Sunday, October 4, 2009

త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును-అనఘాష్టమి సందేశము

[27.12.02] గురు స్వరూపము ఎప్పుడును శిష్యులు చేయు తప్పులను ఎత్తి చూపుచుండును. శిష్యుల యొక్క సద్గుణములను శిష్యులు సాధించినది గాని ప్రశంశించడు. శిష్యుడు చేసిన తప్పులను మాత్రమే వివరించి ఆ తప్పులు మరల జరగకుండా దిద్దుకొని శిష్యుడు పై స్ధాయికి చేరవలయునని గురువు ఎప్పుడును ఆలోచించు చుండును. నూటికి 99 మార్కులు తెచ్చుకున్నను గురువు దానిని ప్రశంసించడు. ఆ తప్పిపోయిన ఒక మార్కు గురించే విశ్లేషించును. ఆ ఒక మార్కు తప్పిపోయినందుకు శిష్యునికి ఉత్తేజపరచును. ఆ ఉత్తేజముచే మరల పరిక్షలో నూటికి నూరు మార్కులు తెచ్చుకొనవలయునని గురువు ఆశించును. గురువు తనను ప్రశంసించక విమర్శించు చున్నాడే అని శిష్యుడు గురువును అపార్ధము చేసుకొనరాదు. ప్రశంసించినచో అహంకారము పెరిగి ఈసారి పరిక్షలో 99 మార్కులు 90 మార్కులకే దిగజారును. అందుకే కబీరు ఇట్లు చెప్పినాడు. "నిన్ను తిట్టువాడు నీ మిత్రుడు". ఏలననగా ఆ తిట్లచేత నిన్ను నీవు దిద్దుకొని ఉన్నత స్ధితికి పోవుదువు. నిన్ను పొగుడువాడు నీ శత్రువు. ఏలననగా అతని పొగడ్త చేత నీవు అహంకరించి పతనము చెందుదువు. గురువు తన శిష్యుడెప్పుడు పైకి పోవలయుననియే ఆలోచించుచుండును. కావున గురువు శిష్యులలో కేవలము దోషములనే చూచును. ఒకసారి నానాచందోర్కర్‌ భగవద్గీతలోని శ్లోకమును చదువు చుండెను. "తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఉపదేష్యంతిదే జ్ఞానం జ్ఞానిన తత్త్వ దర్శినః" అప్పుడు శ్రీ సాయి ఆ శ్లోకము యొక్క అర్ధము అడిగెను. నానా ఇట్లు చెప్పెను. నీవు గురువులకు సేవచేసి శరణాగతి చేసి ప్రశ్నించినప్పుడు వారు నీకు జ్ఞానమును బోధించెదరు అని. ఈ శ్లోకమునకు నానా ఇట్లు అర్ధము చెప్పెను. అప్పుడు శ్రీ సాయి ఇట్లు అడిగెను. జ్ఞానం అను శబ్ధము స్ధానములో అజ్ఞానం అని పెట్టినచో శ్లోకము యొక్క ఛందస్సుకు భంగమగునా? నానా "ఉపదేశ్యంతితేஉజ్ఞానం" ఇట్లు సవరించుట చేత శ్లోకము యొక్క అర్ధమునకు భంగము రాలేదు నానా ఇట్లు అడిగెను. "నేను గురువు వద్దకు పోయినప్పుడు జ్ఞానమునకు బదులు అజ్ఞానమును బోధించుటయా"? అని ఆశ్చర్యపోయెను.

అప్పుడు శ్రీ సాయి ఇట్లు పలికెను. గురువు ఎప్పుడును నీలో ఉన్న అజ్ఞానమునే వివరించును. దానిచేత నీ అజ్ఞానమును నీవు గుర్తించి ఆ అజ్ఞానమును పోగొట్టుకొనుటకు ప్రయత్నించును. అనగా నీ అజ్ఞానము చేత ఏర్పడుచున్న దోషముల గురించి ఆలోచించి గుర్తించి ఆ దోషములను దిద్దుకొని అప్పుడు నీవు జ్ఞానమునకు అర్హుడవగుదువు. కావున జ్ఞానము దానము చేయుటకు ముందు గురువు నీలోని అజ్ఞానమును తొలగించును. ఇంటికి అతిధి వచ్చినప్పుడు ఇల్లు ఊడ్చి శుభ్రము పరచుదువు. అదే విధముగా జ్ఞానము గ్రహించుటకు ముందు నీ అజ్ఞానమును తొలగించుకొనవలెను. నిన్ను జ్ఞానమునకు అర్హునిగా చేయు ప్రయత్నమే గురువు నీలోని తప్పులు పట్టుకొనుట, కావున గురుదత్తుడు ఎప్పుడును తన శిష్యులలో తప్పులు పట్టుచుండును. ఏలనననగా ఆయన పరిపూర్ణ గురుస్వరూపుడు. ఇది తెలుసుకున్నవాడు ఆయనకున్న వాత్సల్యమును గుర్తించును. ఇది తెలియని వాడు గురుదత్తుని విడచివేయును. ఈ రోజు అనఘాష్టమి. అనఘ ఎవరు? అనఘ అనగా ఆది జీవుడు. ఈ జగత్తును సృష్టించవలెనని పరమాత్మలో కలిగిన మొదటి సంకల్ప తరంగమే అనఘ. ఆ తరంగమే ఆత్మ లింగము అనబడును. ఈ అనఘయే మహామాయ, మూలమాయ అనబడుచున్నది. ఆమె అనఘ అనగా పాపరహిత. ఆమె పరమ పవిత్ర. ఎందులకు? ఆమెను సర్వసృష్టి సంపదకు అధిదేవతగా పరమాత్మ చేసియున్నాడు. కాని ఆమె దృష్టి సృష్టి మీద లేదు. ఆమె యొక్క దృష్టి సృష్టికర్తయగు పరమాత్మ మీదనే యున్నది. ఆమె స్వామి పాదముల వద్దనే కూర్చున్నది. ఆమె దృష్టి ఎల్లప్పుడు పరమాత్మ మీదనే వున్నవి. ప్రేమ, ధ్యానము అంతయు పరమాత్మ యందే వున్నవి. జ్ఞానము గాని, ధ్యానము గాని, భక్తి గాని, సేవలేనిచో వ్యర్ధము. కావుననే ఆమె చేతులు ఎల్లప్పుడు స్వామి పాదములను పిసుకుచున్నవి. ఇంత ఐశ్వర్యము లభించగనే అనేక మంది సేవకులనను తీసుకొందురు. కాని అనేక ఐశ్వర్యములు కలిగిన ఆమెయే సేవకురాలైనది. ఆమె ఆచరణ పూర్వక సేవచేయుచున్నది. ఈ రోజు అష్ట కలశములపై అనఘా దత్తుల యొక్క అష్టపుత్రులగు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములగు అష్టపుత్రికలను ఆవాహనము చేయుదురు. అష్టసిద్ధులను ఆవాహనము చేసి అనఘా దత్తులను పూజించుదురు. దీనిలో అంతరార్ధమేమి? స్వామి మీదనే దృష్టిని ఉంచిన అనఘను జూచి దాని నుండి కర్తవ్యమును, తెలుసుకొని నీ దృష్టి స్వామిపై ఉంచెదవా? లేక అష్ట కలశములవున్న అష్టసిద్ధుల మీద, అష్టైశ్వర్యముల మీద దృష్టి ఉంచెదవా?

అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు సృష్టికి సంబంధించినవి. దత్తుడు సృష్టికర్త. అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అనగా దత్తుల నుండి వచ్చినవి. ఇచ్చట యోగము అనగా స్త్రీ పురుషుల సంయోగము కాదు. సృష్టి సంకల్పమగు అనఘ సృష్టికర్తయగు స్వామిని చేరగా సృష్టి ఉద్భవించినది. కావున దీనిని బాహ్యార్ధములో తీసుకొనరాదు. అంతరార్ధమే జ్ఞానస్వరూపము. నీకు సృష్టి కావలయును? సృష్టికర్త కావలయునా? ఇదే దత్త పరిక్ష. నీ దృష్టి అష్టైశ్వర్యముల మీద అష్టసిద్ధుల మీద పోయినచో నీవు అష్ట కష్టముల పాలగుదువు. అట్లు కాక నీవు అనఘా దేవిని చూచినచో, ఆమె దృష్టి తన పుత్రులగు అష్టసిద్ధుల మీదన, తన పుత్రికలగు అష్టైశ్వర్యముల మీదన లేదని తెలుసుకొని ఆమె యొక్క దృష్టి సృష్టికర్త మీద యున్నదనియు కావుననే సృషికర్త ఆమెకు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములను ఆమెకు ఇచ్చినాడు. నీ దృష్టి అష్టసిద్ధులు అష్టైశ్వర్యముల పైకి పోయినచో సృష్టికర్త వాటిని నీకు ఇచ్చును. ఇందులో సందేహము లేదు. కాని అవి సర్కస్‌ మాస్టరుగాని వాడు సర్కస్‌లోని సింహముల మధ్య నిలబడి వాటిని శాసించలేక వాటిచేత ఎట్లు తినబడునో అట్లే ఈ అష్టైశ్వర్యములను, అష్టసిద్ధులను నీవు నిగ్రహించుకొనలేక పోవుటచేత అవి నిన్ను మ్రింగిన నీవు అష్ట కష్టముల పాలగుదురు. వీటిని నిగ్రహించు శక్తి నీకు ఎప్పుడు వచ్చును. నీవు వాటి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచిన అవి సృష్టికర్తను చూచి భయపడి కంట్రోలులో ఉండును. నీవు నీ నీడ చిక్కించుకొను ప్రయత్నములో ఉన్నప్పుడు ఎప్పటికి ఆ ఛాయను నీవు పట్టుకొనలేవు. కాని నీవు నీడ మీద దృష్టి ఉంచక, పరమాత్మ మీద దృష్టి ఉంచినచో, నీవు పరమాత్మ వైపుకు వెళ్ళినప్పుడు నీ నీడ నీతో నీదాసుని వలె అనుసరించును.

ఒక భక్తుడు భగవంతుని గురించి తపస్సు చేసెను. భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకొనమనెను. భక్తుడు తాను సంకల్పించినది జరుగునట్లు వరము కోరుకొనెను. ఇది అష్టసిద్ధులలో ఒక సిద్ధి. భగవంతుడు ఆ వరమును ఇచ్చి మాయమైపోయెను. భక్తుడు ఇట్లు తలచెను. నాకు ఒక అందమైన భార్య కావలెననిన భార్య ప్రత్యక్షమైనది. అప్పుడు భక్తుడు నా భార్య వంటినిండా నగలు కోరగా అన్నియు ప్రత్యక్షమైను. భక్తుడు ఇట్లు తలచెను. "ఓ! ఏమి అమ్మవారి వలె ఉన్నది? అని అప్పుడు ఆమె అమ్మవారిగా మారెను. భక్తుడు ఇట్లు తలచెను. ఈ అమ్మవారు నన్ను మ్రింగునా ఏల?" . అప్పుడు ఆమె వానిని మ్రింగివేసెను. కావున నిగ్రహము లేనిదే అధిక ఐశ్వర్యము అష్టసిద్ధులు అష్టకష్టములకు దారితీయును. అనంత ఐశ్వర్యము అష్టసిద్ధులును నిగ్రహించ గలవాడు ఒక్క దత్తుడే. కావున నీ దష్టి సృష్టికర్తపై ఉన్నంత వరకు నీవు సృష్టి కర్తకు సమీపమున ఉందువు. అప్పుడు ఈ అష్టసిద్ధులను సింహములునూ, ఈ అష్టైశ్వర్యములను పెద్దపులులునూ నిన్ను ఏమియూ చేయలేవు. నీవు సమీపమున ఉన్నావు. కావున ఈ రోజు అనఘాష్టమి నుండి మనము పొందవలసిన జ్ఞానము ఏమనగా "సృష్టి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచి, సృష్టికర్త యొక్క సేవలో నిరంతరము ఉండుచూ ఎంత ఐశ్వర్యము లభించినను, తాను యజమాని అను అహంకారము పొందక నేను ఎప్పుడు సేవకుడనని తెలుసుకుని రజస్తమో గుణ ప్రదానమైన అహంకారమును పొందక, సత్వగుణ ప్రదానమైన వినయముతో ఉన్నచో నీవును అనఘ వలె స్వామి యొక్క హృదయములో ప్రవేశింతువు". కావున అనఘాదేవిని ఆదర్శముగా పెట్టుకొని పాదముల వద్ద సేవకురాలిగా యుండి, అనఘ ఎట్లు హృదయాది దేవతా స్ధానము పొందినదో అట్లే నీవును స్వామి యొక్క హృదయము లోనికి ప్రవేశించవలెను. అనఘకు ఇచ్చిన ఐశ్వర్యము ఆమె ఎప్పుడు అను చలించ లేదు.స్వామి యొక్క భక్తులకు ఆమె దానము చేయుచున్నది. స్వామి నుండి పొందినది ఆమె ఇతరులకు పంచుచున్నది. కేవలము త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. "త్యాగేనైకే అమృతత్వ మానసుః" భోగము చేత కాదు త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. ప్రహ్లాదుడు నారదుని నుండి తాను పొందిన జ్ఞానమును తన చుట్టు ఉన్న బాలురు ఇచ్చుటకు ప్రయత్నించెను. అతడు ఆత్మోద్ధరణమునకు ఎప్పుడు ప్రత్నించలేదు. ఆత్మోద్ధరణము స్వార్ధము. అట్లే రాధయును ఇతర గోపికలకు కృష్ణుని గురించి ప్రశంశించి, వారిలో భక్తిని పెంచి, కృష్ణుడు వారికి ప్రియుడు కావలయునని తలచెను. రాధ ఎప్పుడు తన గురించి ఆలోచించలేదు. రాధ గోపికలకు నీడలాగా ఉండెడిది. నాయకుడి కర్తవ్యమేమి? నాయకుడు తన ప్రజల యొక్క శ్రేయస్సును కోరి సదా శ్రమించవలయును. కాని ఈ రోజు నాయకులు ప్రజల గరించి చింతించక తాము ధనము సంపాదించి, తమ ఆత్మోద్ధరమునకు, తమ కుటుంబ సభ్యుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. కాని రాధ అటువంటి నాయకురాలు కాదు. ఏ స్త్రీ కూడా తనకు ప్రియమైన వానిని ఇతర స్త్రీలతో పంచుకొనుటకు ఒప్పుకొనదు.కాని రాధ కృష్ణునిపై తన ప్రేమను ఇతర గోపికలుకు పంచెడిది. అట్లు వారు ఉద్ధరింపబడుట కోరెను. ఆమె యొక్క త్యాగభావముతో కూడిన మధుర ప్రేమ చేతనే కృష్ణుడు రాధాలోలుడైనాడు. రాధ గురించి ఈ విషయము ఈనాటి వరకును ఎవ్వరికిని తెలియదు. ఇతర గోపికలు కృష్ణుడు ప్రేమించుచుండగా రాధ అలిగి కూర్చునట్లు వర్ణింతురు. కాని ఇది పూర్తిగా అసత్యము. సామాన్య స్త్రీ స్వభావము రాధపై రుద్దినారు. దత్తుడే కష్ణుడు రాధయే అనఘ. ఈ అనఘాష్టమి పుణ్యదినమున ఈ సత్యమైన అనఘా తత్త్వమును దత్తుడగు నేను బయిట పెట్టుచున్నాను. ఈ విధముగనే శంకరులు పరమాత్మ నుండి జ్ఞాన సంపదను పొందినారు. కాని ఆయన ఏమి చేసెను. శంకరులు భారతదేశమంతయు కాలి నడకతో సంచరించి గ్రామ గ్రామమునకు పోయి ఆ జ్ఞానమును ఇతరులకు బోధించి వారి అజ్ఞానమును తోలగించెను.కావున ఆయన దైవము నుండి పొందన జ్ఞానమును తన ఆత్మోద్ధరణమున కొరకు ఇంటిలో కూర్చునలేదు. ఆయనన ఆయన యొక్క ఉద్ధరణము గురించి చింతిచలేదు. ఆయన జీవితమంతయు జ్ఞానబోధలతో గడచిపోయెను. పరులను ఉద్ధరించు జ్ఞానములోనే ఆయన జీవతమంతయు గడిపెను. నేను దేవుడనే మీరును దేవుడే అని తాను పొందనది ఇతరులు పొందినట్లుగా భావించినాడు. కావున సేవ ఎప్పుడు ఇతరుల కోసమే ఉండవలయును. నీ ఆత్మోద్ధరణకు కారాదు. నీవు ఇతరులను ఉద్ధరించుటకు ప్రయత్నించినచో నీవు స్వామిచే ఉద్ధరించబడుదువు. ఇతరులు ఉద్ధరించబడినను, ఉద్ధరించబడకపోయిననూ ఫలమును గురించి నీకు అనవసరము. నీవు మాత్రము ఇతరుల ఉద్ధరణమును సదా ప్రయత్నించుచుండవలెను. నీ ప్రయత్నము చెడినను నీవు ఆ ప్రయత్నములో నిరంతరము ఉండుము. నీవు అంత్యక్షణము వరకు అట్టి ప్రయత్నములో ఉన్నచో భగవంతుడు సంతోషించి నిన్ను మాత్రము ఉద్ధరించును. కావుననే శంకరులను చివరిలో దత్తుడు కౌగలించి తనలో లీనము చేసుకొన్నాడు. అట్లే మీరాబాయి భక్తిని ప్రచారము చేసినది. ఇతర జీవులను తన గానముతో కృష్ణ భక్తులుగా మార్చుటకు ప్రయత్నంచెను. కావుననే జగన్నాధ దేవాలయములో మీరాకు సశీరీరముగా ఐక్యము చేసుకున్నాడు. దత్తుడు సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త. ఇవియే బ్రహ్మ, విష్ణు, శివస్వరూపములు. సృష్టికర్తగా కొందరు అభిమానించి దత్తుని తల్లితండ్రిగాను, పుత్రునిగాను, లేక సోదరునిగాను ఆరాధించిరి.

ప్రహ్లాదుడు తండ్రిగాను, దశరధుడు, నందుడు పుత్రునిగాను, లక్ష్మణుడు అన్నగాను ఆరాధించినారు. లక్ష్మణుడు కూడా స్వామిని నిరంతర సేవ చేయుచు స్వామి కార్యమైన యుద్ధములో పాల్గోనెను. మరికొందరు భక్తులు స్వామిని సృష్టిభర్తగా పతిగా ప్రియునిగా ఆరాధించినారు. రుక్మిణి రాధలు దీనికి ఉదాహరణ. సత్యభామ ఎప్పుడు స్వామి తన వద్దనే ఉండవలయుని కోరుకొన్నది. కాని రుక్మిణి స్వామి అష్టభార్యలను పంచుకొనవలయునని తలచినది. కావుననే తులాభారము నందు రుక్మిణి గెలిచి సత్యభామ ఓడిపోయినది. కాని రుక్మిణి కన్న రాధ గొప్పది. ఏలననగా స్వామి 16 వేల గోపికలు పంచుకొనవలెనని కోరినది. కావున రుక్మిణి త్యాగము కన్న రాధ త్యాగము గొప్పది. కావుననే రాధ ముందు రుక్మిణి ఓడిపోయినది. ఒకనాడు రాధ బృందావనము నుండి ద్వారకకు వచ్చెను. రుక్మిణి తాను రోజు తాగు వేడిపాలు రాధకు యిచ్చెను. రాధ దానిని స్వీకరించినది. ఇరువురు స్వామి వద్దకు పోగా స్వామి ఎర్రగా కందియుండెను. ఇరువురు ఆశ్చర్యపడి అడిగిరి.

స్వామి పలికెను. రాధ వేడి పాలు తాగినది. రాధ హృదయములో నేనున్నాను. కావుననే కందిపోయినాను. అప్పుడు రుక్మిణి అడిగినది. నాధా!ఐతే వేడి పాలను నేను రోజు తాగుతున్నాను గదా! కాని నీవు ఏనాడు కందిపోలేదు. నీవు నా హృదయము నందు లేవా? స్వామి ఇట్లు పలికెను ఓ రుక్మిణి! నీ ప్రేమ కన్న రాధ ప్రేమ గొప్పది. నీవు నన్ను అష్ట భార్యలతో మాత్రమే పంచుకొను చున్నావు. కాని రాధ బృందావనములో పదునారువేల గోపికలతో కలసి నన్ను పంచుకొనుటకు సిద్ధపడినది. కావున ఆమె త్యాగము నీ త్యాగము కన్న గొప్పది. మరియును నీవు నిత్యము నా సహచర్యములో ఉన్నావు. కావున నీకు నా యందు నిర్లక్ష్యము ఏర్పడినది. కావున నా విలువ పోయినది. రాధ దూరముగా యున్నది కావున ఆమెకు వియోగము నందు నాపై శ్రద్ధ ఎక్కువగా యున్నది. భగవంతుడు మనకు కనపడకుందా ఎందుకున్నాడు? ఆయన కనపడక దూరముగా యున్నచో మనకు ఆయన పై విలువ పెరిగి మనము తరింతుము. కావున మన శ్రేయస్సు కోరి మనకు కనబడకున్నాడు. ఒక వేళ నరరూపములో వచ్చినచో అప్పుడును కొంతకాలము మాత్రమే ఉండి తరువాత అవతారము చాలించుచున్నాడు. ఆయన నిరంతరము మనతో ఉన్నచో ఆయన పై మనకు నిర్లక్ష్యము ఏర్పడును. స్వామితో నిరంతరము యాదవులు ఉన్నారు. చిన్ననాటి నుండియు కాళీయమర్ధనము, గోవర్ధనము నెత్తుట చూచినారు. స్వామి కురుక్షేత్ర యుద్ధమునకు పోవుచు నేను వచ్చు వరకు మద్యమును ఎవరు సేవించవలదని ఉత్తర్వులిచ్చియుండెను. దీనికి కారణము ఏమనగా యాదవులు మద్యము త్రాగినచో దుర్వాస శాపము వలన వారు కలహించి మరణింతురనియే, కాని యాదవులు ఉత్తర్వులను నిర్లక్ష్యము చేసిరి. కృష్ణుడు 19 రోజున తిరిగి వచ్చెను. కాని అప్పటికే యాదవులు మద్యము సేవించి, కొట్టుకొని, చంపుకొనిరి.

మరి చిన్ననాటి నుండియు ఎన్నో మహిమలను చూచిన యాదవులు కృష్ణుని ఉత్తర్వులు ఏల ధిక్కరించిరి? దీనికి కారణము కృష్ణుడు నిరంతరము యాదవులతో ఉండుటయే. నిరంతర సాన్నిధ్యము, సహచర్యము యాదవుల దృష్టిలో కృష్ణుని విలువ పోగొట్టినది. అందువలననే భగవంతుడు కనిపించడు. కనిపించినను 10 నిమిషములే కనిపించి అదృశ్యుడగుచున్నాడు. ఎందుకనగా తన పై విలువను నిలుపుకొనుటకే. కావున త్యాగముతో కూడిన సేవ కలిగి జపము, ధ్యానము, భజన చేయుచున్నచో అవి సార్ధకములగును. ఇవి అన్నియు శరీర అవయవములు అయినచో త్యాగముతో కూడినచో సార్ధకము. ప్రాణమున్ననే శరీరావయవములకు విలువ యున్నది. ఎంత గొప్పవాడైనను వాని నేత్రములు కత్తిచే పెకిలింపబడుచున్నవి. అది పుణ్యకర్మ యగుచున్నది. నేత్రదానమున కత్తితో పెకిలించుట పాపమగుటలేదు? ఎందులకు? ప్రాణము పోయినది కాన శరీరము విలువలేదు. కాని అదే కన్నులు ఒక కౄరమైన జంతువునకు పెకిలించినచో అది మహాపాపము అగుచున్నది. ఎందులకు? ప్రాణమున్నది కాన కండ్లకు, శరీరమునకు విలువయున్నది. హనుమంతుడు రామనామ జపము చేసెను. రామ భజన చేసెను. రామధ్యానము చేసెను. కాని ఎప్పుడు? రాముని కార్యము ముగిసిన తర్వాత . వారధి నిర్మాణము కొరకు రాముడు కూర్చుని యుండగా, లేక రామరావణ యుద్ధ సమయములో భజనలు చేయలేదు. రామకార్యములో పాల్గోనెను. యుద్ధము ముగిసిన తర్వాత రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామపాద సేవ చేయుచు అప్పుడునూ వ్యక్తిగతముగాను సేవను విడనాడలేదు. సేవ చేయుచునే యుండెను. రాముడు తన శరీరమును విడిచిన తర్వాత ఆయన పాదసేవ లభించనందున ఆయన కార్యములో పాల్గొనుటకు అవకాశము లేనందున కదళీవనములో యుండి ఆయన భజన, రామనామ జపము చేసెను. అంతేకాక దత్తుడు ఎప్పుడెప్పుడు అవతరించుచున్నాడో అప్పుడప్పుడు ఆయన సేవకునిగా అవతరించెను. కృష్ణావతారములో ఆయన తన అంశతో భీమునిగా జన్మించెను. కావున దత్త భక్తులారా! స్వామి జ్ఞానమును భక్తిని ప్రచారము చేయుటకు వచ్చినారు. మీ జపమును, తపములను, మీ నిత్య పూజలను విడనాడి స్వామి కార్యములో పాల్గోనుడు. స్వామి ఈ శరీరమును వదలి దేవగఢకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీ మీ పూజలు మీరు చేసుకొనవచ్చును. స్వామి కార్యార్ధియై వచ్చియుండగా స్వామి కార్యమున పాల్గొనక మీ సాధనల యొక్క అవసరమేల? ఇదియే అనఘాష్టమి నాటి స్వామి సందేశము.

శ్రీ కృష్ణభగవానుడు 6 నిమిషముల పాటు కారాగారకులో ఉండెను గదా. అంటే శ్రీ కృష్ణుడు కారాగారములో జన్మించి 6 నిమిషముల పాటు కారాగారములో యున్నారు గదా! దీనికి కారణము శ్రీ దత్తభగవానుడు ఇలా వచించినారు. "రామావతారములో అరణ్యవాసములో భరతుడు వచ్చి శ్రీ రామునికి దశరధుని మరణవార్త విన్నవించి, రాజ్యమును స్వీకరించవలసిదిగా ప్రార్ధన చేసిన సందర్భములో జాబాలి మహర్షి శ్రీ రామునకు రాజ్యము స్వీకారము చేయమని బోధించినాడు. అప్పుడు శ్రీ రాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించటం, జాబాలి తన అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీ రామునికి దాసోహమనటం జరిగినది. కాని రావణాసురుని విషయములో ఇట్టి జ్ఞానోపదేశము చేయలేదు. సంహరించినాడు. ఆ తర్వాత కాలభైరవుల సమక్షంలో రావణాసురుడు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అప్పటి రామావతారము చాలించిన శ్రీ దత్తుడే ముద్దాయిగా నిలబడ వలసివచ్చనది. జాబాలి బ్రాహ్మణుడనియు, తాను బ్రాహ్మణుడనే గదా, జాబాలి తపసంపన్నుడైతే తాను తపసంపన్నుడనే గదా. కనుక జాబాలి విషయములో ఒక న్యాయము తన విషయములో మరొక న్యాయము ఉండరాదు గదా. శ్రీ రాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించినట్లుగా, సకాలంలో తనకు జ్ఞానోదయం కల్గించ వచ్చును గదా. అట్లు చేయక శ్రీ రాముడు పక్షపాతముతో వ్యవహరించినాడను వాదనకు కాలభైరవులవారు ఏకీభవించి శ్రీ దత్తునకు 6 చేతలకు సంకెలలు చేయించి 6 నిమిషములు కారాగార శిక్ష విధించినారు. ఆ శిక్షను శ్రీ దత్తుడు శ్రీ కృష్ణావతారములో 6 నిమిషములు కారాగారంలో ఉండి అనుభవించారు. ఇది రహస్యం అని వివరించారు.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు

No comments:

Post a Comment