర శైవులకు మిగిలినది శివుడను పేరుగల కేవలము శివ వేషమే. వీర వైష్ణవులకు దక్కినది విష్ణువను పేరుగల విష్ణు వేషమే. అట్లే శాక్తేయులకు చిక్కినది అమ్మవారి యొక్క వేషమగు చీరె, అలంకారములు కిరీటము మాత్రమే. మూడు వేషములలో ఉన్న వ్యక్తిని కనుగొనలేనప్పుడు కేవలము వేషము పైననే నీ దృష్టి ఉన్నప్పుడును నటుడగు వ్యక్తి జారిపోవును. కావున ప్రపంచములో మూడ మత కలహములు చేయువారి దైవ స్వరూపములు కూడ కేవలము వేషమాత్రము గనే మిగిలిన ఒక ఉపాధ్యాయుడు ఒకే పాఠమును అనగా సిలబస్‌ను ఇంగ్లీషు భాషలో ఇంగ్లీషు మీడియం సెక్షనులో, ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి చెప్పుచున్నాడు. అదే ఉపాధ్యాయుడు అట్లే పాఠమును తెలుగు భాషలో తెలుగు మీడియం సెక్షనులో ధోవతి చొక్కాను ధరించి బోధించుచున్నాడు. ఈ రెండు సెక్షనులలో వ్యక్తిపై దృష్టి లేక కేవలము వేషమునందు దృష్టియున్న విద్యార్ధులు మా ఉపాధ్యాయుడు గొప్ప అంటే మా ఉపాధ్యాయుడు మరియు మా పాఠము గొప్ప ఆంటే మా పాఠము గొప్ప అని వాదించుకొనిచున్నారు. కాని రెండు సెక్షనులలో కొందరు తత్త్వమును పరిశీలించగల ఏకాగ్రతతో ఉన్న బుద్ధిమంతులగు విద్యార్ధులు మిగిలిన విద్యార్ధులతో ఈ వి్ధముగా చెప్పుచున్నారు.

ఓ! విద్యార్ధులారా! మీరు ఏల కలహించుచున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఆయా భాషలలో విద్యకు బోధించియున్నాడు. ఉన్నది ఒక ఉపాధ్యాయుడే కాని వేషములు రెండు. చెప్పినదీ ఒక పాఠమే. కాని భాషలు రెండు మీరు మీ ఉపాధ్యాయుల వేషముపై దృష్టి ఉంచక ఉపాధ్యాయుని యొక్క స్వరూపమును నిశతముగా పరిశీలించుడు. మీకు సత్యము తెలియును. అట్లే మీలో రెండు భాషలు వచ్చు విద్యార్ధి ఎవరైనను ముందుకు వచ్చి రెండు పాఠములను చదించుడు. అప్పుడు ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము అను విషయము బోధపడును. దీనిని ప్రపంచమునకు చాటి చెప్పిన వాడే స్వామి వివేకానందుడు. ఆయన ఒక్కొక్క మతస్ధుడగు వీరాభిమానిని ఒక్కొక్క బావి నుండి వచ్చిన బావి కప్పగా వర్ణించినాడు. వేషాలు వేరు దేవుడొక్కడే. భాషలు వేరు బోధింపబడిన తత్త్వము ఒక్కటే అని ఘోషించినాడు. కావున శ్రీ దత్తుడు ఒక్క హిందూమతమునకు సంబంధించిన వాడు కాడు. ప్రపంచములో యున్న సర్వ మతముల దైవ స్వరూపములగు వేషములలో ఉన్న ఒకే ఒక నటుడు శ్రీ గురు దత్తుడు. అన్ని మత గ్రంధములు ఆయన యొక్క పాఠములే. ఆయా దేశములకు అనుకూలమైన వేషములలో నుండి ఆయా భాషలలో ఒకే సిలబస్‌ను బోధించినవాడు. అయితే ప్రతి దేశాములోను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీలు ఉన్నవి. ఆట్లే ప్రతి దేశములోను అధమ, మద్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులగు జీవులు ఉన్నారు. కావున ప్రతి మతములోను ఆ మతములో వివిధ దశలలో ఉన్న సాధకుల దశలననుసరించి వివిధ పాఠములున్నవి. అన్ని దేశములలోను హైస్కూలు విద్యార్ధులకు ఒకే సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలో కాలేజి స్ధాయి విద్యార్ధులకు ఒకే స్ధాయి సిలబస్‌ ఉన్నది. అట్లే అన్ని దేశములలోను యూనివర్సిటీ స్ధాయి విద్యార్ధులకును ఒక స్ధాయి సిలబస్‌ ఉన్నది. ఒకే దేశములో ఒకే భాషలో బోధించబడుచున్నను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ సిలబస్‌లు వేరు. మన హిందూ మతములో త్రిమతముల పండితులు కలహించుకొనుట మన ఊరిలో హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ విద్యార్ధులు కలలహించుకొనుట వంటిది. మరియు మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పర రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుచున్నారు. కావున భాష ఒక్కటే అయినను సిలబస్‌ తేడా వలన మన ఊరిలో విద్యార్ధుల కలహము, సిలబస్‌ ఒక్కటియే యైనను భాషలో తేడా వలన మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు, పరరాష్ట్రములో హైస్కూలు విద్యార్ధులు కలహించుకొనుట జరగుచున్నది. ఇది చాలక మరియొక కలహమున్నది. మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్ధికి పరరాష్ట్ర భాష వచ్చును. ఐతే వీడు ఈ రాష్ట్ర హైస్కూలు సిలబస్‌ పరరాష్ట్ర కాలేజి సిలబస్‌తో పోల్చి ఈ రాష్ట్రములో విద్య లేదు ఆ రాష్ట్రములో విద్య లేదు అని కలహించుచున్నాడు. ఈ కలహములు ఎప్పుడు పోవును? అన్ని మతములలోను అధమ, మధ్యమ, ఉత్తమ స్ధాయిలలో సాధకులున్నారు. ఒక మతములో అధమ స్ధాయి వారికి సంబంధించిన బోధన విషయములకు మరియొక మతములో అదే అధమ స్ధాయికి చెందిన సాధకుల యొక్క విషయమును పోల్చి చూచినచో ఒక్కటియే అని తేలును. ఇట్లే మధ్యమ, ఉత్తమమ స్ధాయిల వారు కూడ వారి వారి స్ధాయి విషయములను మాత్రమే అన్ని మతములలో పోల్చుకున్నచో ఏకత్వమును దర్శించి అన్ని మతముల పాఠ్యాంశములు ఒక్కటే యని తేల్చుకొనవచ్చును. ఇట్లు తేల్చి వివరించి నిరూపించుటయే ఈ జ్ఞాన సరస్వతి యొక్క ముఖ్యలక్ష్యము. మన హిందూ మతములో ఉన్న హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ స్ధాయిలే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతములు. అద్వైతములో శంకరులు చెక్కిన జ్ఞానము మొదలు మెట్టు హైస్కూలు విద్య లేనిదే కాలేజి, యూనివర్సిటీ విద్యలు లభించవు. కావున హైస్కూలు విద్య తక్కువ అని భావించరాదు. కావున జ్ఞానము మూల కారణము. ఆ తరువాత విశిష్టాద్వైతములో రామానుజులు చెప్పిన భక్తి భగవంతుని చేర్చు ప్రాప్తి కారణమగు రెండవ మెట్టు. రెండవ మెట్టుయగు కాలేజి. ఆ భగవంతుని పొందిన తరువాత నీవు క్రియలో నిరూపించు సత్యమైనన భక్తియే సేవ యనబడు మూడవ మెట్టు అగు అత్యుత్తమమైన యూనివర్సిటిగా ద్వైతమున మధ్యులు చెప్పనారు. క్రియలేని భావము వాక్కు వ్యర్ధములు. అసత్యములు. క్రియలో ఉన్నదా లేదా అని పరీక్షయే దత్త పరీక్ష.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Sunday, January 3, 2010

బహూనాం జన్మనామన్తేః

"బహూనాం జన్మనామన్తేః జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ స్సర్వమితి సమహాత్మా సుదుర్లభః" అని గీత. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ నరాకారము పరబ్రహ్మమని విశ్వసించు నిశ్చల జ్ఞానము, అనేక జన్మల తపస్సాధన వలన అసూయను పోగొట్టు కొని అనసూయా తత్త్వమును పోందిన ఒకానొక అతిదుర్లభ జీవునకే లభించునని అర్ధము. "నాహం ప్రకాశః సర్వశ్య యోగ మాయా సమావ్యతః" అని గీత. నేను మాయచే కప్పబడి యున్నందున అందరు గ్రహించలేరని అర్ధము. ఒక సింహము గొర్రెలలో కలసి పోయి ఆత్మీయుడుగా ఆ గొర్రెలతో మెలుగుచు కొన్ని గొర్రెలకు తండ్రిగాను, కొన్ని గొర్రెలకు పుత్రునిగాను, మరి కొన్నింటికి సోదరునిగాను,కొన్నింటికి భర్తగను, మరి కొన్నింటికి ప్రియునిగాను ఆయా గొర్రెల అభీష్టముననుసరించి ప్రవర్తించి దగ్గరకు తీసుకొని జ్ఞాన, భక్తులను గురించి బోధించవలసిన అవసరము వచ్చినది. ఇది సింహము అని ఏ మాత్రము బయిటపడినను తనతో గల ఆత్మీయ బంధము చెదరిపోవును. ఏలననగా తండ్రి కొడుకు మొదలగు బంధములు జీవుల మధ్య నుండు బంధములు. ఆ బంధములలో స్వామిని ఆరాధించవలయునన్నచో స్వామి ఒక జీవుని వేషములో జీవుని ప్రవర్తననే అనుసరించి యుండవలయును. అందువలన ఆ సింహము పూర్తిగా గొర్రె తోలు కప్పుకొని గొర్రె ఆకారమున, గొర్రె కంఠస్వరముతో గొర్రెల మధ్యకు రావలయును. అప్పుడే గొర్రెలు స్వామితో లౌకిక బంధముతో ఆనందించగలవు. కావున గొర్రెలకు తాను సింహమన్న సత్యజ్ఞానము తెలుయకుండా వేషములో స్వామివలె నటించుటయే మాయ. ఈ మాయతోనే స్వామి అవతరించవలెను. "సంభవామి ఆత్మమాయయా అని గీత. అనగా నా మాయను ఆధారము చేసుకొని నేను అవతరించెదను అని అర్ధము. ఈ నటన రూపమగు, మాయ వలన గొర్రెలు తాము కూడా గొర్రెలని భావించి పరిహాసముతో, సరసోక్తులతో లౌకిక బంధములతో స్వామితో క్రీడించగలవు. అవి క్రీడించుట మాత్రమే స్వామి వానితో క్రీడించగలడు. కావున స్వామి ఈ ప్రయోజనము కొరకే స్వామి తన మాయా నటనముతో వాటికి తాని సింహము కాదన్న ఆజ్ఞానమును వాటికి కలిగించుచున్నాడు. కాని ఈ అజ్ఞానము వాటికి దీర్ఘకాలమున్నచో తన మీద నిర్లక్ష్యము కలుగి తనను అవమానించుచు తాను చేయు బోధలను శ్రద్ధతో వినరు. అంతే తప్ప మానావమానములకు అతీతుడగు స్వామి వారు చేయు అవమానమునకు ఏ మాత్రము బాధపడడు. అంతే కాక పైలోకమున స్వామికి అవమానము దుర్లభము కావున మానము కన్నను అవమానమునకు ఎక్కువ ఆనందించును. కావున భగవత్‌ అవమానమునకు ఎప్పుడును ఆగ్రహించడు. ఇచ్చట మానావమానముల ప్రశ్న కాదు. నిర్లక్ష్యముతో తాను చెప్పునది వినకపోవుట వలన వాడు ఉద్ధరింపబడరు. తాను వచ్చిన ప్రధాన కార్యము వారిని ఉద్ధరించుటయే. కావున అట్టి సమయములలో చిన్నచిన్న సిద్ధులను చూపి అనగా తన కంఠ స్వరమును తన సహజమగు సింహ కంఠమును కొంత చేర్చి తాను సింహమన్న జ్ఞానము ఒక్క క్షణకాలము కల్గించును. పూర్తిగా వేషము తీసి తాను సింహమని చూపినచో గొర్రెలు కనుచూపు మేరలో ఉండవు. మరల ఆ సింహము గొర్రెగా నటించిననూ దగ్గరకు రావు. వచ్చిననూ భయముతో బెదురు చుండునే తప్ప వాటికి ఇష్టమైన లౌకిక బంధములో సహజ స్ధితిలో రమించ జాలవు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Wednesday, December 30, 2009

సీతాదేవి

సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత. ఇచ్చట పతి శబ్ధము స్వామిని చెప్పును. ఆమె విషయములో స్వామియు భర్తయు ఒక్కరే. దీనికి కారణము అగు కర్మ లేకుండా ఫలము సంభవించదు. ఆమె కొన్ని భగవదపచారములను చేసినది. కాని స్వామి వాటిని లెక్కించలేదు. అవియేమనగా

అరణ్య వాసమునకు పోవునపుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి. ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచు రాధకు ఇచ్చినాడు. రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనములోనే ఉండిపోయినది. కాని సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది. అప్పుడు ఆవేశములో స్వామిని నిందించినది కూడ. స్వామిని "స్త్రియం పురుష విగ్రహమ్‌" అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా? నా తండ్రి జనకుడు పురుష వేషములో యున్న ఒక స్త్రీకి నను ఇచ్చి చేసినాడని దూషించినది. దీనికి కూడ స్వామి కోపగించలేదు. ఏలననగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును. ఇదే గీతలో "తుల్య నిందా స్తుతిః" అని చెప్పబడినది. పాయసము ఆనందమును కల్గించినట్లు ఆవకాయ అన్నము కూడా ఆనందము కల్గించును. కాన సుఖదుఃఖము మానవమానములు రెండు ఆనందకరములే. స్వామి విషయములో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును. ఏలననగా? ఆయన స్వస్వరూపములో యున్నపుడు దేవతలు ఋషులు నిరంతరము స్తుతించెదరు. కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను. అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైన తనను నిందించినపుడు పరమానందము చెందుచుండును. కాని ఆయన భాగవతాపచారమును సహించడు. భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు. జీవుడు అవమానమునకు దుఃఖపడును. ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మీదేవి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు. ఆదిశేషునకు ఆ పాదమస్తక స్పర్శను శయనించి అనుగ్రహించినాడు. ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు. రాముని విడచి భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు. సీత లంకలో ఉండినప్పుడు కూడ లక్ష్మణుడు రామునితో ఉన్నాడు. మరల సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు. లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు. సీతయును భక్తుడగు జీవుడే. సీత యనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా యుండును. శేషుడనగా సర్పము. అది వంకర టింకరలుగా పోవుచుండును. నేరు మార్గమున వచ్చు భక్తులు, వంకర మార్గమున వచ్చు భక్తులు ఆక్షేపించగనే పతనము ప్రారంభమగును. సీతాదేవి లక్ష్మణునిపై ఘోరనింద వేసినది. ఇది భాగవతాపచారము. అందుకే స్వామి సంకల్పించి చాకలి వానిచే సీతపై నింద వేయించినాడు. నిందాకర్మకు నిందయే ఫలము. ఆమె లక్ష్మణును నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమై పోయినది. అంతటితో ఫలానుభవము ఆగలేదు. మరల రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది. స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్ధిమితమును కోల్పోయినది. అందుకే చివరలో నీవు అయోధ్యా జనులకు మరల ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది. ఆ సమయములో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే. ఈ విధముగా భాగవతాపచారము వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది. ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడ వెంటపడినది. ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లి కొడుకుగా వచ్చి వియ్యాల వారి యింటిలో కూర్చునియున్నాడు. గౌరీపూజ సిద్ధమైనది. అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము. ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుని నిందించినప్పుడు ఎంత భాధపడినాడో అంత తపన పడినది. ఇంకనూ కొంత కర్మ శేషము మిగిలియున్నది. దానిని కూడా పోగొట్టుటకు, పెండ్లి తరువాత ఒకనాడు శ్రీ కృష్ణుడు "మేము రాజులము కాము. శిశుపాలునే మరల పెండ్లి చేసికొమ్మని చెప్పగా రుక్మిణి దేవి మూర్చపోయినది". దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణి దేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు. ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము, చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి.

ఈ ఐదు భాగము మాత్రమే సీతను అడవులకు పంపించుట. ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవుదురు. హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు. కావున స్వామి రాధనే ఆదరించినాడు. అట్లే సీత లక్ష్మణుని ఆక్షేపించినది. కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు. రాధ స్త్రీ అయినచో, లక్ష్మణుడు పురుషుడు. కావున స్వామికి స్త్రీ, పురుష వివక్షత లేదు. భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును. నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకొని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చెదరని దృష్టియే నిష్ట అనబడును. నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా, ఆ దైవ స్వరూపములోని అంతస్వరూపుడగు దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును. దత్తుడు ప్రకటింపబడిన కొలది ఉష్ణము పెరుగును. సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును. దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు. దత్తపరీక్షలకు ఎంతో ఓర్పు కావలయును. అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్ట మొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు అద్వైత భాష్యమున వచించియున్నారు. కావున నిష్టతో పాటు సబూరి అవసరమన్నారు. సబూరి యనగా ఓర్పు కావలయునని శిరిడి సాయి ఎల్లప్పుడు బోధించెడివారు. రాధ స్వామి ఆజ్ఞననుసరించి, ఎల్లప్పుడును బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతయును గడిపినది.

లక్ష్మణుడు కూడ పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు. అంతే కాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు. సీతను అడవులలో దింపి రమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు. ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు. లక్ష్మణుని నిందా పాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు. కావున స్వామిలో ఎప్పుడు ఎట్టి పొరపాటు కూడా ఉండదు. ఆయన చర్యలోని అంతరార్ధమును మనము గ్రహించ లేక చాలా సార్లు స్వామిని అపార్ధము చేసుకొందుము. నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము. కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్ధము. నిరాకారము కొరకు సాకారులగు ధన గృహములను, నరాకారులగు భార్యాపుత్రాదులను త్యజించుట హస్యాస్పదము. మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగ లభించుచున్న కాఫీ మొదలగు పానీయములను త్యజించెదమా? ఒక ప్రత్యక్ష పదార్ధము కొరకు మరియొక ప్రత్యక్ష పదార్ధమును త్యజించవచ్చును. ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఏల త్యజించ వలెను. ఒక గ్లాసులో అమృతము పోసి యిచ్చి త్రాగించి రుచి చూపినచో, నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని త్యజించును. అంతే కాని అమృతము ఉన్నది. దాని ఆకారము కూడ నాకు తెలియదు. దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడును త్యజించడు. త్యజించుటయు అవివేకము. కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు. ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును, పటమును ధ్యానించుచున్నాము. అది అచేతనమైన జడపదార్ధము. జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడ చెప్పును. కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను త్యజించనేల?

కావున అచేతనములను ఆరాధించు సాకారమార్గములో కూడ వైరాగ్యము అర్ధరహితమై యున్నది. దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడెను. దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియై దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారియై ప్రాణములను విడచినది. ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు. కాని స్వామి నరాకారమున అవతరించినప్పుడు అచేతనములైన గృహాదులను చేతనులైనన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్ధమున్నది. చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా. ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురషోత్తముని కొరకు ఇతర నరులను త్యజించుట కూడా యుక్తమే అగును. పురుషుడనగా జీవుడు అని అర్ధము కూడా ఉన్నది. "పురి" "దేహి"చేతే"పురుషః" అని అర్ధమున్నది. అనగా పురము అనబడు దేహము నందు వ్యాపించి యుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్ధము. కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురషోత్తమముడగు నరావతారములో యున్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను త్యజించుటలో అర్ధమున్నది. కావున మార్గములోనే వైరాగ్యము సాధ్యము సార్ధకము. ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును. అక్కలకోట మహారాజ్‌, శిరిడిసాయి ఒకే సమయమున ఉన్నారు. ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు. వాడు అసలు దత్తుడే కాదు. వాడిని మనము పరీక్షింప పనిలేదు. పరీక్ష ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు.

పౌండ్రక వాసుదేవుడు శంఖ చక్రములు ధరించి నేనొక్కడనే నారాయణావతారుడనని వాగినాడు. ఒకే సమయమున రెండు తీగెల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట, లైటును వెలిగించుట అను రెండు వేరు వేరు పనులను చేయుచున్నది. కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును. ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు. విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును. కాని రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును. ఈ చిత్రపటము సరియైనది కాదు. విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు. కావుననే అనేక బాహుదర వక్త్ర నేత్రం అని సూచించినాడు. అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్త్రములు అనేక నేత్రములు అని అర్ధము. ఇదే అర్ధము సహస్రాత్‌ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది. అనగా అనేక నరావతారములు అని అర్ధము. అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా. కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు. అట్లు అయినచో పరశురామ, శ్రీ రామావతారములు ఒకే సమయమున ఎట్లున్నవి? కలియుగములో శ్రీ స్వామి సమర్ధ (అక్కలకోట మహరాజ్‌) మరియు శ్రీ శిరిడిసాయినాధుడు ఒకే సమమయమున ఉన్నారు గదా.

జీవుని జీవిత ఆశయము ఏమనగా వర్తమానములోని నరావతారమును గుర్తించి సేవించుటయే.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, December 28, 2009

అనుగ్రహము

పరమాత్మ యొక్క అనుగ్రహము పొందినపుడు భక్తిని చూపించుట నిజమైన భక్తి కాదు. మనకు లాభము చేయు వారి మీద ప్రేమను చూపుట, సత్యమైన ప్రేమ కాదు. ఎదుటువారు మన సుఖమునకు కారణమైనందున వారిపై మనము చూపు ప్రేమ అది నిజమైగ వారిపై ప్రేమ కాదు. అది మన మీద మనకున్న ప్రేమయే. మనలను మనము ప్రేమించుట వలననే మనకు సుఖము నిచ్చెడి వస్తువులను వ్యక్తులను ప్రేమించుచున్నాము. కావున ఇది ఆత్మప్రేమయే తప్ప పర ప్రేమ కాదు. మనకు సుఖమును దుఃఖమును కల్గించక మౌనమున ఉన్న వారిపై మనము కూడా ప్రేమను చూపము. మనకు ఒక ప్రదేశములో ఒక రాయి కనబడినది. ఆ రాయి మనకు సుఖము నిచ్చుట లేదు. దుఃఖము నిచ్చుట లేదు. కావున ఆ రాయి మీద మనకు ప్రేమ లేదు. కాని అదే రాయి మన కాలికి కొట్టుకున్నచో కోపముతో దానిని అవతలకు పారవేయుదుము. కావున మనలో ఆత్మప్రేమ కాక పరప్రేమ ఎప్పుడు బయిటపడుచున్నది. స్వామి వరముల నిచ్చి అనుగ్రహమును చూపినప్పుడు కాదు స్వామిని పూజించి ప్రేమించుచున్నను ఎట్టి ప్రతి ఫలమును ఈయక ఉపేక్ష వహించినపుడు మన ప్రేమ, సేవ కొనసాగినచో అది పూర్ణ ప్రేమ లేక సత్యప్రేమ యగును. ఇక పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన ప్రేమ సేవ ఏది యనగా స్వామి మనపై ఆగ్రహించినపుడు మనము ఎంత ప్రేమింతుము? మనము సేవించుచుండగా వరములనీయక పోగా ఉపేక్షవహించుట మాత్రమే కాక కష్టములను కల్గించినను ప్రేమ సేవలు యధాతధముగా కొనసాగించినచో అవియే పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన భక్తి ప్రేమలనబడును. లొట్ట చేతులను బాగు చేసుకొన వచ్చిన కార్తవీర్యునకు ఆ రెండు లొట్ట చేతులను బాగు చేయక పోగా స్వామి కాలితో తన్ని ఆ రెండు చేతులను విరగకొట్టినాడు. అయిననూ కార్తవీర్యుని ప్రేమలో సేవలో ఎట్టి తేడా రాలేదు. శిరముతో సేవించినాడు. అట్లే శ్రీ రాముడు రజకుని నిందా వాక్యములను విని సీతను కారడవులకు పంపినపుడు సీత లక్ష్మణునితో రాముని వంశమగు ఈ సంతానము అడ్డము రాకున్నచో స్వామి వియోగములో వ్యర్ధమైన ఈ బ్రతుకును చాలించి ఉండెడిదానను. ప్రసవానంతరము నేను పంచాగ్ని మధ్య తపమును చేయుదును. ఆ తపస్సు యొక్క లక్ష్యము ఏమనగా మరుజన్మలో కూడా రాముడే నాకు భర్తగా లభించవలయును అని చెప్పినదే కాని శ్రీ రాముని నిందించలేదు. ఇదే నిజమైన భక్తి.

Thursday, December 24, 2009

నిష్కామము

భగవంతుని నిష్కామముగా ప్రేమించుట లేక ఆరాధించుట అసంభవమని కొందరు తలచుచున్నారు. ఏలయనగా "ప్రయోజన మనుద్దిశ్యస మందోపి ప్రవర్తతే" అను సామెత ప్రకారము ఎంతటి మూర్ఖుడైనను ప్రయోజనము లేకుండా ఏ పనిచేయడు. మనకు ఏ ఉపకారము చేయకుండా ఒకరి మీద మనకు ప్రేమ ఎలా కలుగుతుంది. ఇచ్చిపుచ్చుకుంటే ఆపేక్షలు అని అందుకే అంటారు. తండ్రి ధనమును సంపాదించి, మన యొక్క అవసరములు తీర్చుచున్నాడు కావున తండ్రిని ప్రేమించి సేవించెదము. తల్లి పదార్ధములు వండి పెట్టి మన యొక్క ఆకలి తీర్చుచున్నందున మనము తల్లిని ప్రేమించి సేవించు చున్నాము. అట్లే భగవంతుడు మన కష్ణములను పోగొట్టి మనము అడిగిన వరములను ఇచ్చినచో ప్రేమించి సేవించుట సహజము. కాని ఎన్ని కష్టములు వచ్చినను వాటిని తీసివేయమని యాచింపక ఎట్టి వరమును కోరక, స్వామిని ప్రేమించి సేవించుట కంచి గరుడ సేవయే అగును. స్వామి తాను ఆయుధము పట్టనని తన సేన యగు పదివేల యాదవులు ఆయుధము ధరించి యుద్ధము చేయుదురని ఈ రెండింటిలో ఏది కావలయునని పార్ధుని అడిగినాడు. ఆ పదివేలు యాదవులు "నారాయణ సేన " అను పేరుతో గొప్ప వీరులు. దుర్యోధనుడు చాలా భయపడినాడు. పార్ధుడు తప్పక నారాయణ సేననే కోరుననియు ఇక మిగిలిన కృష్ణుడే తనకు గతియని యుద్ధము చేయని కృష్ణునికి ప్రతిరోజు వెన్నముద్దల నైవేద్యములతో వ్యర్ధమగు సేవ చేయవలసి వచ్చునని బాధపడినాడు. కాని కౌంతేయుడు నారాయణ సేనను వదలి నారాయణునే వరించినాడు. దుర్యోధనుడెంతయో సంతోషించి ఇంక కొంచెము సేపు ఉన్నచో ఈ కృష్ణుడు ఏమి తారుమారు చేయునో అని భయపడి అప్పుడు కృష్ణుడు నవ్వుచు, "అర్జునా! నీకేమైనా పిచ్చి పట్టినదా నీకు యుద్ధములో ఉపయోగించు నారాయణ సేనను వదలుకున్నావే.

నీకు ఏ విధముగను ఉపయోగించని నన్నేల కోరుకొంటివి" అని స్వామి నెత్తి బాదుకున్నాడు. అప్పుడు అర్జునుడు "స్వామీ! నీ నుండి నాకు ఎట్టి ప్రతిఫలాపేక్షయు లేదు. నీవు నా వద్ద ఉండిన చాలును. నీ వంటే నాకు పిచ్చి ఇష్టము" అన్నాడు. కానీ, నిజముగా ఆలోచించినచో జరగబోవు యుద్ధములో ఉపయోగించక పోయినను, జరిగిన ఎన్ని విషయములలో కృష్ణుడు వారికి సాయపడినాడు. అవి అన్నియు పార్ధునకు గుర్తు ఉన్నవి కావుననే కృష్ణుడన్న అంత ఇష్టము. భీమునికి విషాన్నము పెట్టించినప్పుడు, యమునలో పడ త్రోయించి, లక్క ఇంటిలో కాల్చినపుడు, ద్రౌపది వస్త్రాపహరణ సమయమునను ఇట్లు ఎన్నిసార్లు స్వామి ఆదుకున్నాడు. అట్లే మానవుడును తనకు ఈ క్షణము వరకు స్వామి విధములుగాఅ సాయపడినాడో, గుర్తుకు తెచ్చుకొన్నచో, అవి చాలవా? స్వామిపై భక్తి ఏర్పడుటకు. ఇప్పుడు అడిగిన వరము ఈయకున్ననూ, నీవు అడుగకయే ఎన్ని వరములు ఇచ్చినాడు. అతి దుర్లభమైన మానవ జన్మ నీకు ఇచ్చినాడు. పూర్ణాయుర్ధాయమును ఇచ్చినాడు. ఆరోగ్యము నిచ్చినాడు. తిన్న అన్నము అరిగించు శక్తిని అరుగుదలను ఇచ్చి నీకు కావలసిన అన్నమును ధనమును ఇచ్చినాడు. సంతానము యిచ్చినాడు. కీర్తి ఇచ్చినాడు. శీతాకాలములో సుఖమును కల్గించు వెచ్చని ఎండ నిచ్చినాడు. ఎన్ని విధముల ఫలములను సృష్టించినాడు. ఎన్ని రుచుల ఆహారమును సృష్టించినాడు. వాటిని చక్కగా తయారుచేయు పాక శాస్త్రమును అందించినాడు. ఇన్ని వరములను ఇచ్చిన స్వామిపై భక్తి కలుగుటకు ఇప్పుడు ఒక్క వరము కావలయునా? ఇచ్చిన వంద వరములకు గతి లేదు. ఇంత వరకు స్వామిపై భక్తి పుట్టలేదు. ఇప్పుడు 101 వరము ఇచ్చినచో నీకు స్వామిపై భక్తి పుట్టుననిన నమ్మమందువా? లేదా 101 వరము తరువాత 102 వరము అడుగుదువు. ఇచ్చిన వంద వరములకు నోటారా ఉచ్చరించి ఒకనాడైనా కృతజ్ఞతలు చెప్పితివా? మానవుడు ఇంత కృతఘ్నుడు కనుక ఇచ్చిన వరములను మరచి 101వ వరమును కోరుచు వరమీయకున్నచో ఎట్లు ప్రేమింతును అని అనుచున్నాడు. నిస్కామముగా సేవించమని స్వామి గీతలో చెప్పుటలో అంతరార్ధ మేమి? పాతబాకీలు వాటి వడ్డీలలో ఏమియు చెల్లించక కొత్త బాకీ అడుగ వద్దనియే నిష్కామ కర్మ యోగము. అంతే కాని స్వామి పిచ్చివాడు కాదు. 40 రోజుల తపస్సు తరువాత క్రీస్తు మహాత్ముడు కొండ మీద తనను చూడవచ్చిన 4000 మందికి 4000 వేల రొట్టెలు ఇయ్యమని భగవంతుని అడుగక బుట్టలో యున్న 4 రొట్టెలను పైకి చూపి "ప్రభూ! ఈ నాలుగు రొట్టెలు ఇచ్చినందులకు నీకు కృతజ్ఞతా స్తుతులను చెల్లించుచున్నాను అని మాత్రమే అన్నాడు. ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలిపినందుకు పరమాత్మ సంతోషిస్తాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad