Sunday, November 8, 2009

పరమాత్మను ఆరాధించు కరణములు

పరమాత్మను ఆరాధించు కరణములు అనగా పనిముట్లు. అవి మూడు 1)మనస్సు, 2)వాక్కు, 3)శరీరము చేత చేయబడు కర్మ . ఈ మూడింటిలోను మనస్సు రాజు. వాక్కు మంత్రి, కర్మ సేనాధిపతియై యున్నాడు. మనస్సుననుసరించియే వాక్కు కర్మలు యుండును. మనస్సు చేయు క్రియ మననము, వాక్కు చేయు క్రియ శబ్ధోచ్చారణము, శరీరము చేయు క్రియ గమనము, దానము మొదలగునవి. ఈ మనన క్రియయే మంత్రము అనబడుచున్నది. శబ్ధోచ్చారణములో శ్రేష్టమైనది సామవేదాత్మకమైన గానము. వచనము కన్న పద్యము, పద్యము కన్న గీతము శ్రేష్టము. "వచనమే యజుర్వేదము, పద్యమే ఋగ్‌వేదము, గీతమే సామవేదము". ఈ మూడు కలసి త్రయి అనబడుచున్నవి. సనాతన సంప్రదాయములో దత్తుని వెంట మూడు శునకములున్నట్లు చిత్రీకరించిరి. నాల్గవ వేదముగ అధర్వణవేదము ధనుర్వేదాత్మకమై శస్త్రాస్త్రములను సూచించుచున్నది. అనగా నాల్గవ వేదము పాణిపద శరీరమునకు సంబంధించిన క్రియయై శారీరక కర్మను సూచించుచున్నది. గానాత్మకమైన ఛందోమయమైన వాక్యమే గాయత్రీ మంత్రము. వాక్యము కావున యజుర్వేదము, చంధస్సులో బంధింపబడినది కావున ఋగ్వేదము, గానముతో మిళితము కాబడినది కావున సామవేదము. ఇట్లు గాయత్రీ మంత్రము వేదత్రయాత్మకమై యున్నది. ఈ గాయత్రీ మంత్రము శ్రవణము, పఠనము, మననము అను ముడు దశలుగా యున్నది. అనగా వినుట, పాడుట, పదేపదే మనస్సులో స్మరించుట. గాయత్రీ మంత్రము అనగా అందరును జపించు " తత్సవితుర్వరేణ్యమ్‌" మొదలగు పాదత్రయాత్మకమైన ఋగ్వేదము లోని మంత్రము కాదు.

గాయత్రి యనగా కేవలము ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి తిష్టుల్‌ భృహతి మొదలగు ఛందస్సులలో గాయత్రి ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి ఛంధః అని చెప్పుచున్నాము. కావున గాయత్రి మంత్రమనగా ఛందోబద్ధమై గానమిళితమై పరమాత్మ యందు ప్రేమను పెంపొందించు వాక్యమే. ఆ వాక్యము ఏ వాక్యమైనను కావచ్చును. ఆ వాక్యము మధురమై గానాత్మకముగా యున్నచో గాయత్రి అనబడును. అది మనస్సుకు ఆకర్షించి పదేపదే దానిని ఉచ్చరింప చేసినచో అదే మంత్రము అనబడును. ప్రతి దేవతకు ఒక్కొక్క గాయత్రి మంత్రము గలదు. దీనినే మంత్ర గాయత్రీ అనుచున్నారు. ఏ దేవతా రూపము మీదనూ గాయత్రీ మంత్రము గలదు. గాయత్రి అనగా ఒకే దేవతపై చెప్పుబడిన మంత్రము కాదు. వాక్కు, మనస్సు, కర్మల మధ్య యున్నది. వాక్కు, మనస్సు, కర్మల యొక్క సంధి స్ధానము శ్రవణము చేత మనస్సు నందు పరమాత్మపై ప్రేమ కలుగుచున్నది. ఈ ప్రేమయే వాక్కులో వ్యక్తమగుచున్నది. మనస్సులో పుట్టి వాక్కులో వ్యక్తమైన ప్రేమయే భక్తి అనబడును. ఈ రెండును పరమాత్మను సాధించుకొని పొందుట వరకే ఉపయోగించును. పరమాత్మ లభించగనే ఏ మాత్రమును మురిసిపోవలసిన అవసరము లేదు. లభించిన పరమాత్మను నిలుపుకొనుటయే సాధన యొక్క సారాంశము. పరమాత్మ స్మర్తృగామి. స్మరణ మాత్ర సంతుష్టుడు. నీవు మనస్సులో ఒక్క క్షణము స్మరించగనే, ఒక్కసారి వాక్కుతో పిలువగనే పరమాత్మ నీ సన్నిధి యందు నిలచుచున్నాడు. కావున పరమాత్మను పొందుటకు పెక్కుసార్లు మనస్సుతో, వాక్కుతో స్మరణము చేయనవసరము లేదు. మనస్సుతో, వాక్కుతో జపము పేరున పెక్కుసార్లు పిలువనేల. స్మరించగనే లభించుచున్నాడు. కాని లభించిన దానిని నిలుపుకొనుటకే నీవు ఎంతో సాధన చేయవలయును.

పరమాత్మను నీవద్ద శాశ్వతముగా నిలుపుకొనవలయున్నచో, నీ భక్తిని సత్యమైనది అని నిరూపించయలయును. ఆ నిరూపణయే కర్మ, లేక సేవ. కావున సేవ కర్మ లేక కేవలము మనస్సు, వాక్కుల చేత పరమాత్మను ఆరాధించి ఏ మాత్రము ప్రయోజములేదు. "రామ" అనగనే నీ వెంట కోదండపాణియై నిలుచున్నాడు. రెండవ సారి "రామ" యననేల? రెండవ సారి రామ యన్నచో వచ్చిన రాముని దూరముగా పొమ్మని మరల రమ్మని అర్ధము. ఒక గురువు "రామ" అని చెప్పుచూ భక్తులకు తీర్ధము నిచ్చుచున్నాడు. ఆ తీర్ధముతో భక్తుల కష్టములు తొలగుచున్నవి. ఒకనాడు ఆ గురువు గ్రామాంతరమునకు పోయెను. భక్తులు వచ్చినారు. ఆయన శిష్యుడు " రామ రామ రామ" అని మూడుసార్లు పలికి తీర్ధము నిచ్చినాడు. భక్తుల కష్టములు తొలగుచున్నవి. తరువార ఆ రాత్రికి గురువుగారు ఇంటికి వచ్చినాడు. శిష్యుడు తాను చేసిన పనిని గురువుకు చెప్పినాడు. గురువు వెంటనే వాని చెంప మీద కొట్టినాడు. గురువు ఇట్లు వచించినాడు. నీవు ఒక్కసారి "రామ" అన్నచో ఆ తీర్ధము కష్టములను తొలగించదా? మూడుసార్లు ఏల ఉచ్చరించితివి? అనగా నీకు రాముని పై విశ్వాసము లేదననియే గదా? అని బోధించినాడు. ఒకే రామ శబ్ధమును అనేక సార్లు ఉచ్చరరించుటలో వ్రాయుటలో అర్ధము లేదు. పరమాత్మ సర్వవ్యాపకుడు. కావున పరమాత్మ నీవు ఉన్నచోటనే ఉన్నాడు గదా. నీ ప్రక్కనే నీ తండ్రి నిలచియున్నాడు. "నాన్న"అని పిలచినావు. వెంటనే నీ వైపు తిరిగి "ఏమి"అనుచున్నాడు. పరమాత్మ కోటాకోట్ల తల్లితండ్రుల కన్న ఎక్కువ వాత్సల్యము గలవాడు గదా! నీవు ఒక్కసారి పిలచిన పలుకడా? నీవు పదేపదే ఆయనను పిలుచుట ద్వారా ఏమి అర్ధము చేసుకొనుచున్నావు. రామ రామ అని ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు. నీ తండ్రి ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు అనగా దాని అర్ధముమేమి? ఆయన నీ పై కోపముతో ఉన్నాడు. ఆయన ముఖము నీకు చూపించుట లేదు. అనగా పరమాత్మ కనబడుట లేదు, పలుకుట లేదు. నిజముగా నీయందు పరమాత్మకు ప్రేమ యున్నచో నీవు ఒక్కసారి "రామ" యన్ననే ఎదురుగ నిలచి ఏమి అనవలయును. ఈ రెండును జరుగుట లేదు. దానికి కల కారణమేమి అని విచారింపక, విచారించి సరిదిద్దుకొనక ఎన్నిసార్లు రామ మంత్రము జపించినను ఫలమే మున్నది?

ఎన్ని రాగములతో రాముని పై గానము చేసినను ప్రయోజనమే మున్నది? నీ తండ్రి వచ్చి నాయనా కాళ్ళు నొప్పులు పుట్టుచున్నవి కొంచెము సేపు పిసుకుము అని అడుగగా ఆయన సేవాకర్మను చేయక నాన్న నాన్న అని అక్షరలక్షలు జపము చేసిన ఫలమేమున్నది? లేక నాన్న యొక్క గుణగణములను పొగడుచూ సంగీత శాస్త్రములో ఉన్న రాగములలో నాన్న పై పాటలు పాడిను అవసరమైన పనిని చేయక వీటిని చేయుచున్నందుకు నాన్న కోపగించి నీకు ముఖమును చూపడు. నీతో పలుకడు. ఆచరణములో కర్మలో స్వామి పైన ప్రేమను నిరూపించిన హనిమంతుని ఆదర్శముగా తీసుకొనక నీవు రాముని ఎట్లు పొందగలవు. కావున రామకార్యములో పాల్గోని రామసేవను చేసినవాడు హనుమంతుడు. హనుమంతుడు రాముడు జీవించినంత కాలము ఎప్పుడును రామ మంత్రమును జపించలేదు. ఎప్పుడును రామును పై భజనలు చేయలేదు. రాముడు జీవించనంత కాలము చేసినవి రెండేరెండు పనులు. ఒకటి రామకార్యములో పాల్గోనుట. రెండవది రామకార్యము లేనపుడు రాముని యొక్క వ్యక్తిగత సేవలో పాల్గోనుట. అనగా పాద సంవాహనము, చామరవీజనము మొదలగు సేవలు. సేవలో రాముని కార్యము మొదటిది. రామ కార్యము ఉన్నప్పుడు రాముని వ్యక్తిగత సేవ చేయలేదు. రామకార్యము లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత సేవ చేసేడి వాడు. వారధి నిర్మాణమునకు వ్యాకులుడై సముద్ర తీరమనన రాముడు కూర్చుని యుండగా, హనమమంతుడు వారధి నిర్మాణము నందు నిమగ్నుడైనాడే తప్ప, వారధిని పట్టించుకొనక కేవలము రాముని పాదములు పిసుకుచు రాముని ఎదురుగా కూర్చున లేదు. రామకార్యమంతయు ముగిసిన పిమ్మట రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామని వ్యక్తిగత సేవ చేసినాడు. తరువాత రాముడు కొంత కాలమునకు శరీరము చలించగా ఆనాటి నుండి రామనామ జపము రామ గానమును చేసినాడు. తరువాత రాముడు మరల కృష్ణునిగా మానవరూపమును తాల్చగా కృష్ణుని యొక్క కార్యమైన కురుక్షేత్ర యుద్ధమున పార్ధుని జండా పై నిలచి అదృశ్య రూపమున శత్రువులను సంహరించినాడు. అనగా మరల రామకార్యమున పాల్గోన్నాడు. నిజముగా కురుక్షేత్రమున శత్రువులను సంహరించినది రధమునకు ముందున్న కృష్ణుడు, మరియు రధము పైనున్న హనుమంతుడే. రామాయణమున, రాముడు హనుమంతుడు యుద్ధము చేయుచూ చేసినట్లు కనిపించినారు. కురకక్షేత్రమున కూడా నిజముగా ఆ ఇరువురు యుద్ధము చేసినారు. కాని కనిపించలేదు. కారణము స్వామి భక్తుడగు అర్జునునకు కీర్తి ఇచ్చుట కొరకే. ఈ కారణము వలననే కృష్ణుడు ఆయుధము పట్టను అన్నాడు. ఇట్లు హనుమంతుడు స్వామి ఎప్పుడు నరరూపమును తాల్చినను తాను కూడా స్వామి వెంట నుండి సేవలో పాల్గొనుచున్నాడు. సేవలేని జపములు, భజనలు వ్యర్ధములు . జపములు, భజనలు లేకపోయినను సేవ యున్నచో భక్తి నిరూపించబడినట్లే. తిన్నడు ఏ జపము చేసినాడు? ఏ భజన చేసినాడు? కేవలము తనకున్న దానితో సేవను చేసినాడు. ఇట్టి ఆచరణాత్మక సేవయే స్వామిని నీ వద్ద శాశ్వతముగా నిలుపును. జప తపములతో స్వామిని పట్టు చున్నావు. కాని క్షణములో జారిపోవు చున్నాడు. దీని వలన ప్రయోజనమేమి? నీ వద్దకు ఒక కోటి రూపాయిలు వచ్చి జారిపోయినచో నీవు కోటీశ్వరుడవు అగుదువా! లేదు లేదు. ఆ కోటి రూపాయిలు నీ వద్ద నిలచి నప్పుడే నీవు కోటీశ్వరుడవగుదువు.

జ్ఞానము, భక్తి స్వామిని సంపాదించునే తప్ప స్వామిని నిలుపజాలవు. స్వామి కంటి నుండి నెత్తురు కారినప్పుడు తన రెండు కన్నులను పెకిలించి స్వామికి అర్పించిన తిన్నడి యొక్క ఆచరణా రూపమైన సేవ ముందు కోటి రామ కోటియైనా తులతూగునా? ఒక్క తులసీ దళము ముందు ఎన్ని మణుగుల బంగారమైనను తుల తూగినదా? ఈ ఆచరణాత్మక మైన ప్రేమ నిరూపణమైన సేవ దత్త పరీక్షలలో బయిటపడును. దత్త పరీక్షలు అతి సూక్షముగా యుండును. ఒక్క క్షణకాలములో పరీక్ష పెట్టుట ఫలితములు ప్రకటించుట జరిగిపోవును. మనము చేయు చిన్న చిన్న పనులలో, మనము మాట్లాడు చిన్న చిన్న మాటాలలో, మన మనస్సులో మెదులు క్షణకాల భావములలో కూడా పరమాత్మకు మనము ఇచ్చు విలువ విషయములో ఓడిపోయి ఆ ఫలితములు చిత్రగుప్తుని గ్రంధములోనికి ఎక్కుచున్నవి. కావున పరమాత్మ విషయములో మనసా వాచా కర్మణా ఎంతో శ్రద్ధతో మెలుకువ యుండవలయును. రాజుగారి వద్ద ఎప్పుడు మనము ఎంతో జాగరూకతతో ఉందుము. ఆయన రాజు రారాజు. కావున ప్రతి క్షణము సేవలో ఎంతో జాగరూకత ఉండవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment