Friday, March 5, 2010

దత్తవేదములోని 10 జ్ఞాన రత్నములు

1. భగవత్సేవయే కర్మ (worship is work) అనుట అతివృష్టివలె సరి కాదు. ఏలననగా భగవత్సేవలో ఉన్నవారు అన్నవస్త్రాదులకై భక్తులపై ఆధారపడినచో నిర్లక్ష్యమునకు గురియై వారందించు బోధలను భక్తులు ఆదరించరు. అలానే కర్మయే భగవత్సేవ (work is worship) కారాదు. ఏలననగా అన్నవస్త్రములు సిద్ధించిన తర్వాత అనావృష్టివలె దారా పుత్రుల మమకారముతో నిరంతర ధనార్జనలోలుడై పశు జన్మలను పొందును. ఈ రెండింటికి మధ్యగా నున్న ‘‘కర్మ మరియు భగవత్సేవ’’ (work and worship) అనునదే భక్తులకు సరియైన మార్గము. మీ అన్నవస్త్రాదులకు లౌకిక కర్మను ఆచరించుచూ మిగిలిన సమయమును, శక్తిని భగవత్సేవకు ధారపోయుటయే కలియుగములో ఉత్తమమైన మార్గము.

2. అన్నవస్త్రాదులకు కావలసిన కర్తవ్యసేవ చేయుచు, విశ్రాంతి తీసుకొనుచు, మిగిలిన సమయమును సినిమాలు, నవలలు చదువుట, కబుర్లు చెప్పుకొనుట మొ||వ్యసనములతో కాలము, శక్తిని దుర్వినియోగము చేయక, భగవత్సేవకు వినియోగించిన చాలును. తప్పక తరింతువు.

3. దత్తుడనగా దానమని అర్ధము. ‘‘త్యాగేనైకే’’ అను శృతి దానము చేతనే బ్రహ్మప్రాప్తి అని చెప్పుచున్నది. దానము అనగా అన్నార్తులగు సజ్జనులకు అన్నదానము, జ్ఞాన భక్తి దరిద్రులకు జ్ఞాన భక్తులను దానము చేయు ప్రచార సేవ. జ్ఞాన ప్రచారము చేయుచూ శంకరులు, భక్తి ప్రచారము చేయుచూ మీర సశరీర కైవల్యమును పొందినారు. మహాజ్ఞానులు, మహాభక్తులు ప్రచార సేవనే చేసినారు.

4. నీవు నీ యొక్క శక్తి, కాలము, కర్మలలో కొంచెమైనను భగవత్సేవకు త్యాగము చేయలేకున్నచో నిరత్సాహ పడ పని లేదు. ‘‘ఒంటెయైనను సూది బెజ్జములో దూరునేమో గాని, ధనవంతుడు పరమాత్మను చేరలేడు.’’ అన్న వాక్యమును విని భయపడకుము. నీకు ఒక మార్గము గలదు. కర్మ త్యాగము చేయలేని వారు కర్మఫలత్యాగము చేసినచో అనగా కర్మఫలమగు ధనమును కొంత దైవ సేవలో వినియోగించినచో ఆ ధనమును ఆర్జించుటకు చేసిన కర్మను భగవత్సేవకు త్యాగము చేసినవాడవే అగుదువు అని కర్మ ఫలత్యాగ మార్గము గీతలో చెప్పబడినది.

5. పరమాత్మను గురించి మనస్సుతో తెలుసుకొనుట జ్ఞానము. వాక్కుతో స్తుతించుట భక్తి. ఈ రెండును క్రియాత్మకమైన సేవలోనే నిరూపించబడును. కావున జ్ఞానము, భక్తి కన్నను, సేవయే గొప్పది. విభీషణుడు హనుమంతునితో ‘‘మనమిరువురము రామనామ జపము చేసిన వారమే గదా, రాముడు నిన్ను అనుగ్రహించినట్లు నన్నేల అనుగ్రహించలేదు?’’ అని అడిగినప్పుడు హనుమంతుడు ‘‘విభీషణా! నేను రామ కార్యములో పాల్గొన్నాను. కాని నీవు పాల్గొన లేదు గదా’’ అని సమాధానము చెప్పినాడు. కావున దత్తుని జ్ఞాన, భక్తి ప్రచార సేవా కార్యములో క్రియాత్మకమగు సేవలో పాల్గొన్నవారే నిజముగా దత్తానుగ్రహమును పొందుదురు. సత్యభామ కృష్ణుని తనవరకే పరిమితము చేసుకొన్నది. కాని రుక్మిణి అట్లు కాదు. రుక్మిణి కృష్ణుని అష్ట భార్యలకు పంచినది. కావున రుక్మిణి సత్యభామ కన్న గొప్పది. రాధ కృష్ణుని పదునారువేల గోపికలకు అందించినది. అందువల్ల రాధ రుక్మిణికన్ననూ గొప్పది. భక్తి ప్రచార సేవతో కృష్ణుని సర్వజీవులకూ అందించిన మీర రాధ కన్ననూ గొప్పది. కావుననే మీరకు మాత్రమే సశరీర కైవల్యమును అందించినారు.

6. సముద్రములో వేయుచున్న పెద్ద బండలు మునుగుచుండగా వానరులు స్వామి కార్యము జరుగదన్న అనుమానముతో బండలు వేయుట ఆపినారు. కాని ఉడుత మాత్రము ‘‘స్వామి కార్యము ఎటూ ఆగదు. నేను యధాశక్తి సేవలో పాల్గొందు’’ నని సముద్రములో కొన్ని ఇసుక రేణువులను విదిలించుట ఆపలేదు. దాని విశ్వాసమునుకు దాని యధాశక్తి సేవలకు మురిసి స్వామి దాని వీపు నిమిరినాడే కాని, వానరుల వీపులను నిమురలేదు. కావున నీవు స్వామి సేవలో పాల్గొనకపోయిననూ స్వామి కార్యము ఆగదు. కావున నీయధాశక్తి స్వామి సేవలో పరిపూర్ణ విశ్వాసముతో పాల్గొనుము.

7. స్వామి కార్యములో నీవు చేసిన గోరంత సేవకు కొండంత ఫలము లభించును. స్వామి వేలుకోసుకున్నప్పుడు రక్తము కారుచుండగా అక్కడే ఉన్న ద్రౌపది తన పట్టు చీరె కొంగును చించి, కృష్ణుని వేలికి చుట్టినందు వల్లనే ఆ చీరె ముక్కనే అక్షయము చేసి ఆమెకు వస్త్రాపహరణ సమయమున అనంత సంఖ్యలో చీరెలుగా స్వామి ప్రసాదించిరి.

8. భగవంతుడు తన పనికి వినియోగించుకన్న అర్జునునికి ఎచటను గుడి లేదు. భగవంతుని కార్యములో తనను వినియోగించుకున్న హనుమంతునికి ప్రతిచోట గుడి గలదు. కావున భగవంతుని నీ లౌకిక కార్యములకు ఉపయోగించుకొను పద్ధతిని కొంత పక్కకుపెట్టి భగవంతుని కార్యమగు సర్వ జీవోద్ధరణమగు కార్యములో ప్రచార సేవకునిగా పాల్గొనుట గురించి ఆలోచించుము.

9. నిరాకారమును ధ్యానించుట కష్టము. సాకారములగు విగ్రహములు, చిత్రములు, దర్శన స్పర్శనముల నిచ్చును. నరాకారము దర్శన స్పర్శనలతో పాటు సహవాస సంభాషణములను ఇచ్చును. హనుమంతుడు తానున్న సమయమున అవతరించిన నరావతారుడగు రాముని, అట్లే రాధ కృష్ణిని అర్చించినారు. హనుమంతునికి భవిష్యద్బ్రహ్మగా సర్వలోకాధిపత్యము, రాధకు 15వ లోకమగు గోలోకము యొక్క ఆధిపత్యము లభించినది. బ్రహ్మమే నరరూపములో అవతరించుటయే మహా వాక్యముల అర్ధము. గీతలో ‘‘మానుషీం తనుమాశ్రితమ్’’ అని చెప్పబడినది. ‘‘దేవుడు జీవుడుగా వచ్చు’’ నని శంకరులు చెప్పినారు. కాని శిష్యులందరునూ జీవుడే దేవుడని అనుకొన్నారు. శిష్యులను సరిదిద్దులకు శంకరులు తప్త సీసమును త్రాగి అవతార పురుషుడైన తాను మాత్రమే ‘‘అహం బ్రహ్మాస్మి’’ అని నిరూపించినారు. హిందూ మతములోనే శంకర, రామానుజ, మధ్వ మతములను సమన్వయము చేసి ఏకత్వమును దర్శించలేకున్నప్పుడు ప్రపంచములోని సర్వమతములనూ సమన్వయము చేసి ఏకత్వమును సాధించుట సాధ్యము కాదు.

10. ఒక దేశమున ఒక కాలములో ఒక అవతారము ద్వారి బోధించిన తత్త్వమునే అదే సమయమున అన్ని అవతారముల ద్వారా అన్ని దేశములందును స్వామి బోధించుచున్నాడు. ఇది నిజము కాకున్నచో ఒక సమయమున ఒక దేశమున మాత్రమే బోధించినచో ఆ సమయమున ఇతర దేశములనున్న అదే తరములవారికి అన్యాయము జరిగి స్వామికి పక్షపాతదోషము కలుగును కదా.

At the lotus feet of Shri Dattaswami,
-Durgaprasad

No comments:

Post a Comment