Friday, January 2, 2009

కార్తీక శుద్ధ దశమినాటి దివ్యవాణి

[14.11.2002 గురువారము మధ్యాహ్నము 2.30 చిత్రభాను నామ సంవ్సరము కార్తీక శుద్ధ దశమి] ఎంతో జ్ఞానము కలిగిన పండితులకును భక్తి వచ్చుటలేదు. జ్ఞానము వలన భక్తి వచ్చును అన్నాము కదా! మరి వీరిలో జ్ఞానము భక్తిని ఏల పుట్టించుట లేదు. దీనికి కారణము వీరిలో బ్రహ్మజ్ఞానము వంటపట్టుట లేకపోవుటయే. ఎన్ని శాస్త్రములు చదివినను, ఎన్ని సత్సంగములు చేసినను బ్రహ్మజ్ఞానము వీరిలోనికి ఎక్కలేదు. తడుసిన కట్టెకు ఎన్నిసార్లు అగ్గిపుల్ల గీసి అంటించిననూ దానిలోనికి అగ్ని ప్రవేశించదు. కావుననే జ్ఞానయోగమునకు చిత్తశుద్ధి అవసరమని శంకరులు అన్నారు. చిత్తశుద్ధి అనగా ఎండిన కట్టె. కట్టె అనగా మనస్సు. ఈ లౌకిక జ్ఞానమే నీరు. మానవుని మనస్సు అను కట్టె లౌకిక జ్ఞానము అను నీరుతో చేరనపుడు ఎన్ని గ్రంధములు చదివినను, ఎన్ని సత్సంగములు చేసినను వ్యర్ధమే. లౌకిక జ్ఞానమును ఈ నీరు ఎన్నో విధములుగా మనస్సు అను కట్టెలోనికి ప్రవేశించుచున్నది. ఆ విధములను విచారించి వాటిని నిరోధించిన గాని ఈ కట్టె ఎండు కట్టె కాదు. ఈ విధములు ఏవి?

అనగా లౌకికులగు మానవులతో సంగము పెట్టుకొనుటయే. భార్య, భర్త, సంతానము, బంధువులు, మిత్రులు వీరందరును లౌకికులే. వీరితో కల బంధములన్నియు లౌకక బంధములే. అనగా సినిమా షూటింగులోని పాత్రల మధ్య బంధములే. ఈ బంధములు అసత్యములు కావున అశాశ్వతములు. చివరకు నటుడు వేసుకన్న వేషముతోటి బంధము కూడా అసత్యము అశాశ్వతము. నాటకము తర్వాత ఆ వేషమును తీసి విడిగా పెట్టినప్పుడు ఆ వేషము మరియొక నటుడు ధరించుచున్నాడు. ఈ శరీరమే ఆ వేషము. మరణానంతరము ఈ శరీరము పంచభూతములలో కలసి ఆ పంచభూతములు మరియొక జీవునకు శరీరముగా ఏర్పడుచున్నవి. కావున ఈ శరీరము మరియు సర్వ లౌకిక బంధములను అసత్యములై అశాశ్వతములై మరణానంతరము జీవునకు ఎట్టి శ్రేయస్సునూ కలుగ చేయజాలవు. ఈ లౌకిక బంధములు గల వ్యక్తులు ఎల్లప్పుడును బ్రహ్మజ్ఞానమునకు సంబంధించని లౌకిక విషయములనే మాటలాడుచు ఇంజక్షనుల ద్వారా లౌకిక జ్ఞానమను విషమును ఎక్కించుచున్నారు. ఈ విషములు చాలక పెండిడ్లు, పేరంటములు, మీటింగిలకు పోయి ఇంకను విషము నెక్కించుకొనుచున్నారు. అంతటితో ఆగక, ఇదియును చాలక టి. విలు, సినిమాలు, నవలలు చదువుట, వార్తాపత్రికలు వీక్లీలు చదువుట, పని కల్పించుకుని ఇతరుల గృహములకు వెళ్ళి ముచ్చట్లు చెప్పుకొనుచూ పూర్తిగా తడిసిన కట్టెలగుచున్నారు. వీరు సత్సంగమునకు వచ్చికూడా లౌకిక విషయములనే మాట్లాడు కొనుచున్నారు. చివరకు సత్సంగ ఫలము కూడ లౌకిక లాభములకే భావించుచున్నారు. ఇట్లు ఈ సంసార సాగరమున నిత్యము మునిగియుండు ఈ కట్టెలకు ఎన్ని బోధలను అగ్గిపుల్లలను గీచినను ప్రయోజనము లేదు. కాలభైరవుని శాసనము ననుసరించి వీరికి వచ్చు అనగా రాబోవు జన్మలన్నియు పశు, పక్షి, మృగ, కీటకాది జన్మలే అయియున్నవి. ఇది శ్రీ దత్తుని హృదయమునకు ఎంతో విచారము కల్గించుచున్నది. కావున లౌకికుల మాటలను వినుటయను శ్రవణమును వెంటనే ఆపివేయవలెను. శ్రవణము ద్వారా లౌకిక జ్ఞానము మనస్సునకు ఎక్కుచూ మననములు అను చింతలకు దారితీయుచున్నది. మననము పెరిగిన వాడు భాషణము చేయును. ఆ భాషణము వలన మరియొకని మనస్సునకు లౌకిక విషము ఎక్కుచున్నది. కావున దీని అంతటికిని మందు ఒక్కటే. లౌకికుల సంగమును పరిహరించుము. తప్పనిసరి అయినచో కుశల ప్రశ్నలు అడిగి తప్పుకొనుము. లౌకిక సంగమును పరిహరించినచో లౌకిక వాక్య శ్రవణము తప్పును. శ్రవణము తప్పినచో మనస్సునకు లౌకిక జ్ఞానము తగ్గును. అనగా కట్టెలోని తడి తగ్గును. క్రమముగా తడి తగ్గి ఎండిన కట్టె అగును. అట్లే క్రమముగా లౌకిక జ్ఞానము పూర్తిగా నశించగనే చిత్తము శుద్ధమై పరపూర్ణ చిత్తశుద్ధి ఏర్పడును. ఇప్పుడు ఎండు కట్టెకు అగ్గి పుల్లగీచి ముట్టించినచో అగ్ని స్వరూపమై ఆ ఎండు కట్టె మండును. అట్టి చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత జ్ఞానుల సత్సంగమున పాల్గోన్నచో జ్ఞానము వంటపట్టును. అప్పుడు ఆ జ్ఞానము భక్తికి దారి తీసి భగవత్ప్రాప్తిని కలిగించును. ఈ చిత్తశుద్ధి కొరకు చేయు ప్రయత్నములే యమము, నియమము. లౌకిక సంగమును పరిహరించుటయే యమ, నియమముల సారాంశము.
భార్యా, పతి, పుత్రాదులును లౌకిక బంధములే కావున వారితోను అతిముఖ్య కర్తవ్య విషయములతోనే మాట్లాడి లౌకిక విషయ చర్చలను తగ్గించుము. మీ ఇంటిలోని వారు మీ సొంతవారనియు, ఎదురింటివారు పరాయివారనియు భ్రమపడుచున్నావు. నాటకములో సుబ్బయ్యయనువాడు నీ పుత్రునిగా నటించినాడు. ఎల్లయ్యయనువాడు ఎదుటివాని పుత్రునిగా నటించినాడు. నాటకము ముగియగనే సుబ్బయ్య, ఎల్లయ్య ఇద్దరు సమమే కదా. సుబ్బయ్య నిజముగా నీ కొడుకు కాదు, ఎల్లయ్య నిజముగా ఎదురింటి వాని కొడుకు కాదు. నీ నిజ జీవితములో కష్టము వచ్చినప్పుడు సుబ్బయ్య ఆదుకొనక, ఎల్లయ్య ఆదుకున్నాడనుకొనుము, ఇప్పుడు చెప్పుము. ఈ రాత్రి నాటకములో నీకొడుకుగా నటించిన సుబ్బయ్య నీ ఆత్మీయుడా, లేక నీ నిజ జీవితంలో సాయపడిన ఎల్లయ్య ఆత్మీయుడా? అట్లే నీకు నిజముగా శ్రేయస్సును కలుగచేయు, సత్సంగమును కలిగించు జ్ఞానులు భక్తులే నీ ఆత్మీయులని తెలియుము. అట్టి వారిపై మమకారమును పెంచుకొనుము. వారే నిజముగా నీబంధువులు. వారిని సేవించుము. వారికి సాయపడుము. నీవు ధన్యుడ వగుదువు. తల్లిదండ్రుల బంధములు కూడా నాటక బంధములే. స్వర్గములో యున్న అభిమన్యుడు అర్జునుని చూచి “నీవే జన్మలో తండ్రివి” అని అడిగినాడు. కావుననే త్యాగరాజు తల్లిదండ్రుల, బంధువుల పేర్లు చెప్పక “సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి లక్ష్మణాదులు సో్దరులు హనుమదాదులు బంధువులు” అని చెప్పినాడు. ఇట్టి స్ధాయికి మానవుడు వచ్చినపుడే తప్ప, మానవుడు జ్ఞానయోగమును మొదటి మెట్టు ఎక్కలేడు.

No comments:

Post a Comment