Monday, April 6, 2009

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! (Part-2)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా!
[శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము)]

వివాహముయొక్క ముఖ్య ఉద్దేశము అచ్చట చదువు మంత్రములయొక్క అర్ధములను తెలుసుకొనుటయే. వివాహ సంస్కారముయొక్క ప్రధాన లక్ష్యము గృహస్థాశ్రమములో ధర్మార్ధ కామములకునూ తరువాత వానప్రస్థములో మోక్ష సాధనకూ కావలసిన అన్యోన్య సహకారమునకు మూలమైన దైవానుగ్రహమును దైవ స్తుతులచే సాధించు కొనుటయే. ఆ దైవ స్తుతులే వివాహ మంత్రములు. కానీ, మంత్రములయొక్క అర్ధములను పురోహితుడు తెలియక పోవుటచేత ఆ అర్ధములయొక్క వివరణములను అందించబడుటలేదు. కావున ప్రధాన లక్ష్యముపై ఉండవలసిన దృష్టి ఎప్పుడో జారిపోయినది. అనవసరమైన ఇతర లక్ష్యములు అచ్చట చోటుచేసుకొన్నవి. అవియే వేడుకల ఆడంబరములు, బహమతుల వ్యాపారము, పరస్పర ఆక్షేపణములు, కన్యాదాతను బెదరగొట్టు విమర్శలు మొదలగునవి. ఈవిధముగా ఈ వివాహ సంస్కారము భ్రష్టమైనది. దీనికి మూలకారణము పురోహితుడు కేవలము వేదమును బట్టీపట్టి వేదార్ధమును తెలియలేక వివరించలేకపోవుటయే. ఇతర మత గ్రంధములు వారి మాతృ భాషలోఉండుట చేత ఇతర మతస్థులు సంస్కారములు చేసుకొనునపుడు వారికి ఈ దుస్థితి పట్టలేదు. హిందూమతములో ప్రాచీన ఋషులు తమ మాతృభాష సంస్కృతము కావున ఈ మంత్రములను ఎట్టి వివరణలేకయే అర్ధము చేసికొనెడివారు. కాని ఈనాడు సంస్కృత భాష పురోహితులకేరాదు కావున మంత్రార్ధవివరణకు ఎట్టి అవకాశములేక దురాచారములకు దారితీయుచున్నది. ఉదాహరణమునకు ఆబ్దికమనకు వచ్చిన భోక్తలు అన్నసూక్తమును పఠించుచు దాని అర్ధము తెలియక ఆహారమును పారవేయుచున్నారు. భోజనముకు ముందే యజమాని 'నీకు ఇష్టమైనది ఉంచుకొని ఇష్టము కాని దానిని త్యజించుము' అని చెప్పుచున్నాడు (యత్ రోచతే...). ఈ వాక్యము సంస్కృతములో ఉండుటచే ఎవరికిని అర్ధమగుటలేదు. ఈ వాక్యము ప్రకారముగా భోక్తలు ఇష్టము కాని పదార్ధములను ఎంగిలి చేయకముందే దొప్పలో ఉంచవలెను. వారి భోజనము తరువాత ఈ దొప్పలో ఉన్న పదార్ధములను గురించి యజమాని 'వీటిని ఏమి చేయవలయునని' ప్రశ్నించును (అన్న శేషః కింక్రియతాం...). అప్పుడు భోక్తలు వాటిని ఎంగిలి చేయలేదు కనుక ఇష్టులతో కలసి భుజించమని పలుకుదురు (ఇష్టైః సహ భుజ్యతాం...). ఎంగిలి చేసినది ఇతరులు తినరాదు (యదుచ్చిష్ట మభోజ్యం ...) కనుకను, ఆహారమును పారవేయరాదు కనుకను (అన్నం న పరీచక్షిత ...), ఈ ఏర్పాటు ఇట్లు చేయవలసి వచ్చినది. వేదార్ధము తెలియక మరియు దానిని చర్చించక పోవుటవలన ఇచ్చట అనేక అపార్ధములు వచ్చినవి. ఇష్టములేని దానిని త్యజించుము అనగా తిన్నంత తిని పారవేయమని అపార్ధమును తీసినారు. అట్లు పారవేయుటకే ఆ దొప్పను ఉపయోగించినారు. అట్లు పారవేసిననే భోక్త సంతృప్తి చెందినట్లుయని విపరీతార్ధమును సృష్టించినారు. అన్న శేషము అనగా వంట ఇంటిలో మిగిలిన వంట అని అన్నారు. అది ఎటూ అందరూ తినుటకే వండినది కావున దానికి భోక్తల అనుమతి అవసరము లేదు. వీటినన్నింటిని అన్నము పారవేయరాదన్న వేద ప్రమాణము ఖండిచుచున్నది. వేద ప్రమాణమునకు ముందు ఎట్టి వాదములు నిలువజాలవుగదా (శ్రుతి స్మృతి విరోధేతు ...)! మరియూ యోగ శాస్త్రము ప్రకారము పొట్టకు సగభాగమే భుజించవలయునుగదా! అర్ధము తెలియక పోవుట అను అజ్ఞానముతోపాటు జ్ఞానులు చెప్పునది తిరస్కరించుట అను అహంకారము ఏర్పడుట వలన రాక్షసత్వము వచ్చినది. దైవము రాక్షసులను ఎప్పుడునూ శిక్షించుచునే ఉన్నది. అజ్ఞానులగు ఇతరులు తప్పుచేసినచో క్షమించవచ్చును గాని లోకమును నడిపించవలసిన గురువులే తప్పు చేసినచో క్షమార్హులు కారు. కావుననే పురోహితులకు దరిద్రభాధ అంటుకొన్నది. అన్నపూర్ణయు ధాన్యలక్ష్మియు అగు అన్నమును పారవేయుటవలన ప్రతిరోజు ఆహారమును అన్వేషించవలసిన స్థితికి దిగజారినారు.

వేదార్ధము తెలియక పోవుటవలన యజ్ఞ స్వరూపము గూడా అపభ్రష్టమైనది. అగ్ని మూడు విధములు: లౌకికాగ్ని, వైద్యుతాగ్ని మరియు వైశ్వానరాగ్ని. లౌకికాగ్ని అనగా సమిథలతో చేయుమంట. వైద్యుతాగ్ని అనగా విద్యుత్ కు సంబంధించినది అనగా విద్యుత్ శక్తి. ఇక వైశ్వానరాగ్ని అనగా దేవతాస్వరూపమై జఠరములోఉండు ఆకలిమంటయే (అహం వైశ్వానరో భూత్వా ... గీత). మొదటి రెండు అగ్నులు యజ్ఞ సాధనములు అనగా వీటి సహాయముచేత ఆహారమును వండవలయును. ఇట్లు వండిన ఆహారమును ఆకలి మంటగల వానికి పెట్టుటయే యజ్ఞ పరమార్ధమైన హోమము. ఈ ఆకలి మంటయే దేవతా స్వరూపమైన వైశ్వానరాగ్నియై ఉపాసించ బడవలసిన యజ్ఞముయొక్క ఉపాస్యాగ్ని అనబడును. ఇట్లు శ్రేష్టమైన ఆహారమగు ఘృతము మరియు అన్నము ఆకలితో ఉన్నవానికి పెట్టుటయే యజ్ఞము. అగ్ని శబ్దమునకు లౌకికాగ్నినే అర్ధముగా తీసుకొని ఆహారమును నిప్పులలో పోసి తగులపెట్టువాడు మూఢుడని విష్ణు అవతారమగు కపిల ముని భాగవతములో బోధించినాడు. ఇట్లు ఆహారమును తగులపెట్టు దురాచారముకూడా వేదార్ధము తెలియకపోవుటవలననే వచ్చినది. వీరి అన్న దారిద్ర్యమునకు ఇది ఒక కారణము. ఇట్టి యజ్ఞ ధూమమువలన వర్షములు ఆగుట నేటి విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది. ఈ ధూమము వర్షకారణమని పలుకుట ఎంత వెర్రి తనము! బ్రహ్మజ్ఞుడగు సద్గురువునందు సర్వదేవతలు వసింతురు కావున (యావతీర్వై ...) అట్టి సద్గురు పురోహితుడు సంతృప్తి చెంద సర్వ దేవతా తృప్తి వలన వర్షములు కురియును. ఇప్పుడు చేయు యజ్ఞ విధానములో వాతావరణ కాలుష్యము ద్వారా కరువులు, వరదలు వచ్చునని విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది. ప్రాచీన కాలములో లౌకికాగ్నిని జ్వలింపచేయుటకు కొంచెము నేతిని చక్షుషీ హోమములను పేరున వాడినారు. మిగిలిన ఘృతమునంతయు ఆకలిగొన్న వారికి ఆహారమును ఇచ్చుటయే యజ్ఞము. పానీయములను ఇచ్చుట సోమ యజ్ఞము. అల్పాహారమును ఇచ్చుట హవిర్యజ్ఞము. భోజనము పెట్టుటయే పాక యజ్ఞము. ఆకలితో ఉన్న పురోహితుడే అగ్నియని ప్రధమ వేద ప్రధమ మంత్రము (అగ్నిమీళే ...). అట్టివానిని మొట్టమొదట ఆహార దానముచే అర్చించమని అగ్ని శబ్దముయొక్క అర్ధము కావున అగ్రి శబ్దము నుండి అగ్ని శబ్దము పుట్టినది. గురువగు ఆ పురోహితుడు ఆహారమును స్వీకరించి జ్ఞానమును బోధించు జ్ఞానాగ్ని స్వరూపునిగా చెప్పబడుచున్నాడు (అగ్నేయోవై బ్రాహ్మణః ...). కేవల శబ్దమాత్రముగా చెప్పబడు మంత్రముతో చేయు కర్మ, ఫలరహితమని యాస్క మహర్షి వచనము (అనగ్నానివ ...). కావున కేవల వేద ధ్వని ఏమియూ చేయజాలదు. కావున వేదమును బట్టీపట్టుట మానుకొని వేదార్ధబోధ చేయు జ్ఞాన యజ్ఞమును నిర్వహించు గురువుగా పురోహితులు మారవలెను. వ్రాత సాధనములు లేని పూర్వ కాలమున వేదములను కంఠస్థము చేసి పరంపరగా అందిచ వలసిన అవసరము ఉండి ఉన్నప్పుడు బట్టీపట్టి వేదములను రక్షించుట చేసిన ప్రాచీనులు అభినందనీయులే. నాడు బట్టీపట్టుటతో పాటు వేదార్ధ విచారము కూడా చేసి వేద పాఠకులేకాక వేద పండితులుగానూ ప్రసిద్ధినొందిరి (అధ్యేతవ్యో జ్ఞేయశ్చ ...). అసలు వేద శబ్దమునకు అర్ధమే జ్ఞానమైనపుడు (విదుల్ జ్ఞానే ...) వేదార్ధము ఎంత ముఖ్యమో ఆలోచింపుడు.

ఉపనయనములో గాయత్రీ మంత్రోపదేశము కూడా అర్ధము తెలియక వెర్రి దోవలకు దారితీసినది. ఉపనయనము అనగా జీవుని దైవము వైపునకు త్రిప్పుటయే. జీవులను దైవము వైపునకు నడిపించువాడే బ్రాహ్మణుడని శబ్దార్ధము (బ్రహ్మ నయతి ఇతి బ్రాహ్మణః). గాయత్రి అనగా గానముచే దైవమును ప్రార్ధించుటయే (గాయంతం త్రాయతే ...) అనగా ప్రతి జీవునకు బాల్యములో భగవంతుని గురించిన గానమును నేర్పించుటయే ఉపనయనము మరియు గాయత్రీ మంత్రోపదేశము. దీనికి కులము మరియు లింగముల విచక్షణలేదు. ఒకానొక వైధిక ఛందస్సు పేరు గాయత్రి (గాయత్రీ ఛందః). గాయత్రి, దేవతానామము కాదు. సృష్టిని చేయు సవిత యనబడు భగవంతుడే దేవత (సవితా దేవతా). ఇట్లు వేదార్ధ విచారము చేయక గాయత్రి అనగా దేవతయనియు, గాయత్రీ ఛందస్సులో గల ఒకానొక పద్యమును గాయత్రీ మంత్రమనియు, అది కేవలము ఒకానొక కులములో గల పురుషులకు మాత్రమే వర్తించుననియూ అపార్ధముచేసి హిందూమతములో కుల ద్వేషమునకు, లింగ వివక్షతకు దారిజూపి, హిందూమతములో ఇకమత్యమును పాడుచేసియున్నారు. గానమయమై, అర్ధము తెలియు మాతృభాషలో పదే పదే ఉచ్చరింపజేయు భగవంతుని గుణ గానమే గాయత్రీ మంత్రము. వీరు చెప్పు గాయత్రీ మంత్రములో గానమేలేదు. అర్ధము తెలియదు. మనస్సునకు ఆకర్షణ లేదు. బలవంతముగా పదే పదే ఉచ్చరించుట చేత అది గాయత్రీ మంత్రమే కాదు. మనస్సును ఆకర్షించి పదే పదే మననము చేయించు దైవ గానమే గాయత్రీ మంత్రము. అప్రయత్నముగా మనస్సును ఆకర్షించునదియే మంత్రము (మననాత్ ఇతి). అట్టి ఆకర్షణమును కలుగజేయు శక్తి వచనము కన్నను, పద్యముకన్నను గానమునకే ఎక్కువ కలదు. కావున గానాత్మకమైన భగవంతుని గీతము సర్వ శ్రేష్టమని చెప్పుటయే గాయత్రి యొక్క శ్రేష్ట తత్వము. అందుకే వచనమైన యజుర్వేదముకన్నను, పద్యమైన ఋగ్వేదము కన్నను, గానమైన సామవేదమే సర్వ శ్రేష్టమైనది (వేదానాం సామవేదోస్మి - గీత). విశ్వములోగల అన్ని భాషలకు ఇది వర్తించును కావున విశ్వ జనులకు అందరికిని హితముచేయు బోధకుడే విశ్వామిత్రుడు అనబడుచు దీనికి ఋషి అయి ఉన్నాడు (విశ్వామిత్ర ఋషిః).

No comments:

Post a Comment