Friday, January 2, 2009

ప్రకృతిం స్వాం అధిష్టాయ

బృహదారన్య ఉపనిషత్తు మరణం గురించి చెప్పుచున్నది. పరమాత్మ అవతరించినపుడు తనకు అతి సన్నిహితమైన ఆత్మీయమైన ప్రకృతిని ఆశ్రయించును. “ప్రకృతిం స్వాం అధిష్టాయ” అన్న గీతార్ధమిదే. ఆత్మీయమైన ప్రకృతి సత్వగుణ స్వరూపము. అనగా ఈ ప్రకృతి పంచభూతమయమైన శరీరముతో పాటు శుద్ధ చైతన్యమును (చేతన) కూడా కలిగి యుండును. ఈ శుద్ధ చైతన్యము తాను జీవించుచు శరీరమును జీవింప చేయునది కావున జీవుడు అని పిలవబడుచున్నను ఇతర మానవులయందున్న జీవ స్వరూపములకు భిన్నముగా యుండును. “జీవతి, జీవయతి ఇతి జీవః” అని జీవ శబ్దమునకు అర్ధము. అనగా శుద్ధ చైతన్యము. ఇతర మానవులలో ఈ శుద్ధ చైతన్యము పుణ్యపాప కర్మల సంస్కారములతో కలుషితమై పంచదార మరియు మురికి కరిగిన శుద్ధ జలము వలెయుండును. అవతార పురుషుని శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము ఎట్టి కర్మల సంస్కారము లేక శుద్ధ జలము వలెయుండును. ఇట్టి శుద్ధ చైతన్యము ఎట్టి ప్రత్యేకతయు లేక శరీరములో ఒక భాగముగానే యున్నది. కావున ఇచ్చట ఈ శుద్ధ చైతన్యము శరీరము కన్న భిన్నమైన జీవునిగా వ్యవహరింపబడుటలేదు. ఇతర ప్రాణులలో ఈ శుద్ధ చైతన్యము సంస్కారములతో కలుషితమై శరీరము కన్న భిన్నముగా ఒక ప్రత్యేకత కలిగి జీవుడుని పిలువబడుచున్నది.

అవతార పురుషుని శరీరము కార్యము ముగిసిన తర్వాత ఇచ్చట త్యజింపబడినపుడు పరమాత్మను వదలి పంచభూతములలో కలియుచున్నది. ఈ శుద్ధ చైతన్యము మనోమయమై తేజస్సు యొక్క రూపము కావున అగ్ని అను భూతమునందు ఇచ్చటనే కలియుచున్నది. “మనోమయ”, మరియు “తేజఃసతి” అను శ్రుతులు దీనికి ప్రమాణములు. ఇతర ప్రాణులు మరణము నందు ఈ శుద్ధ చైతన్యము సంస్కారములచే కలుషితమై నందున జీవుడు అనబడుచు “జాయస్వ”, “మ్రియస్వ”అను శ్రుతి ప్రకారముగా ఆయా కర్మ ఫలములను పొందుచు పుట్టుచు, గిట్టుచు ఉన్నాడు. ఇక పరమాత్మ అవతరించినప్పుడు ఆయన వెంట వచ్చిన భక్తులగు సేవకుల గతి ఏమి? వీరు మరణానంతరము పరమాత్మను పొంది “పురుషాయణాః పురుషం ప్రాప్యా” అను శ్రుతి ప్రకారముగా పరమాత్మలో అవ్యక్తస్ధితిలో ఉండి “న విదుః సతి” అను శ్రుతి ప్రకారముగా నిద్ర, విశ్రాంతినికొని మరల పరమాత్మతో పాటు అవతరించుచున్నారు. ఇట్టి వీరి యొక్క జీవశరీరము ఎట్లుండుననగా జ్ఞానము, విశ్వాసము, భక్తి మెదలగు పుణ్య సంస్కారములతో కూడిన శుద్ధ చైతన్యముగా కేవలం పంచదార కలసిన శుద్ధ జలము వలెయుండును. వీరికి పరమాత్మకు వలె జన్మించునపుడు బద్ధ నరక దుఃఖము కాని, మరణించునపుడు మరణ వేదన కాని యుండదు. ఇట్టి జనన మరణ దుఃఖము నుండియే మోక్షము. అంతే తప్ప జనన మరణములు లేవని కాదు. పరమాత్మయే అవతారముల ద్వారా జనన మరణములను గ్రహించుచున్నాడు. ఇట్టి జనన మరణములు పరమాత్మకు కాని, ఆయన సేవకులకు గాని కేవలము కట్టిన వస్త్రమును వదలి శుద్ధ వస్త్రమును గ్రహించిన రీతిగా ఉండును. “వాసాంసి జీర్ణాని” అను గీతార్ధముఇదే. “నివసిష్యసి మయ్యెవ" మరియు "ప్రవేష్ఠుంచ పరంతప” అను గీతలు స్వామి ఆత్మీయులైన భక్తులు మరణానంతరము స్వామిలోనికి ప్రవేసించి అణు ప్రమాణ జీవరూపులుగా నివసించెదరని చెప్పుచున్నది.

No comments:

Post a Comment