Tuesday, November 3, 2009

ధనము

ధనము నీ శక్తి యొక్కయు నీ సమయము యొక్కయు స్వరూపమై యున్నది. నీ కాలము శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున దుర్వినియోగము చేసినచో నీ కాల శక్తులను దుర్వినియోగము చేసినట్లే. నివు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా శోడశోపచారములు ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు అనగా నేమి? ఒకడు జ్వరముతో బాధపడుచున్నాడు వానికి ఔషధము నిచ్చి, పాలు మొదలగు ఆహారము నిచ్చి, విసని కర్రతో విసరుచు ఇట్టి సేవలను చేయుట ద్వారా వాని యొక్క ఆర్తి శాంతించి వాడు ఆనంద పడుచున్నాడు. ఆర్తి యనునది చైతన్యము కలిగిన ప్రాణికి ఏర్పడును. ఆర్తి జడములకు కలుగదు. బ్రహ్మము చైతన్యమని "ఈక్షతే నా శబ్ధం" అని బ్రహ్మ సూత్రము చెప్పుచున్నది. "స ఈక్షాం చకే" అను శ్రుతియు బ్రహ్మమును సృష్టి సంకల్పము చేసినది కావున బ్రహ్మము చైతన్యమేనని చెప్పుచున్నది. శ్రుతిలో సః అను శబ్ధము ఈశ్వరుడును చైతన్య స్వరూపుడే అని చెప్పుచున్నది. చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు లేదా బ్రహ్మము అవతరించినపుడు చైతన్య స్వరూపమైన ప్రాణిగనే అవతరించును. మత్స, కుర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాద్యవతారములు ప్రాణులే. పరమాత్మ అచేతనమైన జడముగా అవతరించునట్లు శ్రుతి స్మృతులలో ఎచ్చటను లేదు. కావున పరమాత్మ మనుష్య రూపమున వచ్చినపుడు అవతారములో పరమాత్మ మరియు జీవాత్మ మరియు మనుష్య శరీరము ఉండును. జీవాత్మ ఇతర జీవుల వంటి జీవుడు కాకపోవచ్చును. అనగా స్త్రీ గర్భమున శుక్రరేతస్సుల సంయోగము చేత చైతన్యమయమైన జీవపిండము ఏర్పడును. దీనినే సామాన్య జీవ స్వరూపమందురు. ఈ జీవ స్వరూపములొ వంశ లక్షణములు మాత్రము ఉండును. ఆ తరువాత కొంత కాలమునకు విశేష జీవ స్వరూపము ప్రవేశించును. కొందరి సిద్ధాంతము ప్రకారము పురుషుని రేతస్సు ద్వారానే విశేష జీవ స్వరూపము ప్రవేశించుచున్నది. విశేష జీవస్వరూపము అనగా సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మఫలములతో కూడియుండును. అవతార పురుషుని శరీరములో ఇట్టి విశేష జీవ స్వరూపము ఉండదు. అవతారములోని జీవ స్వరూపము శుద్ధ చైతన్యమై సద్వంశ లక్షణములను మాత్రము కలిగి యుండును. ఒక్కొక్కసారి పరమాత్మ విశేష జీవ సహితమైన మానవశరీరమును ఆవహించవచ్చును. రామావతారములోని జీవస్వరూపము సామాన్య జీవస్వరూపము. పరుశురామునిలోని జీవస్వరూపము విశేష జీవస్వరూపము. ఏది ఏమైనను అవతారములో పరమాత్మ జీవాత్మ మనుష్య శరీరము అను మూడు ఉండును. జీవాత్మ మనుష్య శరీరములు కలసి ప్రకృతి అనబడును.ఇందు జీవాత్మ ప్రకృతి పరాప్రకృతి, శరీరము అపరా ప్రకృతి. పరమాత్మ పురుషుడు ఇట్లు అవతార పురుషుడు ప్రకృతిని ఆశ్రయించుటి. ఇదే "ప్రకృతిం స్వా మవష్టభ్య" అని గీతలో చెప్పబడినది.

కొందరి మతమున జీవాత్మయే పురుషుడు శరీరము మాత్రమే ప్రకృతి అనబడును. పరమాత్మ పురుషోత్తముడనబడును. ఏది యైనను సత్యమునకు భంగము లేదు. కావున ఉపచారములు పరమాత్మ ఆశ్రయించిన జీవాత్మ సహిత మనుష్య శరీరమునకే. ఈ ఉపచారములు పరమాత్మకు అవసరము లేదు కాని పరమాత్మ ఆశ్రయించి జీవాత్మను మనుష్య శరీరమును సంపూర్ణముగా వ్యాపించినను జీవ శరీరముల ప్రకృతి ధర్మము నశించవు. విద్యుత్‌ తీగె అంతయు వ్యాపించియున్నను సన్నగా ఉండుట వంకరలు తిరిగి యుండుట మొదలగు తీగె ధర్మములు నశించవు గదా. పైగా భక్తుల కర్మఫలములను అనుభవించుటకు ప్రకృతి ధర్మములు ఉండి తీరయలయునేగదా. సిద్ధులను ప్రదర్శింనప్పుడును శరీరము ప్రకృతి ధర్మములను గలిగియే యుండి భక్త కర్మఫల అనుభవ కర్మ ఆగక నిరంతరము జరుగుచునే ఉండును. ఎప్పుడో గోవర్ధన పర్వతోద్ధరణము మొదలగు మహా సిద్ధులను ప్రదర్శించు సమయమున మాత్రమే అవతార శరిరము దివ్యత్వమును పొండి దివ్యశక్తిమయమై ఉండును. కావున అవతార శరీరము క్షుత్పిపాసాది శరీర ధర్మములు కలిగియే యుండును.

కావున అవతార పురుషునకు ఉపచారములు అవసరము. అవతార పురుషుడు లభించనిచో మహాభక్తునకు, మహాభక్తుడు లభించనిచో ఆర్తులగు సజ్జనులకును ఈ ఉపచారములు అను త్యాగము లేక దానము చేయుట పరమాత్మకు సంపూర్ణ ప్రీతి కలిగించును.

రాముడు చిక్కకున్న హనుమంతుడు, హనమంతుడు చిక్కకున్న ఆర్తులు భక్తులైన సజ్జనులు ఈ ఉపచారములచే సేవనీయులు. జడములకు ఉపచారములు -1) కేవలము నీటితో కడుగుట - అనగా స్నానము. 2) పుష్పాలంకరణము వరకు చాలును. స్వామి లేనప్పుడు విగ్రహము, పటము మొదలగునవి దర్శించి భక్తిభావమును పొందవచ్చును గాన విగ్రహారాధనము ఆవశ్యకమే. కాని జడమైన విగ్రహమునకు ప్రాణియగు అవతార పురుషునకు చేయు ఉపచారములు అనవసరము. చీకటిగా నుండి విగ్రహము యొక్క దర్శనము స్పష్టముగా లేకున్నచో దీపోచారము అవసరమగును. కాని విగ్రహమునకు ధూప, దీప, నీరాజన ఉపచారములు అనవసరము. ధూపము ముమశిక్ష మక్షికాదులను తోలుట కొరకే. వాటి వలన విగ్రహములకు ఆర్తి కలుగదు. కాని వాటిచే నీకు ఆర్తి కలిగినచో ధూపమును వేసుకొని, నీవు స్ధిరాసనము సిద్ధించుటకు ఆ ఉపచారము నీవు చేసుకొన వచ్చును. ఇక నీరాజనమనగా విగ్రహము చుట్టును దీపమును త్రిప్పుట. ఇది విగ్రహము ఇంకనూ స్పష్టముగా కనిపించుట కొరకే. కాని నైవేద్య తాంబూలాల ఉపచారములు ప్రాణియగు అవతార పురుషునకు మాత్రమే. విగ్రహములకు వ్యర్ధము. అవతార పురుషునకు లేక మహాభక్తునకు లేక ఆర్తులైన సజ్జనులకు అన్ని ఉపచారములు సార్ధకము గావున చేయవచ్చును. కావున పట్టపగలు సూర్యకాంతిలో దీపము వెలిగించుట ధనమును దుర్వినియోగము చేయుట అగును. అట్లే మశిక మక్షికాదులు లేనప్పుడు దూపోపచారము వ్యర్ధము. సూర్య తేజస్సుతో లేక ఇంటిలోని దీపముతో దర్శనము స్పష్టముగా జరుగుచుండగా, కర్పూర నీరాజనాదులు వ్యర్ధము. నీవు విచక్షణ లేక ఇట్టి ఉపచారములు చేసినచో తైలము వత్తులు కర్పూరము అమ్ముకొని వ్యాపారము చేయువారికి పిచ్చివాడవై సాయపడుచున్నావు తప్ప అది ఉపచారము కాదు. ఉపచారము అనగా పూజలో చేసినది కాదు. ఏదియైనను ఆర్తిని పోగోట్టుటకు మనము చేయు ప్రయత్నము ఉపచారమనబడును. వారధి నిర్మాణము కొరకు స్వామి బాధపడుచుండగా నీవును ఒక బండ వేసి వారధి నిర్మాణమునకు సాయబడి స్వామి యొక్క ఆర్తిని తగ్గించుటయే ఉపచారము. అంతేగాని సముద్రములో బండవేయుట షోడశోపచారము, రాజోపచారములలో లేదు కావున చేయకుండుట అవివేకము. ఉపచారము అనగా ప్రాణి యొక్క ఆర్తిని తొలగించి ఆనందము కలుగచేయుట. ఐతే సమస్త జీవులు ఉపచారమునకు యోగ్యులు కారు. దుష్టులకు ఉపచారము చేయరాదు.

"పరోపకార పుణ్యయ పాపాయ పరపీడన" అని వ్యాసుడు చెప్పినాడు గదా. అనగా ఇతరులకు ఉపచారము చేసి బాధ తగ్గించుట ఉపచారము చేయుట పుణ్యము కావున సజ్జనులు దుర్జనులు అని చూడకుండా అందరుకి ఉపచారము చేయవలెనని అర్ధము చేసుకొనరాదు. ఇదే నిజమైనచో "పరిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం" అను శ్లోకమునకు విరోధము వచ్చును. అప్పుడు సజ్జనులకు దుర్జనులకు రక్షణము చేయవలయును గదా. సజ్జనులను రక్షించి దుర్జనులను నాశనము చేయుదునని గురువచనము. అట్లు చేయుట ధర్మమని "ధర్మ సంస్ధాపనార్దాయ" అను శ్లోకము చెప్పుచున్నది. కావున వ్యాస శ్లోకములో పర అను శబ్ధమునకు 'ఇతరులు' అని అర్ధము తీసుకొనరాదు. పర అను శబ్ధమునకు శ్రేష్టుడు, సజ్జనుడు అను అర్ధము తీసుకొనవలెను. కావున సజ్జనులకు ఉపచారములు చేయుట దుర్జనులను హింసించుట ఈ రెండును పుణ్యము. అట్లే సజ్జనులను హింసించుట, దుర్జనులకు ఉపచారములు చేయుట ఈ రెండును పాపములే అని తెలియవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment