Monday, April 6, 2015

శ్రీసాయి విమర్శ ఖండనము

    [12-07-2014 గురుపూర్ణిమ నాడు భక్తులు శ్రీదత్తస్వామితో, ద్వారకాపీఠాధిపతి యగు శ్రీసంపూర్ణానందస్వామి, శ్రీ షిరిడీ సాయాబాబా మీద చేసిన ఆక్షేపణల గురించి ప్రస్తావించగా, శ్రీదత్తస్వామి ఇచ్చిన సందేశమే ఇది.]
    ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ షిరిడీ సాయిబాబావారి మూలంగా ఈ పండుగ చాలా ప్రసిద్ధికి వచ్చినది. ఈ సందేశమునకు ఈ రోజు చాలా యోగ్యము. స్వామి సంపూర్ణానంద, లోతుగా విశ్లేషణ చేయకుండా బాబావారిపై ఆక్షేపణలనుచేసినారు. ఆయన చేసిన విమర్శలు ఆయననే కాక, ఆయన మూలగురువగు ఆది శంకరులనే వ్యతిరేకించు చున్నవి. హిందూమతములోని భిన్నసంస్కృతుల యొక్క మిశ్రమమైన స్మార్తమార్గమును శ్రీసంపూర్ణానందయే స్వయముగా అనుసరించుచున్నారు గదా.

భిన్న సంస్కృతుల మిశ్రమ - ఏకీకరణము :
    రెండు భిన్న సంస్కృతి మార్గములను గురించి ఆలోచిద్దాము. ఈ రెండింటిలో ఒకటి సుప్రసిద్ధ శైవమతము, మరియొకటి సుప్రసిద్ధ వైష్ణవమతము. ఈ రెండు  మతములు అంతరార్థ వేదాంతములందే కాక, బాహ్యసంస్కృతులలో సైతము పరస్పర విరుద్ధములు. మొదటి మతము వారు నుదిటిపై అడ్డరేఖలను, రెండవమతము వారు నుదిటిపై నిలువురేఖలను బొట్టుగా పెట్టుచుందురు. పాత చరిత్రను తిరగేస్తే, ఈ రెండుమతముల విరోధము ఎంత తీవ్ర మంటే - ఒకరి నొకరు చంపుకొనుట వరకు జరిగినది. ఈ మతముల ఆరాధ్య దైవములు (లక్ష్యములు) కూడా పూర్తిగా భిన్నములే. ఒక మత జనులు వారి దైవమునకు రెండవమతము వారి దైవము కూడా దాస్యము చేయునందురు. మొదటి మతము వారు తమ మతదైవమైన శివునకు, రెండవ మత దైవమైన విష్ణువు దాసుడందురు. రెండవ మతము వారు కూడా అట్లే విష్ణువునకు శివుడు భక్తుడందురు.
    మూడవ మార్గమైన స్మార్త మతము,  యీ రెండు  మతముల సమన్వయము  కొరకు ఉద్భవించినది. ఆదిశంకురులు, వారి శిష్యుడగు యీ శ్రీ సంపూర్ణానందయును యీ మూడవ మార్గమునకు చెందినవారే. ఈ శ్రీ సంపూర్ణానందగానీ, మరి ఏ శంకర పీఠాధిపతి గానీ, నుదిటిపై అడ్డముగా బొట్టు పెట్టి, సంభాషణ సందేశము చివర 'ఇతి నారాయణ స్మృతి:' అని ముగించుట ఆచారమై యున్నది. ఈ స్మార్త మతము, రెండు మత లక్ష్యములగు శివ విష్ణువు లొకరే యనుటయే కాక, మార్గ సంస్కృతులను కూడా మిళితము చేయును. రెండు మతముల లక్ష్యమగు ఒకే పరమాత్మను చేరు ప్రయత్నమే రెండు మార్గములలోని సంస్కృతి తాత్పర్యము. స్మార్త మార్గస్థుడు, ఈ రెండుమతములకు పంబంధించిన పండుగలన్నియును చేయును. ప్రతి పండుగ లోను, ఒకే భగవంతుని చేరు ప్రయత్నము (సంస్కృతి) కూడా ఒక్కటే కావున మార్గసంస్కృతి కూడా ఒక్కటియే కావలయును. రెండు ఎట్లు అగును?

    శ్రీ సాయిబాబా కూడా భిన్న సంస్కృతులు గల హిందూ-ముస్లిం మతములను అనుసరించుటను, స్మార్త మార్గము నవలంబించు శ్రీసంపూర్ణానంద ఆక్షేపించుట విచిత్రము. భిన్నమత సంస్కృతులు గల శివ, విష్ణువులలో ఒకే దైవత్వ మున్నప్పుడు, అదే దైవత్వము, భిన్నమత సంస్కృతి గల 'అల్లా'లో ఏల ఉండరాదు? భిన్నమతముల లక్ష్యములలోను, మార్గసంస్కృతులలోను ఏకత్వమును సాధించిన స్మార్త మతమార్గమునకు మూలపురుషుడే ఆది శంకరులు. లక్ష్యము ఒకటే అయినప్పుడు, ఆ లక్ష్యమును చేరు ప్రయత్నమే సారాంశముగా గల భిన్న మత మార్గములు కూడా ఒకటియే కావలయును. వాటిలో విరోధము అసంభవము. భూమిపై నున్న ఒకే పట్టణమును చేరు మార్గములు వేరు వేరు కావచ్చును కాని, ఒకే దైవ ప్రీతిని లక్ష్యముగా గలిగి, ఆ లక్ష్యసాధన ప్రయత్న రూపములైన భిన్నమతములు మాత్రము వేరు వేరు కాలేవు. ప్రయత్న రూపమైన సాధన ఒకటియే గదా. భూమిపై నున్న మార్గములు వేరు వేరుగా నుండవచ్చును కానీ, సాధన తత్త్వము ఒకటియే గల మతములు వేరువేరుగా నుండజాలవు. ఒకే పట్టణమును చేరు భిన్నమార్గములను, ఒకే దైవమును చేరు భిన్న మతములతో పూర్తిగా పోల్చరాదు.
    ఆదిశంకురులు మతలక్ష్యములైన దైవరూపములందే కాక, ఆయా దైవరూపములను ప్రసన్నము చేసుకొను మార్గములగు మతములందును ఏకత్వమును సాధించినారు. ఈ విశ్వమను బ్రహ్మాండమునకు ప్రతీకగా నిలచిన పిండాండమే హిందూమతము. హిందూమతము లోని మతముల యొక్క  ప్రతీకలుగా విశ్వమతములను తీసుకొనవచ్చును. అన్ని మతముల దేవతా రూపములలో దైవత్వము ఒకటే అనియు, ఆ ఏకైక దైవప్రీతిని సాధించు ప్రయత్నములగు మత మార్గములు కూడా ఒకటియేనని బోధించు విశ్వమతములోని ఉపమతములే యీ విశ్వమందున్న మతములు. కావున హిందూ మతముతో విశ్వమతము పూర్తిగ పోలియున్నది. మతముల బాహ్యసంస్కృతులగు భాషాభేదము, రూపభేదము, వస్త్రధారణభేదము, ఆహారాదులలో భేదము మొదలగు భేదము లన్నియు పట్టించు కొనుటకు పనికిరానివి. ఏలనన, దైవము ఒకటియే, మరల, దైవసాధన ప్రయత్నమే ఏకతాత్పర్యముగా గల మతములు కూడా ఒకటే గదా.
    దైవము ఊహకును అందని అతీతము అని మా సిద్ధాంతము. ఆ దైవము చైతన్యమని అద్వైతులందురు. మా యీమత భేదము గురించిన చర్చ ఇచట అప్రస్తుతము. దైవము అనూహ్యమైననూ, చైతన్య స్వరూపమైననూ, పైన చెప్పిన బాహ్యభేదము లేవియును దైవమును అంటజాలవు. శంకర మతములోను, బాహ్యములగు మిథ్యానామ రూపముల భేదము, సత్యమైన అంత: స్వరూపము అగు బ్రహ్మమును స్పృశించ జాలదనియే గదా సారాంశము. ఈ శంకర సిద్ధాంతమును హిందూమతము లోని భిన్న మతములకే కాక, విశ్వమతములోని భిన్న మతములగు హిందూ, ముస్లిం, క్రైస్తవాది మతములకును ఏల వర్తింప చేయరాదు? హిందూమతమునకు ఒక సిద్ధాంతమును, ఇతర మతములకు మరియొక సిద్ధాంతమును వర్తింపచేయుట విజ్ఞత కాజాలదు. భారతదేశములోని హిందూమతమునకు, విశ్వములోని ఇతర మతములకు ఒకే తర్కమును అన్వయించ వలెను.
    ఆదిశంకరులు హిందూమతములోని ఉపమతముల మధ్య నున్న అడ్డుగోడలను తొలగించినారు. ఒకే ఇంటిలో ఉన్న గదుల మధ్య గోడలను తొలగించి, మొత్తము ఇంటిని ఒకే హాలుగా చేయుటయే యీపని. శ్రీ సాయిబాబా ఇదే పనిని ప్రపంచములో నున్న మతముల మధ్య గోడలను తొలగించి చేసినారు. అంటే-వారు ఒకే హాలుగా మారిన ఇళ్ళను అన్నింటిని కలిపి ఒకే పెద్దహాలును చేసినారు. ప్రతి మతములోను, ఉపమతములను ఏకీకరణము చేయు ప్రయత్నము    జరిగినది.   ఇస్లాం మతములోను,  ప్రవక్త  మహమ్మదు  రాకముందు అనేక   ఉపమతము లుండెడివి. ప్రవక్త, యీ ఉపమతముల మధ్య గోడలను తొలగించి ఒకే మతమును చేసి, 'అల్లా' అను పేరుతో ఒకే దైవమును స్థాపించినారు. హిందూమతములో శంకరులు చేసినపనినే, ప్రవక్త మహమ్మదు, ఇస్లాంలో చేసినారు. ఈ ఇరువురి ప్రయత్నముల వల్లను, హిందూమతము ఒక పెద్దహాలుగాను, ముస్లింమతము మరియొక పెద్దహాలుగాను మారినవి. ఇప్పుడు శ్రీ సాయిబాబా యీ రెండు పెద్దహాలుల మధ్య గోడలను తొలగించి 'ఒకే ఒక పెద్దహాలును' ఏర్పరిచినారు. ఈ విశ్వములోని అన్ని మతములను పెద్దహాలులను కలిపి, ఒకే పెద్దప్రపంచ హాలును నిర్మించినారు స్వామి వివేకానంద.
    ఇప్పుడు ఆదిశంకరులు, మహమ్మదుప్రవక్త, సాయిబాబా, వివేకానందులలో ఏమి తేడా ఉన్నది? శ్రీ రామకృష్ణ పరమహంస గూడా అన్ని మతముల దైవరూపములలోను, అన్ని మతముల మార్గములలోను ఏకత్వమును అనుభూతిగా పొంది, దానిని ప్రకటించినారు. అన్ని మతముల లక్ష్యములలో ఏకత్వమే ఒకే దేవుడు. అన్ని మత మార్గములలో ఏకత్వము ఆ ఒకే దైవమును ప్రసన్నము చేసుకొను ఏకైకప్రయత్నమే. ఈ విషయము, శ్రీ సంపూర్ణానంద వాదించు మతసంస్కృతుల భిన్నత్వమును ఖండించుచున్నది. ఈ విషయములో ఆయన సాయిబాబాను దూషించినచో, వారి గురువగు ఆదిశంకరులను కూడా పరోక్షముగ దూషించినట్లే గదా.
మతముల ఐక్యత నిగూఢతర్క సాధ్యము :
    స్వామి వివేకానంద ప్రపంచ పౌరుల సభలో మతసామరస్యమునకై ప్రయత్నించినారు. ఈ సందేశము నిచ్చు దత్తస్వామి, ఆ సామరస్యమును నిగూఢ తర్కవాదముతో సాధించుచున్నారు. దీనికి కారణమేమనగా - ప్రతి మానవుడును తనలో నున్న అత్యున్నతమైన బుద్ధియోగమును సమాధానపరచగల తర్కముతోనే సంతృప్తిని చెందును. ఆతర్కవాదమేమనగా -
    శ్రీ సంపూర్ణానంద స్వామిజీ హిందూమతమునకు చెందినవారు. ఈ హిందూమత దైవమగు పరబ్రహ్మము యీ విశ్వమును సృష్టించినది కావున, యీ విశ్వములోగల అన్ని పాశ్చాత్యదేశములను కూడా పరబ్రహ్మమే సృష్టించినది గదా. ఈ భారతదేశములో అనేక దైవావతార పురుషులు హిందువుల కొరకు ఆధ్యాత్మిక జ్ఞానమును వర్షించినారు. అయితే, ఈ జ్ఞానామృతము భారతదేశములో కురిసిన సమయములోనే వెంటనే అన్ని  పాశ్చాత్యదేశములకు చేరలేదు. పాశ్చాత్యదేశములు, భారతదేశమును 17వ శతాబ్దము లోనే కనుగొన్నవి. అప్పటివరకు, పాశ్చాత్యదేశములలో అనేక మనుష్యతరములు, యీ జ్ఞానామృతమును తెలుసుకొను అవకాశమే లేక అంతరించినవి. అయితే, విశ్వములోని అన్ని దేశముల జీవులును ఆ ఏకైక దైవమైన పరబ్రహ్మము యొక్క సంతానమేకదా (అహంబీజప్రద:పితా... గీత). మరి, 17వశతాబ్దము వరకు భారతదేశజీవులగు కొందరు పుత్రులకే జ్ఞానామృతమునిచ్చి, యీ నిష్కారణ పక్షపాతము నేల దైవము చూపినది? దైవము విశ్వమును సృష్టిచేసినపుడు, సర్వవిశ్వజీవులకు ఒకే మాతృభాషగా సంస్కృతమును పెట్టియుండవలసినది. సృష్టించినపుడే, అన్ని దేశములను అనుసంధానము చేసి ఉన్నచో, సంస్కృతములో ఇచ్చట బోధించిన జ్ఞానామృతము వెంటనే అన్ని దేశములకు వ్యాపించి యుండెడిది. అప్పుడు విశ్వపితయగు దైవమునకు ఎట్టి పక్షపాత దోషము లేశమైనను వచ్చియుండెడిది కాదుగదా. దీనికి ఒకేఒక సమాధానము తప్పవేరు మార్గము లేదు. అది ఏ మనగా - సృష్టించిన సమయము నుండి, విశ్వములోని అన్ని దేశములకు ఏకైక దైవమగు పరబ్రహ్మము అనేక రూపములలో అవతరించి, ఆయాభాషలలో ఈ జ్ఞానామృతమును బోధించినట్లు అంగీకరించవలెను. ఆయా దేశముల జీవుల గ్రహణశక్తి స్థాయిలననుసరించి భిన్నస్థాయిలలో యీ జ్ఞానామృతమును బోధించి యుండవచ్చును. సర్వమతదైవరూపములలో ఒకే దైవమున్నదనియు, ఆ దైవప్రీతిని సాధించు ప్రయత్నమే తాత్పర్యముగాగల మతములన్నియు ఒక్కటేననియు, యీ ఏకైక సమాధానమే నిరూపించుచున్నది. శ్రీ సంపూర్ణానంద, దీనిని అంగీకరించనిచో, దైవమునకు అంటు అకారణ పక్షపాత దోషమును గురించి సమాధానమీయవలెను. తమ మతమే నిజమైనది యని భావించు ప్రతి మతమునకును, ఈ పక్షపాత దోషము వెంబడించుచున్నది, కావున, సర్వమతములును ఈ సమాధాన సమన్వయము నంగీకరించక తప్పదు.

శాకాహార మార్గము-దైవత్వము :
    శ్రీ సంపూర్ణానంద, మాంసాహారి యగు శ్రీ సాయిబాబా దైవము కాదనుచున్నారు. ఆయనే శ్రీరాముని దైవముగా స్తుతించుచున్నారు. శ్రీరాముడు కూడా మాంసాహారియే కదా! సాయిని పూజించరాదని ఎట్లు చెప్పుచున్నారు? ఆహారము బాహ్యసంస్కృతియే. ఆయిననూ, ప్రాణివధ కారణమున మాంసాహారము పాపమే. కాని, భగవంతుడు ఒకచోట అవతరించినపుడు అచట నున్న జీవుల బాహ్యసంస్కృతిని తానూ అనుసరించి, వారితో ముందు సఖ్యతను ఏర్పరుచుకొనును. ఆ తరువాత వారికి జ్ఞానబోధను చేయుచు, పరమధర్మమైన అహింసామార్గమునకు వారిని నెమ్మదిగా మరలించును. బురదగుంటలో కూరుకొని పోవువారిని ఉద్ధరించుటకు రక్షకుడును, బురదగుంటలో దూకవలయును కదా. అట్లు దూకినప్పుడు తన దేహమునకును బురద అంటుకొనక తప్పదు. పరుగెత్తు ఆంబోతును నిలువరించుటకు ముందు, దానితో కూడా కొన్ని అడుగులు వేయకతప్పదు. అజ్ఞానులను ఉద్ధరించుటకు ముందు వారి అజ్ఞానమును కొంతకాలము అనుసరించుట, అవతారపురుషునకు తప్పదు. గాయపడిన జటాయుపక్షిని చూచి దు:ఖించిన శ్రీరాముని, ప్రేమతో మేక నెత్తుకొన్న క్రీస్తును, మాంసాహార విషయములో ఇట్లు అర్థము చేసుకొనవలెను. కానీ, శ్రీ సాయిబాబాను మాంసాహారి యనుట సరికాదు. మాంసాహార భక్తులకు, మాంసాహారమును వండించి వడ్డించినాడే తప్ప, తాను మాంసాహార భక్షణము చేయలేదు. భక్తురాలు గేదెను కొట్టినందుకే తన వీపుపై వాతను చూపి భూతదయను బోధించిన శ్రీసాయి, అమాయక జంతువధ వలన లభ్యమైన మాంసమును తినునా? శ్రీరాముని మాంసాహారమును క్షత్రియకుల ధర్మముగా చూచిననూ, తాను బ్రాహ్మణుడని ఎన్నోసార్లు ఎలుగెత్తి చాటిన శ్రీసాయి విషయమున దీనిని నమ్మశక్యము కాదు. మాంసాహారులెవరైన తమ పాపమును సమర్థించు కొనుటకు ఇట్లు శ్రీసాయిపై ఆరోపించి చెప్పియుండవచ్చును. కాదని, నీవు మూర్ఖముగా శ్రీసాయి మాంసాహారియేనని వాదించిననూ, కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లే వ్యర్థమగును. ఏలననగా- మాంసాహారమునకును-దైవత్వమునకును ఎట్టి సంబంధము లేదని శ్రీరాముని విషయములో తేలినది కదా.
    శ్రీ సాయిబాబా మేకను స్వయముగా చంపినారన్న మీ ఆక్షేపణయును పూర్తిగ అసత్యము. ఆయన ఒక మేకను చంపమని ఒక బ్రాహ్మణ భక్తుని ఆదేశించగా, ఆ భక్తుడు చంపుటకు సిద్ధమయ్యెను. అప్పుడు శ్రీసాయి భక్తుని వారించి 'నేనే చంపెదను' అనెను. వెంటనే మేక భూమిపైపడి చనిపోయెను. దీని ద్వారా శ్రీసాయి సృష్టి స్థితి లయములు భగవంతుని అధికారములనియు, భగవంతుడు నరావతారమున జ్ఞాన బోధకుడనియు సూచించెను.

శ్రీసాయి హిందూమతస్థుడే :
    శ్రీ సంపూర్ణానంద, శ్రీసాయిని గురించి ఆయన ముస్లిం అనియు, హిందువు కాదనియు, ముస్లిం సంస్కృతిని హిందూమతములోనికి త్రోయుచున్నారనియు, ఆరోపించుట సరికాదు. శ్రీసాయి హిందూబ్రాహ్మణుడు. ఆయన హిందూదేవతల నారాధించుచు, భక్తులను కూడా హిందూదేవతల నారాధించుటలో ప్రోత్సహించినారు. ఒకసారి వర్షములో తడియుచు క్రింది మెట్టుపై నున్న సాయి, హనుమంతుని విగ్రహముకల పైమెట్టును భక్తులు ఎక్కమన్ననూ ఎక్కక, స్వామి కన్న క్రింది స్థాయిలోనే ఉండవలయునని పలికినారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన ఆశీస్సులతో సంతానము పొంది, లడ్లు తీసుకొనిరాగా, శ్రీసాయి వాటిని హనుమంతుని గుడిలో పంచమని ఆదేశించిరి. 'అల్లా హనుమంతులకు కుస్తీ జరుగగా, హనుమంతుడే గెలిచినాడు' అని పలికిరి. ఎప్పుడు 'అల్లామాలిక్' అని పలుకు శ్రీసాయి, యిట్లు పలుకుట ఆ ముస్లిం భక్తుని మత దురభిమానమును పోగొట్టుటకే తప్ప, అల్లాపై భక్తి లేక కాదని    గ్రహించవలెను. హిందూదేవతలపై శ్రీసాయి ఎంతో భక్తిని చూపించినారు. తాను హిందూబ్రాహ్మణుడననియు, ఉపనయనంలో కుట్టిన చెవులను శ్రీసాయి చూపెడివారు. ఒక దసరానాడు, తాను ముస్లిం అయినచో తనకు 'సుంతి' చేసినారా లేదా చూడమని దిగంబరుడై శ్రీసాయి కోపముతో కేకలను పెట్టినారు. ఇవి అన్నియును శ్రీసాయి హిందువనియే నిరూపించుచున్నను, ఆయన కొన్ని ముస్లిం పద్ధతులను అవలంబించుట, ఆ రెండు మతముల సమన్వయము కొరకేనని తెలియవలయును. వస్త్రధారణములో ఆయన తరువాత శ్రీ సత్యసాయిగా అవతరించినపుడు హిందు-క్రైస్తవ మత సమన్వయమును సూచిస్తూ మరొక ప్రయత్నమును చేసినారు.

శ్రీసాయికి గురుపరంపర ఉన్నది :
    శ్రీసాయికి గురుపరంపర లేదని వారు చేసిన ఆక్షేపణయు నిజముకాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడగు శ్రీవెంకుసాయే శ్రీసాయికి గురువు. శంకరాచార్య గురుపరంపరలను కూడా, సదాశివ-శంకరాచార్య పరంపరలో చెప్పినట్లు, వెంకటేశ్వర-వెంకుసా పరంపరయు నట్టిదేగదా. తన గురువగు శ్రీవెంకుసా తన కిచ్చిన ఇటుకరాయిని, శ్రీసాయి ఎంతో ప్రియముగా దాచుకున్నారు.
భగవదవతారముల సంఖ్య :
    భాగవతంలో కలియుగ అవతారముల సంఖ్య 22 అనియు, వాటిలో శ్రీసాయి పేరులేదని మీరు ఆక్షేపించుటలో మీరు చూపిన పాండిత్యము మీ మూలమునకే ముప్పుతెచ్చుచున్నది. ఆదిశంకరులు భగవదవతారమని వేదములోనే చెప్పబడియున్నది (వ్యుప్తకేశాయచ). శివుడే ముండిత శిరస్కుడై వచ్చునని ఈ వేదమంత్రార్థము. అయితే, ఆదిశంకరులు ఈ 22 అవతారములలో చెప్పబడలేదు. భాగవతము కన్నను వేదప్రామాణ్యము అధికము (శ్రుతిరేవగరీయసీ). ఎప్పుడు ఏ అవసరము వచ్చినా భగవంతుడవతరించునని గీతావచనము (యదాయదాహి...), ఈ పురాణోక్త సంఖ్య భగవంతుని నియమించలేదు. ఆదిశంకరులు కూడా 22 సంఖ్యలో చెప్పబడలేదని భగవదవతారము కాదని శ్రీ సంపూర్ణానంద, కర్మకాలి, చెప్పుదురా ఏమి!

గంగాస్నాన నిషేధము:
    శ్రీసాయి భక్తులు గంగా స్నానము చేయరాదని శ్రీ సంపూర్ణానంద నిషేధించుట వారి ఘనీభవించిన అజ్ఞానపరాకాష్ఠ. ఏ నదీ జలమైననూ, హైడ్రోజన్, ఆక్సిజన్ 2:1 నిష్పత్తిలో కలిసి సమ్మేళనముగా మారుటయేకదా.  నదీ జలములో  కలుషములతో బాటు ఖనిజములు కూడా ఉండును. వీటిని వదిలినచో అన్ని నదీజలములు ఒక్కటియే. అజ్ఞాన దోషములను సూచించు కలుషముల పరిమాణము ఎక్కువగా గంగాజలములోనే నున్నది. ప్రస్తుత గంగాజలము మీ అజ్ఞాన కలుషితమైన బుద్ధిని సూచించుచున్నది. అజ్ఞాన రహితులగు శ్రీసాయి భక్తులకు గంగాజలస్నాన నిషేధము యీ విధముగా సంమజసమేనేమో! ప్రస్తుత ప్రభుత్వము గంగాజల శుద్ధిని గురించి చేయుచున్న ప్రయత్నము, మీ బుద్ధిని శుద్ధిచేయుటకై చేయు ప్రయత్న రూపమైన యీ సందేశము వలెనున్నది. ఎన్నో నదులు గంగవలె హిమాలయములో ఉద్భవించి సాగరమును చేరుచున్నవి. మిగిలినట్టి ఆ నదులలో స్నాన నిషేధమును చేయక, కేవల గంగనే ఎట్లు నిషేధించగలరు? అన్ని స్తోత్రములలోను గొప్పది యగు మహిమ్న: స్తోత్రము (మహిమ్నోనాపరాస్తుతి:) లో- నదులన్నియు నేరుగా కానీ వక్రముగా కాని పయనించుచున్నను, ఒకే సముద్రమును చేరునట్లు, భిన్న మార్గ సంస్కృతులు కల మతము లన్నియు ఒకే భగవంతుని చేరుచున్నవి (పయసామర్ణవ ఇవ) అని చెప్పబడినది.
వేదమంత్రముల నుదహరించుట :
    వేదవచనములను ప్రమాణముగా తన ఉపదేశములలో చూపని శ్రీసాయి, దేవుడు కాడని శ్రీ సంపూర్ణానంద చేయు విమర్శ అనాలోచితము. వాల్మీకి రామాయణములో వాలి జాబాలి మొదలగు వారికి ఉపదేశములను చేయునపుడు కూడా శ్రీరాముడు ఎట్టి వేదవాక్యములను ఉదహరించలేదు. శ్రీరాముడు బోధించినవి వేదములో నున్నవే కాని, అవి శ్రీరాముని సొంత మాటలలో బోధించబడినవి. అట్లే శ్రీసాయి బోధలన్నియును, వేదములలో కనిపించునవే కాని, అవి శ్రీసాయి సొంత మాటలలో నున్నవి. వేదమనగా (విదుల్ - జ్ఞానే) జ్ఞానమని అర్థ్ధము. జ్ఞానము అనగా మాటలేవి యైనను వాటిచే చెప్పబడు భావమే ప్రధానము. అదే భావము చెప్పబడినప్పుడు, అవే మాటలు అక్కరలేదు. వేదము యొక్క భావము చెప్పబడగానే, వేదము చెప్పినట్లే. గీతను చెప్పినపుడు కృష్ణుడు కూడా వేదవాక్యముల నుదహరించలేదు. అయినా, వేదార్థ్ధసారమే గీత. అయితే, శంకరులు తన భాష్యములలో వేదవాక్యములను ప్రమాణముగా చూపినారు. పండితులతో వాదించు పరిస్థితులలో పండిత సంప్రదాయము ననుసరించి అట్లు ఉదహరించినారు. అట్లు ఉదహరించనిచో, పండితులు తృప్తినొందరు.   వేదవచనములను ఉదహరించుటయే దైవత్వమన్నచో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దైవము కారు. కేవలము శంకరులే దైవము అగుదురు. దైవము కాని పండితులు కూడా అట్లు వేదమును ఉదహరించగలరు. కావున వారు దైవమగుదురా? వేదముల నుదహరించని శ్రీసాయి - శ్రీరాములలో తేడాలేనందున, దైవము కాని శ్రీసాయిని పూజించు వారు, దైవమైన శ్రీరాముని పూజించరాదు అని ఎట్లు తేడాను ఇరువురిలో చూపగలరు?
    నిశితముగ చూచినచో, బ్రహ్మసూత్రములు (శాస్త్ర యోనిత్వాత్) భగవంతుడే వేదముల కర్తయని పలుకుచున్నవి. గీత కూడా ఇదే చెప్పుచున్నది (వేదాంతకృత్). భగవంతుడు నరావతారమును ధరించినపుడు తన మాటలను తానే చిలుకవలె బట్టీ పట్టిన రీతిగా పలుక నవసరములేదు. తన మాటల భావమునే తాను వేరు మాటలతో వేరు సమయమున చెప్పవచ్చును. శంకరులు కూడా, వేదార్థమునే తన మాటలలో శ్లోకరూపమున స్తోత్రములుగా చెప్పినారు కదా. వాటికి ప్రామాణ్యము లేదా? వేదవాక్యములలోనే ఉదహరించి, వాటి అర్థమును వక్రీకరించినపుడు వేదమును  ఉదహరించనట్లే అగును. వేదవాక్యములను ఉదహరించకపోయిననూ, వాటి యొక్క సత్యార్థమును వేరు మాటలలో వ్యక్తపరచిననూ, వేదమును ఉదహరించినట్లే. భగవదవతార పురుషడు మాట్లాడినపుడు, ఆయన మాటలన్నియు వేదమే. పండితులు భాషించినపుడు, వారి భావములు వేదసమ్మతములని తెలుపుటకు, వేదవాక్యముల నుదహరింతురు. నరరూపములో పలుకుచున్న భగవంతుని వాక్యములు లోపలనున్న భగవంతునివే, కాని, బాహ్య నరరూపమునకు సంబంధించినవి కావు. భగవంతుడు వేరు భాషలో చెప్పుభావములను సమర్థించు కొనుటకు వేరొక భాషలో చెప్పిన మాటలను (వేదమును) ఉదహరించ నవసరము లేదు. తన మాటలకు తన మాటలనే ఎట్లు ప్రమాణముగా చూపుకొనును? భగవంతుడు చెప్పిన భావములను వేదములో అన్వేషించవచ్చునే కాని, ఆ భావమును వ్యక్తపరచు మాటలు యథాతథముగా, వేదములో ఉన్నవా? లేవా? అని వెతు పనిలేదు. భావమే జ్ఞానము. జ్ఞానమే వేదము.
విగ్రహారాధనము :
    శ్రీసాయి విగ్రహముల నారాధించు వారు అపమార్గములో నున్నారని శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట పిచ్చితనము. ఆరాధన లక్ష్యము సత్యమై, చేతనమై, యోగ్యమై ఉండవలెనని వారు చెప్పుచున్నారు. శ్రీసాయి విగ్రహములకు ఈ మూడింటిలో ఏ లక్షణము లేదని వారు చెప్పుచున్నారు. మిగతా దేవాలయ విగ్రహములకు ఈ మూడు ఉన్నవి కావున పూజ్యములని వారి భావన. ఈ మూడు, ప్రాణప్రతిష్ఠ ద్వారా సిద్ధించుచున్నవని వారి మతము. ఈ విధిలో ఆయా విగ్రహములలోకి ఆయా దేవతలను ప్రవేశింప చేయుటకు ఆయా వేదమంత్రములను పఠించుచున్నారు. కాని శ్రీ సాయికి సంబంధించిన వేదమంత్రమేమీ లేకపోవుటచేత ప్రాణప్రతిష్ఠ వ్యర్థమగును. కావున శ్రీసాయి విగ్రహములు పూజాయోగ్యములు కావని వారి మొండిమతము, మూడు కారణముల వలన అంగీకారము కాదు.
    1) మీరు చెప్పిన ఈ మూడు లక్షణములు ఈ తంతువులలో కావలయునని వేదము ఎచ్చట చెప్పినదో మీరు చెప్పలేదు. వేదములలో ఇవి ఎచ్చటను కానరాకుండుట చేత, వేదమునుదహరించనిచో ప్రామాణ్యతలేదని మీరు చెప్పినందున, వీటికి    ప్రామాణ్యత లేదు.
    2) ప్రాణప్రతిష్ఠలో మంత్రములో ఎచ్చటనూ దేవతా నామములేదు. అవి కేవలము జడవిగ్రహములో ప్రాణమును తెచ్చుటకు వినియోగింపబడుచున్నవి. కావున, శ్రీసాయికి సంబంధించిన వేదమంత్రములు లేవని మీరు చెప్పుట హాస్యాస్పదము.
    3) జడ విగ్రహములలో చైతన్యమున్నట్లు భావించి సేవించవలయునను తాత్పర్యమును గ్రహించక, ఈ విధి ద్వారా నిజముగా ప్రాణప్రవేశము జరుగునట్లు తలచుట మూర్ఖత్వము. అట్టి తాత్పర్యమును శ్రీసాయి విగ్రహములలో కూడా నుంచి సేవించవచ్చును కదా. జడ విగ్రహములో యీ తంతువు ద్వారా నిజముగా ప్రాణము వచ్చుట లేదు. ఈ తంతువు తరువాత చలనము, చూపు, వినుట, భాషించుట మొదలగు ప్రాణ లక్షణములు విగ్రహములో నిజముగా వచ్చుటలేదు. కనీసం ఒక ఫ్యానులో జడశక్తియగు విద్యుత్తు ప్రవేశించగనే చలనము కనపడుచున్నది. విగ్రహములో కనీసం చలనలేశమైనను లేదు. ప్రాణప్రవేశము అనుభవవిరుద్ధము కావున ప్రామాణికము కాదు. ప్రమాణములలో శ్రుతి, స్మృతి, యుక్తి మరియు అనుభవము శాస్త్రసమ్మతములు. చివరిదగు అనుభవము వ్యతిరేకించుచున్నది కావున ఇది ఏ విధముగాను ప్రామాణికము కాదు.
    ప్రాణప్రతిష్ఠ జరిగినా, జరుగకపోయినా, తేడాలేదు. విగ్రహములు ప్రతీకోపాసన కిందికి వచ్చును. అవి భగవంతుని ప్రతీకలే కాని, వాటిలో భగవంతుడులేడు (నతస్యప్రతిమా..., ప్రతిమాహ్యల్పబుద్ధీనాం...). ప్రాణప్రతిష్ఠ జరిగిననూ అవి సాక్షాదుపాసన కిందికిరావు. కేవలము నరావతారములే సాక్షాదుపాసన కిందికివచ్చును (మానుషీం తనుమాశ్రితమ్... గీత). కావున, శ్రీసంపూర్ణానంద పట్టుదల వ్యర్థము. ఈ విధిలో ఏమియు లేకున్నను, ఇది ఒక సత్యమును సూచించుచున్నది. అది ఏమనగా - జడవిగ్రహమైన జడశరీరము, ప్రాణ ప్రవేశము వలన చేతనమైన మానవుని సూచించుచున్నది. అది సూచించు తాత్పర్యమును గ్రహించవలయును కానీ, దానితో నిజముగా అది జరుగుచున్నది అని భావించరాదు. మానవుని లోనికి మాత్రమె తాను ప్రవేశింతునని తాత్పర్యము. జడము లోనికి ప్రవేశించననియే సారాంశము. జ్ఞానబోధ చేయుటకు చేతనమైన నరరూపము కావలయునన్నదే విషయము. అట్టి నరావతారమునే పూజించి సేవించమన్నదే పరమార్థము. జడస్తంభములోని చైతన్యరూపుడైన పరమాత్మ నరసింహావతారములో ప్రవేశించినాడుగదా అన్న మీ వాదము వివేక విచార రాహిత్యమును సూచించుచున్నది. జడస్తంభమును పగులగొట్టగా చైతన్యరూపమైన నరసింహ రూపము ద్వారా పరమాత్మ వ్యక్తమైనాడే తప్ప, చైతన్య ప్రవేశము ద్వారా జడస్తంభము కదిలి గర్జించి అసురసంహారము స్వయముగా చేయలేదు. ఇచట   ప్రాణప్రతిష్ఠా విధి యేమియును జరుగలేదు. కావున, పూర్తిగా ఇది అప్రస్తుతము. భక్తాగ్రేసర రక్షణార్థమై జరిగిన ప్రకృత్యతీత మహిమ ఇది. ప్రాణప్రతిష్ఠ కర్మచేత    సిద్ధమైనది కాదు. ఇది విగ్రహారాధన విషయమునకు చాలా దూరముననున్నది. సింహముఖ నరరూపము ప్రాణి రూపమైనది కావున ప్రాణియందే భóగవదావేశము జరుగునని ముఖ్యార్థము. ఇచ్చట నరసింహ శరీరము,  కాలవ్యవధి లేనందున, భగవంతుని చేత సృష్టింపబడినది. అట్టి  విలక్షణప్రాణి-ఉపాధి, ప్రకృతి సిద్ధము కూడా కాదు. ప్రాణి శరీరమునే భగవంతుడావేశించునన్న నియమము ఇచ్చట కూడా యథాతథముగ పాటించబడినది.
    జడవిగ్రహము, ప్రాణరహితమైన జడశరీరమును సూచించుచున్నది. అట్టి జడవిగ్రహము లోనికి ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగ ప్రాణప్రవేశము జరిగినచో, ఆ విగ్రహమే చేతన నరశరీరముగ మారును అన్న విషయమే ఇచట సూచితము. ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగ విగ్రహములోనికి ప్రాణప్రవేశము జరుగలేదు, నిజముగా, విగ్రహము నరశరీరముగ మారనూలేదు. దీనిచే గ్రహించవలసినది ఏమనగా - చేతనమైన నరశరీరము = జడ విగ్రహము + ప్రాణము అనియే. ప్రాణములేని నరశరీరము సాక్షాత్తు జడవిగ్రహమే. కేవల జడవిగ్రహ పూజ కన్ననూ, చేతనమైన, నరశరీరమును ప్రవేశించిన భగవంతుడగు అవతారపురుషుని పూజయే చేయవలయునన్న సందేశమే జడవిగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయుట. సూచించిన అర్థమును గ్రహించక, సూచించు జడ విగ్రహములోనికే ప్రాణము ప్రవేశించినదన్న భ్రమతో, దానినే పూజించుట అవివేకము. అయితే, ప్రారంభదశలో నున్న వారు దానిని దైవ ప్రతీకగా భావించి పూజించుట తప్పదు. ప్రారంభదశలో దోషములు తప్పనిసరి (సర్వారంభాహి... గీత). కావున ప్రాణప్రతిష్ఠ తరువాత కూడా జడవిగ్రహము, జడవిగ్రహమే. గీతాచార్యుడు, అవతారపురుషుడగు కృష్ణుడు, తాను సచేతనమైన నరశరీరమును ఆశ్రయించి అవతరించెదనని గీతలో చెప్పినాడు (మానుషీం తనుమాశ్రితమ్...).
    శ్రీ సంపూర్ణానంద చెప్పిన మూడు శబ్దములకు అర్థము నిట్లు ప్రతిపాదింపవచ్చును. దైవానుగ్రహము వలన, నీవు చేయు ప్రాణప్రతిష్ఠ ద్వారా,  నిజముగా (సత్య) జడవిగ్రహములోనికి ప్రాణ ప్రవేశము జరిగి, అది సచేతనమైనచో (చేతన), అట్టి మానవ శరీరము భగవత్ప్రవేశమునకు యోగ్యము (యోగ్యత) అగును అనియే. దీని అర్థము అద్వైతులు భ్రమపడినట్లు, ప్రతి సచేతన శరీరములోనికి భగవత్ప్రవేశము జరిగినట్లు కాదు. కొందరు విశిష్ట భక్త సేవకులగు వారి యందు దైవమావేశింప, శ్రీసాయి, శంకర, రామ, కృష్ణ మొదలగు అవతారములు, ఆయా ప్రత్యేక కార్యక్రమముల కొరకు దైవసంకల్పముననుసరించి ప్రకటితమగును.  జడములోనికి ప్రాణప్రవేశము, ప్రాణిలోనికి దైవప్రవేశము - ఈ రెండును భగవత్సంకల్పముచే జరుగును తప్ప ఏ జీవునికి శక్యముకావు. జడము + ప్రాణము = చేతన శరీరము అను సమీకరణములో ఎడమ భాగమే కుడిభాగము కాదు. ఎడమ భాగము కుడి భాగముగా మారవలెను. ఈ మార్పు దైవవశములో నున్నది కాని, ప్రాణప్రతిష్ఠ చేయు పురోహితుడగు ఏ జీవునివశములోను లేదు. ఎంత గొప్ప విజ్ఞానవేత్తయైనను ఈ మార్పును చేయజాలడు. ఈ మార్పు నిజముగా జరుగనపుడు సమీకరణములోని కుడిభాగము సున్నా అగును. అప్పుడు ఏమి మిగిలినవి? - జడవిగ్రహము మరియు ప్రాణప్రతిష్ఠతంతువు మాత్రమే. అప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహము, ప్రాణప్రతిష్ఠ జరగని విగ్రహము, ఈ రెండు విగ్రహములు సమానమైనపుడు, ప్రాణప్రతిష్ఠ జరగని శ్రీసాయి విగ్రహముల కన్ననూ ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయ విగ్రహములు ఎట్లు విశిష్టము లగును?
జీవోద్ధరణము కొరకు దైవము సృష్టిలోనికి ప్రవేశించును :
    'అత్రిముని అనసూయలకు ముగ్గురు పుత్రులు పుట్టిరి. మొదటివాడు    చంద్రుడు. మూడవవాడు దుర్వాసముని. మధ్యవాడు దత్తాత్రేయముని. శ్రీసాయి దత్తావతారమన్ననూ, దైవత్వము ఎచ్చటనూలేదు' అని శ్రీ సంపూర్ణానంద  పలుకుట, వారు  ఇంకను బాల్యావస్థలోనే ఉన్నారని నిరూపించుచున్నది. భాగవతకథాను    సారముగా - అత్రిముని ఏకైక పరమాత్మ  అగు పరబ్రహ్మ దర్శనము కోరి, ఋక్ష పర్వతమున, అనసూయతో కలిసి తపమును చేసెను. సృష్టి స్థితి లయములు ఒకే ఒక పరమాత్మ చేయుచున్నాడని వేదము పలుకుచుండ, సృష్టికర్తయగు బ్రహ్మ, స్థితి కర్తయగు విష్ణువు, లయకర్తయగు శివుడు, వేరువేరుగా వేరువేరు లోకములందుండుట స్పష్టముగాకనిపించుట ఎట్లు కుదురును? ఇదియే అత్రి సందేహము. త్రిమూర్తులు ముగ్గురును సాక్షాత్కరించి 'మేము ముగ్గురు ఒక్కటే. సృష్టి స్థితి లయములను చేయుచున్నాము' అనిరి. అత్రి దీనికి అంగీకరించలేదు. 'త్రిమూర్తులు వేరువేరుగా కనిపించుచుండగా, ఒకే స్వరూపము ఎట్లు అగుదురు?' అని ప్రశ్నించెను. అత్రి శబ్దమునకు అర్థము కూడా 'ముగ్గురు కాదు' అనియే. కావున అత్రి సార్థకనాముడయ్యెను. అప్పుడు త్రిమూర్తులు కలిసి ఏక స్వరూపములో దర్శనమిచ్చిరి. ఆ ఏక స్వరూపములో బ్రహ్మ - విష్ణు - శివ ముఖములున్నవి. అయినను, వ్యక్తి ఒక్కరే. ఈ స్వరూపము, వేదము బ్రహ్మమును గురించి యిచ్చిన నిర్వచనమునకు సరిగా సరిపోయెను (యతోవాఇమాని..., ఏకమేవాద్వితీయం...). ఇదియే త్రిమూర్తులకు మూలమైన ఏక పరబ్రహ్మ స్వరూపము. అనూహ్యమైన పరబ్రహ్మము ఈ ఏకస్వరూపములో నున్నది, విడివిడిగా త్రిమూర్తుల స్వరూపములలోను ఉన్నది (అవిభక్తం విభక్తేషు...గీత). అనూహ్య పరబ్రహ్మమునకున్న అనూహ్య శక్తి మహిమ ద్వారా ఇది సాధ్యము. లౌకికసృష్టికి అతీతమైన పరబ్రహ్మశక్తియందు, లౌకికసృష్టి భాగము లందే ప్రవర్తించు తర్కము పనిచేయదు.
    ఈ ఏకైక పరమాత్మ స్వరూపము, అనసూయ గర్భమున త్రిమూర్తులుగా మారి, చంద్ర - దత్త - దుర్వాసుల రూపములలో ముగ్గురు పుత్రులుగా గోచరించినది. బ్రహ్మాంశ - విష్ణు అంశ - శివాంశలు ముగ్గురి యందు వేరువేరుగా నుండుటచే ఒకటియే మూడగుట ఇది. ప్రథముడు, తృతీయుడు, తమ బ్రహ్మ - శివ అంశలను దత్తునకు యిచ్చి వెడలిపోయిరి. అనగా త్రిమూర్తుల ఏకస్వరూపమై దత్తాత్రేయరూపము ఏకముఖముతో నిలచినది. ఏకముఖమైనను, మిగిలిన రెండు ముఖముల శక్తులును అందే ఇమిడియున్నవి. దీనిని స్పష్టపరచుటకు, ఏకస్వరూపము త్రిముఖములతో గోచరించినది. వేదపండితుడగు అత్రి సంశయము దీనితో పటాపంచలైనది. ఇంత మహత్తర అంతరార్థ్ధము కల ఈ కథను కేవలము ఒక ముని వంశచరిత్రగా మీరు చూచుట, మీ కన్నులకే కాక, మీ బుద్ధికిని పట్టిన చత్వార దోషమును స్పష్టము చేయుచున్నది. ఇట్టి మీరు ఆదిశంకరులను గురించి కూడా 'అతడొక కేరళదేశీయుడైన నంబూద్రి బ్రాహ్మణయువకుడు. వేదశాస్త్రములను బాగుగ అధ్యయనము చేసిన పండితుడు, సంపూర్ణ జీవితానుభవజ్ఞానము లేనివాడు' అనియు చెప్పగల మహానుభావులు! ఆయన యొక్క భాష్యములను, ఆయన యొక్క జీవిత పరమార్థమును అంతరదృష్టితో నిశితముగా పరిశీలించిన కాని, ఆయన సాక్షాత్తు శంకరుల అవతారమని అర్థము     చేసుకొనలేరు.
ఉపసంహారము
    ఊహలకు సైతము అందని (నైషాతర్కేణ..., మాంతువేదన...) పరబ్రహ్మము, నర శరీరియగు ఒకానొక భక్తజీవుని ఆవేశించి, నరావతారముగ యీ లోకమున ప్రకటిత మగుచుండును. ధర్మమునకు సంభవించిన క్షోభను నివారించి శాంతిస్థాపనము చేయుటకును, మోక్షా సక్తులకు ముక్తి మార్గమునుపదేశించుటకును, భక్తులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను చతుర్విధములగు అనుగ్రహములను ప్రసాదించుటకును, ధర్మమోక్షములందు జీవులను నడిపించుటకు కావలసిన జ్ఞానమును ప్రచారము చేయుటకును, నరావతార ప్రయోజనములుండును. ఇస్లాం-హిందూ మతముల విరోధము యొక్క కాలక్రమ ఫలితములే యీనాటి మారణకాండలు. ఈ విరోధమును పరిహరించి ఆనాడే ముందుగా, మతసమైక్యతను సమగ్రముగా స్థాపించుటయే దీనికి శాశ్వత పరిష్కారము. దీనికొరకే శ్రీ షిరడీసాయి, శ్రీ సత్యసాయి అవతారములు ప్రకటితమైనవి. దీనిని అనుసరించియే కార్యక్రమము యొక్క స్వరూపము సంధానమగును. మతధర్మముల విరోధము లోకక్షోభకు దారితీయగా, మోక్షమార్గసాధన సైతము అల్లకల్లోలమగును. అట్టి ప్రత్యేక కార్యక్రమము యొక్క ప్రత్యేకమైన విధానము నర్థము చేసుకొనలేక, అవతారపురుషుని కీర్తిని సహించలేక, సాటి నరరూపముననున్న నరావతరాము పైనున్న అసూయతో, స్వార్థపూరితమైన దురహంకారముతో, అవతార పురుషులను ఆక్షేపించుట (అవజానంతిమాం...) కృష్ణావతారము నుండియే గోచరించుచున్నది. నరావతారముగా నరులకు దత్తమైన ప్రతి అవతార పురుషుడును దత్తుడే. ఊహాతీతమైన పరమాత్మ, నరులకు నరరూపమున, చక్షువులకే గోచరించుట దత్తతత్త్వము, బుద్ధితర్కములకును అందని దైవమ, కన్నులకే అందుట, దత్త శబ్ద సారాంశము.

    ప్రతి మానవ జీవునకును, తోటిమానవునిపై అసూయ కలుగుటకు కారణము- ఇరువురికిని ఒకే పార్థ్ధివమైన శరీర ముండుటయే. ఇదే మానవుడు, తేజోరూప శరీరధారులగు దేవతలపై శ్రద్ధను చూపును. సాటి మానవశరీరమున నున్న భగవంతుని సైతము తిరస్కరించి, తేజోరూపులగు దైవసేవకులగు ఇంద్రాది దేవతల నారాధించును. యాదవులు మానవ శరీరమున నున్న పరమాత్మయగు కృష్ణుని గుర్తించలేక, దైవసేవకుడైన తేజోరూపియగు ఇంద్రుని ఆరాధించుట ఇదే. కాటన్ చొక్కావాడు, సిల్కు చొక్కావాడగు ప్యూన్ను అయినా గౌరవించునుకాని, కాటన్ చొక్కాలో నున్న కలెక్టరును సైతము గౌరవించడు. ఇదే మానవులు మానవ శరీరములను త్యజించి, మరణానంతరము తేజోరూపములను ధరించిననూ శివాది తేజోరూపములందున్న భగవంతునిపై నిర్లక్ష్యము చూపుదురు. ఇట్లు మానవుడు, ఇచ్చటను, అచ్చటను దైవమును గ్రహించక ఉభయ భ్రష్టులగుచున్నారు (మహతీవినష్టిః). దీనికి కారణము, తమ శరీరము వంటి శరీరము పరమాత్మకున్నప్పుడు నిర్లక్ష్యము వలన కలుగు ద్వేషమే (ప్రత్యక్షద్విషః). ఇట్టి అసూయ- అహంకారులగు మానవులు, నరరూపమున సాక్షాత్తుగ లభించిన దైవమును సేవించక, దైవమునకు ప్రతీకలగు విగ్రహములనే సేవింతురు. ఇట్టి సామాన్య మానవుని స్థితియే శ్రీ సంపూర్ణానంద స్వామీజీకిని ఉండుటయే, యీ విమర్శకు కారణము. ఇట్టి అయోగ్యులగు మానవులు దరిచేరకుండా చేయుటకే, రజస్సు-తమస్సు గుణములను ప్రకటించి, దైవము తన కార్యమును చేసుకొనును. కృష్ణుని జారచోరత్వము, సాయి ధూమపానము, యీ కోవకు చెందినవే. గుర్తించు సాధకులకు సైతము ఇవి వారి విశ్వాస బలపరీక్షలగును. ఈ రజస్సు-తమస్సు గుణములు, ఆ గుణములు కల మానవులతో కలిసిపోవుటకును ఉపకరించును. కొంతకాలము కలిసిపోయి, వారిని క్రమముగా దైవము బోధలతో ఉద్ధరించును. అన్ని కోణములలో అవతారతత్త్వమును అర్థ్ధము చేసుకొనలేని మూఢులు, ప్రత్యక్షమైన దైవమును త్రోసిపుచ్చి, శాశ్వతముగ నష్టపోవుచున్నారు.
    ''భల్లూకపట్టు'' అను సామెత ప్రకారం-రామభక్తుడైన జాంబవంతుడను భల్లూకము, ఒకే విష్ణువు యొక్క అవతారములగు రామ- కృష్ణుల యొక్క బాహ్య భేదమును తెలుసుకొనలేక, కృష్ణునితో మొండిగా ఎన్నో దినములు యుద్ధము చేసెను. అట్లే శ్రీ సంపూర్ణానంద, ఒకే శివుని అవతారములగు షిరిడీసాయి (షిరిడీసాయి- శివ, సత్యసాయి - శివ శక్తి, ప్రేమసాయి - శక్తి అవతారములు) మరియు శంరుల బాహ్యభేదము వలన భ్రమతో, షిరిడీసాయిని విమర్శించుచున్నారు. శైవ వైష్ణవ మత సమన్వయకర్త శంకరులు, హిందూ- ఇస్లాం మత సమన్వయకర్త షిరిడీ సాయి, ఆయాకాలానుగుణముగ వేషభాషలలో భేదము కలిగి ఉండవచ్చును. విష్ణు-శివ - అల్లాలతో ఒకే ఊహాతీత పరబ్రహ్మము ఉన్నందున,లోనున్న తత్త్వమొకటేయని గుర్తించవలెను.
    దైవము ఊహాతీతమని మూడు ప్రమాణ గ్రంథములు (ప్రస్థానత్రయము) నిర్ణయించినవి. వేదము (యతోవాచో, నమేధయా...), గీత (మాంతువేదన...) మరియు బ్రహ్మసూత్రములు (జన్మాద్యస్య...) పరమాత్మ యొక్క స్వరూపమునకు చెప్పలేమని చెప్పినవి. దీనికి కారణమేమనగా - ఖాళీస్థలమైన ఆకాశమును సృష్టించిన పరమాత్మలో ఆకాశము ఉండుటకు వీలులేదు. ఎందుకనగా సృష్టించబడిన ఆకాశము, తన సృష్టికి ముందే, తనకు కారణమైన దైవములో ఉండజాలదు. ఆకాశము తనలో లేనందున, దైవమునకు, ఆకాశ లక్షణమైన పరిమాణములేదు. కావున పరిమాణములేని ఏ వస్తువైనా ఊహించుటకు వీలుకానిదే. ఇట్టి ఊహాతీతమైన పరమాత్మ, ఊహలకును, కన్నులకు సైతము కనపడు నరరూపమును ఆవేశించి, దానితో తాదాత్మ్యమును పొంది, జ్ఞానప్రచారము చేయుటకు, అవతార పురుషునిగా వచ్చుచున్నాడు. పండితులకు శంకర రూపంతో, పామరులకు సాయిరూపంతో అవతరించినాడు. శివుడు జ్ఞానప్రదాత (జ్ఞానం మహేశ్వరాత్....). శివుడు తేజోరూపము, సాయి శంకరులు మానవరూపములు. శివ, విష్ణు, బ్రహ్మాది రూపములు తేజో రూపములు. ఈ తేజో మానవ రూపములన్నింటిలోను ఉన్నది ఒకేఒక ఊహాతీత పరమాత్మయని తెలుసుకొన్నచో, మతముల మధ్య పరస్పర విరోధము అంతరించును. అప్పుడే విశ్వశాంతి ప్రతిష్ఠించబడును. ఈ బ్రహ్మజ్ఞానము లేకపోవుటచేత, అవతార ఉపాధి రూపములనే పరమాత్మయని భ్రమించి, అన్ని అవతార ఉపాధులలోనున్న ఊహాతీత పరబ్రహ్మమును గుర్తించక, ఊహలందు ఉపాధిరూపముల బేధమును అధిగమించలేక మత కలహములతో అశాంతిని నెలకొల్పుచున్నారు. ఊహలకందు వస్తువులెన్నియైన విడివిడిగా ఉండవచ్చును కాని, ఊహాతీతములగు ఎన్ని వస్తువులైనను ఒకటే కావలయును. దైవము ఊహాతీతము కావుననే ఒకే దైవముగా ఏకత్వము సిద్ధించినది.

At the lotus feet of Shri Datta Swami
-Prasad

2 comments:

  1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete
  2. Dear Sir,

    Myself Durgaprasad, admin for this Dattavedam blog. I'm a follower of my Guru Shri Datta Swami.

    I sincerely thank you very for the information you have provided and you are doing a nice job in the service of Lord.

    I would like to inform you, we are no more using this blog and all the discourses mainly in English, Sanskrit and Telugu are now being published through the website given below:

    https://www.universal-spirituality.org

    You may please visit the site and check various discourses that are being delivered by Shri Datta Swami.

    In this regard, I request you to add the following two links in your page at https://telugubhakthisamacharam.blogspot.com/

    1) https://www.universal-spirituality.org
    2) https://www.youtube.com/channel/UCdh14uyTgPi4JUAEK3uIrUA

    The second link provides podcasts of discourses and bhajans etc., f

    Once again, thanking you,
    Best regards,

    At the lotus feet of Shri Datta Swami
    -Durgaprasad

    ReplyDelete